కూకట్‌పల్లిలో జరిగిన సీమాంధ్రుల హమారా హైదరాబాద్ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు, విజయ్ చందర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలని స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కాంగ్రెస్ తోకపార్టీగా మార్చడంతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రె స్ ముందు టీడీపీ మోకరిల్లడంతో చంద్ర బాబు ఎన్టీఆర్‌ను మరోసారి వెన్నుపోటు పొడిచినట్లైందని ఆయన విమర్శించారు. కూకట్‌పల్లి నియోజకవర్గం లో శనివారం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సంఘీభావంగా సీమాంధ్రులు ఏర్పాటు చేసిన ‘హమారా హైదరాబాద్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరిపైనా వివక్ష చూపలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు శాంతి భద్రతల విషయంలో దుష్ప్రచారం చేశారని, టీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఎక్కడైనా పొరపాట్లు జరిగాయా అని ప్రశ్నిం చారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీకి విజయాన్ని అందించారని గుర్తు చేశారు.
కేసీఆర్ సింహంలాంటి వాడు...
టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేకే నాలుగు పార్టీల నేతలు కలిసి కూటమి కట్టారని, సింహం లాంటి సీఎం కేసీఆర్ ఎన్నికల్లో సింగిల్‌గానే వస్తున్నారని మంత్రి కేటీఆర్ చమత్కరించారు. డిసెంబర్ 11 తర్వాత రాహుల్ గాంధీ వీణ, చంద్రబాబు ఫిడేల్ వాయించుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ సీమాంధ్రుల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
జగన్ దాడిపై స్పందిస్తే ఇంత రాద్ధాంతమా?
ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాడి జరిగిన సమయంలో తాను సిరిసిల్లలో ఓ కార్యక్రమంలో ఉండగా పీఏ వచ్చి దాడి గురించి చెప్పారని కేటీఆర్ వివరించారు. జగన్‌పై దాడిని ఖండిస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని మధ్యాహ్నం 3.35 నిమిషాలకు తాను ట్వీట్ చేశానని, ఆ వెంటనే కేసీఆర్, కేటీఆర్, పవన్, ప్రధాని మోదీ కలిసి పోయారని ఏపీ సీఎం చంద్రబాబు ఒకటే రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. సాటి మనిషిపై దాడి జరిగితే మానవీయంగా స్పందించడం తప్పా అని ప్రశ్నించారు. తన కంటే గంట ముందే చంద్రబాబు కుమారుడు లోకేశ్ జగన్‌పై దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశాడని.. అంటే లోకేశ్ కూడా మాతో కలిసిపోయినట్లేనా అని ప్రశ్నించారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంఘటన జరిగినప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారని..దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేశారని విమర్శించారు.
అమరావతిని ఎందుకు కట్టలేకపోయాడు?
తొమ్మిదేళ్లలో హైదరాబాద్‌ను తానే కట్టానని చెబుతున్న చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లలో అమరావ తిని ఎందుకు నిర్మించలేకపోయాడని కేటీఆర్ ప్రశ్నిం చారు. తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధి మీద దృష్టి పెడితే ఆంధ్రాలో చంద్రబాబు గ్రాఫిక్స్ మీద దృష్టి పెట్టారన్నారు. ఆంధ్రాలో అభివృద్ధి గ్రాఫిక్స్ మీదే తప్ప వాస్తవ రూపంలో కనిపించడం లేదన్నారు.
కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు...
అధికారం కోసం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలోనే నెగ్గలేడని, ఇక్కడక్కొచ్చి ఏం చేయగలడని ఎద్దేవా చేశారు. ఇటువంటి వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ప్రతినిధులు సినీనటుడు, వైఎస్సార్ సీపీ నేత విజయచందర్ తదితరులు పాల్గొన్నారు.
శాంతిభద్రతల్లో నం.1గా హైదరాబాద్
శాంతిభద్రతల విషయంలో దేశంలోనే హైదరాబాద్ నంబర్ వన్‌గా నిలించిందని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకునే సీమాంధ్రులంతా ఈ నాలుగున్నరేళ్లు సంతోషంగా జీవించారని చెప్పారు. అందరం అభివృద్ధి చెందాలంటే నగరంలోని సీమాంధ్రులం తా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కేటీఆర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment