సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ పునరుద్ఘాటించింది. ఏ కారణంతో విభజన జరిగినప్పటికీ ఆ నిర్ణయంలో టీడీపీకీ భాగస్వామ్యం ఉందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో టీడీపీ ప్రతినిధిగా హాజరైన సోమిరెడ్డి ఈ మేరకు పార్టీ వైఖరిని వెల్లడించారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని... అయితే విభజన జరిగితే ఇరుప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నదే టీడీపీ విధానమని సోమిరెడ్డి చెప్పారు. విభజన నిర్ణయం తీసుకునేముందు సొంతపార్టీ వారిని సైతం ఒప్పించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి ఆక్షేపించారు. అసెంబ్లీ తీర్మానం ద్వారా రాష్ట్రాల విభజన చేసిన బీజేపీ విధానాన్ని కాంగ్రెస్ ఎందుకు పాటించదని ప్రశ్నించారు.
2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కోరినప్పటికీ అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకోవాలని నొక్కిచెప్పినట్లు వివరించారు. విభజనకు అనుకూలమని అఖిలపక్ష భేటీలో పార్టీలన్నీ చెప్పిన తర్వాతే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేతలు మల్లు రవి, జంగా గౌతమ్ చెప్పారు. విభజనను అడ్డుకుంటే తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వినోద్‌కుమార్ చెప్పారు. విభజన తీరుచూస్తే రాజకీయకోణ ంలో జరిగిందనే భావన కలుగుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణకు చర్యలుండాలని కోరారు. సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న తమ పార్టీ విభజన తర్వాతి పరిణామాలపై ఇప్పుడే స్పందించదల్చుకోలేదని సీపీఎం నేత ఎస్.వీరయ్య చెప్పారు. సమగ్ర, సామరస్య తెలంగాణకు లోక్‌సత్తా అనుకూలమని ఆ పార్టీ నేత డీవీవీఎస్ వర్మ తెలిపారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు అధ్యక్షతన ఫోరం నేతలు కొమ్మినేని శ్రీనివాసరావు, కందుల రమేశ్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ వైఖరిపై అయోమయం: విభజన విషయంలో టీడీపీ గందరగోళ వైఖరితో ఉందని సమావేశానికి హాజరైన వక్తలతో పాటు ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. నేతల స్పందన సమయంలోనూ, ఆహుతుల ప్రశ్నల్లోనూ ఈ ధోరణి స్పష్టంగా కనిపించింది. సమావేశంలోని వాతావరణానికి టీడీపీ ప్రతినిధి సోమిరెడ్డి ఇబ్బందిపడ్డారు. పలువురు నేతలు టీడీపీ వైఖరి ఏంటని రెట్టించి అడిగినప్పటికీ సోమిరెడ్డి సరైన రీతిలో సమాధానం ఇవ్వలేకపోయారు.