- ఆదాలతో అజీజ్ స్నేహం
- తమ వర్గం పట్టు పెంచుకోవడానికి పార్టీ నేతలతో సమావేశం
- కార్పొరేటర్లతో పాటు ఓడిన వారికీ పనులు ఇస్తామని హామీ
- నెల్లూరు సిటీలో అజీజ్‌కు ఆదాల సహకారానికి ఒప్పందం
దోస్త్ మేరా దోస్త్
Published Fri, Aug 12 2016 12:38 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:
నెల్లూరు తెలుగుదేశం పార్టీలో కొత్త స్నేహానికి తెర లేచింది. మంత్రి నారాయణతో విభేదిస్తున్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో మేయర్ అబ్దుల్ అజీజ్ జత కట్టారు. రాజకీయంగా ఒకరికొకరు సహరించుకుంటూ పార్టీ లోని తమ శత్రువులకు చెక్ పెట్టే ఎత్తుగడలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే గురువారం ఆదాల ఇంట్లో రూరల్ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యులతో ఇద్దరూ సమావేశమై మనం మనం ఒకటి అనుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్‌గా ఎన్నికైన అబ్దుల్ అజీజ్ తన గురువు, మంత్రి నారాయణ ఆహ్వానంతో టీడీపీలో చేరారు. అనంతర పరిణామాల్లో ఆనం కుటుంబం టీడీపీలో చేరడంతో అజీజ్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైంది. మంత్రి అండతో రాజకీయ చక్రం తిప్పాలనుకున్న అజీజ్ వ్యూహం ఫలించలేదు. ఆనం కుటుంబానికి మంత్రి ప్రాధాన్యం ఇస్తూ రావడంతో కార్పొరేషన్ వ్యవహారాల్లో కూడా వారు పరోక్షంగా జోక్యం చేసుకుంటూ వస్తున్నారు. దీంతో అజీజ్ ఒక అడుగు ముందుకేసి శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్లు ఆదాలతో జత కలిశారు. ఆదాల సహకారం ఉంటే కార్పొరేషన్ వ్యవహారాల్లో తన మాట నెగ్గించుకోవడం కోక పోయినా ఆనం చర్యలకు అడ్డుకట్ట వేయొచ్చని అంచనా వేశారు. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో మంత్రి నారాయణ మీద ఆదాల నేరుగా ధ్వజమెత్తడం వీరిద్దరి స్నేహాన్ని మరింత బలపడేలా చేసింది. అప్పటి నుంచి ఒకరి కొకరు అన్నట్లుగా ఉన్న వీరిద్దరూ రూరల్‌నియోజక వర్గంలో కలసి పనిచేసుకుని తమ వర్గం బలపరచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల చేతిలో ఓడిన అభ్యర్థులను ఒక్కటి చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం రూరల్ నియోజక వర్గంలోని కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ఓడిన అభ్యర్థులతో ఆదాల ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ప్రాంరభమైన సమావేశం రాత్రి 9 గంటల దాకా జరిగింది. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌కు ఆదాల, సిటీకి అజీజ్ టికెట్లు దక్కించుకునే ఎత్తుగడలోనే ఈ రాజకీయం ప్రారంభించారని టీడీపీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఆరుగురు కార్పొరేటర్లు డుమ్మా
రూరల్ నియోజకవర్గంలో గెలిచిన, ఓడిన కార్పొరేటర్ అభ్యర్థుల మధ్య సమన్వయం కుదర్చడం కోసం నిర్వహించే పేరుతో జరిపిన ఈ సమావేశానికి ఆరుగురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. ఆనం వివేకానందరెడ్డి కుమారుడు 12వ డివిజన్ కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డిని ఆజీజ్ మనుషులు ఆహ్వానించారు. నామ మాత్రపు ఆహ్వానం అందినందువల్ల తాను రాలేదని, ఆయన తన మద్దతు దారులకు చెప్పారు. ఈయనతో పాటు వెంకన్న యాదవ్, నూనె మల్లికార్జున యాదవ్, నెల్లూరు సునీత, బొల్లినేని శ్రీవిద్య సమావేశానికి రాలేదు. వీరిలో కొందరు మంత్రి నారాయణతో సన్నిహితంగా ఉండటం వల్ల రాలేదు. కొందరు మాత్రం వ్యక్తిగత పనుల వల్ల రాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆదాల, అజీజ్ ఇద్దరూ కార్పొరేటర్లు, ఓడిన అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడారు. కార్పొరేషన్ పరి«ధిలో మంజూరైన పనులు కార్పొరేటర్లతో పాటు ఓడిన∙వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించారు. రూరల్ నియోజక వర్గంలోని డివిజన్లలో ఇక మీదట జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాల్లో ఆదాల పేరు కూడా వేయాలని కొందరు కార్పొరేటర్లు చేసిన డిమాండ్‌కు అజీజ్ అంగీకరించినట్లు తెలిసింది.
Advertisement
Advertisement