
రాజ్యసభకు నేనూ పోటీ చేస్తున్నా: ఆదాల
కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే బలం ఉందో తెలియదు గానీ, ఎవరికి వారే, తామంటే తాము రాజ్యసభ బరిలో ఉన్నామంటూ ముందుకొస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీకి నలుగురు రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే బలం ఉందని, అయినా కూడా ముగ్గురిని మాత్రమే బరిలో నిలబెట్టారని ఆయన అన్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు ఓటేసే పరిస్థితి ఉందని, దీన్ని నివారించేందుకు తాను కూడా బరిలోకి దిగానని ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియజెప్పేందుకే తాను రాజ్యసభకు పోటీచేస్తున్ననని, సమైక్యాన్నికోరుకునే ఎమ్మెల్యేలంతా పార్టీలకు అతీతంగా తనకు ఓటేస్తారని ఆశిస్తున్నానని నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన చెప్పారు.
తొలుత రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేసిన సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి ఉపసంహరించుకోవడంతో చైతన్య రాజు, ఆదాల మాత్రమే రెబెల్స్ గా బరిలో నిలిచినట్లు అయ్యింది. సమైక్యాంధ్ర కోరుకునే వాళ్లంతా తమకు ఓటు వేయాలనేది తమ నినాదం అని ఆదాల అంటున్నారు. విభజనపై కాంగ్రెస్ వైఖరిని వ్యతిరేకించేలా తమ చర్యలు ఉండాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందులోభాగంగా సమైక్యానికి మద్దతు ఇచ్చే కాంగ్రెస్ నాయకులు ఎవరు రాజ్యసభ అభ్యర్థులుగా పోటీ చేసినా తమ ఓటు వారికే వేస్తామని ప్రకటించారు. ఎం.ఎ.ఖాన్, టి.సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు అధికారికంగా రాజ్యసభ బరిలో నిలవనున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది.