రాజ్యసభ బరిలోనే ఆదాల.. ఉపసంహరణకు నో
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల విషయంలో హైడ్రామా నడుస్తోంది. రెబెల్ అభ్యర్థులుగా బరిలో నిలబడిన చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తొలుత కథనాలు వచ్చాయి. అయితే, వీరిలో చైతన్య రాజు స్వయంగా రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి ఉపసహరణ పత్రాలపై సంతకాలు చేయగా.. ఆదాల ఉపసంహరణ పత్రాలను మాత్రం ఎమ్మెల్యే వెంకటరామయ్య వెళ్లి అందజేశారు. దీంతో ఇద్దరూ బరినుంచి తప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొద్దిసేపటికే ఆదాల ప్రభాకర్ రెడ్డి నేరుగా రిటర్నింగ్ అధికారి రాజా సదారాంకు ఫోన్ చేసి, తాను పోటీ నుంచి తప్పుకోవట్లేదని, తానింకా రంగంలోనే ఉన్నానని స్పష్టం చేశారు. వెంకటరామయ్య ఇచ్చిన లేఖతో తనకు సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ తనకు ఫోన్ చేసి ఉపసంహరించుకోవాల్సిందిగా చెప్పినా.. తాను పరిశీలిస్తానని చెప్పానే తప్ప సరేననలేదని అన్నారు. దీంతో ఎమ్మెల్యే వెంకటరామయ్య ఇచ్చిన ఉపసంహరణ లేఖను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.
సమైక్యం కోసమే తాము నిలబడ్డామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని చెప్పిన చైతన్య రాజు... కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి, ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఒత్తిడితో ఆయన బరి నుంచి వైదొలగారు. మరో అభ్యర్థి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రం ఎవరి మాటా వినకుండా రాజ్యసభ ఎన్నికల బరిలో యథాతథంగా నిలిచారు. దీంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. అంతకుముందు రాజ్యసభకు పోటీచేసిన ఆరుగురు అభ్యర్థులూ ఏకగ్రీవం అయినట్లు కూడా వార్తలు వచ్చినా, ఆదాల బరిలోనే ఉండటంతో ఎన్నిక తప్పట్లేదు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా సదారాం వద్దకు నామినేషన్ ఉపసంహరణకు చైతన్యరాజుతో పాటు ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్ వచ్చారు. అధిష్టానం నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో సీఎం సూచనల మేరకే చైతన్య రాజు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు సమాచారం.