జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలు | Telangana will be born June 2 | Sakshi
Sakshi News home page

జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలు

Published Wed, Mar 5 2014 1:22 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM

Telangana will be born June 2

* ‘అపాయింటెడ్ డే’ ప్రకటించిన కేంద్రం
* కేంద్ర హోంశాఖ గెజిట్ జారీ
* శాసనసభ తుది గడువు రోజే.. రాష్ట్ర విభజన తేదీ
* విభజన పూర్తిచేయటానికి మూడు నెలల సమయం
* ఉమ్మడి రాష్ట్రంలోనే లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు
* ప్రస్తుత నియోజకవర్గాల్లోనే యథాతథంగా పోలింగ్
* జూన్-2 నాటికి సిద్ధం కానున్న కొత్త శాసనసభలు
* విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు
* విభజన పనిలో కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు నిమగ్నం
* కేంద్రంలో 15, రాష్ట్రంలో మరో 15 కమిటీలు ఏర్పాటు
* ఈ కమిటీల సూచనలపై నిర్ణయం తీసుకోనున్న
* రాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాలు
 
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ రెండో తేదీ నుంచి రెండు భాగాలుగా విడిపోతుంది. ఆ రోజున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జూన్-2వ తేదీని ‘అపాయింటెడ్ డే’గా మంగళవారం రాత్రి ప్రకటించింది. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2014 రాష్ట్రపతి ఆమోదంతో ఈ నెల 1న చట్టంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విభజన అమలులోకి వచ్చే ‘అపాయింటెడ్ డే’ ఎప్పుడన్నది ఆ చట్టం గెజిట్‌లో పొందుపరచలేదు. ఈ తేదీని తర్వాత వేరుగా ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

ఈ నేపథ్యంలో.. సార్వత్రిక ఎన్నికలతో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కూడా బుధవారం షెడ్యూలు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. షెడ్యూలుతో పాటు బుధవారం నుంచే ఎన్నికల కోడ్ కూడా అమలులోకి రానున్న పరిస్థితుల్లో అందుకు ఒక రోజు ముందు మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన అమలు తేదీ (అపాయింటెడ్ డే)ని జూన్-2గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది.
 
రెండు రాష్ట్రాల్లో కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వాలు
రాష్ట్ర విభజన తేదీ అయిన జూన్ 2వ తేదీతోనే రాష్ట్ర శాసనసభ గడువు కూడా ముగియనుంది. ఆ తేదీ నాటికి రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త శాసనసభ కొలువుదీరాల్సి ఉంటుంది. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలకూ జారీ చేయనున్న షెడ్యూలు ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నికల ఘట్టం మొత్తం మే 15వ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశమున్నట్లు సమాచారం. అంటే.. ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలోనే.. ప్రస్తుతమున్న నియోజకవర్గాల ప్రకారమే.. సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని స్పష్టమైపోయింది. అలాగే.. 2న విభజన అమలులోకి వచ్చాకే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)- రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా కొత్త ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి.

విభజన పూర్తిచేయటానికి మూడు నెలలు...
విభజన చట్టం గెజిట్ నోటిఫికేషన్‌కు, విభజన అమలులోకి వచ్చే అపాయింటెడ్ డేకు మధ్య దాదాపు 3 నెలల వ్యవధి ఉంది. ఈ వ్యవధిలో విభజనకు సంబంధించి అనేక లాంఛనాలు పూర్తిచేయాల్సి ఉంది. ముఖ్యంగా సిబ్బంది పంపిణీ, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి కార్యక్రమాలు పూర్తికావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో 15 కమిటీలను ఏర్పాటు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ వుంత్రిత్వ శాఖల అధికారులతో కూడా 15 కమిటీలను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఈ 30 కమిటీలు విభజన పనిలో నిమగ్నమై ఉన్నాయి.

ప్రధానంగా కీలకమైన ఆస్తులు, అప్పులు, ఫైళ్లు, ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం గత రెండు రోజులుగా నిమగ్నమైంది. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ గురువారం నుంచి పని ప్రారంభించనుంది. అలాగే టక్కర్ కన్వీనర్‌గా నియమించిన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేసింది.
 
ఎన్నికల ఫలితాల వెల్లడినాటికి పంపిణీలు పూర్తి...
ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెల్లడించే నాటికల్లా తెలంగాణ రాష్ట్రం, సీమాంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అవసరమైన పంపిణీలు, కేటాయింపులు అన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగాలు పూర్తి చేయనున్నాయి. అయితే ఈ విభజన, పంపిణీలకు సంబంధించి అధికారులు చేసిన ప్రతిపాదనలు అన్నింటిపై ప్రస్తుతం గవర్నర్ నరసింహన్‌తో పాటు.. కేంద్ర  ప్రభుత్వ అధికార యుంత్రాంగం నిర్ణయం తీసుకోనుంది.

సీమాంధ్రలోనూ, తెలంగాణలోనూ ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలు వారికి అవసరమైన రీతిలో ఏయే శాఖలను కొనసాగించాలి.. ఏయే శాఖలు అవసరం లేదు.. ఏయే ప్రభుత్వ రంగ సంస్థలు అవసరం.. ఏయే ప్రభుత్వ రంగ సంస్థలు అవసరం లేదు.. ఉద్యోగుల అవసరాలు.. సర్దుబాట్లపై నిర్ణయాలు తీసుకుంటారు. ఇక విభజన తర్వాత రెండు రాష్ట్రాలకూ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో శాంతిభద్రతలు, రెవెన్యూ, భూములు తదితర అంశాలపై గవర్నర్ అంతిమంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ అంశాలపై తెలంగాణ మంత్రివర్గం సిఫారసు చేసిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే స్వతంత్రంగా గవర్నర్ నిర్ణయాలను తీసుకుంటారు.
 
అపాయింటెడ్ డే గెజిట్ నోటిఫికేషన్ సారాంశం...
‘‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ  చట్టం - 2014 లోని సెక్షన్ 2 లో క్లాజ్ (ఎ) కింద ఉన్న అధికారం మేరకు.. పై చట్టం అవసరాల నిమిత్తం 2014 జూన్ రెండో రోజును అపాయింటెడ్ డేగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తోంది.’’
 - ఎస్.సురేష్‌కుమార్, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి
 
‘పునర్విభజన’పై తొలగిన సంశయం
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ గడువును పొడిగిస్తారని, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపడతారని, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచి విడిగా ఎన్నికలు జరుపుతారని గత వారం రోజులుగా రాజకీయ లబ్ధిని ఆశించి కాంగ్రెస్ వర్గాలు చేసిన ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. ప్రస్తుత శాసనసభ్యుల సంఖ్య ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని తాజాగా కేంద్రం ప్రకటించిన ‘అపాయింటెడ్ డే’తో తేటతెల్లమైంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని స్పష్టమైంది.

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని మూడో విభాగంలో గల 15, 16, 17 సెక్షన్లలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరణ ఇచ్చినప్పటికీ.. వీటికి తప్పుడు వివరణలు ఇస్తూ.. అసెంబ్లీ ఎన్నికలు విడిగా ఉంటాయని, సీట్ల సంఖ్య పెంచుతారని కాంగ్రెస్ వర్గాలు రాజకీయ లబ్ధిని ఆశించి ప్రచారం చేశాయి. ‘అపాయింటెడ్ డే’ నుంచి ఈ చట్టంలోని రెండో షెడ్యూలులో పేర్కొన్న విధంగా సీట్ల సంఖ్య ఉండాలని చట్టం స్పష్టంగా పేర్కొంది. అంటే 2008 నియోజకవర్గాల పునర్విభజన ప్రకారంగా ఉన్న సీట్ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు 175, తెలంగాణకు 119 సీట్లు ఉండాలని నిర్దేశించింది.
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 లోని 3వ క్లాజు ప్రకారం అపాయింటెడ్ డే నాటికి ఎంత సంఖ్యలో స్థానాలు ఉన్నాయో అంతే సంఖ్యలో ఎన్నికలు జరపాలి. దీని ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే.. ఈసీ ఎన్నికల షెడ్యూలు వెలువరించకముందే కేంద్ర ప్రభుత్వం ‘అపాయింటెడ్ డే’ను ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement