ఇక... తెలంగాణ పర్యాటక సంస్థ!
హైదరాబాద్ : ఇప్పటివరకు రాష్ట్రం మొత్తానికి ఒక్కటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఇక నుంచి రెండు కానుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కంపెనీల చట్టం కింద 'తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ' పేరును నమోదు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీగా పేరు నమోదుతో పాటు డైరెక్టర్ల బోర్డు ఏర్పాటుకు కూడా పచ్చజెండా ఊపింది.
కంపెనీ కింద నమోదు కావాలంటే వాటాదారులు (షేర్ హోల్డర్స్) ఉండాల్సినందున తాత్కలికంగా ఏడుగురు సభ్యుల (వాటాదారుల) ప్యానెల్కు అనుమతినిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పర్యాటకం) చందనాఖాన్, ఏపీ టీడీసీ ఎండీ కేఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, పర్యటాక శాఖ పీఎంయూ అడిషనల్ చీఫ్ బి.శ్రీనివాస్, గవర్నర్ సెక్రటేరియట్ డిప్యూటీ సెక్రటరీ కలికుమార్, పర్యాటక శాఖ కమిషనర్ సునీల్ కుమార్ గుప్తా, పర్యాటక శాఖ హోటల్స్ విభాగం ఈడీ సుమిత్ సింగ్లను షేర్ హోల్డర్లుగా ప్రకటించారు.