
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానేగానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్‌సీపీ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీ అధిష్టానాన్ని కలిసినట్లు, ఆ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎంపీ టికెట్ ఇవ్వడంతో గెలిచి సేవలు అందించానని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించి పార్టీ తగిన గుర్తింపునిచ్చిందన్నారు. ఇంత ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్సార్‌సీపీని వదిలి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక కొందరు కిరాయి మూకలను నియమించుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అత్యంత బలంగా ఉండటంతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. వీటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ మారే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు మరోసారి ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment