సోమిరెడ్డి పట్టుజారుతోందా?
- కొత్త కార్యాలయం ప్రారంభానికి నాయకుల డుమ్మా
- నారాయణ నామినేషన్ దాఖలుకు తరలిన నేతలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి జిల్లా పార్టీపై పట్టుజారుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. అసలు ఎన్నికల్లో పోటీ చేయని నారాయణకు మంత్రి పదవి రావడం, ఆయన జిల్లాలో దూసుకుపోవడం లాంటి సంఘటనలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. సీనియర్ నేతగా పేరున్న సోమిరెడ్డి ఎన్నికల్లో వరుస పరాజయాలు పొందడం కూడా పార్టీపై పట్టుజారి పోవడానికి ఓ కారణంగా నేతలు పేర్కొంటున్నారు.
కొన్నేళ్లుగా కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి పనిచేసిన సోమిరెడ్డిని కాదని నారాయణకు పార్టీ ప్రాధాన్యం ఇవ్వడంతో నాయకులు, కార్యకర్తలు కూడా మంత్రినే అనుసరిస్తున్నారు. నారాయణ సోమవారం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమానికి జిల్లాలోని ముఖ్యనేతలందరూ వెళ్లారు. నెల్లూరు మేయర్ అజీజ్ టీడీపీలో చేరడంలో ప్రముఖ పాత్ర వహించిన నారాయణ, తాను నామినేషన్ దాఖలు చేసిన రోజునే, పార్టీలో చేర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఇదే రోజున నెల్లూరులో సోమిరెడ్డి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు.
కార్యాలయం ప్రారంభానికి ఇద్దరు ముగ్గురు ప్రముఖ నాయకులు మాత్రమే హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో పాటు, ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, కురుగొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, పరసారత్నం, చాట్ల నరసింహారావు, వేనాటి రామచంద్రారెడ్డి, అంచెల వాణితో పాటు పలువురు ప్రముఖ నాయకులు నారాయణ కార్యక్రమానికే వెళ్లారు.
సోమిరెడ్డి నూతన కార్యాలయం ప్రారంభానికి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటేస్వామి నాయుడు, తాళ్లపాక అనూరాధ, బెజవాడ ఓబుల్‌రెడ్డి తదితరులు మాత్రమే వచ్చారు. అటు మంత్రివర్గంలోను, పార్టీ కార్యకలాపాల్లోను నారాయణ చురుగ్గా ఉండడంతో సోమిరెడ్డి అనుచరులైన కార్యకర్తలు, నాయకులు కూడా మంత్రినే అనుసరిస్తున్నట్లు సమాచారం. కొందరు సోమిరెడ్డి వైపున్నా, ఎంతకాలం కొన సాగుతారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ఎటువంటి పదవి దక్కించుకోలేని పరిస్థితిలో సోమిరెడ్డి కొనసాగితే, ఆయన భవిష్యత్తులో ఒంటరి అయ్యే అవకాశం ఉందని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. జిల్లాలో అధికారులు కూడా సోమిరెడ్డి కన్నా, నారాయణకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో జిల్లాలో నారాయణ హవానే కొనసాగుతుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో సోమిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.