Subbirami reddy
-
బ్రహ్మానందానికి ‘హాస్య నట బ్రహ్మ’ అవార్డు
స్టేషన్ మహబూబ్‌నగర్: 1,100 సినిమాల్లో నటించిన ప్రముఖ హాస్యనటుడు కె.బ్రహ్మానందాన్ని ‘హాస్య నట బ్రహ్మ’ అవార్డుతో సత్కరించారు. టీఎస్ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో స్పీకర్ మధుసూదనాచారి, కళాబంధు సుబ్బరామిరెడ్డి, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఓరుగల్లు కాకతీయ కళావైభవ గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు సుబ్బరామిరెడ్డి తన సంస్థ ద్వారా ఈ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సినీనటులు జయప్రద, రాజశేఖర్, జీవిత, బాబుమోహన్, అలీ, శ్రద్ధాదాస్, రఘుబాబు, శ్రీనివాస్‌రెడ్డిలకు కాకతీయ పురస్కారాలు అందజేశారు. కళారంగంలో సేవలు అందిస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఎల్లూరి శివారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, గోరటి వెంకన్న, చిక్కా హరీశ్, జంగిరెడ్డి, వంగీశ్వర నీరజ, పద్మాలయ ఆచార్యను ‘కాకతీయ అవార్డు’లతో సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
చరిష్మాకు మారుపేరు వైఎస్ జగన్
ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్‌కి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని వచ్చిన వారితో మాట్లాడి పంపించడం పద్ధతిగా ఉన్న ఈ రోజుల్లో, ప్రజల హృదయాలను స్పర్శించడానికి జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఏది బాగుంది. ప్రజలకు ఏది కావాలంటున్నారు అని తెలుసుకోవడానికి వెళుతున్నారని ప్రశంసించారు. ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ గట్టిగా పట్టు పట్టారు కాబట్టే ప్రజల్లో ఆయనపై అభిమానం పెరుగుతోందన్నారు. పవన్ కల్యాణ్‌తో సహా ఎవరైనా సరే ప్రత్యేక హోదాపై అంత గట్టిగా పట్టుపడితేనే అది వారికి కూడా ప్లస్ పాయింట్ అవుతుందంటున్న టి. సుబ్బరామిరెడ్డి అబిప్రాయాలు ఆయన మాటల్లేనే... ఎక్కడ మీడియా అలర్ట్‌గా ఉందంటే అక్కడ మీరు ఉంటారని ప్రతీతి. నిజమేనా? దాంట్లో ఏమీ తప్పు లేదు. ఇంట్లో కూర్చుంటే ఫొటో రాదు కదా. మనిషిలో చురుకుదనం, కార్యాచరణ ఉంటేనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆదివారం కదా అని ఇంట్లోనే కూర్చుని ఉంటే మీకు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కాను కదా. ఆ చురుకుదనమే ఉంటేనే ఏదయినా వస్తుంది. ఇద్దరు సీఎంల మధ్యలో మీరు తల పెట్టేస్తారని మీడియాలో ప్రచారం ఉంది. నిజమేనా? ముఖ్యమంత్రి పక్కన లేకుంటే మన ఫొటో ఎందుకేస్తారు ఎవరైనా? 35 ఏళ్ల క్రితం అనుకుంటాను. అక్కినేని నాగేశ్వరరావు మా ఇంటికివచ్చారు. ఏదో పేపర్లో నాదీ, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ ఫొటో కలిసి వచ్చింది. ఏమండీ రెడ్డిగారూ, దిస్ ఈజ్ టూమచ్. మీ ఫొటో ఏమిటి మా మధ్యలో వచ్చింది అనేశారు. సరదాగానే అనుకోండి. నేను వేయించుకున్నాను లేండి అనేశాను. ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు పెద్దగా పొసిగేది కాదంటారు నిజమేనా? పైకి అలా కనిపించినా వాళ్లిద్దరికీ పరస్పర గౌరవం ఉండేది. ఇద్దరూ గొప్ప వ్యక్తులు. గొప్ప క్వాలిటీ ఉన్న వారు. కాని మనిషిలో బలహీనతలు తప్పవు కదా. ఎక్కడో ఒక చోట ఘర్షణ వచ్చేది. స్టూడియో అభివృద్ధి కోసం ప్రభుత్వం అక్కినేనికి స్థలం ఇస్తే వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారనే విషయంలో కాస్త ఘర్షణ ఏర్పడింది ఇద్దరికీ. స్నేహితుడిగా ఉండి కూడా ఇలా చేశాడే అని ఏఎన్నార్ బాధపడేవారు. కాని అది గతం అయిపోయింది. మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు. మీకు బాగా నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు? నాకు తెలిసిన ముఖ్యమంత్రుల్లో చెన్నారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావులతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇక వైస్సార్ అయితే గ్రేట్ సోల్. స్నేహితులకు, స్నేహానికి ప్రాణం ఇచ్చేవారు. ఢిల్లీకి ఎప్పడొచ్చినా మా ఇంట్లోనే భోంచేసి వెళ్లేవారు. ఆయన భోజనానికి వచ్చినప్పుడు కూడా ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌ని, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శిని ఇలా ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించి వైఎస్‌కి పరిచయం చేసి రాష్ట్రానికి మీరు సహాయం చేయాలని అని చెప్పేవాడిని. తెలుగు సీఎంలలో వైఎస్సార్ నాకు అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలతో సమాన సంబంధాలు ఎలా నిర్వహించగలిగారు? 1983లో ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నప్పుడే నన్ను పిలిచి ‘రెడ్డిగారూ పార్టీ పెడుతున్నాం. మీరు రావాలి. పార్టీలో చేరాలి’ అని ఆహ్వానించారు. ‘కానీ మీరు నాకు చాలా క్లోజ్ కదా పార్టీలో చేరితే మిమ్మల్ని బాస్‌గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అది నాకిష్టం లేదు. పైగా నేను రాజకీయాల్లోకి రాను’ అని చెప్పాను. కానీ 1989లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన్ని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరా. జాతీయ పార్టీలో ఉండాలనేది నా కోరిక. పైగా నాకు స్థానిక రాజకీయాలపై ఆసక్తి లేదు. చేరినవెంటనే ఎంపీ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాగేశారు. దానికీ నేను బాధపడలేదు. తర్వాత టీటీడీ చైర్మన్‌ని చేశారు. 40 ఏళ్ల చిన్న వయస్సులోనే టీటీడీ చైర్మన్ కావడం నా జీవితంలోనే గొప్ప మలుపు. అదే సమయంలో తిరుపతిలో కాంగ్రెస్ జాతీయ ప్లీనరీ జరిగింది. దాదాపు పార్టీ నేతలందరితో పరిచయం అయింది. దైవనిర్ణయం అనుకున్నాను. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటారు? రాష్ట్ర విభజన విషయంలో రాంగ్ ట్రాక్‌లో పోయింది. అన్ని రాజకీయ పార్టీలూ కలిసి విభజన చేయాలని చెప్పాయి. దాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంది. అదే సమయంలో బీజేపీ తాను అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని విభజిస్తామని సవాలు విసిరింది. మనమెందుకు ఇక మౌనంగా ఉండాలని కాంగ్రెస్ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ విభజించినప్పటికీ హైదరాబాద్ లేని ఏపీకి వీలైనంత సహాయం చేయాలని కూడా పార్టీ నిర్ణయించుకుంది. ప్రత్యేక హోదా ఇచ్చి సహకరిస్తామని కూడా చెప్పారు. కేంద్రంలో మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది కాబట్టి విభజన తర్వాత ఏపీని వీలైనంతగా అభివృద్ధి చేద్దామని అధినాయకత్వం భావించింది. కానీ ఫలితాలు అక్కడే తారుమారయ్యాయి. దెబ్బతిన్నాం. కాంగ్రెస్ తన కొంప తానే కూల్చుకుందంటున్నారు నిజమేనా? ఒక్కమాటలో చెబుతాను. అది డెస్టినీ. విధినిర్ణయం. దాన్ని అంగీకరించాల్సిందే. ఇంతకుమించి ఏమీ చేయలేం కూడా. కానీ పరిస్థితులు మారతాయని నమ్మకం ఉంది. వైఎస్ జగన్ పాదయాత్రపై మీ అభిప్రాయం? చూస్తున్నాం కదా. పాదయాత్రలు ఎవరు చేస్తారు ఈరోజుల్లో. ఇప్పుడలా ఎవరు నడుస్తారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని వచ్చిన వారితో మాట్లాడి పంపించడం ఒక పద్ధతి. ప్రజల హృదయాలను స్పర్శించడానికి జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఏది బాగుంది. ప్రజలు ఏది కావాలంటున్నారు అని తెలుసుకోవడానికి వెళుతున్నారాయన. అది చేసిన వాడే గొప్పవాడు. కాని అది అంత సులభం కాదు. వైఎస్ జగన్ సీఎం అయ్యే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? జగన్, రాహుల్ గాంధీ.. ఇప్పుడు వాళ్లనెవరు ఆపగలరు? ఆయన వయస్సులో రాహుల్ గాంధీకున్నంత చరిష్మా ఎవరికుంది? అలాగే జగన్‌కి కూడా అంత చిన్న వయసులో ఆ ప్రజాకర్షక శక్తి ఎవరికుందో చూపండి మరి. ఆ ఏజ్‌లో ఎవరు ఆయనకు పోటీ రాగలరు? అలాగే మోదీ వయస్సు ఇప్పుడు 68 ఏళ్లు. రాహుల్‌కు 46 ఏళ్లు. పైగా ప్రజాకర్షణ బాగా ఉన్న వ్యక్తి. భవిష్యత్తు వీళ్లది కాక మరెవరిదవుతుంది? మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్‌వైపు ఉన్నా, సీఎం పదవిని తనకు ఎందుకివ్వలేదు? జాతీయ రాజకీయాల్లో కమ్యూనిస్టులతో సహా ఏ పార్టీ అయినా సరే మెజారిటీ సభ్యులు ఎవరిని సూచిస్తున్నారు అన్నది నాయకత్వ ఎంపికకు కొలమానంగా ఉండదు. పశ్చిమబెంగాల్లో మెజారిటీ సభ్యుల అభిప్రాయం బట్టి జ్యోతిబసుకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా ముందునుంచి ఉన్న సంప్రదాయం ఇదే. 2004లో వైఎస్ నాయకత్వంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. కాని ఆయనే మా సీఎం అభ్యర్థి అని కాంగ్రెస్ ప్రకటించలేదు కదా. 99 శాతం మంది ఎమ్మెల్యేలు ఆయనే సీఎం కావాలని కూడా చెప్పేవారు. కానీ పార్టీ అధిష్టానం సిస్టమ్ ప్రకారమే వెళ్లింది. జాతీయ స్థాయిలో చర్చలు జరిపి, వాటిని మళ్లీ కిందికి పంపి వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటించింది. సినిమా రంగంలోకి ఎలా వచ్చారు? మా చిన్నాయన టీవీ రమణారెడ్డి ఫిల్మ్ యాక్టర్‌గా ఉండేవారు. ఆయన ద్వారా నాకు సినీనటులు పరిచయం అయ్యారు. అక్కినేని నాకు చాలా సన్నిహితులు. తర్వాత దేశంలోనే ఉత్తమ సినిమా ధియేటర్లను కట్టాను. మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు. ఇవి కట్టిన తర్వాతే నిర్మాతనయ్యాను. పైగా కళాకారులంటే నాకు ఎంతో అభిమానం. నా పాలసీ ఒకటే. ఇతరులకు సన్మానం చేయించి పదిమందిని సంతోషపెట్టడం నాకిష్టం. పవన్ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా? పవన్ చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. పైగా నిజాయితీపరుడు. ఆయన ఇప్పుడు ఫోకస్ చేస్తున్న ప్రత్యేక హోదా విషయాన్ని ఇలాగే ముందుకు తీసుకుపోతే చాలా పేరు వస్తుంది. ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ గట్టిగా పట్టు పట్టారు. పవన్ కూడా అలాగే పట్టుబడితే కచ్చితంగా తనకు అది ప్లస్ పాయింట్ అవుతుంది. -
పాపారావుగారి వ్యాఖ్యలు బాధాకరం : శివాజీ రాజా
కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ఇటీవల మోహన్ బాబుకు విశ్వ నట సార్వభౌమ బిరుదును ప్రధానం చేస్తూ సన్మానించిన సంగతి తెలిసిందే. కాకతీయ కళావైభవోత్సవాలు పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సన్మానం చేయటాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కు చెందిన పాపారావు తప్పుపట్టారు. ఈ విషయంపై ఆర్టిస్టు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా స్పందించారు. ‘సినిమా, సమాజం ఎప్పుడూ వేరు వేరు కాదు. ప్రజలతో మమేకమైన కళ సినిమా.. సినిమా కళాకారులు తొలినాళ్ల నుండి ప్రజల పట్ల స్పందిస్తూ సహాయమందించడం తెలియని విషయం కాదు. అలాంటి గొప్ప సినిమా రంగానికి సంబంధించిన సినీ నిర్మాత డా॥టి. సుబ్బిరామిరెడ్డిగారు సినిమా నటీనటులని సన్మానించే భాగంలో తొలుతగా డా॥మోహన్‌బాబు గారిని సన్మానించారు. ఇంకా ఎన్నో చోట్ల ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. ఈ సమయంలో శ్రీ పాపారావుగారు ‘సినిమా నటీనటులను సన్మానించకూడదు’ అని వ్యాఖ్యానిస్తూ హెచ్చరించడం బాధాకరం. ఒకవైపు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్రావుగారు తెలుగు భాషకి మరింత గౌరవాన్ని తెచ్చే విధంగా ‘ప్రపంచ తెలుగు మహా సభలు’ జరిపి తనదైన ఔన్నత్యాన్ని చాటి భాషకు ఎల్లలు లేవు. కళకు సరిహద్దులు, భాషా బేధం లేదు అన్న రీతిలో తెలుగు సినీ నటీనటులను ఆహ్వనించి ఎంతో గొప్పగా ఘనంగా సన్మానించారు. శ్రీ కె.టి.ఆర్ గారు కూడా ప్రతీ నటిని, నటున్ని పేరు పేరున పలకరిస్తూ తనదైన అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్‌గారు కూడా సినీ పరిశ్రమ పట్ల, నటీనటుల పట్ల తనదైన స్నేహభావాన్ని ప్రకటిస్తూ.. ఏ సహాయానికైనా వెనుకాడకుండా ఆదరిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలుగు సినిమా నటుడు శ్రీ గుండు హన్మంతరావు అనారోగ్య పరిస్థితులు తెలుసుకుని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 5లక్షల రూపాయలు అందించారు కె.టి.ఆర్ గారు. సినిమా నటీనటుల పట్ల తనదైన గౌరవాన్ని చాటుకున్న శ్రీ కె.సి.ఆర్ గారి పరిపాలనకి కృతజ్ఞతలు. ఇలాంటి సమయంలో శ్రీ పాపారావుగారు ‘సినిమా నటీనటులను సన్మానించకూడదు’ అని హెచ్చరించడం ఎంత వరకు సబబు అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం.. ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వం కూడా సమర్థించదని అనుకుంటున్నాం’. అంటూ పాపారావు వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
డాక్టర్ కేర్ హోమియోపతి ఆస్పత్రి ప్రారంభం
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): డైమండ్ పార్కు సమీపంలోని శ్రీకన్య ఫారŠూచ్యన్ హోటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన డాక్టర్ కేర్ హోమియోపతి ఆస్పత్రిని సోమవారం రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్ మందులకు నయం కాని జబ్బులకు సైతం హోమియోపతి వైద్యం సంపూర్ణంగా పనిచేస్తుందన్నారు. ఎన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రులు వచ్చినా, హోమియో చికిత్స మాత్రం ప్రత్యేకమేనన్నారు. దశాబ్ద కాలం పాటు వైద్య రంగంలో అనుభవం కలిగిన డాక్టర్ ఎ.ఎం.రెడ్డి విశాఖలో ఆస్పత్రి ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆస్పత్రి అధినేత ఎ.ఎం.రెడ్డి మాట్లాడుతూ విశాఖ ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిన టీఎస్సార్ చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విశాఖ కేంద్రంగా తమ బ్రాంచులను తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రారంభిస్తామన్నారు. సుబ్బిరామిరెడ్డి సేవా పీఠం స్ఫూర్తితో రోగులకు సలహాలు అందిస్తామన్నారు. అనంతరం లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ అధినేత జి.శ్రీధర్‌రెడ్డి, విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు వరదారెడ్డి, పాలూరి శేషమాంబ, టి.ఎస్.ఎన్.మూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
'శ్రీదేవితో సిల్వర్ జూబ్లీ సినిమా తీయాలనుంది'
'ఇండియాలోని అన్ని జనరేషన్స్‌కి తెలిసిన ఒకే ఒక్క పేరు శ్రీదేవి. బాల నటి గా మొదలైన తన కెరీర్ 'మామ్' చిత్రం వరకూ సాగడమంటే మామూలు విషయం కాదు. శ్రీదేవితో 24 సినిమాలు చేసిన ఏకైక దర్శకుణ్ణి నేనే. కోన వెంకట్ కథ అందించి, సురేశ్‌బాబు ఫైనాన్స్ చేసి శ్రీదేవి డేట్స్ ఇస్తే తనతో సిల్వర్ జూబ్లీ మూవీ చేస్తాను' అన్నారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. శ్రీదేవి టైటిల్ రోల్లో రవి ఉద్యవార్ దర్శకత్వంలో తెరకెక్కిన మామ్ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ 'ఏదైనా సినిమా బాగుందని తెలిస్తే వెళతాం. కానీ, శ్రీదేవి సినిమాలో ఉందని తెలిస్తే ఆలోచించకుండా వెళ్తాం. ఎందుకంటే తను గ్లామర్‌గా ఉంటుంది. యాక్టింగ్, డ్యాన్స్ బాగా చేస్తుంది కాబట్టి' అన్నారు. నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ 'శ్రీదేవిగారితో మా నాన్నగారు దేవత, ముందడుగు, తోఫా వంటి చిత్రాలు తీసారు. అప్పడు నేను పక్కన నిలబడి చూస్తుండేవాణ్ని. ఆమె సూపర్‌స్టార్. ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్. మామ్ రషెష్ చూశా. ఎక్సలెంట్‌గా నటించారు' అన్నారు. 'బోనీ కపూర్ సినిమాల మేకింగ్‌లో లాభనష్టాలు చూసుకోడు. శ్రీదేవి అప్పట్లో ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉన్నారు అన్నారు' కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి. 'దేవుడు అన్ని చోట్ల ఉండకుండా అమ్మను సృష్టిస్తాడనేది ఎంత నిజమో, మామ్ సినిమా చేయడానికి శ్రీదేవిగారిని క్రియేట్ చేశారనేది అంతే నిజం. జూలై 7న సినిమా విడుదల కానుంది' అని రచయిత కోన వెంకట్ అన్నారు. 'నా జీవితానికి భార్య ఎంత ప్రాణమో ఈ సినిమాకు అంతే ప్రాణం. ఇప్పటి వరకు తను చేసిన పాత్రలన్నింటిని మించే పాత్ర మామ్' అని నిర్మాత, శ్రీదేవి భర్త బోనీకపూర్ అన్నారు. శ్రీదేవి మాట్లాడుతూ 'మామ్ ఎంత పెద్ద హిట్ అవుతుందనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ఓ నటిగా నాకు సంతృప్తినిచ్చింది. మా ఆయన ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వడం నా అదృష్టం' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, నిర్మాతలు: బోనీ కపూర్, సునీల్ మన్‌చందా, నరేష్ అగర్వాల్, ముఖేష్ తల్రేజా, గౌతమ్ జైన్. -
ఇది నా పూర్వజన్మ సుకృతం :సుమన్
విశాఖ సాగరతీరం శివనామస్మరణతో మార్మోగింది. ఏటా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే మహకుంభాభిషేకం ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. ఆర్కే బీచ్‌లో ప్రతిష్టించిన కోటి లింగాలకు శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి క్షీరాభిషేకం చేసి, మహా కుంభాభిషేకం ప్రారంభించారు. అనంతరం సినీ ప్రముఖులు సుమన్, రాజశేఖర్, జీవిత శివ లింగాలకు అభిషేకం చేశారు. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో నటుడు సుమన్‌కు ‘ఆధ్యాత్మిక నటప్రవీణ’ బిరుదు ప్రదానం చేశారు. ‘‘సుమన్‌ని చూస్తే వేంకటేశ్వరస్వామిని, శ్రీరాముడిని చూసినట్లు ఉంటుంది. అందుకే ఆయనకు ‘ఆధ్యాత్మిక నటప్రవీణ’ బిరుదు ఇవ్వడం జరిగింది’’ అని టీయస్సార్ అన్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సుమన్‌కు స్వర్ణ కంకణం తొడిగి, బిరుదుతో సత్కరించారు. ‘‘ఈ బిరుదును స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, సుబ్బిరామిరెడ్డి చేతుల మీదగా అందుకోవటం నా పూర్వజన్మ సుకృతం’’ అని సుమన్ అన్నారు. -
అభిమానులకు షాక్ ఇచ్చిన పవర్ స్టార్
-
'చిరు, పవన్ ఎంత బిజీగా ఉన్నా సినిమా తీస్తా'
చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్లిద్దరితో కలిపి ఒక మల్టీస్టారర్ సినిమా తీస్తానని కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. సినిమాలకు, రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని, సినిమాకు కథ మాత్రమే ముఖ్యమని ఆయన అన్నారు. ఇద్దరి ఇమేజ్‌కు తగ్గట్లుగా సినిమా తీస్తానని టీఎస్ఆర్ వివరించారు. సుబ్బిరామిరెడ్డితో పాటు అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. అన్నదమ్ములు చిరు, పవన్ కలిసి ఒకే సినిమాలోనటిస్తున్నారన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇంతకుముందు కూడా ఈ విషయం ప్రచారంలోకి వచ్చినా, అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు స్వయంగా సుబ్బిరామిరెడ్డే ప్రకటించడంతో ఇక ఇది అఫీషియల్ అయిపోయింది. -
త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు, పవన్‌లతో మల్టీ స్టారర్
-
త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు, పవన్‌లతో మల్టీ స్టారర్
ఇటీవల ఖైదీ నంబర్ 150 సినిమా సందర్భంగా మెగాస్టార్ కోసం కళాబంధు సుబ్బిరామి రెడ్డి, ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో త్వరలో మెగా ఫ్యామిలీ హీరోలతో ఓ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు సుబ్బిరామి రెడ్డి. అయితే ఇంత భారీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని భావించారు ఫ్యాన్స్. కానీ అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కనుందట. సుబ్బిరామిరెడ్డితో పాటు అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ దూరమవుతున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరు, పవన్‌లు కలిసి ఒకే సినిమాలోనటిస్తున్నారన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ వార్త తెగ హల్చల్ చేస్తోంది. -
ఎంపీలనూ పట్టించుకోరా: సుబ్బిరామిరెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రక్షణ కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) గార్డులు ఎంపీలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి సభలో మండిపడ్డారు. ఈ విషయమై ఆయన రాజ్యసభలో 188 నిబంధన కింద ప్రివిలేజి నోటీసు ఇచ్చారు. ఎంపీల పట్ల ఎస్పీజీ సభ్యులు అమర్యాదగా, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్పారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నప్పుడు వాళ్లు తనపట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. వాళ్ల విధులకు తాము ఆటంకం కలిగించబోమని, కానీ కనీసం ఎంపీలమన్న గౌరవం అయినా ఉండాలి కదా అని సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఆయన ఇచ్చిన ప్రివిలేజి నోటీసును పరిశీలిస్తామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చెప్పారు. అయితే, ఒక ఎంపీ స్వయంగా తన సొంత అనుభవాన్ని చెబుతున్నప్పుడు కేవలం నోటీసులకు మాత్రమే ఈ అంశం పరిమితం కాకూడదని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అన్నారు. ఈ నోటీసు పరిధి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు రక్షణ కల్పిస్తున్న ఎస్పీజీకి కూడా విస్తరించాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. -
ప్రత్యేక హోదాపై విద్యార్థి సంఘాల ఆందోళన
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కెటాయించకపోవడాన్ని నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి నివాసం వద్ద శనివారం ప్రజా విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నేతలు సుబ్బిరామిరెడ్డికి వినతి పత్రం సమర్పించాయి. ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కెటాయించకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. సేకరించిన కోటి సంతకాలతో ఈ నెల 14న ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సారథ్యంలో రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని తెలిపారు. -
రెబల్స్ ఉన్నారా.. నాకు తెలియదే
రాజ్యసభ బరిలో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా పోటీ చేసిన విషయం తనకు తెలియదని కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఒకవేళ రెబెల్స్ ఎవరైనా ఉంటే ఆ విషయాన్ని పార్టీ అధిష్ఠానం, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చూసుకుంటారని ఆయన అన్నారు. వాస్తవానికి నాలుగో అభ్యర్థిని గెలిపించుకునే బలం కాంగ్రెస్ పార్టీకి లేదని, అందుకే అధిష్ఠానం కేవలం ముగ్గురు అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపిందని టీఎస్సార్ చెప్పారు. అయితే, గోదావరి జిల్లాల నుంచి చైతన్య రాజు, నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం ఆరు స్థానాలకు గాను ఎనిమిది మంది బరిలో ఉన్నట్లయింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు, టీఆర్ఎస్ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడనున్నారు.