సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు దేశం పార్టీలో సీనియర్లకు వరుస ఝలక్‌లు తగులుతున్నాయి. ఈ బాటలోనే జిల్లా నడుస్తోంది. నెల్లూరులో టీడీపీ పరిస్థితి కరి మింగిన వెలగపండులా తయారైంది. ఓ వైపు అధిష్టానం అభ్యర్థిత్వాలపై ఎటూ తేల్చలేకపోతుండడం, మరో వైపు పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు వెరసి అంతర్గత విభేదాలను తారాస్థాయికి చేరుస్తున్నాయి. ఫలితంగా క్యాడర్ డోలాయమానంలో కొట్టుమిట్టాడుతోంది.
వెంకటగిరిలో ఈనెల 19న చంద్రబాబు నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభ సాక్షిగా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పార్టీకి అవసరాలకు తగ్గట్లుగా పని చేయకపోతే.. దూరంగా ఉండాలంటూ సోమిరెడ్డికి చంద్రబాబు సూత్రప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే..
స్థానిక ఎమ్మెల్యే (వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత) ఆనం రామనారాయణరెడ్డిని సభకు సోమిరెడ్డి ఆహ్వానించలేదు. దీంతో ఆనం అలకబూనారు. ఈ విషయంపై చంద్రబాబుకు సమాచారం పంపారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆనం రామనారాయణరెడ్డిని చివరి నిమిషంలో సభకు పిలిపించుకున్నారు. సభలో ఆనం ప్రసంగిస్తున్నప్పుడూ ఓ పథకం ప్రకారమే కురుగొండ్ల రామకృష్ణ అనుచరులు అడ్డుతగిలారు. దీంతో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని బస్సులోకి పిలిపించుకుని చర్చలు జరిపారు.
నమ్మి వస్తే అవమానిస్తారా..!
నమ్మి పార్టీ లోకి వస్తే తమకు సరైన గుణపాఠం చెప్పారని ఆనం, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ లోకి వస్తే జిల్లాపై పెత్తనంతోపాటు కోరుకున్న సీటు ఇస్తానని మాటిచ్చిన విషయాన్ని ఆనం బాబుకు గుర్తు చేశారట. ఆత్మకూరులో పరిస్థితి బాగాలేదని, వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని ఆనం కోరగా బాబు వారించి ఆత్మకూరు నుంచే పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పి పంపారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్రల తీరుపై బాబుకు ఆనం, కోటంరెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ పెద్దలు చేసుకున్న లోపాయికారీ ఒప్పందాల నుంచి ఇటీవల చేసిన మైనింగ్ అక్రమాల వరకు అన్నింటిపైనా ఆధారాలతో సహా బాబుకు వివరించారని తెలిసింది. నెల్లూరు రూరల్‌ను జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆ సీటు తనకే ప్రకటించాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరగా, అలాగే.. అంటూ చంద్రబాబు మాట దాటేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం సోమిరెడ్డి, బీద రవిచంద్రలను తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు చివాట్లు పెట్టారని తెలుస్తోంది.
చిన్నబుచ్చుకున్న సోమిరెడ్డి!
కడప జిల్లాలో జరిగే సభకు చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సోమిరెడ్డి హెలిప్యాడ్ వద్దకు చేరుకోగా బాబు వారించి ‘నీ అవసరం లేదులే’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో సోమిరెడ్డి చిన్నబుచ్చుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment