పొదలకూరు, న్యూస్‌లైన్: రెండు అంశాలకు సంబంధించి రైతులు, బాధితులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వచ్చిన తీర్పులను తప్పుపడుతూ తనపై నిందలు వేస్తున్న సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి తీరుపై కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గసమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కండలేరు ఎత్తిపోతల పథకం పనుల బిల్లుల చెల్లింపునకు సంబంధించి పంటలు పండని రైతులు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా ఎత్తిపోతలకు నీరు ఎలా పంపిణీ చేస్తారని, బిల్లుల చెల్లింపు నిలిపేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఏ జలాశయంలోని నీటిని వాడుకోవాలన్నా స్టేట్ లెవల్ ఇరిగేషన్ వాటర్ అడ్వయిజరీ మేనేజ్‌మెంట్ కమిటీ(శివం కమిటీ) సిఫార్సులు అవసరమని వెల్లడించారు. అలాంటి అనుమతి ఈ తాత్కాలిక ఎత్తిపోతల పథకానికి లేదన్నారు. ఈ పథకాన్ని మార్చిలో ప్రారంభించి ఏప్రిల్ వరకు కొనసాగించారన్నారు.
నీటి లిఫ్టింగ్ కోసం వాడిన ట్రాక్టర్లకు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చూస్తే దిమ్మ తిరిగిపోతుందన్నారు. రూ.20 లక్షలు కూడా ఖర్చుచేయకుండా పనులు పూర్తిచేసి ఏ చెరువు కింద పంటలకు నీరుఇవ్వకుండా ఆరు నెలల తర్వాత ఏకంగా రూ.71 లక్షలకు అనుమతులు తెచ్చారన్నారు. రైతులు పంటలు పండలేదని కోర్టుకు వెళితే తానెలా బాధ్యుడ్ని అవుతానని ప్రశ్నించారు. ఈ ప్రాంతవాసిగా ప్రతిపక్ష నాయకుడిగా వివరాలు వెల్లడించాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నట్టు తెలిపారు. పొదలకూరుకు సమీపంలోని చాటగొట్ల లేఅవుట్‌లో 110 మంది ముంపు వాసులకు ప్లాట్లు పంపిణీ చేసేందుకు జాబితా తయారు చేస్తే ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా అర్హుల పేర్లను తొలగించి అనర్హుల పేర్లు చేర్పించారన్నారు. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అనర్హులను గుర్తించమని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే తాను కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినట్టు ఆదాల ప్రచారం చేయడం తగదన్నారు.
కోర్టు మధ్యంతర ఉత్తర్వులకు, స్టేకు తేడా తెలియకుండా ఆయన మూడు మార్లు ఎమ్మెల్యే ఎలా అయ్యారో అర్థం కావడం లేదన్నారు. పొదలకూరులో మంత్రి శిలాఫలకాలను ధ్వంసం చేసిన కేసులో ఓ ఎస్సై అవినీతికి పాల్పడి విద్యార్థులను అరెస్ట్ చేస్తే వైఎస్సార్‌సీపీ ధర్నా చేసిందన్నారు. అదే సమయంలో ఒక చోరీ విషయంలో మరొక బృందం వచ్చి ధర్నా చేయడంతో రెండు ఆందోళనలు కలిసిపోయి గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. దీన్ని సాకుగా తీసుకున్న ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ దొంగలను ప్రోత్సహిస్తోందని విమర్శలకు దిగడం గురివింద సామెతను గుర్తుచేస్తున్నట్టుందన్నారు. తాను ఎలాంటి వ్యక్తినో జిల్లా ప్రజలందరికీ తెలుసునన్నారు. దొంగే దొంగాదొంగా అని అరిచినట్టుగా ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉందన్నారు. కోర్టు తీర్పు ప్రతులను కాకాణి విలేకర్లకు అందజేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, కోనం బ్రహ్మయ్య, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, డాక్టర్ టి.శ్రీహరి, మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
కోర్టు తీర్పులను తప్పుపడుతున్న ఆదాల
Published Mon, Dec 16 2013 7:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement