టీడీపీకి ఆనం షాక్‌.. అయోమయ స్థితిలో కోటంరెడ్డి | TDP High Command Facing Trouble Over Deciding Candidates In Nellore District, Details Inside - Sakshi
Sakshi News home page

టీడీపీకి ఆనం షాక్‌.. అయోమయ స్థితిలో కోటంరెడ్డి

Published Wed, Jan 10 2024 1:53 PM | Last Updated on Sun, Feb 4 2024 10:42 AM

TDP High Command Facing Trouble Over Deciding Candidates In Nellore District - Sakshi

వైఎస్సార్‌సీపీ కంచుకోటగా పేరొందిన నెల్లూరు జిల్లాలో పాగా వేయడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆది నుంచి బెడిసి కొడుతున్నాయి. పార్టీ సీనియర్లకు టికెట్‌ ఇస్తే ఓటమి తప్పదని, కొత్త వారికి ఇద్దామంటే అభ్యర్థులు దొరకడం లేదని అధిష్టానం తలలు పట్టుకుంటోంది. నెల్లూరు ఎంపీతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల నియామకం ఒక సమస్య అయితే జనసేనతో పొత్తు పచ్చనేతల్లో వర్గపోరుకు దారితీస్తోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్‌ నుంచి అసెంబ్లీ స్థానం వరకు ఎవరూ బరిలో దిగేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషణ చేస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి చెందారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండడంతో నెల్లూరు పార్లమెంట్‌ సీటుకు టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదనేది భయంతో పలాయనం చిత్తగిస్తున్నారు.

జిల్లాలో ఇలా..
జిల్లాలో పలు నియోజకవర్గాల నుంచి కొత్త ముఖాలను బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీ నేతలు నెల్లూరు సిటీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్యాకేజీ ఇచ్చి రూరల్‌ నియోజకవర్గం వైపు మళ్లించే ప్రయత్నాలు చేయిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో నెల్లూరు రూరల్‌ తనకే అని అనుకుంటున్న వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. టికెట్‌ ఇస్తే టీడీపీ తరఫున... లేకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని శ్రీధర్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

► సర్వేపల్లి నుంచి పోటీ చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ వరుసగా ఐదుసార్లు ఓటమి చెందిన నేపథ్యంలో ఈసారి కొత్త వ్యక్తిని నిలబెట్టాలని టీడీపీ భావిస్తోంది. అందుకే ఇప్పటి వరకు సోమిరెడ్డి అభ్యర్థిత్వంపై స్పష్టత లేదని సమాచారం.

► కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పొలిటికల్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించడంతో ఈ దఫా ఆయన కుమారుడు దినేష్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీకి ఉన్న బలంతో పాటు పోలంరెడ్డిపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇక్కడ కూడా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

► కావలిలో ఇప్పటికే నలుగురు నేతలు టికెట్‌ అడుగుతున్నప్పటికీ వీరందరూ మండలస్థాయి నాయకులే. కొత్తగా మైనింగ్‌ మాఫియా డాన్‌ డి.వెంకటకృష్ణారెడ్డికి సీటు ఇవ్వాలనుకున్నా ఓటమి తప్పదని సర్వేల్లో తేలింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్‌ కూడా సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తేలకుండా ఉంది.

► ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని, ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌ టికెట్‌ మాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పనిలో పనిగా వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నాడు. ఇక బీసీ మార్కుతో చెంచలబాబు యాదవ్‌ సీటు ఆశిస్తున్నాడు. మరి చంద్రబాబు బ్యాగ్‌ బరువున్న వ్యక్తుల వైపే చూస్తాడా? సామాజిక న్యాయం వైపు చూస్తాడా అనేది తేలాల్సి ఉంది.

► ఆత్మకూరు నుంచి వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని దింపాలని యోచిస్తున్న టీడీపీకి ఆయన బిగ్‌షాక్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఆత్మకూరు నుంచి పోటీలో ఉండబోనని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇటీవల వరుసగా రెండు దఫాలు ఆయన సొంతంగా సర్వే నిర్వహిస్తే ప్రజాదరణ తక్కువగా ఉన్నట్లు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆనం సైతం ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది.

► కందుకూరు నుంచి ఇంటూరి బ్రదర్స్‌ మధ్య పోటీ ఉంది. ఇందులో ఇంటూరు నాగేశ్వరరావుకు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న కందుకూరులో టీడీపీ ఓటమి తప్పదని, దీంతో కొత్త వారికి టికెట్‌ ఇవ్వాలనే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎదురు పెట్టుబడికి సిద్ధంగా అధిష్టానం
మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉండడంతో ఆ పార్టీ అధినేత తల పట్టుకున్నట్లు సమాచారం. సీట్ల కోసం డబ్బు మూటలతో వస్తారని ఆశించిన చంద్రబాబుకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు కావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అయితే సర్వేపల్లి, కోవూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నప్పటికీ కనీసం అధికార పార్టీకి ఏ మాత్రం పోటీ ఇచ్చే స్థాయి నేతలు కాకపోవడంతో వీరి స్థానంలో కొత్త వారిని రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత యోచన.

ఇందుకు బడాబాబులను ఆహ్వానిస్తున్నప్పటికీ పోటీకి వారు కూడా సిద్ధంగా లేకపోవడంతో కొంచెం పెట్టుబడి మీరు పెట్టండి.. మిగతాది పార్టీ చూసుకుంటుందని హామీ ఇస్తున్నారంట. కొత్త వారు దొరక్కపోతే కోవూరు, కందుకూరు, ఉదయగిరిలో పాత వారికే టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. సర్వేపల్లి, కావలి, ఆత్మకూరులో కచ్చితంగా కొత్త అభ్యర్థులు వస్తారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement