సాక్షి ప్రతినిధి, నెల్లూరు:నమ్మిన వారిని మోసం చేయడం, వారిని నట్టేట ముంచేయడం చంద్రబాబు నాయుడి నైజం. సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు నిజస్వరూపం తెలిసి కూడా మరోసారి నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు బొక్కబోర్లా పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు చెప్పిన తియ్యటి మాటలు ఇప్పుడు విన్పించడం లేదు. దీంతో ఆ ముగ్గురి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
మాటమార్చి మోసం చేసి..
వెంకటగిరి, నెల్లూరురూరల్, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు చంద్రబాబు చేసిన మోసంపై మథన పడుతున్నారు. జిల్లాలోనే ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి సీనియర్ పొలిటీషియన్‌గా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆనం ప్రస్తుతం చంద్రబాబు రాజకీయ క్రీడలో ఓ పావుగా మారారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనను 2016లో ఎమ్మెల్సీ లేదా మంత్రి పదవి ఆశ చూపడంతో టీడీపీలో చేరారు.
పచ్చ కండువా కప్పుకోగానే మాట మార్చిన చంద్రబాబు కనీసం ఆత్మకూరు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఇవ్వకుండా అవమానించారు. టీడీపీలో జరిగిన అవమానాల్ని తట్టుకోలేక కుమిలిపోతున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ అక్కున చేర్చుకుని వెంకటగిరి నుంచి బరిలోకి దింపి గెలిపించుకుంది. అయితే అక్కున చేర్చుకున్న పార్టీనే కాదనుకున్న ఆనం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. దీంతో ఆనం టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లి పార్టీ కండువా కప్పుకోకుండానే లోకేశ్ యువగళం పాదయాత్రలో హల్‌చల్ చేశారు.
జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలతో పాటు నెల్లూరు సిటీ, ఆత్మకూరు సీట్లు ఇస్తామని టీడీపీ అధినేత నమ్మబలకడంతో ఆనం యువగళంలో పాల్గొన్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అ«ధినేత మాట మారింది. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు కాకుండా.. ఒక్క ఆత్మకూరుకే పరిమితం కావాలని ఆదేశాలొచ్చాయి. ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. టీడీపీ అంతర్గత సర్వేల్లో కూడా ఈ విషయం తేలడంతో ఆత్మకూరులో పోటీ చేస్తే ఓటమి తప్పదని తెలుసుకున్న ఆనం తనకు నెల్లూరు సిటీ లేదా వెంకటగిరి స్థానాన్ని కేటాయించాలని చంద్రబాబు వద్ద మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.
ఆత్మకూరు లేదా సర్వేపల్లిలో పోటీ చేయాలని తెగేసి చెప్పడంతో ఆనంకు దిక్కతోచని పరిస్థితి నెలకొంది. చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయానంటూ ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉదయగిరికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఆనం వద్దకు వెళ్లి ఉదయగిరి రావాలని ఆహ్వానించగా పార్టీలో తన పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదని వాపోయారని తెలుస్తోంది.
కోటంరెడ్డి సీటు వెనుక కుట్ర
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి కూడా టీడీపీలో అయోమయంగా మారింది. రూరల్ టీడీపీ టికెట్ నీదేనంటూ మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ సీటు జనసేనకు ఇచ్చేందుకు తెరవెనుక రాజకీయం చేస్తున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో ఒక్క సీటైనా జనసేన అడిగే అవకాశం ఉంది. ముందుగా నెల్లూరు సిటీ మీద జనసేన కన్నుపడింది.
అయితే మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన సామాజికవర్గంలో ఉన్న పరపతిని ఉపయోగించి జనసేన అధినేత వద్ద పంచాయితీ పెట్టారని, నెల్లూరు సీటు ఆశించకుండా ఉంటే ప్యాకేజీతోపాటు మరోచోట పోటీ చేస్తే అక్కడ అయ్యే ఖర్చంతా తానే భరిస్తానంటూ షరతు పెట్టారని ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రూరల్ టికెట్ రాకుండా తెరవెనుక కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.
చంద్రశేఖర్‌రెడ్డికి చంద్రబాబు ఝలక్
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఉదయగిరి టికెట్ నీదేనంటూ చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీ కండువా కప్పుకున్న చంద్రశేఖర్‌రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ కాదు కదా ఎమ్మెల్సీ కూడా ఇచ్చేది లేదని, ముందు పార్టీకి పనిచేయాలంటూ ఆదేశాలిచ్చారంట.
చంద్రశేఖర్‌రెడ్డి సతీమణికి పార్టీ పదవి ఇచ్చి ‘ఈ పదవే నీకు ఎక్కువ ఇక చాలు’ అని చెప్పడంతో చంద్రశేఖర్‌రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పుకుంటున్నారు. ఇటుఉదయగిరిలో కూడా టీడీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డికి కనీస గౌరవంకూడా ఇవ్వటం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించక పోవడంతో ఆయన పరిస్థితి కూడా కుడితిలో పడ్డ ఎలుకలా తయారై ఇంటికే పరిమితం అయ్యారనే ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment