Nellore Assembly Constituencies
-
టీడీపీలో ‘ఆడియో’ దుమారం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్‌రెడ్డితో జరిపిన ఫోన్ సంభాషణ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఆ ఆడియో సంభాషణను విలేకరుల సమావేశంలో బహిర్గతం చేశారు. ఈ ఆడియో తనది కాదని ప్రశాంతిరెడ్డి కామాక్షమ్మ అమ్మవారి సాక్షిగా చెప్పగలరా అని రాజేంద్రనాథ్‌రెడ్డి సవాల్ విసిరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి వారి కుటుంబంతో తమకు అనుబంధం ఉందన్నారు. నేటికీ జగన్మోహన్రెడ్డితో ఆ అనుబంధం కొనసాగుతోందని ఆయన స్పష్టంచేశారు. ఓడితే ముఖం చాటేస్తారు: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పెద్దలపట్ల అగౌరవంగా మాట్లాడడం, ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలగుతాం అని చెప్పడం చూస్తే వారి వ్యవహారం ప్రజలకు బాగా అర్థమవుతుందన్నారు. ఓడిపోతే విదేశాల్లో వ్యాపారాలు, లావాదేవీలు చేసుకుంటూ ప్రజా జీవితంలోకి రారని వారి మాటల బట్టి తెలుస్తోందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వైఎస్సార్సీపీ అభ్యర్థులు కావాలో ఓడిపోతే ముఖం చాటేసే టీడీపీ అభ్యర్థులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఎవరూలేకే టీడీపీ వైఎస్సార్సీపీ నుంచి అభ్యర్థులను దిగుమతి చేసుకుందన్నారు. నా సోదరుడికి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చారు: ప్రసన్నకుమార్‌రెడ్డి ఇక తన సోదరుడు రాజేంద్రకు ప్రశాంతిరెడ్డి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చి పార్టీలోకి ఆహా్వనించినా వారి ప్రలోభాలకు తలొగ్గలేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని వాడు అని సం¿ోదించడం చూస్తే ఎంత అహంకారంతో మాట్లాడుతోందో అర్థమవుతోందన్నారు. ఆడియో సంభాషణ ఇలా.. రాజేంద్ర: హలో ప్రశాంతక్కా.. బావున్నావక్కా.. ప్రశాంతి: ఎక్కడున్నావ్? రాజేంద్ర: అక్కా బెంగళూరులో ఉన్నా. అక్కా ఇక్కడ రెండు పీజీలు ఏర్పాటుచేశాను ప్రశాంతి: నీవు ఇక్కడ లేవా? రాజేంద్ర: పీజీలు ఏర్పాటుచేసి ఇక్కడే ఉన్నాను. వచ్చిపోతుంటాను అక్కా. ప్రశాంతి: నేనెందుకు చేశానంటే.. ఇప్పుడే నీవు చెప్పొద్దు.. కోవూరు నుంచి పోటీచేయమని అడుగుతున్నారు వాళ్లు.. సర్వేపల్లి నుంచి పోటీచేయమని అడిగారు.. ఈ పార్లమెంట్ నియోజకవర్గం కాదు కదా అని వద్దన్నాను. కోవూరు తీసుకోమన్నారు.. ఫస్ట్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అల్లుడు కోసం ఉంచారు.. ఆయన పార్టీలోకి రాకపోవడంతో నన్నే చేయమంటున్నారు. రాజేంద్ర: అక్కా.. అక్కా.. ప్రశాంతి: ఇంకా వాళ్లు (వైఎస్సార్సీపీ) మా వెంటçపడే ఉన్నారు. నాక్కూడా పార్టీ మారడం ఇష్టంలేదు, ఫస్ట్ నుంచి ఈ పార్టీ అంటే ఇష్టం నాకు.. మరీ వాళ్లు ఈ మాదిరి చేసేసరికి అన్నను కని్వన్స్ చేయలేకపోయా. నాకు ఇంత అవమానం జరిగితే ఇంకా వెంటపడతావా అన్నారు. నాది చేతగానితనం అనుకుంటావా. నాకు రాజకీయం అవసరంలేదు. నేను పోటీచేస్తా.. గెలిస్తే గెలుస్తా.. లేకుంటే ఓడిపోతా. ఆ తర్వాత క్విట్ అయిపోతా.. పోటీచేయకుండా ఉండనన్నాడు.. రాజేంద్ర: అక్కా.. అక్కా.. ప్రశాంతి: వీళ్లందరూ నన్ను ఉండమంటున్నారు. లేదులే మేం ఎంపీ ఎలక్షన్ చేసుకుంటాం అన్నాను.. లేదులే అన్నాను. కోవూరు అయితే ఆదాల అల్లుడు అనుకున్నారు. కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు. కోవూరే తీసుకోమంటున్నారు. రాజేంద్ర: అవును కదక్కా అందరం ఇంట్లో వారం కదా. ప్రశాంతి: ఇంట్లో వారమే కానీ వాళ్లు పోటీచేయమంటున్నారు.. అన్న కూడా పార్టీ వీడుతున్నారు కాబట్టి వైఎస్సార్సీపీ నుంచి ప్రెజెర్స్ ఉంటాయి.. ఆత్మకూరు అయితే పదివేలతో ఆనం రామనారాయణరెడ్డి ఓడిపోతాడు.. అయితే, విక్రమ్ బాగా చేస్తున్నాడు.. రామనారాయణరెడ్డి పోయినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది.. రాజేంద్ర: అక్కా.. నేను మధ్యస్తంగా ఏమి చెప్పలేను.. నాకు ఇద్దరు కావాలక్కా.. ఈ మ«ధ్య అన్నకు దూరంగా ఉన్నా. ప్రశాంతి: మీడియాకు వీడియోలు పెడుతున్నావు కదా.. ప్రతి ఎలక్షన్‌కు అన్నదమ్ముల మధ్య మామూలే కదా.. రాజేంద్ర: కానీ, మా మధ్య ఏమీలేవక్కా.. అన్న గెలుపు కోసం గట్టిగా కృషిచేసేవాళ్లం. ప్రశాంతి: ఎక్కడా చెప్పకు రాజేంద్ర.. మేమైతే ఇంకా ఓకే చెప్పలేదు రాజేంద్ర. అంతా బంధువులు కదా.. సర్వేపల్లి గురించి చెప్పినా నేను ఒప్పుకోలేదు. నీవు సర్వేపల్లిలో అయితే గెలుస్తావన్నారు.. గెలవనని కాదు. నాకు ఇష్టంలేదు అని చెప్పా.. మరీ ఆయనకు (సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి) టికెట్ ఇవ్వమనే చెప్పారు.. నేను వద్దని చెప్పాను.. ఎవరు ముందుకు రాకపోతే ఆయనకే టికెట్ ఇస్తారు కదా పాపం.. -
టీడీపీ నేతలు ఓడిపోతున్నారు.. వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో లీక్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆడియో సంచలనంగా మారింది. పలువురు టీడీపీ నేతలు ఓడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేశారు. టీడీపీలో చేరితే మూడు కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కాగా, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇటీవల కొవ్వూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డికి కాల్ చేశారు. ఈ కాల్ సందర్భంగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కాల్లో ఆమె టీడీపీ నాయకులను కించపరుస్తూ మాట్లాడారు. అలాగే, ప్రసన్న కుమార్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డిని విడగొట్టేందుకు పలు మార్లు రాజేంద్రనాథ్‌కు ఆమె కాల్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనాథ్‌ను టీడీపీలో చేరాలని సూచించారు. టీడీపీలో చేరితో మూడు ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. అలాగే, టీడీపీకి అభ్యర్థులు లేకపోవడంతో తనను కొవ్వూరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని అన్నారు. పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోతున్నారని ఆమె ఈ కాల్లో మాట్లాడారు. ఇదే సమయంలో తాము ఓడిపోతే ప్రజలను వదిలేసి వ్యాపారాలు చేసుకుంటామని చెప్పారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం, ప్రశాంతి రెడ్డి ఆడియోను రాజేంద్రనాథ్ రెడ్డి బయటపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. నా మద్దతు కోసం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫోన్ చేశారు. నల్లపురెడ్డి కుటంబంలో విభేదాలు తేవాలని చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డికి, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేదు. ప్రశాంతి రెడ్డి రెడ్డికి మా కుటుంబం పేరెత్తే అర్హత కూడా లేదన్నారు. -
టీడీపీకి కొత్త టెన్షన్.. అక్కడ అభ్యర్థి కరువు?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ నాయకత్వంపై ఆ పార్టీకి నమ్మకంలేక వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఎర్రతివాచీ పరిచింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మకూరు కంచుకోట కావడంతో పోటీ చేసినా ఓటమి తప్పదనే సంకేతాలు ఆనంకు అందాయి. దీంతో పార్టీ కండువా కప్పుకోకముందే ఈ సీటు తనకొద్దంటూ తెగేసి చెప్పి మరోసారి వెంకటగిరి వైపు చూస్తున్నారు. నో చెప్పలేక వెంకటగిరి సీటును ఆనంకే ఖరారు చేశారని సమాచారం. ఈ పరిణామాలతో ఆత్మకూరులో అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాట ఇంకా కొలిక్కి రాలేదు. వైఎస్సార్సీపీ గ్రాఫ్పైపైకి.. ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ నానాటికీ పెరుగుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి విద్యావంతుడు కావడంతో అభివృద్ధి విషయంలో ఓ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తనదైన శైలిలో విక్రమ్‌రెడ్డి దూసుకెళ్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ మేళాలు.. ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా పలు పనులను చేపడుతూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఆత్మకూరా.. నాకొద్దు..! టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ఆత్మకూరులో చేపట్టిన సమయంలో అన్నీతానై ఆనం రామనారాయణరెడ్డి నడిపించారు. ఆత్మకూరు బాధ్యత ఇక ఆయనదేనని లోకేశ్ ప్రకటించారు. దీంతో నెల పాటు నియోజకవర్గంలో హడావుడి చేసిన ఆనం ఆ తర్వాత వాస్తవ పరిస్థితి తెలుసుకొని ముఖం చాటేశారు. పార్టీతో పాటు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేల్లో సైతం ఓటమి తప్పదని తేలడంతో ఆత్మకూరు అంటేనే హడలిపోతున్నారు. దూరమైన సీనియర్ నేతలు స్థానిక టీడీపీ నాయకత్వం సైతం ఆనం రామనారాయణరెడ్డికి సహకరించడంలేదు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, బొల్లినేని కృష్ణయ్యనాయుడు, గూటూరు కన్నబాబు లాంటి నేతలూ దూరంగా ఉన్నారు. అటు కేడర్ కలిసిరాక.. ఇటు నేతలు సహకరించక ఆయన మీమాంసలో పడ్డారు. ఆత్మకూరు టు వెంకటగిరి వయా నెల్లూరు సిటీ ఆత్మకూరు కలిసి రాకపోవడంతో నెల్లూరు సిటీ వైపు ఆనం మొదట్లో కన్నేశారు. నగరంలో తన కుటుంబానికి రాజకీయ బలంతో పాటు అభిమాన గణం ఉండటంతో నెల్లూరు సిటీ సీటును ఇవ్వాలని చంద్రబాబును ప్రాధేయపడ్డారని సమాచారం. అయితే నారాయణకు ఖరారు చేశామని స్పష్టం చేసిన బాబు.. సర్వేపల్లిలో ఛాన్స్ ఇస్తామని చెప్పినా సిట్టింగ్ సీటు కావాలని పట్టుబట్టడంతో ఓకే చేశారని తెలుస్తోంది. సిట్టింగ్ స్థానంలోనూ తప్పని కుస్తీ ఆనం రామనారాయణరెడ్డి తన సిట్టింగ్ సీటు వెంకటగిరిని మరోసారి దక్కించుకునేందుకు కుస్తీ పడాల్సి వస్తోందనే వాదనా వినిపిస్తోంది. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రెండుసార్లు విజయం సాధించి పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీని నమ్ముకొని ప్రస్తుత ఎన్నికల్లో పోటీకి సై అంటున్న క్రమంలో తన ప్రత్యర్థి ఆనం టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి సీటు తనదేనంటూ ప్రకటనలు చేయడంపై కురుగొండ్ల తీవ్రంగా మండిపడుతున్నారు. సీటు విషయంలో వీరిద్దరూ కుస్తీ పడాల్సి వస్తోంది. మరోవైపు వెంకటగిరి సీటును బీసీలకు కేటాయించాలని మరో నేత యత్నాలు ప్రారంభించారు. కాగా ఈ ముగ్గురిలో సీటు ఎవరికొచ్చినా మిగిలిన ఇద్దరూ హ్యాండిచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికలొస్తున్నాయంటే సాధారణంగా ఆయా నియోజకవర్గాల్లో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడతారు. నువ్వా.. నేనా అనే రీతిలో తలపడి తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకుంటారు. అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఆది నుంచి ఇక్కడ సరైన నాయకత్వం లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ అక్కున చేర్చుకుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అశేష ప్రజాదరణతో ఇక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదని తెలియడంతో ఆనం విముఖత చూపుతున్నారు. ఈ పరిణామాలతో రండి బాబూ రండీ అనే రీతిలో కొత్త అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషణను ప్రారంభించింది. -
చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు!
కర్నూలు(సెంట్రల్)/నెల్లూరు, సాక్షి ప్రతినిధి/ నెల్లూరు సిటీ : నెల్లూరు నగరంలో, కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ ఆదివారం నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలు జనం లేక వెలవెలబోయాయి. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సి వచ్చింది. ఒక్కో సభకు లక్ష మంది చొప్పున రప్పించాలనుకున్న వారి వ్యూహం బెడిసికొట్టింది. కనీసం ఏడెనిమిది వేల మంది చొప్పున కూడా జనం హాజరు కాలేదు. వచ్చిన వారు కూడా బాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయారు. దీంతో స్థానిక నేతలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాగైతే ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళతాయని, ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు, పత్తికొండలో భారీ జన సమీకరణకు ఆ పార్టీ నేతలు యత్నించినా ఫలితం లేకపోయింది. చాలాచోట్ల డబ్బులిస్తామన్నా.. ‘మేము రాము బాబో.. మీ సభలకు’ అంటూ ప్రజలు ముఖంమీదే తేల్చి చెప్పడంతో స్థానిక టీడీపీ నేతలు చేతులెత్తేశారు. రెండు జిల్లాల్లోనూ సభలు జనం లేక వెలవెలబోవడంతో పార్టీ అధిష్టానంతోపాటు క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. జగన్ అర్జునుడు కాదు : చంద్రబాబు పత్తికొండ, నెల్లూరు సభల్లో చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఆయన అభిమన్యుడు కాదు.. అర్జునుడూ కాదూ.. భస్మాసురుడు’ అని విమర్శించారు. సాక్షి పత్రికలో అబద్ధాలే రాస్తారని, చదవొద్దని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తామని చెప్పారు. రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ చేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఐటీకి తానే ఆద్యుడినని, తనకు 80 దేశాల్లో మద్దతు ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, ప్రసన్నకుమార్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్జగన్ చెబుతున్నట్లు 175 సీట్లు వారు గెలవలేరని, పులివెందులలో జగన్‌ను ఓడిస్తామన్నారు. జగన్ టిక్కెట్లు ఇచ్చిన వారిలో రౌడీలు, దోపిడీ దారులే అధికంగా ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను ఓడించేందుకు ఏపీలోని 5 కోట్లమంది స్టార్ క్యాంపెయినర్లు కలసి తనతో రావాలని పిలుపునిచ్చారు. తన 45 ఏళ్ల పాలనలో ఇంత తీవ్ర వ్యతిరేక ఉన్న ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. సీఎం జగన్ నాపై ఎన్ని కేసులుపెట్టి వేధించారో ప్రజలు చూశారన్నారు. సీఎం జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. జనసేన కార్యకర్తలపై సోమిరెడ్డి మండిపాటు నెల్లూరు సభలో జనసేన కార్యకర్తలు వారి పార్టీ జెండాలను ఊపుతుండగా, టీడీపీ నాయకులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జెండాలు అడ్డుగా ఉన్నాయని, పక్కకు వెళ్లాలని సూచించారు. అయినా ఆ పార్టీ కార్యకర్తలు వినలేదు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి సూచించినా పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మైక్ తీసుకుని జనసేన కార్యకర్తలపై మండిపడ్డారు. మీరు ఎవరు చెప్పినా వినరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు టీడీపీ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జనవరి 31న కృష్ణపట్నం పోర్టులో ఉన్న కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు తరలిపోతుందని విమర్శించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరోక్షంగా దుర్భాషలాడారు. డబ్బులు, మద్యం ఎర చూపినా.. నెల్లూరులో డబ్బులు, మద్యం ఎర చూపినా ప్రజలు చంద్రబాబు సభ వైపు రాలేదు. కేవలం రెండు వేల మంది మాత్రం ఎస్వీజీఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో హడావుడి చేశారు. వారూ వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద నాయకులకు టెంట్, కూలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో మండుటెండలో వారు విలవిలలాడారు. ఉదయం 11.30 గంటలకు రావాల్సిన చంద్రబాబు మధ్యాహ్నం 12.45 గంటలకు ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకోవడం కార్యకర్తల సహనానికి పరీక్ష పెట్టింది. సభకు వచ్చిన కార్యకర్తలకు రూ.250, క్వార్టర్ మద్యం బాటిల్ పంపిణీ చేయడం కనిపించింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆద్యంతం కుర్చీలు ఖాళీగా కనిపించడంతో స్థానిక నాయకులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను మాట్లాడే సమయానికి ప్రజలను నిలబెట్టలేకపోయారా అని నెల్లూరు నగర రూరల్ ఇన్చార్జిపై మండిపడ్డారు. పత్తికొండలోని ఆదోని రోడ్డులో జరిగిన సభకు కచ్చితంగా లక్ష మంది వస్తారని శనివారం సాయంత్రం స్థానిక నేతలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. తీరా ఆదివారం ప్రజలెవరూ రాకపోవడంతో సభాస్థలిలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వచ్చిన కొద్ది మంది కూడా సభ మధ్యలోనే వెళ్లిపోవడంతో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచలేదు. -
KP Port: అదంతా ఎల్లో మీడియా సృష్టే: మంత్రి కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: ఎల్లో మీడియా, టీడీపీపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. కృష్ణపట్నం పోర్టు టెర్నినల్‌పై ఎల్లో దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు. కాగా, మంత్రి కాకాణి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ కొత్త ఫేక్ ప్రచారానికి తెరలేపింది. కేపీ పోర్ట్ తరలి పోతుందని ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు, కేపీ పోర్టు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వానికి పోర్టుకు సంబంధించిన నివేదిక కూడా ఇచ్చింది. కొత్త వ్యాపారంతో ఏపీకి ఆదాయం వస్తోందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అయితే, అభివృద్ధిలో ఉన్న పోర్టును దెబ్బతీయాలని సోమిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. పోర్టు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయ. కానీ, పోర్టు పురోగతికి ఎలాంటి ఢోకా లేదు. కేపీ పోర్టులో ఎలాంటి సర్వీసులు రద్దు కాలేదు. ఎక్కడికి తరలిపోలేదు. పోర్టు ఎలాంటి సర్వీస్ కూడా తొలగించలేదు. గతంలో పవర్ పొల్యూషన్‌పై కమ్యూనిస్టులతో కలిసి ఆందోళన చేసిన సోమిరెడ్డి నాడు యాజమాన్యాలతో కుమ్ముక్కయ్యారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
సోమిరెడ్డికి బిగ్ షాక్?!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు దేశం పార్టీలో సీనియర్లకు వరుస ఝలక్‌లు తగులుతున్నాయి. ఈ బాటలోనే జిల్లా నడుస్తోంది. నెల్లూరులో టీడీపీ పరిస్థితి కరి మింగిన వెలగపండులా తయారైంది. ఓ వైపు అధిష్టానం అభ్యర్థిత్వాలపై ఎటూ తేల్చలేకపోతుండడం, మరో వైపు పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు వెరసి అంతర్గత విభేదాలను తారాస్థాయికి చేరుస్తున్నాయి. ఫలితంగా క్యాడర్ డోలాయమానంలో కొట్టుమిట్టాడుతోంది. వెంకటగిరిలో ఈనెల 19న చంద్రబాబు నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభ సాక్షిగా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పార్టీకి అవసరాలకు తగ్గట్లుగా పని చేయకపోతే.. దూరంగా ఉండాలంటూ సోమిరెడ్డికి చంద్రబాబు సూత్రప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే.. స్థానిక ఎమ్మెల్యే (వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత) ఆనం రామనారాయణరెడ్డిని సభకు సోమిరెడ్డి ఆహ్వానించలేదు. దీంతో ఆనం అలకబూనారు. ఈ విషయంపై చంద్రబాబుకు సమాచారం పంపారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆనం రామనారాయణరెడ్డిని చివరి నిమిషంలో సభకు పిలిపించుకున్నారు. సభలో ఆనం ప్రసంగిస్తున్నప్పుడూ ఓ పథకం ప్రకారమే కురుగొండ్ల రామకృష్ణ అనుచరులు అడ్డుతగిలారు. దీంతో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని బస్సులోకి పిలిపించుకుని చర్చలు జరిపారు. నమ్మి వస్తే అవమానిస్తారా..! నమ్మి పార్టీ లోకి వస్తే తమకు సరైన గుణపాఠం చెప్పారని ఆనం, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ లోకి వస్తే జిల్లాపై పెత్తనంతోపాటు కోరుకున్న సీటు ఇస్తానని మాటిచ్చిన విషయాన్ని ఆనం బాబుకు గుర్తు చేశారట. ఆత్మకూరులో పరిస్థితి బాగాలేదని, వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని ఆనం కోరగా బాబు వారించి ఆత్మకూరు నుంచే పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పి పంపారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్రల తీరుపై బాబుకు ఆనం, కోటంరెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ పెద్దలు చేసుకున్న లోపాయికారీ ఒప్పందాల నుంచి ఇటీవల చేసిన మైనింగ్ అక్రమాల వరకు అన్నింటిపైనా ఆధారాలతో సహా బాబుకు వివరించారని తెలిసింది. నెల్లూరు రూరల్‌ను జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆ సీటు తనకే ప్రకటించాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరగా, అలాగే.. అంటూ చంద్రబాబు మాట దాటేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం సోమిరెడ్డి, బీద రవిచంద్రలను తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు చివాట్లు పెట్టారని తెలుస్తోంది. చిన్నబుచ్చుకున్న సోమిరెడ్డి! కడప జిల్లాలో జరిగే సభకు చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సోమిరెడ్డి హెలిప్యాడ్ వద్దకు చేరుకోగా బాబు వారించి ‘నీ అవసరం లేదులే’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో సోమిరెడ్డి చిన్నబుచ్చుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
‘ఏపీకి ఎవరొచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు’
నెల్లూరు: గత ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోలేదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట సామాజిక సాధికార బస్సుయాత్రలో నారాయణస్వామి మాట్లాడుతూ.. ‘ ఏపీకి ఎవరొచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు. మేలు జరిగి ఉంటేనే ఓటు వేయమని ధైర్యంగా జగన్ అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ రాజకీయ పదవులు ఇచ్చారు. ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అని చంద్రబాబు హేళన చేసి మాట్లాడారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దానిని కూడా తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చింది. వైఎస్ చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చారు. వైఎస్ కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం.. దళిత ప్రజా ప్రతినిధులు అందరూ వైఎస్ జగన్‌తోనే ఉంటారు. కాంగ్రెస్‌లో చేరి జగనన్నపై యుద్ధం చేస్తామని షర్మిల అంటున్నారు. తప్పు చేయని వైఎస్ జగన్‌ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది. ఇవన్నీ గుర్తులేవా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ గతంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. ఎంతో కొంత చేశారు. కానీ ఎస్పీ, ఎస్టీ, బీసీ మహిళలకు యాభై శాతం పదవులు ఇచ్చిన ఘనత మాత్రం జగన్‌కే దక్కుతుంది. చంద్రబాబు ఎక్కడో మూలన, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. నగరం నడిబొడ్డున ఉండాలని జగన్ నిర్ణయించి.. స్వరాజ్ మైదాన్‌లో పెట్టించారు. జగన్నే లక్ష్యం చేసుకునే కుట్రలు చేస్తున్నారు. ఇందుకోసం కుటుంబాల్లో కూడా చిచ్చుపెడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కూడా వారి కుట్రలో భాగస్వామ్యమయ్యారు. వైఎస్సార్సీపీ చీల్చి.. చంద్రబాబుకు ప్రయోజనం కలిగించాలని చూస్తున్నారు. షర్మిల మాట్లాడిన ప్రతిమాటను వైఎస్సార్ అభిమానులను బాధిస్తోంది. వైఎస్సార్‌ను దేవుడిగా భావించే ప్రతి కుటుంబం కూడా బాధపడుతోంది. షర్మిల మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి’ అని తెలిపారు. -
టీడీపీలో రచ్చకెక్కుతున్న ‘సీటు’ రాజకీయాలు
ఓడిపోయే పార్టీ అయినా టిక్కెట్ల కోలాహలం బాగానే ఉంటుంది. ఆ మాత్రం బిల్డప్ ఇస్తేనే టిక్కెట్లు అమ్ముకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీలో అదే జరుగుతోంది. సీటు రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. ఓ నియోజకవర్గానికి ఇంచార్జ్ ఉన్న తనను కాదని వేరే వారికి టిక్కెట్ ఇస్తే ఊరుకునేదే లేదని ఆ మాజీ ఎమ్మెల్యే ఓపెన్‌గానే పార్టీ అధినేతకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఇక్కడ చంద్రబాబు రాజకీయాల్లో పావుగా మారుతున్న నేత ఎవరు? ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో పచ్చపార్టీ టిక్కెట్ ఫైట్ రోజు రోజుకూ ముదురుతోంది. వెంకటగిరి టికెట్ తనదే అంటూ ముగ్గురు నేతలు తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరపున కురుగొండ్ల రామకృష్ణ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం చంద్రబాబు రాజకీయ క్రీడలో పావుగా మారి అధికార పార్టీ నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలోకి జంప్ చేశారు. మంత్రి పదవి ఇవ్వలేదన్న అసహనంతో ఆనం రామనారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది. టీడీపీలో చేరేసమయంలోనే తనకు ఆత్మకూరు టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబుని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ తన ఆటలు సాగవని భావించిన ఆనం తిరిగి వెంకటగిరికి వచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది. తనకు వెంకటగిరి టిక్కెట్టే ఇవ్వాలంటూ చంద్రబాబును ఆనం రామనారాయణరెడ్డి కోరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి తమకే టిక్కెట్ ఇస్తున్నారంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో బీసీ నేతగా ఉన్న మస్తాన్ యాదవ్ సైతం చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే వారి ద్వారా టిక్కెట్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో ముగ్గురిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక పార్టీ క్యాడర్ అయోమయంలో పడిందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.. నేను లోకల్ టికెట్ నాకే అంటూ మస్తాన్ యాదవ్ విస్తృతంగా జనాల్లో తిరుగుతూ ఉండడంతో అటు అనంకి ఇటు కురుగొండ్ల రామకృష్ణకి టికెట్ భయం పట్టుకుందట. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ చరిష్మాతో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి మంచి మెజార్టీతో గెలుపొందారు. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఆనం టిడిపిలోకి జంప్ అవడం.. టిడిపి టికెట్ ని ఆశిస్తూ ఉండడంతో చంద్రబాబుకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని కురుగొండ్ల రామకృష్ణ పబ్లిక్ గా చెబుతుంటే.. ఆనం మాత్రం సైలెంట్ గా ఆయన సీటుకి ఎసరు పెడుతున్నారని యాంటీ కురుగొండ్ల వర్గం చెబుతోంది. వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తున్నారని పాతతరం నేతలు మండిపడుతున్నారు. ఇంతకీ చంద్రబాబు పార్టీ ఫండ్ ఇచ్చే వారికీ ప్రయారిటీ ఇస్తారా లేక పార్టీని నమ్ముకున్న నేతకు టికెట్ ఇస్తారో చూడాలి. -
చంద్రబాబు రా.. కదలిరా అంటే ఎవరూ రావడం లేదు: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: వెంకటగిరిలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన ‘రా.. కదలి రా’ ప్రోగ్రాం అట్టర్ ప్లాఫ్ అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు రా.. కదలిరా అంటే ఎవరూ రావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు.. డబ్బులిచ్చి మరీ జనాలను తరలించారని మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. చప్పట్లు కాదు.. చంద్రబాబును చెప్పులతో కొట్టాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకి దమ్ము, దైర్యం, నీతి నిజాయితీ ఉంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. రాజకీయాల్లో తన అవినీతి మీద సీబీఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకి ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. కోర్టులకి వెళ్లడం స్టే తెచ్చుకోవడం చంద్రబాబు అవినీతికి పరాకాష్ట అని మండిడ్డారు. స్కిల్ స్కాం, ఔటర్ రింగ్ రోడ్ మీద సీబీఐ విచారణ కోరి చంద్రబాబు పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలన్నారు. చంద్రబాబు బలహీనుడు, అసమర్డుడు, రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి అని విర్శించారు. వ్యవసాయ రంగం మీద జరిగిన అభివృద్ధి మీద ఛాలెంజ్ విసిరితే.. తోక ముడుచుకుని చంద్రబాబు పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పరిశ్రమలు తీసుకొచ్చి ఉంటే.. రాష్ట్ర ప్రజలు, యువత ఆయన్ని ఎందుకు తరిమెస్తారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు మార్క్ సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా? అని నిలదీశారు. తమ ప్రభుత్వ పథకాలను పక్క రాష్ట్రంలో అమలు అవుతున్న వాటిని.. కాపీ కొట్టాలనుకునే దౌర్బాగ్యడు చంద్రబాబు బాబు అని మండిపడ్డారు. మోసానికి, అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని అన్నారు. చదవండి: టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని -
వైఎస్సార్ సీపీ నాలుగో జాబితా.. సంపూర్ణ సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: సంపూర్ణ సామాజిక న్యాయం, ప్రజాదరణే గీటు రాయిగా 8 శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగో జాబితాను ఖరారు చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల మన్ననలు అందుకొన్న నేతలకు పెద్దపీట వేశారు. సామాజిక న్యాయంలో మరో రెండడుగులు ముందుకేశారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను ప్రకటించారు. గత నెల 11న 11 శాసనసభ స్థానాలకు, ఈ నెల 2వతేదీన 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 11న విడుదల చేసిన మూడో జాబితాలో 15 శాసనసభ, 6 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించారు. మొత్తం నాలుగు జాబితాలతో కలిపి 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. 58 మంది సమన్వయకర్తల్లో ఎస్సీలు 21 మంది, ఎస్టీలు ముగ్గురు, బీసీలు 17 మంది, మైనార్టీలు నలుగురు, అగ్రవర్ణాలకు చెందిన వారు 13 మంది ఉన్నారు. పది లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో బీసీలు ఆరుగురు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఓసీ ఒకరు చొప్పున ఉన్నారు. సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలు.. వైనాట్ 175 లక్ష్యంతో దూసుకెళుతున్న వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసింది. సామాజిక సమీకరణలు, స్థానిక రాజకీయ అంశాల మేలు కలయికగా తాజాగా నాలుగో జాబితాను ప్రకటించింది. ప్రజలకు మరింత మేలు చేయడం, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సమన్వయకర్తలను నియమించింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ 2019 నుంచి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రిగా ఉన్న సీనియర్ నేత కె.నారాయణ స్వామిని చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. 2019లో చిత్తూరు ఎంపీగా గెలిచిన ఎన్.రెడ్డెప్పను జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఖరారు చేసింది. ఇక అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎం.వీరాంజనేయులు, నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ సుధీర్ దారా, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సమన్వయకర్తగా ఈర లక్కప్పలకు తొలిసారి అవకాశం కల్పించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నల్లగట్ల స్వామిదాస్‌ను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా హనుమంతునిపాడు జెడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ యాదవ్‌ను నియమించారు. చేసిన మంచే శ్రీరామరక్షగా.. ప్రజలకు నాలుగున్నరేళ్లుగా చేసిన మంచి పనులే మనకు తోడుంటాయనే ధైర్యంతో ముఖ్యమంత్రి జగన్ అడుగులు ముందుకు వేస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధం చేస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండేవారికే టికెట్ ఇస్తున్నారు. ఆ విషయం అనేకసార్లు ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గత 56 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్నారు. డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా నేరుగా రూ.2.45 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.12 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించినట్లుగా దళితులు, బలహీనవర్గాలు, పేద వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా తోడ్పాటు అందిస్తున్నారు. శాసనమండలి చైర్మన్‌గా మోషేన్ రాజును, బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్‌గా నియమించి సామాజిక సమీకరణకు పెద్ద పీట వేశారు. 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మంత్రుల్ని చేశారు. సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు, సిఫారసులకు తావులేకుండా ప్రజలకు అందిస్తున్నారు. మహిళా సాధికారతను సాకారం చేశారు. వైఎస్సార్ మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తే సీఎం జగన్ వారిని కోటీశ్వరులుగా చేస్తున్నారు. పేదల పిల్లలకు ఉన్నత వర్గాలతో సమానంగా ఇంగ్లిష్ మీడియం చదువులు అందిస్తున్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు ద్వారా బడుగు బలహీన వర్గాలు, దళితుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు. ఈ క్రమంలో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. నాలుగో జాబితా ఇదీ చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వుడ్): కె.నారాయణస్వామి (ఉప ముఖ్యమంత్రి) 8 శాసనసభ నియోజక వర్గాలకు సమన్వయకర్తలు వీరే.. 1. జీడీ నెల్లూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): ఎన్ . రెడ్డెప్ప 2.శింగనమల (ఎస్సీ రిజర్వ్డ్ ): ఎం. వీరాంజనేయులు 3. నందికొట్కూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): డాక్టర్ సుధీర్ దారా 4. తిరువూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): నల్లగట్ల స్వామిదాస్ 5. మడకశిర (ఎస్సీ రిజర్వ్డ్ ): ఈర లక్కప్ప 6. కొవ్వూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): తలారి వెంకట్రావు 7. గోపాలపురం (ఎస్సీ రిజర్వ్డ్ ): తానేటి వనిత 8. కనిగిరి: దద్దాల నారాయణ యాదవ్ -
వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానేగానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీ అధిష్టానాన్ని కలిసినట్లు, ఆ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎంపీ టికెట్ ఇవ్వడంతో గెలిచి సేవలు అందించానని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించి పార్టీ తగిన గుర్తింపునిచ్చిందన్నారు. ఇంత ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్సార్సీపీని వదిలి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక కొందరు కిరాయి మూకలను నియమించుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అత్యంత బలంగా ఉండటంతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. వీటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ మారే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు మరోసారి ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
వెన్నుపోటు నేతలకు భంగపాటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:నమ్మిన వారిని మోసం చేయడం, వారిని నట్టేట ముంచేయడం చంద్రబాబు నాయుడి నైజం. సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు నిజస్వరూపం తెలిసి కూడా మరోసారి నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు బొక్కబోర్లా పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు చెప్పిన తియ్యటి మాటలు ఇప్పుడు విన్పించడం లేదు. దీంతో ఆ ముగ్గురి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాటమార్చి మోసం చేసి.. వెంకటగిరి, నెల్లూరురూరల్, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు చంద్రబాబు చేసిన మోసంపై మథన పడుతున్నారు. జిల్లాలోనే ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి సీనియర్ పొలిటీషియన్‌గా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆనం ప్రస్తుతం చంద్రబాబు రాజకీయ క్రీడలో ఓ పావుగా మారారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనను 2016లో ఎమ్మెల్సీ లేదా మంత్రి పదవి ఆశ చూపడంతో టీడీపీలో చేరారు. పచ్చ కండువా కప్పుకోగానే మాట మార్చిన చంద్రబాబు కనీసం ఆత్మకూరు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఇవ్వకుండా అవమానించారు. టీడీపీలో జరిగిన అవమానాల్ని తట్టుకోలేక కుమిలిపోతున్న తరుణంలో వైఎస్సార్సీపీ అక్కున చేర్చుకుని వెంకటగిరి నుంచి బరిలోకి దింపి గెలిపించుకుంది. అయితే అక్కున చేర్చుకున్న పార్టీనే కాదనుకున్న ఆనం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. దీంతో ఆనం టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లి పార్టీ కండువా కప్పుకోకుండానే లోకేశ్ యువగళం పాదయాత్రలో హల్చల్ చేశారు. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలతో పాటు నెల్లూరు సిటీ, ఆత్మకూరు సీట్లు ఇస్తామని టీడీపీ అధినేత నమ్మబలకడంతో ఆనం యువగళంలో పాల్గొన్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అ«ధినేత మాట మారింది. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు కాకుండా.. ఒక్క ఆత్మకూరుకే పరిమితం కావాలని ఆదేశాలొచ్చాయి. ఆత్మకూరులో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. టీడీపీ అంతర్గత సర్వేల్లో కూడా ఈ విషయం తేలడంతో ఆత్మకూరులో పోటీ చేస్తే ఓటమి తప్పదని తెలుసుకున్న ఆనం తనకు నెల్లూరు సిటీ లేదా వెంకటగిరి స్థానాన్ని కేటాయించాలని చంద్రబాబు వద్ద మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆత్మకూరు లేదా సర్వేపల్లిలో పోటీ చేయాలని తెగేసి చెప్పడంతో ఆనంకు దిక్కతోచని పరిస్థితి నెలకొంది. చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయానంటూ ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉదయగిరికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఆనం వద్దకు వెళ్లి ఉదయగిరి రావాలని ఆహ్వానించగా పార్టీలో తన పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదని వాపోయారని తెలుస్తోంది. కోటంరెడ్డి సీటు వెనుక కుట్ర నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి కూడా టీడీపీలో అయోమయంగా మారింది. రూరల్ టీడీపీ టికెట్ నీదేనంటూ మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ సీటు జనసేనకు ఇచ్చేందుకు తెరవెనుక రాజకీయం చేస్తున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో ఒక్క సీటైనా జనసేన అడిగే అవకాశం ఉంది. ముందుగా నెల్లూరు సిటీ మీద జనసేన కన్నుపడింది. అయితే మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన సామాజికవర్గంలో ఉన్న పరపతిని ఉపయోగించి జనసేన అధినేత వద్ద పంచాయితీ పెట్టారని, నెల్లూరు సీటు ఆశించకుండా ఉంటే ప్యాకేజీతోపాటు మరోచోట పోటీ చేస్తే అక్కడ అయ్యే ఖర్చంతా తానే భరిస్తానంటూ షరతు పెట్టారని ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రూరల్ టికెట్ రాకుండా తెరవెనుక కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. చంద్రశేఖర్‌రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఉదయగిరి టికెట్ నీదేనంటూ చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీ కండువా కప్పుకున్న చంద్రశేఖర్‌రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ కాదు కదా ఎమ్మెల్సీ కూడా ఇచ్చేది లేదని, ముందు పార్టీకి పనిచేయాలంటూ ఆదేశాలిచ్చారంట. చంద్రశేఖర్‌రెడ్డి సతీమణికి పార్టీ పదవి ఇచ్చి ‘ఈ పదవే నీకు ఎక్కువ ఇక చాలు’ అని చెప్పడంతో చంద్రశేఖర్‌రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పుకుంటున్నారు. ఇటుఉదయగిరిలో కూడా టీడీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డికి కనీస గౌరవంకూడా ఇవ్వటం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించక పోవడంతో ఆయన పరిస్థితి కూడా కుడితిలో పడ్డ ఎలుకలా తయారై ఇంటికే పరిమితం అయ్యారనే ప్రచారం సాగుతోంది. -
టీడీపీకి ఆనం షాక్.. అయోమయ స్థితిలో కోటంరెడ్డి
వైఎస్సార్సీపీ కంచుకోటగా పేరొందిన నెల్లూరు జిల్లాలో పాగా వేయడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆది నుంచి బెడిసి కొడుతున్నాయి. పార్టీ సీనియర్లకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని, కొత్త వారికి ఇద్దామంటే అభ్యర్థులు దొరకడం లేదని అధిష్టానం తలలు పట్టుకుంటోంది. నెల్లూరు ఎంపీతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల నియామకం ఒక సమస్య అయితే జనసేనతో పొత్తు పచ్చనేతల్లో వర్గపోరుకు దారితీస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ నుంచి అసెంబ్లీ స్థానం వరకు ఎవరూ బరిలో దిగేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంట్ స్థానానికి కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషణ చేస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి చెందారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండడంతో నెల్లూరు పార్లమెంట్ సీటుకు టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదనేది భయంతో పలాయనం చిత్తగిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో పలు నియోజకవర్గాల నుంచి కొత్త ముఖాలను బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీ నేతలు నెల్లూరు సిటీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్యాకేజీ ఇచ్చి రూరల్ నియోజకవర్గం వైపు మళ్లించే ప్రయత్నాలు చేయిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో నెల్లూరు రూరల్ తనకే అని అనుకుంటున్న వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. టికెట్ ఇస్తే టీడీపీ తరఫున... లేకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని శ్రీధర్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ► సర్వేపల్లి నుంచి పోటీ చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ వరుసగా ఐదుసార్లు ఓటమి చెందిన నేపథ్యంలో ఈసారి కొత్త వ్యక్తిని నిలబెట్టాలని టీడీపీ భావిస్తోంది. అందుకే ఇప్పటి వరకు సోమిరెడ్డి అభ్యర్థిత్వంపై స్పష్టత లేదని సమాచారం. ► కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ దఫా ఆయన కుమారుడు దినేష్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీకి ఉన్న బలంతో పాటు పోలంరెడ్డిపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇక్కడ కూడా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ► కావలిలో ఇప్పటికే నలుగురు నేతలు టికెట్ అడుగుతున్నప్పటికీ వీరందరూ మండలస్థాయి నాయకులే. కొత్తగా మైనింగ్ మాఫియా డాన్ డి.వెంకటకృష్ణారెడ్డికి సీటు ఇవ్వాలనుకున్నా ఓటమి తప్పదని సర్వేల్లో తేలింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తేలకుండా ఉంది. ► ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని, ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ టికెట్ మాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పనిలో పనిగా వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నాడు. ఇక బీసీ మార్కుతో చెంచలబాబు యాదవ్ సీటు ఆశిస్తున్నాడు. మరి చంద్రబాబు బ్యాగ్ బరువున్న వ్యక్తుల వైపే చూస్తాడా? సామాజిక న్యాయం వైపు చూస్తాడా అనేది తేలాల్సి ఉంది. ► ఆత్మకూరు నుంచి వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని దింపాలని యోచిస్తున్న టీడీపీకి ఆయన బిగ్‌షాక్ ఇచ్చినట్లు తెలిసింది. ఆత్మకూరు నుంచి పోటీలో ఉండబోనని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇటీవల వరుసగా రెండు