దేశంలోని వ్యవస్థలన్నీ మీ బిడ్డ మీద ప్రయోగించిన వారితో కలిసిపోయినోళ్లు వైఎస్సార్ వారసులా?
కాంగ్రెస్‌కి ఓటు వేస్తే వైఎస్సార్ పేరు కనపడకుండా చేసే కుట్రలో భాగస్తులం అయినట్లే
ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు, వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు
వారంతా ఇన్నేళ్లకు ఇడుపులపాయకు ఎందుకు వస్తున్నారో ఆలోచించండి
కడప జిల్లాలో రాజకీయ వ్యాక్యూమ్ క్రియేట్ చేసి అందులోకి చొరబడే కుట్రలు
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఈరోజు కడప జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోందో మీ అందరికీ తెలుసు. కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం రాష్ట్రంలో బహుశా అతి కొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది.. నాన్నగారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో మీరంతా చూశారు. ఆ సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాక సింబల్ వచ్చి కేవలం 14 రోజులు మాత్రమే అయినా మీ బిడ్డతో మీరంతా నిలబడి 5,45,000 మెజారిటీ ఇచ్చారు.
మీరు ఇచ్చిన ఆ రికార్డు మెజారిటీతో మీ బిడ్డ ఆరోజు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరీ జగన్? అని చూసింది. అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప వన్‌టౌన్ సమీపంలోని మద్రాస్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు.
ఎవరు నిర్ణయించాలి?
ఇటువంటి కడప రాజకీయాన్ని మన ప్రజలు, వైఎస్సార్ మీద అభిమానం ఉన్న వారు నిర్ణయించాలా? లేక ఆ పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వైఎస్సార్ శత్రువులు నిర్ణయించాలా? అనేది మీరంతా ఆలోచన చేయాలని కోరుతున్నా. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
రాజకీయంగా వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మీ బిడ్డ మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి.. అదే కాంగ్రెస్, అదే టీడీపీతో ప్రత్యక్షంగా ఒకరితో, పరోక్షంగా ఇంకొకరితో కలిసిపోయి వైఎస్సార్ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్రలో వీరందరూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఇలాంటి వాళ్లా వైఎస్సార్ వారసులు?
దుర్మార్గంగా అబద్ధాల ప్రచారం...
వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును, ఆ కీర్తి ప్రతిష్టలను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో పెట్టిన పార్టీ ఆయన కుమారుడిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టింది. ఆ 16 నెలలు నాకు ఎవరు ఇస్తారు? ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించింది. ఆ ఛార్జ్‌షీట్‌లో నాన్నగారి పేరును మనంతట మనమే పెట్టించామట! ఇంత దుర్మార్గంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటే అసలా పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా? ఆ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా?
రాజకీయ శూన్యత సృష్టించి...
నా పక్కన అవినాష్ ఉన్నాడు. నాకన్నా 13 ఏళ్ల చిన్నోడు. మా అందరికన్నా చిన్న పిల్లోడు. ఈ పిల్లోడి జీవితం నాశనం చేయడం కోసం చంద్రబాబు దగ్గర నుంచి కుట్రలు పన్నుతున్నారు. ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి, టీవీ 5 దాకా కుట్రలు పన్నుతున్నారు. కడప జిల్లాలో ఒక రాజకీయ వ్యాక్యూమ్ క్రియేట్ చేసి అందులోకి వాళ్లు రావాలని కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడి జీవితం నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వీళ్లంతా మనుషులేనా? అవినాష్ ఎలాంటి వాడో మీకు, నాకు తెలుసు. అవినాష్ మీద నాకు, మీ అందరికీ నమ్మకం ఉంది. అవినాష్‌ను గొప్ప మెజారిటీతో గెలిపించమని మీ అందరినీ కోరుతున్నా.
ఇన్నేళ్లకు ఇడుపులపాయకు..
నాన్న 2009లో హఠాన్మరణం పాలైతే ఆ తర్వాత వైఎస్సార్ కుటుంబాన్ని వాళ్లు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికి తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాన్న సమాధి దగ్గరకి వాళ్లు వస్తారట! ఇడుపులపాయ దగ్గరకు వస్తారట! చూడటానికి వస్తారట! ఢిల్లీ నుంచి వస్తారట! ఇన్నేళ్ల తర్వాత ఎన్నికల వేళ వస్తారట..! ఎన్నికల కోసం వస్తారట! ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే వైఎస్సార్ పేరు కనపడకుండా చేసే కుట్రలో భాగస్తులం అయినట్లే. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్లను మనమే పొడుచుకున్నట్లే. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని, ఎన్డీఏని గెలిపించడం కాదా?
పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో కాపురం..
ఎన్నికల వేళ వీళ్లు ఎందుకు మన రాష్ట్రానికి వస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతున్నాయో గమనించండి. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది. చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ పెద్దమనిషి చంద్రబాబు పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రి పూట కాంగ్రెస్‌తో కాపురం చేస్తాడు! రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో గమనించండి.
నాన్నగారు బతికున్నప్పుడు ఎవరితో విబేధించి యుద్ధం చేశారో, ఆయన్ను అభిమానించే ప్రతి కార్యకర్తా ఎవరితో యుద్ధం చేశారో, ఇవాళ వైఎస్సార్ వారసులు అని చెప్పుకుంటున్న వాళ్లు అదే ఈనాడుతో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో, చంద్రబాబుతోనూ చెట్టాపట్టాలు వేసుకుని వాళ్లను గెలిపించడం కోసం మన ఓట్లను చీల్చే యత్నం చేస్తున్నారంటే ఇంతకంటే హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఉంటాయా?
Comments
Please login to add a commentAdd a comment