నిద్ర లేకుండా హింసించారు...న్యాయమే గెలిచింది
హైదరాబాద్ : రాజ్యసభ రెబల్ అభ్యర్థులు చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. వారిద్దరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల కమిషన్ తేల్చింది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లపై అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ బరిలో ఉన్న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని దుర్మార్గాలు చేసినా చివరికి న్యాయం గెలిచిందన్నారు.
తమ నామినేషన్లను తిరస్కరించేందుకు కాంగ్రెస్ పెద్దలు శతవిధాలా యత్నించారని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. తనను, చైతన్య రాజును గత రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా హింసించారని ఆదాల అన్నారు. తమకు మద్దతు ఇచ్చి నామినేషన్లపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురి చేశారని ఆయన తెలిపారు. వివరణ లేఖలు ఇవ్వాలంటూ తమను వేధించారన్నారు.
రిటర్నింగ్ అధికారిపై కూడా తీవ్ర ఒత్తిడి ఒత్తిడి తెచ్చారని ఆదాల అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారిని స్క్రూటినీ ప్రక్రియకు రప్పించారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల చట్టం నిబంధన 33 ప్రకారం ప్రతిపాదకుల ఉపసంహరణ అంశమే లేదని అన్నారు. అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు ఉపసంహరించుకోవాలనే నిబంధనను అధికారులు చెప్పటంతో తమ నామినేషన్లు ఆమోదం పొందాయన్నారు.