పార్టీ కార్యాలయంలో కన్నబాబు ఆమరణ దీక్ష
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ కుమ్ములాటలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా వారం నుంచి అధికార పార్టీ ఆత్మకూరు రాజకీయం హాట్‌హాట్‌గా సాగుతోంది. జిల్లాలో మంత్రి సోమిరెడ్డి ఆయన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మధ్య ఆత్మకూరు నియోజకవర్గం వేదికగా వర్గపోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ పరిణామాల క్రమంలో ఆది వారం పరిస్థితి తీవ్రమై గత ఎన్నికల్లో ఆత్మకూరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కన్నబాబు పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్షకు అనుచరులతో కలిసి కూర్చోవటంతో హైడ్రామా తారాస్థాయికి చేరింది. మరోవైపు సోమవారం మంత్రి నారాయణ, ఆత్మకూరు తాత్కాలిక ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కన్నబాబు దీక్షకు దిగటం, భవిష్యత్తు పరిణమాలు ఎలా ఉంటాయనే దానిపై పార్టీలో తీవ్రంగా చర్చ సాగుతుంది.
అధికార పార్టీలో ఆత్మకూరు ఇన్‌చార్జి చిచ్చు రోజుకో మలుపు తిరుగుతోంది.
వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అంతర్గతంగా సాగుతున్న విభేదాలు మరింత ముదిరి రచ్చకెక్కాయి. ఈ వ్యవహారంలో జిల్లాలో ఇద్దరు మంత్రలు రెండు గ్రూప్‌లుగా మారి రాజకీయం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆత్మకూరు ఇన్‌చార్జి నియామకంపై మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, అమర్నా«నాథ్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చర్చించారు. అయితే మంత్రులు ఐదుగురు నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు ఆత్మకూరులో కొనసాగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇన్‌చార్జి పదవి ఆశిస్తున్న మంత్రి సోమిరెడ్డి వర్గీయుడు కన్నబాబు తన అనుచరులతో సమావేశానికి వచ్చి ఒక్కరినే ఇన్‌చార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు.
అలాగే పార్టీ నేత మెట్టుకూరు ధనుంజయ్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో సమావేశానికి గైర్హాజరై నిరసన తెలపారు. ఈ క్రమంలో ఆత్మకూరు వ్యవహారాన్ని సీఎం నిర్ణయానికి వదిలేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. దీంతో పార్లమెంట్ ఇన్‌చార్జిగా ఉన్న ఆదాలను తాత్కలిక ఇన్‌చార్జిగా నియమించాలని పార్టీ ఆదేశించింది. దీంతో మరుసటి రోజునే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన వర్గీయుడు కన్నబాబుతో కలిసి ఆత్మకూరులో పర్యటించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించి, చేజర్లలో బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజకీయంగా మంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాలకు వైరం ఉన్న క్రమంలో సోమవారం ఆదాల ప్రభాకర్‌రెడ్డి తాత్కలిక ఇన్‌చార్జి హోదాలో సోమవారం మంత్రి నారాయణతో కలిసి ఆత్మకూరులో పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆత్మకూరు టీడీపీ నేతలు కొందరు ఆదాలను కలిసి అభినందించారు. దీనిని కన్నబాబు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనకు దిగింది.
పార్టీ కార్యాలయంలో కన్నబాబు ఆమరణ దీక్ష
ఈ క్రమంలో ఆదాల నియామకాన్ని వ్యతిరేకిస్తూ కన్నబాబు పార్టీ రాజీనామా చేస్తారని బలంగా ప్రచారం సాగింది. దీనికి అనుగుణంగా ఆత్మకూరు టీడీపీ నేతలు, కొందరు కార్యకర్తలతో కలిసి నగరంలో ఆయన మూడు గంటలకు పైగా సుదీర్ఘ మంతనాలు జరిపారు. చివరిగా పార్టీ కార్యాలయంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహం ముందు ఆమరణదీక్షను ఆదివారం రాత్రి 9.15 గంటలకు ప్రారంభించి సేవ్ టీడీపీ అంటూ నినాదాలు చేశారు. జిల్లాకు చెందిన పార్టీ మంత్రులు, జిల్లా అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర నేతలు ఎవరూ పట్టించుకోకపోవటంతో పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్ష నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కన్నబాబుతో చర్చలు ప్రారంభించారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు కన్నబాబుతో దీక్ష విరమించాలని కోరినా ఫలితం లేదు.
Comments
Please login to add a commentAdd a comment