సాక్షి, నెల్లూరు: రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లాస్థాయిలోనూ చీకటి పొత్తులకు కాంగ్రెస్, టీడీపీ సిద్ధమయ్యాయి. ప్రజాదరణను కోల్పోయిన రెండు పార్టీలు వైఎస్సార్‌సీపీని అడ్డుకోవడమే లక్ష్యంగా లోపాయికారిగా పొత్తులు కుదుర్చుకునేందుకు వ్యూహం పన్నాయి. దీనికి అసెంబ్లీ ఎన్నికలు వేదిక కానున్నాయి. ఈ మేరకు ఆ రెండు పార్టీల నేతలు అవగాహనకు వచ్చినట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాల్లో నాలుగు కాంగ్రెస్‌కు, ఆరు తెలుగుదేశానికి అన్న దామాషాలో సీట్ల పంపిణీ జరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రి ఆనం, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్య తొలి విడత చర్చలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సోమిరెడ్డి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీలో చేరబోతున్న సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డితో మంత్రి మరో దశ చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ చర్చలతో ఆనం సోదరులు టీడీపీలో చేరనున్నారన్న వార్తలు వెలువడ్డాయి. కాని కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ టీడీపీతో చేతులు కలిపి తమ ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు ఆనం సోదరులు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రజాబలంతో ముందుకు దూసుకెళుతున్న వైఎస్సార్‌సీపీ వల్ల జిల్లాలో తమ ఆధిపత్యానికి గండిపడుతుందని వారు భయపడుతున్నారని తెలిసింది. వైఎస్సార్‌సీపీని కట్టడి చేయాలంటే తమ ఒక్కరి వల్ల సాధ్యం కాదని,టీడీపీతో చీకటి ఒప్పందం మినహా మరో మార్గంలేదని ఆనం సోదరులు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో టీడీపీతో కాంగ్రెస్ రహస్య పొత్తులు కొనసాగిస్తున్న విషయం విదితమే. జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఆనం సోదరులతో మంచి సంబంధాలు కొనసాగిస్తుండటం జగమెరిగిందే. జిల్లాలో ఐదు నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు పలికితే, మిగిలిన చోట్ల టీడీపీకి కాంగ్రెస్ మద్దతు పలికేలా చర్చించినట్టుగా తెలిసింది. అయితే అందుకు టీడీపీ నేతలు ససేమిరా అంటున్నారని సమాచారం. సీమాంధ్రలో కాంగ్రెస్ పనై పోయిందని, ఎవరూ ఓట్లేసే పరిస్థితి లేదని టీడీపీ నేతలు వాదించినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు నాలుగు నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలికేందుకు టీడీపీ నేతలు అంగీకరించినట్టు సమాచారం.
నెల్లూరు సిటీ,రూరల్ నియోజక వర్గాలతో పాటు ఆత్మకూరు, గూడూరు స్థానాలు తమకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారని తెలిసింది. ఇక మిగిలిన ఆరు నియోజక వర్గాలతో పాటు నెల్లూరు ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ మేరకు అధికార పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులకు టీడీపీ శ్రేణులు మద్దతు పలకాలి. ఇక మిగిలిన నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి కాంగ్రెస్ వారు కృషి చేయా ల్సి ఉంటుంది. దీంతో పాటు నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకరరెడ్డిని నిలిపి ఇరుపార్టీలు ఆయన విజయానికి కృషి చేయాలి. దీనికి ఇరువర్గాలు ఆమోదం తెలిపాయని తెలిసింది. ఒప్పందం మేరకు కాంగ్రెస్ వారు కోరిన నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థులు సైతం పోటీలో ఉంటారు. అయితే కేవలం డమ్మీ అభ్యర్థులుగా మాత్రమే ఉంటారు. టీడీపీ వారికిచ్చిన స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. మొత్తంగా జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ ,టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉంటారు.
ఆనంకు అలవాటే:
తమకు ఇష్టం లేకపోతే సొంతపార్టీ అభ్యర్థులను నట్టేట ముంచి ఇతర పార్టీల అభ్యర్థులకు రహస్యంగా మద్దతుపలికి గెలిపించడం ఆనం సోదరులకు కొత్తేమే కాదని పలువురు అంటున్నారు. గతంలో పలు సందర్భాల్లో ఆనం సోదరుల నిజస్వరూపం బయటపడిందని జిల్లా ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. 2009 ఎన్నికలలో నేదురుమల్లి రాజ్యలక్ష్మికి వ్యతిరేకంగా పనిచేసి టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికారు. 1999లో నగరంలో మున్సిపల్ ఎన్నికలలో డాక్టర్ యశోధరకు టికెట్ ఇప్పించి టీడీపీ అభ్యర్థి అనూరాధకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ అనీల్‌కుమార్ యాదవ్‌కు కాకుండా పీఆర్‌పీ అభ్యర్థి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డికి మద్దతు పలికిన విషయం అందరికీ తెలిసిందే. ఆలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత. ఈ వైఖరికి అలవాటు పడిన ఆనం వర్గీయులు మరోమారు చీకటి పొత్తులకు సిద్ధమయ్యారు. అయితే నాయకులు తమ స్వార్థానికి చేసుకుంటున్న ఈ అనైతిక ఒప్పందాలను ఇరు పార్టీల్లోని దిగువశ్రేణులు వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది.
చీకటి పొత్తులు
Published Tue, Jan 21 2014 1:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement