సాక్షి, నెల్లూరు: నిన్నమొన్నటి వరకు కత్తులు దూసుకున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు ఒక్కటయ్యారు. నాకు నువ్వు..నీకు నేను అంటూ ఆలింగనాలు, కౌగిలింతల్లో మునిగితేలుతున్నారు. వీరి మధ్య సాగిన శతృత్వం తెలిసిన వారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసి విస్తుపోతున్నారు.
జనంతో పాటు వారి అనుచరులు, కార్యకర్తలు సైతం ఔరా..! రాజకీయం అని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీలో చేరకముందే ఆయన సోమిరెడ్డితో పాటు మిగిలిన నేతలతో సభలు, సమావేశాల్లో, చర్చలు, విందుల్లో మునిగితేలుతూ అందరినీ ఆశ్చర్చపరుస్తున్నారు.
కయ్యమిలా..
క్లాస్ వన్ కాంట్రాక్టర్ అయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సోమిరెడ్డే రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. మొదట ఆదాల 1999లో అప్పటి అల్లూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచే ఆయన అవకాశవాద రాజకీయాలను బాగా వంట బట్టించుకున్నట్టు పేరుపొందారు. రాజకీయాల్లో జూనియర్ అయినప్పటికీ అధిష్టానం వద్ద చక్రం తిప్పి మంత్రి పదవి పొందారు. ఆ పదవి కోసం ఆయన ధనబలం బాగా ఉపయోగపడిందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అనంతరం ఆదాల, సోమిరెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయి. ఆదాల ధన రాజకీయంతోనే తనకు మంత్రి పదవి రాకుండా పోయిందనే అక్కసు సోమిరెడ్డిలో మొదలైంది.
అప్పటి నుంచి ఆదాలను మంత్రి పదవిని తప్పించేందుకు దొరికిన అన్ని అవకాశాలను సోమిరెడ్డి ఉపయోగించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఎట్టకేలకు రెండున్నరేళ్ల తర్వాత ఆదాలను చంద్రబాబు మంత్రిపదవి నుంచి తొల గించి సోమిరెడ్డికి కట్టబెట్టారు. దీంతో వీరి మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమాని అల్లూరు నియోజకవర్గం కనుమరుగైంది. సోమిరెడ్డిపై అక్కసుతో ఉన్న ఆదాల కాంగ్రెస్‌లో చేరి 2004లో జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లిలో ఆయనేపైనే పోటీ చేసి విజయంతో ప్రతీకారం తీర్చుకున్నారు. అంతటితో వదలని ఆదాల 2009లోనూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమాని సోమిరెడ్డిపై మరోసారి విజయం సాధించారు. వరుస ఓటములతో కుంగిపోయిన సోమిరెడ్డి కోవూరు ఉపఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశాలతో బరిలోకి దిగి ముచ్చటగా మూడోసారి ఓడిపోయారు.
నేడు కౌగిలింతలు: రాష్ట్ర విభజన పుణ్యమాని మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నేతలు మాటల కత్తులు పక్కన పెట్టి కండువాలు, చొక్కాలు మా ర్చుకుంటున్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉంటే అధికారిక పదవులు లభించవని భా వించిన ఆదాల అవకాశవాద రాజకీయంతో మరోమారు టీడీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సోమిరెడ్డితో దోస్తీ తప్పనిసరయిం ది. అందులో భాగంగా శుక్రవారం సోమిరెడ్డి ఇంటికి ఆదాల వెళ్లగా, ఆది వారం సోమిరెడ్డితో పాటు పలువురు నేతలు ఆదాల ఇంటికి వెళ్లి విందు రాజకీయాలు చేశారు.
ఈ కొత్తరాకపోకలు చర్చనీయాంశంగా మారాయి. ఆర్థిక బలం కలిగిన ఆదాలతో తాత్కాలికంగా అయినా స్నేహంగా మెలిగేందుకు సోమిరెడ్డి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే గతంలో జరిగిన నష్టం మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఆయన వ్యూహాలు రచించినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ నుంచి లేదా సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఆదాల నుంచి ఆర్థిక సాయం పొందాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ వారు ఊహిస్తున్నట్లు టీడీపీ అధికారంలోకి వస్తే గతంలో మాదిరిగా ఆదాల తనకు అడ్డం కాకుండా, ఆయనను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు సోమిరెడ్డి వ్యూహం రచించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆదాల సైతం అంగీకరించినట్లు సమాచారం. ఏది ఏమైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులు ఉండరని తెలుగు తమ్ముళ్లు తేటతెల్లం చేస్తున్నారు.
నిన్న కత్తులు.. నేడు కౌగిలింతలు
Published Mon, Mar 3 2014 4:08 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement