
∙టి. సుబ్బిరామిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, సుమన్, రాజశేఖర్, స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, అర్చన
విశాఖ సాగరతీరం శివనామస్మరణతో మార్మోగింది. ఏటా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే మహకుంభాభిషేకం ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. ఆర్కే బీచ్‌లో ప్రతిష్టించిన కోటి లింగాలకు శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి క్షీరాభిషేకం చేసి, మహా కుంభాభిషేకం ప్రారంభించారు.
అనంతరం సినీ ప్రముఖులు సుమన్, రాజశేఖర్, జీవిత శివ లింగాలకు అభిషేకం చేశారు. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో నటుడు సుమన్‌కు ‘ఆధ్యాత్మిక నటప్రవీణ’ బిరుదు ప్రదానం చేశారు. ‘‘సుమన్‌ని చూస్తే వేంకటేశ్వరస్వామిని, శ్రీరాముడిని చూసినట్లు ఉంటుంది. అందుకే ఆయనకు ‘ఆధ్యాత్మిక నటప్రవీణ’ బిరుదు ఇవ్వడం జరిగింది’’ అని టీయస్సార్ అన్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సుమన్‌కు స్వర్ణ కంకణం తొడిగి, బిరుదుతో సత్కరించారు. ‘‘ఈ బిరుదును స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, సుబ్బిరామిరెడ్డి చేతుల మీదగా అందుకోవటం నా పూర్వజన్మ సుకృతం’’ అని సుమన్ అన్నారు.