ప్రసంగిస్తున్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో శనివారం సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్రకు అశేష జనవాహిని జేజేలు పలికింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.
ముత్తుకూరులోని పాత వాణి థియేటర్ నుంచి జంక్షన్ వరకు మేళతాళాలు, కేరళ డ్రమ్స్, గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ ఓ పండుగలా ర్యాలీ జరిగింది. దారి పొడవునా బడుగు, బలహీన వర్గాలకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జరిగిన మేలును తలచుకుంటూ జై జగన్.. జైజై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జరిగిన సామాజిక సాధికార సభ జనసంద్రాన్ని తలపించింది. కిలోమీటర్ల పొడవున జనం నిల్చుని నేతల ప్రసంగాలు వింటూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
జగన్‌తోనే సామాజిక విప్లవం: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
అంబేడ్కర్ కలలు కన్న సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పారు. నవరత్నాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఓసీలు సైతం లబ్ధి పొందారని తెలిపారు. సీఎం జగన్ కార్యక్రమాలతో ఈ వర్గాలు సామాజిక సాధికారత సాధించి, నేడు తలెత్తుకొని తిరగగలుగుతున్నాయని చెప్పారు.
సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేసేందుకు రాక్షస మూకలు మళ్లీ బయల్దేరాయని, వారిని మరోసారి చిత్తుగా ఓడించాలని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ని బతికిస్తే.., చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ బొమ్మ పెట్టుకొనే అర్హత లేదన్నారు. మరోసారి రాష్ట్రంలో సీఎం జగన్‌కు పట్టం కట్టి, మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.
తండ్రిని మించిన తనయుడు జగన్: ఎంపీ బీదా మస్తాన్‌రావు
సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసి, వారిని అభివృద్ధి దిశగా నడిపించారని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు చెప్పారు. రాజ్యసభలో 9 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఉంటే వీరిలో ఐదుగురు బీసీలకు అవకాశం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. పేదలకు అత్యంత ఆవశ్యకమైని విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు అవమానాలకు గురిచేస్తే, వైఎస్ జగన్ అన్నిరంగాల్లోనూ పెద్దపీట వేశారని తెలిపారు.
బడుగు వర్గాలకు బంగారు బాట: తిరుపతి ఎంపీ గురుమూర్తి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు బంగారు బాటలు వేసిన ఘనత సీఎం వైఎస్ జగనకే దక్కుతుందని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి అన్నారు. గత పాలకులు బడుగు వర్గాలను ఓటు బ్యాంకుగా చేశారని, కానీ, వారి అభ్యున్నతికి కృషి చేసిన సీఎం జగన్ అభినవ అంబేడ్కర్ అని కొనియాడారు.
మైనారిటీలకు రూ.26 వేల కోట్లు : రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్‌బాషా
సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లలో మైనారిటీల సంక్షేమానికి రూ.26 వేల కోట్లు ఖర్చు చేశారని, గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇంతస్థాయిలో ఖర్చు పెట్టలేదని రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్‌బాషా అన్నారు. తెలుగు, లెక్కలు రాని లోకేశ్ సీఎం కావాలని తాపత్రయపడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండు చోట్ల గ్లాసులు పగలగొట్టుకొన్న పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌ని విమర్శించడం సిగ్గుచేటన్నారు.
రూ.979 కోట్ల మేరకు
సంక్షేమ ఫలాలు : మంత్రి కాకాణి
సీఎం జగన్ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు సంక్షేమ పథకాల ద్వారా రూ.979 కోట్ల మేర లబ్ధి పొందారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రూ.442 కోట్ల మేరకు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సుమారు 1.10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు.
మేలు జరిగితేనే ఓటు వేయమన్నారు : నెల్లూరు మేయర్ స్రవంతి
మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వేయండంటూ అడిగే ధైర్యం ఈ రాష్ట్రంలో సీఎం జగనన్నకు మాత్రమే ఉందని నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతి అన్నారు. గిరిజన మహిళనైన తనను మేయర్ సీట్లో కూర్చొబెట్టడమే కాకుండా ఒక ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కూడా జగనన్నే అని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను అభివృద్ధి పరుస్తూ సామాజిక న్యాయాన్ని సాధించిన సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment