ఓడిపోయే పార్టీ అయినా టిక్కెట్ల కోలాహలం బాగానే ఉంటుంది. ఆ మాత్రం బిల్డప్ ఇస్తేనే టిక్కెట్లు అమ్ముకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీలో అదే జరుగుతోంది. సీటు రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. ఓ నియోజకవర్గానికి ఇంచార్జ్ ఉన్న తనను కాదని వేరే వారికి టిక్కెట్ ఇస్తే ఊరుకునేదే లేదని ఆ మాజీ ఎమ్మెల్యే ఓపెన్‌గానే పార్టీ అధినేతకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఇక్కడ చంద్రబాబు రాజకీయాల్లో పావుగా మారుతున్న నేత ఎవరు?
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో పచ్చపార్టీ టిక్కెట్ ఫైట్ రోజు రోజుకూ ముదురుతోంది. వెంకటగిరి టికెట్ తనదే అంటూ ముగ్గురు నేతలు తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరపున కురుగొండ్ల రామకృష్ణ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం చంద్రబాబు రాజకీయ క్రీడలో పావుగా మారి అధికార పార్టీ నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలోకి జంప్ చేశారు. మంత్రి పదవి ఇవ్వలేదన్న అసహనంతో ఆనం రామనారాయణరెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది. టీడీపీలో చేరేసమయంలోనే తనకు ఆత్మకూరు టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబుని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ తన ఆటలు సాగవని భావించిన ఆనం తిరిగి వెంకటగిరికి వచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది.
తనకు వెంకటగిరి టిక్కెట్టే ఇవ్వాలంటూ చంద్రబాబును ఆనం రామనారాయణరెడ్డి కోరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి తమకే టిక్కెట్ ఇస్తున్నారంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో బీసీ నేతగా ఉన్న మస్తాన్ యాదవ్ సైతం చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే వారి ద్వారా టిక్కెట్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో ముగ్గురిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక పార్టీ క్యాడర్ అయోమయంలో పడిందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.. నేను లోకల్ టికెట్ నాకే అంటూ మస్తాన్ యాదవ్ విస్తృతంగా జనాల్లో తిరుగుతూ ఉండడంతో అటు అనంకి ఇటు కురుగొండ్ల రామకృష్ణకి టికెట్ భయం పట్టుకుందట.
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ చరిష్మాతో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి మంచి మెజార్టీతో గెలుపొందారు. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఆనం టిడిపిలోకి జంప్ అవడం.. టిడిపి టికెట్ ని ఆశిస్తూ ఉండడంతో చంద్రబాబుకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని కురుగొండ్ల రామకృష్ణ పబ్లిక్ గా చెబుతుంటే.. ఆనం మాత్రం సైలెంట్ గా ఆయన సీటుకి ఎసరు పెడుతున్నారని యాంటీ కురుగొండ్ల వర్గం చెబుతోంది. వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తున్నారని పాతతరం నేతలు మండిపడుతున్నారు. ఇంతకీ చంద్రబాబు పార్టీ ఫండ్ ఇచ్చే వారికీ ప్రయారిటీ ఇస్తారా లేక పార్టీని నమ్ముకున్న నేతకు టికెట్ ఇస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment