ఆయనేమన్నా మంత్రా.?. ఎమ్మెల్యేనా.? | Mayor Abdul aziz takes on Aadala prabhakar reddy | Sakshi
Sakshi News home page

ఆయనేమన్నా మంత్రా.?. ఎమ్మెల్యేనా.?

Published Sat, Jun 11 2016 6:45 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ఆయనేమన్నా మంత్రా.?. ఎమ్మెల్యేనా.? - Sakshi

ఆయనేమన్నా మంత్రా.?. ఎమ్మెల్యేనా.?

ఆదాల కార్యక్రమానికి హాజరైన  కమిషనర్
ఆయనపై మేయర్ మద్దతుదారుల చిందులు
టీడీపీ గ్రూపుల గొడవల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని అధికారుల ఆందోళన

 
‘‘ఆయనేమన్నా (ఆదాల ప్రభాకర్రెడ్డి ) మంత్రా.?. ఎమ్మెల్యేనా.? ఆయన కేమైనా ప్రొటోకాల్ ఉందా?. అభివృద్ధి పనుల పరిశీలన కోసం ఆయన పిలిస్తే మీరెలా వెళతారు.. ఉండాలనుందా? లేదా’’  మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లుపై మేయర్  అబ్దుల్ అజీజ్ సమక్షంలోనే ఆయన మద్దతుదారులు ఈ రకమైన హెచ్చరికలు జారీ చేశారు.
 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి నెల్లూరు రూరల్నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్రెడ్డి రెండేళ్లుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తున్నారు.  ప్రభుత్వ అధికారులను వెంటబెట్టుకుని పనుల పరిశీలనకు వెళుతున్నారు. అధికార పార్టీ నాయకుడు కావడంతో అధికారులు కూడా ఆయన పిలిచిన వెంటనే పర్యటనకు హాజరవుతున్నారు. ఇటీవల కాలంలో మేయర్ అబ్దుల్ అజీజ్ను టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గాలు చుట్టుముట్టాయి.
 
 అవకాశం దొరికితే రాజకీయంగా దెబ్బతీయడానికి కత్తులు నూరుతున్నాయి. ఇదే సమయంలో అజీజ్ కూడా ప్రత్యర్థులతో సై అంటే సై అనేలాగా వ్యవహరిస్తున్నారు. మేయర్గా కార్పొరేషన్ పరిధిలో తాను చెప్పిన పనులే జరగాలని అధికారుల మీద ఒత్తిడి పెంచారు. కొన్ని వ్యవహారాల్లో మంత్రి నారాయణ ఒక విధంగా చెబితే అధికారులకు మేయర్మరో రకమైన ఆదేశాలు ఇస్తున్నారు. టీడీపీలోని ఈ గ్రూపుల గోలతో కమిషనర్ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఇబ్బంది పడుతున్నారు.
 
  ఆదాల  పిలిస్తే ఎలా పోతారు?
 రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రూరల్ నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్న ఆదాల ప్రభాకర్రెడ్డి మూడు రోజుల నుంచి మళ్లీ పర్యటనలు ప్రారంభించారు. ఇందులో భాగంగా బుధవారం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు తన వెంట రావాలంటూ కమిషనర్ వెంకటేశ్వర్లుకు సమాచారం పంపారు. అధికార పార్టీ నాయకుడు కావడంతో కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదాల వెంట పర్యటనకు వెళ్లారు.
 
 ఈ విషయం తెలియడంతో మేయర్ అజీజ్ తీవ్రంగా రగిలిపోయారు. కార్పొరేషన్ అధికారులను కూడా మాజీ మంత్రులు, నాయకులు శాసిస్తే ఇక తాను ఉండేది ఎందుకంటూ ఆగ్రహించారు. తమ నాయకుడి ఆగ్రహం చూసిన మద్దతుదారులు మేయర్ ఎదుటే కమిషనర్పై తమ ఆవేశం వెళ్లగక్కారు. ఆదాల ఏమైనా మంత్రా, ఎమ్మెల్యేనా, కనీసం కార్పొరేటరా? ఆయనకు ఏం ప్రొటోకాల్ ఉందని మీరు వెళ్లారు? ఇంకో సారి వెళితే మీరు ఇక్కడ ఉండరు అని తీవ్రంగా హెచ్చరించారు.
 
  తాను అధికారిననీ, అభివృద్ధి పనుల విషయం గురించి అధికార పార్టీ నాయకుడు పిలిస్తే వెళ్లాననీ, వెళ్లొద్దనడానికి మీరెవరనీ కమిషనర్ అన్నారు. తనను నియంత్రించే ప్రయత్నం చేయొద్దని ఆయన గట్టిగా చెప్పడంతో మేయర్ వ ర్గీయులు సర్దుకున్నారు. ఈ విషయం గురించి తెలియడంతో కార్పొరేషన్లోని అధికారులు, సిబ్బంది తెలుగుదేశం పార్టీ గ్రూపుల గొడవల్లో తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కమిషనర్ వెంకటేశ్వర్లును సాక్షి ప్రతినిధి వివరణ కోరగా, తాను అధికారిననీ అభివృద్ధి పనుల విషయంలో అందరినీ సమన్వయం చేసుకోవాల్సి ఉందని చెప్పారు.
 
 పనులన్నీ వారే నిర్ణయిస్తే ఎలా ?
 కార్పొరేషన్ పరిధిలో వివిధ పథకాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే నిధులతో చేపట్టే పనులను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్లు చెప్పిన విధంగానే ఖరారు చేయాలని ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు ఇదే విషయాన్ని మేయర్ అజీజ్కు గట్టిగా చెప్పారు.
 
 అన్నీ వారు చెప్పినట్లు చేస్తే ఇంక నేనెందుకు? వాళ్లు ప్రతిపాదనలు పంపితే నేను సంతకాలు చేయాలా? అని అజీజ్ ఆ సమావేశం అనంతరం బహిరంగంగానే తన నిరసన వెల్లడించారు. అభివృద్ధి పనులు మంజూరు చేయించుకునేది వారే, వాటిని పర్యవేక్షించేదీ వారే, మేం రాజకీయం చేయాల్సిన అవసరం లేదా? అని ఆయన మండి పడ్డారు. ఈ రకంగా అయితే నగరంలో తన పరపతి పూర్తిగా పోతుందని భావించి అధికారులను కట్టడి చేసే వ్యూహం అమలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement