కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేశ్ రూ.30 కోట్లు..
చెప్పినట్టల్లా ఆడటానికి కాంగ్రెస్‌కు ప్యాకేజీ పంపిన బాబు
కేసుల కోసం బీజేపీతో... కాపుల కోసం జనసేనతో పొత్తు
2019లో ఓడిన వెంటనే సీఎం రమేశ్‌ను బీజేపీలోకి పంపిన బాబు
ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్‌కు రూ.30 కోట్ల నిధులు
నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం; ఏపీ పీసీసీకి నియామకం
ఆది నుంచీ జగన్ టార్గెట్‌గానే విమర్శలు; ఇప్పుడు కడపలో పోటీ కూడా?
పీకే, షర్మిల, పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా రమేశ్‌దే
కుట్రలలో తన రికార్డులను తానే బద్దలుగొడుతున్న నారా వారు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ... కాంగ్రెస్ వేరువేరు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి మరీ నడిపిస్తున్నారని మరోసారి స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడింది. అవసరాల కోసం, కేసుల నుంచి రక్షణ కోసం చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. అధికారికంగా జనసేనతోను, అనధికారికంగా కాంగ్రెస్‌తోను అంటకాగుతూనే ఉన్నారని స్పష్టంగా వెల్లడయింది. ఇందుకోసం చంద్రబాబు తన నమ్మిన బంటు సీఎం రమేశ్ ద్వారా... కాంగ్రెస్ పార్టీకి భారీ ప్యాకేజీ అందజేసినట్లు నేరుగా ఎలక్టొరల్ బాండ్లే వెల్లడించాయి.
అది కూడా తెలంగాణలోను, కాంగ్రెస్‌లోను ఎన్నికలకు ముందు ఏకంగా 30 కోట్ల రూపాయలను అధికారికంగా పార్టీ ఫండ్ కింద చంద్రబాబు నాయుడు పంపించినట్లు వెల్లడయింది. ఇక అనధికారికంగా ఎంత ముట్టజెప్పారన్నది ఊహించటం కష్టమే. వీటన్నిటికీ తోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎలా మోశారో... కాంగ్రెస్ కోసం తన పార్టీని ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఎలా కట్టడి చేశారో తెలియనివేమీ కావు. నిజానికి కడప జిల్లాకు చెందిన సీఎం రమేశ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నా... నూటికి నూరుపాళ్లూ తెలుగుదేశం మనిషి.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆయన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థను ఆరంభించి... బాబు అండదండలతో భారీ కాంట్రాక్టులు పొందారు. బాబు మనిషిగా సింగపూర్, మారిషస్‌ల నుంచి నిధులు తెచ్చుకుని చాలా తక్కువ కాలంలోనే వేల కోట్లకు ఎదిగాడు. అందుకే... 2019లో తాను ఓడిపోగానే సీఎం రమేశ్‌ను బీజేపీలోకి పంపించేశాడు చంద్రబాబు నాయుడు. ఇక అప్పటి నుంచి బీజేపీలో ఉంటూనే... నారా వారి ప్రయోజనాల కోసం సకల కార్యాలూ చక్కబెట్టడం మొదలెట్టాడు సీఎం రమేశ్.
అలాంటి సీఎం రమేశ్... బీజేపీలో ఉంటూ బీజేపీకి ఒక్క పైసా కూడా అధికారికంగా ఇవ్వకపోయినా... రూ.30 కోట్లను మాత్రం బీజేపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ ఖాతాలో వేయటం అందరినీ ఆశ్చర్యపరిచేదే. అంతేకాదు. చంద్రబాబు ఎవరెవరిని వాడాలని అనుకుంటున్నారో... వారందరికీ అవసరమైన ఖర్చులు పెట్టడం, ప్రత్యేక విమానాలు సమకూర్చటం ఇవన్నీ రమేశ్ విధులే. ఈయన విమానాన్ని ఇటీవల షర్మిల, పవన్ కల్యాణ్, ప్రశాంత్ కిషోర్ సహా బాబు బ్యాచ్ మొత్తం వాడేస్తుండటం అందరికీ తెలిసిన విషయమే.
జగన్ టార్గెట్‌గా బాబు పావులు...
2019లో ప్రజా క్షేత్రంలో దారుణంగా ఓడిపోయినప్పటి నుంచీ చంద్రబాబు ఎన్ని పాచికలు వేసినా పారటం లేదు. ఆ తరవాత జరిగిన స్థానిక ఎన్నికలతో సహా ప్రతి ఎన్నికలోనూ ఘోరమైన ఓటమి పాలవుతుండటంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని నేరుగా ప్రజాక్షేత్రంలో ఢీకొనటం కష్టమని తెలుసుకుని మాయోపాయాలకు దిగాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆసరాగా చేసుకుని ఆయన కుటుంబీకుల్లో చిచ్చు పెడితే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టవచ్చనే నిర్ణయానికి వచ్చి... ఆ దిశగా పావులు కదిపాడు.
హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడి ఇరుక్కుంటామేమోనని భయపడుతున్న సునీతను చేరదీయటంతో పాటు... అధికారం ఆశ చూపించి వైఎస్ షర్మిలనూ తమవైపు తిప్పుకున్నారు. వారు గనక తెలుగుదేశంలో నేరుగా చేరితే తమ మాటలెవరూ నమ్మరన్న ఉద్దేశంతో... తన సన్నిహితుడు రేవంత్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్‌లో ఆమె పార్టీని విలీనం చేయించటం వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా చేయించాడు. ఇదే సమయంలో ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి కాంగ్రెస్‌కు తన బంటు సీఎం రమేశ్ ద్వారా రూ.30 కోట్లను ఎలక్టొరల్ బాండ్ల ద్వారా అందజేశారు.
నిజానికి ఎలక్టొరల్ బాండ్ల విషయంలో చాలా కంపెనీలు 2019 ఎన్నికల ముందు కొనుగోలు చేసి ఆయా పార్టీలకు అందజేశాయి. సీఎం రమేశ్ మాత్రం 2023లోనే తన రిత్విక్ ప్రాజెక్ట్ ద్వారా రూ.45 కోట్ల మేర ఎలక్టొరల్ బాండ్లను కొనుగోలు చేసి, అందులో రూ.30 కోట్లను కాంగ్రెస్ ఖాతాలోకి, రూ.5 కోట్లను తెలుగుదేశం ఖాతాలోకి, మరో 10 కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్ (ఎస్) ఖాతాలోకి వేశారు.
కాంగ్రెస్‌లో మారిన పరిణామాలు...
తెలుగుదేశం తరఫున రాజ్యసభకు ఎన్నికై... బీజేపీలో కొనసాగుతూ... కాంగ్రెస్‌కు భారీగా నిధులిచ్చిన సీఎం రమేశ్... ఇటీవల చంద్రబాబు నాయుడిని ఢిల్లీలో బీజేపీ పెద్దలు కలవటానికి కూడా ఇష్టపడనప్పుడు మొత్తం వ్యవహారాన్ని వెనక ఉండి నడిపించారు. మొత్తానికి బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్లు సంపాదించి బాబును వారితో భేటీ అయ్యేలా చేశారు. ఇక వాళ్లేం చెబితే అది చేస్తానని చంద్రబాబు సాగిలపడటంతో వారు కూడా పొత్తుకు సరేనన్న విషయం బహిరంగ రహస్యమే.
ఆ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా నేరుగానే చెప్పారు. బాబుకు బుద్ధొచ్చింది కనకనే తిరిగి తమ వద్దకు వచ్చాడని ఆయన చెప్పగా... గతంలో చంద్రబాబుజీ... నాయుడుజీ అన్న ప్రధాన మంత్రి మోదీ... ఇటీవల చిలకలూరిపేట సభలో మాత్రం నేరుగా చంద్రబాబు నాయుడు అని మాత్రమే... అదికూడా ఒక్కసారే సం¿ోదించడం గమనార్హం. బాబు మాత్రం మోదీజీ గారు అంటూ అతివినయం ప్రదర్శించటం ఎవ్వరి దృష్టినీ దాటిపోలేదు కూడా.
కాకపోతే సీఎం రమేశ్ కాంగ్రెస్ పార్టీకి నిధులిచ్చాక పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీని విలీనం చేయటంతో పాటు ఆమెను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించారు. నాటి నుంచీ ఆమె నేరుగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డినే టార్గెట్‌గా చేసుకుని రకరకాల విమర్శలు చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు కూడా తాను అండగా ఉన్నానని చెబుతూ... వివేకా హత్య విషయంలో కూడా జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలకు దిగారు. ఒక దశలో వివేకా భార్యను గానీ, సునీతను గానీ కడపలో పోటీ చేయించాలని భావించి... ఇపుడు మాత్రం చంద్రబాబు సూచనలతో నేరుగా తానే పోటీక దిగే ప్రయత్నాలూ చేస్తున్నారు.
కాకపోతే ఇప్పటిదాకా ఈ వ్యవహారాలపై ఎన్ని విమర్శలొచ్చినా కాంగ్రెస్‌తో తమకేం సంబంధమంటూ చంద్రబాబు దాటవేశారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తరహాలో స్పందించేవారు. కాకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ ఎలక్టొరల్ బాండ్ల మొత్తం వివరాలన్నీ బయటపెట్టింది. ఎవరు కొన్నారు? ఏ పార్టీకి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అనే వివరాలన్నీ వెల్లడించటంతో... సీఎం రమేశ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇచ్చిన వ్యవహారం బట్టబయలయి... దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.
ఇవీ.. బాండ్ నంబర్లు
కాంగ్రెస్‌కు సీఎం రమేశ్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఇచ్చిన బాండ్ల నంబర్లు. ఒక్కొక్కటీ రూ.కోటి విలువ గల 30 బాండ్లను... అంటే రూ.30 కోట్లను కాంగ్రెస్‌కు అందజేశారు. 14402, 14412, 14414, 14416, 14418, 14420, 14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477.
Comments
Please login to add a commentAdd a comment