విభజనలో టీడీపీ ముద్దాయి
సాక్షి, చెన్నై: రాష్ట్ర విభజన వ్యవహారంలో టీడీపీ కూడా ముద్దాయి అని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. చెన్నైలో ఆదివారం ఆయనకు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా తమిళనాడులోని తె లుగు సంఘాల నేతృత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. చెన్నైలోని వళ్లువర్‌కోట్టం వద్ద సమైక్య సింహ గర్జన పేరుతో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించించింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఆహ్వానించడం వివాదానికి దారి తీసింది. అలాగే సోమిరెడ్డికి ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు వెలియడం కూడా వివాదాస్పదమైంది. ఈ చర్యల్ని వ్యతిరేకించిన సమైక్యవాదులను నిర్వాహకులు బుజ్జగించారు. నిరసన ప్రదర్శనకు హాజరైన సోమిరెడ్డి పలువురు సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. సమైక్యాంధ్ర వర్ధిల్లాలి, సమైక్యాంధ్ర జిందాబాద్ అని నినదించాలని డిమాండ్ చేసినా ఆయన స్పందించ లేదు.
తాను ఇక్కడికి ముఖ్య అతిథిగా హాజరుకావడాన్ని బట్టి సమైక్యవాదిని అవునో..కాదో నిర్ణయించుకోవాలని ఆయన ఎదురు పశ్న వేస్తూ ప్రసంగించారు. విభజన ప్రక్రియకు టీడీపీ లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని, ఈ పక్రియలో టీడీపీ సైతం ముద్దాయి అని అన్నారు. అయితే తమకంటే ముందుగా మరెందరో ముద్దాయిలు ఉన్నారని.., టీడీపీ ఆరో ముద్దాయి అంటూ వివరించే యత్నం చేశారు. పార్టీలు లేఖలు ఇచ్చినంత మాత్రాన రాజ్యాంగ బద్దంగా, విధానపరంగా నిర్ణయాలు తీసుకోకుండా వ్యవహరిస్తారా అంటూ ఏఐసీసీపై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా మారిందని తెలిపారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ప్రస్తుత సమస్యలకు ఓటరు తీర్పే పరిష్కార మార్గం అవుతుందని అన్నారు.