దఫాలు ఆయన సొంతంగా సర్వే నిర్వహిస్తే ప్రజాదరణ తక్కువగా ఉన్నట్లు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆనం సైతం ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. ► కందుకూరు నుంచి ఇంటూరి బ్రదర్స్ మధ్య పోటీ ఉంది. ఇందులో ఇంటూరు నాగేశ్వరరావుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే వైఎస్సార్సీపీ బలంగా ఉన్న కందుకూరులో టీడీపీ ఓటమి తప్పదని, దీంతో కొత్త వారికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురు పెట్టుబడికి సిద్ధంగా అధిష్టానం మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉండడంతో ఆ పార్టీ అధినేత తల పట్టుకున్నట్లు సమాచారం. సీట్ల కోసం డబ్బు మూటలతో వస్తారని ఆశించిన చంద్రబాబుకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు కావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అయితే సర్వేపల్లి, కోవూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నప్పటికీ కనీసం అధికార పార్టీకి ఏ మాత్రం పోటీ ఇచ్చే స్థాయి నేతలు కాకపోవడంతో వీరి స్థానంలో కొత్త వారిని రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత యోచన. ఇందుకు బడాబాబులను ఆహ్వానిస్తున్నప్పటికీ పోటీకి వారు కూడా సిద్ధంగా లేకపోవడంతో కొంచెం పెట్టుబడి మీరు పెట్టండి.. మిగతాది పార్టీ చూసుకుంటుందని హామీ ఇస్తున్నారంట. కొత్త వారు దొరక్కపోతే కోవూరు, కందుకూరు, ఉదయగిరిలో పాత వారికే టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. సర్వేపల్లి, కావలి, ఆత్మకూరులో కచ్చితంగా కొత్త అభ్యర్థులు వస్తారని తెలుస్తోంది. -
ముత్తుకూరులో సామాజిక ప్రభంజనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో శనివారం సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్రకు అశేష జనవాహిని జేజేలు పలికింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ముత్తుకూరులోని పాత వాణి థియేటర్ నుంచి జంక్షన్ వరకు మేళతాళాలు, కేరళ డ్రమ్స్, గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ ఓ పండుగలా ర్యాలీ జరిగింది. దారి పొడవునా బడుగు, బలహీన వర్గాలకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జరిగిన మేలును తలచుకుంటూ జై జగన్.. జైజై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జరిగిన సామాజిక సాధికార సభ జనసంద్రాన్ని తలపించింది. కిలోమీటర్ల పొడవున జనం నిల్చుని నేతల ప్రసంగాలు వింటూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్‌తోనే సామాజిక విప్లవం: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అంబేడ్కర్ కలలు కన్న సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పారు. నవరత్నాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఓసీలు సైతం లబ్ధి పొందారని తెలిపారు. సీఎం జగన్ కార్యక్రమాలతో ఈ వర్గాలు సామాజిక సాధికారత సాధించి, నేడు తలెత్తుకొని తిరగగలుగుతున్నాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేసేందుకు రాక్షస మూకలు మళ్లీ బయల్దేరాయని, వారిని మరోసారి చిత్తుగా ఓడించాలని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ని బతికిస్తే.., చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ బొమ్మ పెట్టుకొనే అర్హత లేదన్నారు. మరోసారి రాష్ట్రంలో సీఎం జగన్‌కు పట్టం కట్టి, మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. తండ్రిని మించిన తనయుడు జగన్: ఎంపీ బీదా మస్తాన్‌రావు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసి, వారిని అభివృద్ధి దిశగా నడిపించారని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు చెప్పారు. రాజ్యసభలో 9 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు ఉంటే వీరిలో ఐదుగురు బీసీలకు అవకాశం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. పేదలకు అత్యంత ఆవశ్యకమైని విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు అవమానాలకు గురిచేస్తే, వైఎస్ జగన్ అన్నిరంగాల్లోనూ పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు వర్గాలకు బంగారు బాట: తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు బంగారు బాటలు వేసిన ఘనత సీఎం వైఎస్ జగనకే దక్కుతుందని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి అన్నారు. గత పాలకులు బడుగు వర్గాలను ఓటు బ్యాంకుగా చేశారని, కానీ, వారి అభ్యున్నతికి కృషి చేసిన సీఎం జగన్ అభినవ అంబేడ్కర్ అని కొనియాడారు. మైనారిటీలకు రూ.26 వేల కోట్లు : రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్‌బాషా సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లలో మైనారిటీల సంక్షేమానికి రూ.26 వేల కోట్లు ఖర్చు చేశారని, గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇంతస్థాయిలో ఖర్చు పెట్టలేదని రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్‌బాషా అన్నారు. తెలుగు, లెక్కలు రాని లోకేశ్ సీఎం కావాలని తాపత్రయపడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండు చోట్ల గ్లాసులు పగలగొట్టుకొన్న పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. రూ.979 కోట్ల మేరకు సంక్షేమ ఫలాలు : మంత్రి కాకాణి సీఎం జగన్ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు సంక్షేమ పథకాల ద్వారా రూ.979 కోట్ల మేర లబ్ధి పొందారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రూ.442 కోట్ల మేరకు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సుమారు 1.10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు. మేలు జరిగితేనే ఓటు వేయమన్నారు : నెల్లూరు మేయర్ స్రవంతి మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వేయండంటూ అడిగే ధైర్యం ఈ రాష్ట్రంలో సీఎం జగనన్నకు మాత్రమే ఉందని నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతి అన్నారు. గిరిజన మహిళనైన తనను మేయర్ సీట్లో కూర్చొబెట్టడమే కాకుండా ఒక ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కూడా జగనన్నే అని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను అభివృద్ధి పరుస్తూ సామాజిక న్యాయాన్ని సాధించిన సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైఎస్సార్సీపీ సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత పిలుపునిచ్చారు.