Telangana Grand Alliance 2018
-
ఒక కన్ను ఔట్, రెండో కన్ను డౌట్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు చంద్రబాబు ప్రకటించుకొన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రెండు కళ్ల సిద్ధాం తంలో ‘‘ఒక కన్ను ఔట్, రెండో కన్ను డౌట్’’ అనే విధంగా పరిణమించాయి. కానీ, కొందరు పరిశీలకులు రెండో కన్ను ఆంధ్ర కూడా పోయినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ‘‘ప్రజాకూటమి’’లో చేరడంలో చంద్రబాబు ముఖ్య ఉద్దేశ్యం కూటమి బలపడటం కాదు. కనీసం తెలంగాణలో తనపార్టీ టి.డి.పి. బలపడటం కన్నా, ఆంధ్రలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని తిరిగి అధికారాన్ని పొందడమే ప్రధానం. ఏదో ఒకపార్టీతో జట్టుకట్టి గెలుపొందడమే చంద్రబాబు చరిత్ర, చాణక్యనీతి. ఆంధ్రరాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తుకు అవకాశాలు కనిపించడం లేదు. కనుక, ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీయే కనుక, ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌తో సీట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండానే, తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుకి చంద్రబాబు సిద్ధపడ్డారు. మరోవైపు అధికారం కోసం ఆవురావురుమంటోన్న కాంగ్రెస్ నాయకత్వం, బాబుతో జతకట్టి తెలంగాణ గడ్డపైకి ఆహ్వానించి పప్పులో కాలేసింది. బాబు ట్రాప్‌లో (ఉచ్చుల్లో) పూర్తిగా పడిపోయింది. మొత్తంమీద చంద్రబాబు ప్రజాకూట మిలో ‘‘ఐరన్‌లెగ్’’ పాత్రని అద్వితీయంగా పోషించారు. ఇకపోతే, మహత్తర చారిత్రక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిన తెలుగు గడ్డపైన కమ్యూనిస్టు ప్రతినిధి ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేకపోవడం ఆ రెండు పార్టీల దురవస్థను తెలియచేస్తోంది. మరోవైపు అణచబడ్డ సామాజిక వర్గాలకు చెందిన బహుజన సమాజ్‌పార్టీ ఒంటరిగానే పోటీచేసి తన రాజకీయ వ్యక్తిత్వాన్నీ స్వతంత్రతనీ నిలబెట్టుకొన్నది. అయితే, తెలంగాణలో బీఎస్పీకి వెలుపల ఉన్న సామాజిక రాజకీయ శక్తులతో ఆ పార్టీ జతకట్టి, ఒక ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేసి, మరింత శక్తివంతంగా ఎన్నికలబరిలో నిలబడిఉంటే, ఇప్పుడు ఒక్కస్థానం కూడా పొందలేని దుస్థితి నుండి ఈ శక్తులు బయటపడి ముందంజవేసి ఉండేవి. వాస్తవానికి, తెలంగాణలో ఆధిపత్య, సంపన్నవర్గాల కాంగ్రెస్, టి.డి.పి., తదితర పార్టీల ‘ప్రజాకూటమి’ మట్టికరిచినప్పటికీ, అక్కడ గెలుపొందింది కూడా అవే సామాజిక రాజకీయ శక్తులేనన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. చాడా వెంకటరెడ్డి గారి సి.పి.ఐ.తో కలుపుకొని చూసినా, ఆ కూటమి ఆధిపత్య కులాల గుంపేననేది సుస్పష్టం. ఆధిపత్యకుల సి.పి.యమ్. నాయకత్వంలో ఏర్పడిన కూటమికి ఏ పేరుపెట్టుకొన్నా, దానిని కూడా ఆధిపత్య కులాల కూటమిగానే ప్రజలు, ముఖ్యంగా దళిత, బహుజనులు, ఆదివాసీ, మైనారిటీలు భావించి, తిరస్కరించి, దాని నాయకత్వ ముసుగును చీల్చారు. అందరూ గ్రహించవలసిన మరోసత్యం ఏమంటే, యస్.సి., యస్.టి., బి.సి., మైనారిటీలకు చెందిన రాజకీయ శక్తులు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శిబి రంగా రూపొంది, శక్తివంతమైన స్వతంత్ర పోరాటం చేయలేకపోవడం ఒక కీలకమైన లోపం. ఈ లోపాన్ని ఆ సామాజిక శక్తులు సవరించుకొని ముందుకు పోవాల్సి వుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే గాక, దేశవ్యాప్తంగా కూడా బహుళ ప్రాచుర్యం పొందిన ఉద్యమ నేతలు గద్దర్, ఆర్. కృష్ణయ్య, మంద కృష్ణమాదిగలు. ఒకరు విప్లవ ప్రజా కళాకారుడు కాగా, రెండవ వారు అణచివేతకు గురవుతోన్న బి.సి.ల నాయకులు కాగా మూడవ వారు దొంతర్ల కుల వ్యవస్థలో అణచబడ్డ సామాజిక న్యాయంలో అంతర్భాగమైన ఎస్.సి. వర్గీకరణ ఉద్యమకారులు. ఈ ముగ్గురూ మూడు సామాజిక వర్గాలకు చెందినవారు కావడం మరో విశిష్టత. అయితే, చాలా బాధాకరమైన విషయమేమంటే, ఈ ముగ్గురూ తమ దశాబ్దాల కాలపు ఉన్నతమైన సామాజిక ఉద్యమ చరిత్రను తామే చెరిపివేసుకొనే విధంగా ఈ ఎన్నికల్లో వ్యవహరించడం. ఆధిపత్యకులాల, సంపన్నవర్గాల, ప్రతినిధులుగా పనిచేసి, పరి పాలించి, అవినీతికి నిలయమైన, విప్లవాన్ని, సామాజిక వర్గాలని అణచివేసిన, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఆధిపత్యంలో ఉన్న దుష్టకూటమిలో కలగలసిపోవడం, చివరికి ప్రజలు తిరస్కరించిన భ్రష్టకూటమిలో వీరు కూడా భాగస్వాములు కావడం అత్యంత విషాదకరం. ‘‘రాజకీయాలలో హత్యలు ఉండవు! ఆత్మహత్యలే ఉంటాయి’’ అన్న సూక్తికి నిదర్శనంగా ఈ ముగ్గురూ నేడు నిలబడి ఉన్నారు. ఇప్పటికీ సంఘాలలో, ఉద్యమాలలో వివిధ స్థాయిల్లో పనిచేస్తోన్న నాయకులూ, కార్యకర్తలూ ఈ ముగ్గురి వ్యక్తిత్వాలను సరిగా అర్ధం చేసుకొని తమ తమ వర్తమాన భవిష్యత్ కార్యాచరణ విధానాలను బహు జాగ్రత్తగా మలచుకోవలసి వుంటుంది. ప్రస్తుత దుష్ట వ్యవస్థలో పతనం ఎల్లవేళలా పొంచేవుంటుంది. తస్మాత్ జాగ్రత్త! ఇప్పటికైనా ఆ ముగ్గురు నేతలూ తమ రాజకీయ తప్పిదాన్ని గ్రహించి, మహాత్మా జోతిరావ్‌ఫూలే, డా‘‘ బి.ఆర్. ఆబేండ్కర్ల సిద్ధాంతాల వెలుగులో సామాజిక, రాజకీయ ప్రత్యామ్నాయ విధానానికి తిరిగిరావడం అవసరం. వ్యాసకర్త : వై. కోటేశ్వరరావు, సీనియర్ న్యాయవాది, అధ్యక్షులు, సోషల్ జస్టిస్ పార్టీ మొబైల్ : 98498 56568 -
పోలింగ్ మర్నాడు...
ఓటమిలో చాలా రకాలుంటాయ్. ఇది మాత్రం కూటమికి భయంకరమైన ఓటమి. తెలంగాణలో చంద్రబాబు కింగ్‌మేకర్‌గా వెలిగిపోదామని ఉత్సాహపడ్డారు. అనేక రోడ్‌షోల్లో అదే అరిగిపోయిన రికార్డుని వేసుకుంటూ పరమబోరు కొట్టించారు. రాహుల్ సరసన కూర్చుని మహాసభల్ని అడ్రస్ చేయడానికి చంద్రబాబు సంకోచించలేదు. ఇదంతా బీజేపీని గద్దె దింపడానికేనని పదే పదే చెప్పారు. జనం విని, ఆవలించారు. కోదండరాం కూటమిలో చేరడం, అయ్యో పాపం అనిపించుకోవడం ఘోరం. గద్దర్ సరేసరి. వీళ్లంతా వ్రతాలు పాడు చేసుకుని, కళావిహీనంగా మిగిలారు. వీళ్లంతా ఒకే తాటిమీద నడవడం, ఒకే వేదిక మీద నుంచే ఒకే మైకులో మాట్లాడటం ఒక ‘చారిత్రక ఛండాలం’ అన్నాడొక పెద్దాయన. ఈ కూటమి కెమిస్ట్రీలోంచి పనికిమాలిన ఫలితాలొచ్చాయ్. చేతికందిన పార్టీలన్నింటినీ తెచ్చి ఒక బీకర్లో వేశారు. దాని ఫలితం ఇది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పటికీ ఈ దేశ ప్రజమీద అతి చొరవ తీసుకుంటోంది. ఆ నైజానికి స్వస్తి పలకాలని ఒకాయన వాపోయాడు. మొన్న చిత్తుగా ఓడిన కూటమి పార్టీలు కొత్త పాఠాలు నేర్చుకోవాలి. పోలింగ్ అయ్యాక కూడా ఓటర్ల నాడిని కనీసం గురికి బెత్తెడుగా అయినా పట్టుకోలేకపోయారు. పైగా ఓటింగ్ మెషీన్లు దగా చేశాయని అర్థంలేని ప్రకటనలు. ఇవన్నీ హాస్యాస్పదంగా ఉంటాయ్. పోలింగ్ అయిన మర్నాడు తీరిగ్గా బస్సెక్కి నగరం దాటి వెళ్లాను. ఒక బంజారా తండా దగ్గర దిగాను. తండా మొదట్లో ఒక రావి చెట్టుని ఆనుకుని ఓ పెద్దాయన జోగుతున్నాడు. మధ్య మధ్య మెడమీద పాకుతున్న చీమల్ని దులుపుకుంటున్నాడు. నేను అటూ ఇటూ దిక్కులు చూసి, ఆ పక్కనే ఉన్న బండరాయిమీద చతికిలబడ్డాను. ఆయన లేచి కూర్చుని ఎవరు ఏమిటన్నట్టు నా వంక చూశాడు. కుశల ప్రశ్నలతో మాటలు మొదలుపెట్టాను. నాలుగు ప్రశ్నలయ్యాక, ‘అసలు సంగతికి రాకూడదూ’ అన్నాడు సూటిగా. వయసు, దానికి తగ్గ అనుభవం నిలువెల్లా తొణికిసలాడుతోంది. నేను ఎంపిక చేసుకుందామనుకుంది సరిగ్గా ఇలాంటి ఓటర్నే. ఆడబోయిన తీర్థం ఎదురైంది. ‘... ఎవరు గెలుస్తారు?’ అని సూటిగా అడిగాను. ‘మా వాళ్లంతా కారుకే వేశారు. మరి మా వాళ్లంటే మంద.. ఒకే తీరు. తేడాలుండవ్. మీ పట్నం వాళ్లకి సొంత ఆలోచనలుంటాయ్. అందుకని మీ ఆలోచనలు మేక పెంటికల్లా విడివిడిగా ఉంటాయ్’. ఆ పోలిక నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. ‘... అంతో ఇంతో చేశాడు. ఇంకా చేస్తన్నాడు. ఎవడైనా అంతే. ఇంకా తింటం అంటారా. వీళ్లే నయం. ఈ నాలుగేళ్లలో గుంటలు పూడ్చుకున్నారు. ఇహ మెరకలేసుకోవడమే కాబట్టి కూత్తి తక్కువే తింటారు’. ఆ పెద్దాయన అంచనాకి నాకు నవ్వొచ్చింది. ‘పాపం ఇంటిల్లిపాదీ రాష్ట్రానికే చాకిరీ చేస్తున్నారు గదా’ అనగానే ‘అదేకదా వచ్చిన విమర్శ’ అన్నాను. ‘అదేంది? నాకిప్పుడు నలుగురు బిడ్డలున్నారు. నాకు ఐదెకరాల భూమి ఉంది. అందరూ పొలంలో తలోపనీ చేసుకుంటారు. ఓ కూతురుంది. అది గోచీ బిగించి తాడిచెట్టుకి పాకిందంటే ఉడత లెఖ్ఖ. కల్లుగీతలు గీసేవాళ్లు దాన్ని నివ్వెరపాటుగా చూస్తారు. పనికొచ్చేవాడు పనిచేస్తే తప్పా? కేసీఆర్ రాగానే నీళ్లమీద పడ్డాడు. కరెంటుని ముందే చక్కపెట్టాడు. పొలాలకి డబ్బు పంచాడు. కాస్త గుక్క తిప్పుకోనియ్యాలి కదా. ఒక్కమాట చెబుతా విను. దేశానికి సొరాజ్జం తెచ్చామని చెప్పి కాంగ్రెసోళ్లు గాంధీ, నెహ్రూల పేర్లు చెప్పుకుని యాభై ఏళ్లు హాయిగా ఏలారు. ఈయన ఉద్యమం నడిపాడు. రాష్ట్రం తెచ్చాడు. ఇంకోసారి సీటిస్తే ఏమవుతుందనిపించింది. నేను కుర్రతనం నించి ఎర్రజెండా పట్టుకు పెరిగినవాణ్ణి. నాకన్నీ తెలుసు. నా బీడు భూమికి చెమ్మ తగుల్తుందని నేననుకోలేదు. తగిలింది. అంతమంది కలిసి పాలిస్తే అది కుక్కలు చింపిన విస్తరవుతుంది. శానామంది నాలాగే అనుకున్నారు. ఫలితాలు దానికి తగ్గట్టే ఉంటాయ్’. నేను సంతృప్తిగా లేచి కదిలాను. నా సర్వే పూర్తయింది. ‘ఇలాంటి ఫలితాలు నాలో ఉన్న కమ్యూనిస్టుకి అక్కసుగానే ఉంటది. అందుకే వాడు గొర్రె కసాయి వాణ్ణే నమ్ముద్ది’ అని అరుస్తున్నాడు. దూరానికి ఆ మాటలు వినిపించాయి. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
కొంగర కలాన్ టు కొడంగల్ ప్రభంజనం వరకు..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తవకముందే.. ముందుస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలనం సృష్టించారు. ప్రతిపక్షాలు ఇంకా ఎన్నికలకు సిద్ధం కాకముందే.. ఆయన ముందస్తు ఎన్నికల ప్రకటనతో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. తన నాలుగేళ్ల పాలనలోని అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ‘ప్రగతి నివేదన సభ’ ఏర్పాటుచేసిన కేసీఆర్.. ఆ సభలో ముందస్తు సంకేతాలు ఇచ్చారు. సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఏకంగా 105మంది అభ్యర్థులను ప్రకటించి.. ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. వంద స్థానాలు టార్గెట్‌గా ప్రచారంలో దూసుకుపోయిన కేసీఆర్.. కోమటిరెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి లాంటి దిగ్గజాలను ఓడించడం ద్వారా పరిపూర్ణ విజయాన్ని అందుకున్నారు. అసెంబ్లీ రద్దు నుంచి.. ఫలితాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం వరకు జరిగిన పరిణామాలు తేదీల వారీగా.. సెప్టెంబర్ 2న: కొంగర కలాన్‌లో ‘ప్రగతి నివేదన సభ’ను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 6న: తెలంగాణ అసెంబ్లీ అధికారికంగా రద్దయ్యింది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్ గవర్నర్‌కు సమర్పించగా.. ఆయన ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్దర్మ సీఎంగా ఉండలాంటూ కేసీఆర్‌ను గవర్నర్ కోరారు. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని శాసనసభ కార్యదర్శి ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, సీఎస్ ఎస్.కె. జోషికి అందజేయడం కూడా చకచకా జరిగిపోయాయి. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే 105 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్.. మరో సంచలనానికి తెరతీశారు. వీరిలో 103 మంది సిట్టింగ్‌లకే ఇవ్వగా.. చెన్నూర్, ఆంథోల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. సెప్టెంబర్ 7న: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాద సభ’తో కేసీఆర్ ఎన్నికల ప్రచార భేరీ మోగించారు. సిద్ధిపేట సమీపంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన అక్కడ నుంచి బహిరంగ సభకు వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయంపై స్టే ఇవ్వాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్, కాంగ్రెస్ నాయకురాలు డికే ఆరుణలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సెప్టెంబర్ 11: రాష్ట్రానికి ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా తదితరులు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్ కుమార్‌తో పాటు ఇతర అధికారులతో సమావేశమ య్యారు. ఓటర్ల జాబితా కూర్పుకు షెడ్యూల్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల: 10-09-2018 అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ: 10-09-2018 నుంచి 25-09-18 గ్రామ సభలు, ప్రత్యేక క్యాంపులు: 15-09-2018, 16-09-2018 రెండు రోజులు అభ్యంతరాల తర్వాత సవరణల లిస్టు: 04-10-2018 ఓటర్ల జాబితా ముద్రణ: 07-10-2018 తుది జాబితా: 08-10-2018 (కోర్టు తీర్పు అనంతరం 12-10-18న తుది జాబితా విడుదల చేశారు) అక్టోబరు 3, 4, 5 తేదీల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్, మహబూబ్‌నగర్(వనపర్తి), నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థాయి సభలు నిర్వహించారు. అక్టోబర్ 4: జోగులాంబ- గద్వాల జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పూరించింది . జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 5: ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ టీపీసీసీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో తుది ఎన్నికల జాబితాపై హైకోర్టు స్టే ఇచ్చింది అక్టోబర్ 12: అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ సహా ఇతరులు వేసిన పిటీషన్లను హైకోర్టులో ధర్మాసనం కొట్టివేసింది. అక్టోబర్ 20: తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ (భైంసా, కామారెడ్డి) ప్రారంభించారు. ఓవరాల్‌గా రాహుల్ గాంధీ 6 సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని 26 నియోజకవర్గాల్లో 17 సభలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ 06-10-18 నోటిఫికేషన్ 12-11-18 నామినేషన్ల గడువు 19-11-18 పరిశీలన 20-11-18 ఉపసంహరణ 22-11-18 పోలింగ్ 07-12-18 ఓట్ల లెక్కింపు 11-12-18 అక్టోబర్ 20: 38 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేశారు. నవంబర్ 2: 28 మంది సభ్యులతో బీజేపీ రెండో జాబితా విడుదల చేశారు. నవంబర్ 13: 65 మంది సభ్యులతో కాంగ్రెస్ తొలి జాబితా, 9 మంది సభ్యులతో టీడీపీ తొలి జాబితా విడదుల చేశారు. నవంబర్ 14: 10 మంది సభ్యులతో కాంగ్రెస్ రెండో జాబితా, ఇద్దరి సభ్యులతో టీడీపీ రెండో జాబితా విడుదల చేశారు. నవంబర్ 14: గజ్వేల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్, సిద్దిపేట టీఆర్ఎస్ అభ్యర్థిగా హరీశ్ రావుల నామినేషన్ దాఖలు చేశారు. నవంబర్ 15: 20 మంది సభ్యులతో బీజేపీ మూడో జాబితా విడుదల చేశారు. నవంబర్ 16: 7 మంది సభ్యులతో బీజేపీ నాలుగో జాబితా విడుదల చేశారు. నవంబర్ 17: 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా, టీజేఎస్ నలుగురు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. నవంబర్ 17: హుజుర్ నగర్ ప్రజాకూటమి అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నవంబర్ 19: సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా కేటీఆర్ నామినేషన్, కొడంగల్ ప్రజాకూటమి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నవంబర్ 18: 25 మంది అభ్యర్థులతో బీజేపీ ఐదో జాబితా, టీజెఎస్ మేనిఫెస్టో విడుదల చేశారు. నవంబర్ 18: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. నవంబర్ 20: టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. నవంబర్ 23: సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మేడ్చల్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. నవంబర్ 26: ప్రజా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. నవంబర్ 27: కాంగ్రెస్ ప్రజా మేనిఫెస్టో విడుదల చేసింది. నవంబర్ 27: ప్రధాని మోదీ నిజామాబాద్, మహబూబ్‌నగర్ సభల్లో పాల్గొన్నారు. నవంబర్ 28: ఖమ్మంలో తొలి సారిగా రాహుల్, చంద్రబాబులు కలిసి తొలి బహిరంగ సభలో పాల్గొన్నారు. డిసెంబర్ 2: టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసింది డిసెంబర్ 3: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. డిసెంబర్ 4: కొడంగల్‌లో అత్యంత ఉద్రిక్తత మధ్య టీఆర్ఎస్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ను జరిగింది. కేసీఆర్ సభను వ్యతిరేకిస్తూ స్థానిక అభ్యర్థి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ బంద్‌కు పిలుపునిచ్చారు. అనంతరం రేవంత్ అరెస్ట్.. విడుదల వంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటికే కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్.. తన సభను రేవంత్ అడ్డుకోవాలని చూడటంతో కొడంగల్‌లో విజయం సాధించాలని కేసీఆర్ సవాల్‌గా తీసుకున్నారు. విజయం సాధించారు. డిసెంబర్ 5: గజ్వేల్‌లో టీఆర్ఎస్ చివరి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 7: ప్రశాతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్. 73.2 శాతం నమోదయిన పోలింగ్ డిసెంబర్ 11: టీఆర్ఎస్ అఖండ మెజారిటీతో ఘనవిజయం సాధించింది విస్త్రతంగా కాంగ్రెస్ ప్రచారం సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్ జాతీయ నాయకులు అహ్మద్ పటేల్, జైరాంరమేశ్, జైపాల్‌రెడ్డి, మల్లిఖార్జున ఖర్గే, ఆజాద్, చిదంబరం, కపిల్ సిబల్, వీరప్పమొయిలీ, డి.కె.శివకుమార్, ఆనంద్‌శర్మ, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, ఉమెన్ చాందీ, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు, అజహారుద్దీన్, ఖుష్బూ, నగ్మా, సూర్జేవాలా, అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ తదితరులు ప్రచారం చేశారు. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్‌లతోపాటు మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించారు. బీజేపీ దూకుడుగా ప్రచారం ప్రధాని మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్‌షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం లు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, ఫడ్నవిస్, రమణ్‌సింగ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, సంతోశ్ గంగ్వార్, జగత్ ప్రకాశ్ నడ్డా, పురుషోత్తం రూపాల, జువాల్ ఓరమ్, మాజీ మంత్రి పురంధేశ్వరి సహా మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు 180కి పైగా సభల్లో పాల్గొన్నారు. స్వామి పరిపూర్ణానంద 80కి పైగా సభల్లో పాల్గొన్నారు. కేసీఆర్ వన్ మ్యాన్ షో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అక్టోబర్ 19 నుంచి పూర్తిస్థాయిలో ప్రచారం చేశారు. అక్టోబర్ 24, నవంబర్ 1న రెండు రోజులు మినహా ప్రతిరోజు సగటున నాలుగు నుంచి తొమ్మిది సభల్లో పాల్గొన్నారు. చివరిరోజు గజ్వేల్‌లో ఒకే సభతో ప్రచారం పూర్తిచేశారు. కొంగరకలాన్ సభ మినహాయిస్తే.. మొత్తం 87 బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. వైరా, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లలో మినహా 116 అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆయన కవర్ చేశారు. -
మహాకూటమిదే అధికారం
గరిడేపల్లి/కోదాడ: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రావటం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనకు నేటితో వీడ్కోలు పలికారన్నారు. నాలుగున్నర సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా లైన్లో నిలబడి ఓట్లు వేశారన్నారు. రాష్ట్రంలో 85 సీట్లలో మహాకూటమి విజయం సాధించబోతోందన్నారు. కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీల కూటమి ఆధ్వర్యంలో ఈనెల 12న ప్రజా ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఓటింగ్‌శాతం ఎంత పెరిగితే అంతే స్థాయిలో మెజార్టీ సీట్లు కూటమికి రావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని మహాకూటమికి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఆయనవెంట సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఉత్తమ్ గరిడేపల్లి, పొనుగోడు, కీతవారిగూడెంలో గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అధికారులను అడిగి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో ముచ్చటించారు. కోదాడలో ఓటేసిన ఉత్తమ్ టీపీసీసీ అధ్యక్షుడు, హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కోదాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నా రు. గతంలో ఆయన రెండు సార్లు కోదాడ ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆయన ఓటు పట్టణంలోని రెండవ వార్డులో నమోదై ఉంది. పట్టణంలోని అనంతగిరి రోడ్డులో ఉన్న ఈవీరెడ్డి డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన బూత్‌కు ఆయన మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చి ఓటు వేశారు. -
కేసీఆర్.. ఔర్ ఏక్‌బార్
సాక్షి, హైదరాబాద్ : ఔర్ ఏక్ బార్.. కేసీఆర్ సర్కార్ అంటున్నాయి ఎగ్జిట్‌పోల్ సర్వేలు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజున ప్రముఖ ఇంగ్లిష్ చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ టీఆర్ఎస్కే కాస్త అటు ఇటుగా అధికారం దక్కడం ఖాయమని అంచనా వేశాయి. రిపబ్లిక్‌టీవీ, టైమ్స్‌నౌ, ఇండియాటుడే, న్యూస్ఎక్స్.. ఇలా దాదాపు అన్ని జాతీయ చానళ్ల సర్వేలూ కేసీఆర్‌దే విజయమని సూచించాయి. టీఆర్ఎస్ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టైమ్స్‌నౌ, ఇండియాటుడే చానళ్లు చెప్పగా, రిపబ్లిక్ టీవీ 50–65 స్థానాలు, న్యూస్ఎక్స్ చానల్ 57 స్థానాలు టీఆర్ఎస్కు వస్తాయని పేర్కొంది. కేసీఆర్ హవా ముందు ఏ శక్తీ నిలబడలేదని, ఆయనకు తెలంగాణ ప్రజలతో భావోద్వేగ సంబంధముందని వెల్లడించాయి. కాంగ్రెస్–టీడీపీల పొత్తే.. కేసీఆర్ విజయాన్ని సులభతరం చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని.. ఎగ్జిట్‌పోల్స్ సర్వేలో వెల్లడైంది. కేసీఆర్ హాయాంలో అమలయిన సంక్షేమ పథకాలు కూడా మేలుచేకూర్చాయని, కేసీఆర్‌ది కుటుంబ పాలన అని, అవినీతి జరిగిందన్న ఆరోపణలను తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని తేల్చిచెప్పాయి. (‘మరోమారు కారుదే కుర్చీ’) అంతా బాబే చేశాడు జాతీయ చానెళ్ల ఎగ్జిట్‌పోల్స్ సందర్భంగా చర్చల్లో పాల్గొన్న రాజకీయ విశ్లేషకులు, నిపుణులు కూడా టీఆర్ఎస్ విజయానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే పూర్తి కారణమని పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేసిందని, తెలంగాణ వ్యతిరేకిగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తిగా ముద్రపడిన బాబుతో దోస్తీయే.. కాంగ్రెస్ పుట్టి ముంచిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన టీజేఎస్‌తో పొత్తు కూడా ఉపయోగపడలేదని విశ్లేషించారు. (తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్) గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైనందునే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సభలను ముగిస్తూ ‘జై తెలంగాణ’అని చంద్రబాబు ముగించినప్పటికీ ఆయన్ను తెలంగాణ ప్రజానీకం నమ్మలేదనేది ఎగ్జిట్‌పోల్స్‌తో స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. తమకు బాబు శత్రువే ఉన్న భావనలో ఇంకా తెలంగాణ ప్రజలున్నట్టు వారు వ్యాఖ్యానించారు. మొత్తంమీద ఈ ఫలితాలు రాజకీయంగా కాంగ్రెస్‌తో పాటు ఏపీలోనూ టీడీపీకి పెద్ద మొత్తంలో నష్టం చేకూరుస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్.. హార్ట్‌టచ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడని, ఆయనకు తెలంగాణ ప్రజలతో భావోద్వేగ సంబంధాలున్నాయని కూడా జాతీయస్థాయి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హాయాంలో కుటుంబ పాలన జరిగిందని, అవినీతి పెచ్చుమీరి పోయిందన్న ఆరోపణలున్నాయని, అయినా వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని, కేసీఆర్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలనే భావనే పోలింగ్ సరళిలో కనిపించిందంటున్నారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని కలిగించాయని, రైతు బంధు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి లాంటి పథకాలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయని పేర్కొన్నారు. (‘కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహిస్తాం’) కేసీఆర్‌పై ఎన్ని ఆరోపణలున్నప్పటికీ ఆయన తెలంగాణ సమాజానికి కీడు చేసే వ్యక్తి కాదనే అభిప్రాయం కారణంగానే ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపి ఉంటారని వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన సెటిలర్ల విషయంలో గత నాలుగేళ్లలో ఎలాంటి చిన్న ఘటనలు కూడా జరగలేదని, ఇది కూడా టీఆర్ఎస్కు లాభించిందని విశ్లేషించారు. గత నాలుగేళ్లలో రూ.3.5లక్షల కోట్లను ఖర్చు చేసి విద్యుత్ అందించారని, ఇది కూడా ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్కు చాలా బాగా కలిసొచ్చి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (అర్బన్ ఓటర్ సిగ్గుపడాలి: కొరటాల శివ) బీజేపీకి నష్టమే.. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ ఎన్నికల ఫలితాలు భంగపాటేనని జాతీయ రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కనీసం ప్రతిపక్ష స్థాయికి వెళ్లాలన్న ఆ పార్టీ ఆశలు మరోసారి అడియాశలు అయ్యాయని, బీజేపీని గట్టెక్కించాలని అమిత్‌షా చేసిన యత్నాలు కూడా ఫలించలేదని విశ్లేషించారు. తెలంగాణ యోగి (ఆదిత్యనాథ్)గా గుర్తింపు పొందిన స్వామి పరిపూర్ణానందను ఉపయోగించుకోవడంలో బీజేపీ విఫలం అయిందని చెప్పిన విశ్లేషకులు.. కేసీఆర్ రూపంలో భవిష్యత్ మిత్రుడు మాత్రం లభించాడని చెప్పడం విశేషం. వివిధ జాతీయ చానళ్లు, సంస్థల ఎగ్జిట్ పోల్స్ వివరాలివీ -
నాడు సోనియా గాందీ గాడ్సే.. నేడు దేవత
-
‘తెలంగాణ ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదు’
గచ్చిబౌలి: తెలంగాణ ప్రాజెక్టులకు తాను వ్యతిరేకం కాదని, ఐటీ కంపెనీలు కొలువుదీరిన సైబరాబాద్ సృష్టికర్త తానేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గురువారం ఆయన రోడ్‌షో నిర్వహిస్తూ మసీద్‌బండ, తారానగర్, ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్లో ప్రసంగించారు. సైబరాబాద్ తన మానస పుత్రిక అని, 1995 నుంచి హైటెక్ సిటీలో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. 100 ఎకరాల్లో ఉన్న ఒక్క మైండ్ స్పేస్‌లోనే లక్ష ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. సైబరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానని, హెచ్ఐసీసీ, గచ్చిబౌలి స్టేడియం, డైమండ్ నెక్లెస్ లాంటి ఔటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చానని చెప్పారు. అమెరికాలో 16 రోజుల పాటు కాలినడకన తిరిగి ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చానన్నారు. టీడీపీ, కాంగ్రెస్ జెండాలు కలిసి పని చేయడం ఓ చరిత్ర అని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిశామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని నరేంద్ర మోదీని గట్టిగా అడిగానని, ఆయనతో పేద వారికి ఎంతో నష్టం జరిగిందన్నారు. నాలున్నరేళ్లలో ప్రజలకు అసంతృప్తి, బాధలు తప్ప ఏమీ మిగల్లేదన్నారు. కేంద్రం తీరుతో రూపాయి విలువ పతనమైందన్నారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తీసుకొచ్చారా.. అని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. చార్మినార్ కట్టానని చెప్పను.. కేసీఆర్ అన్నట్లుగా తాను చార్మినార్ కట్టానని చెప్పనని, సైబరాబాద్‌ను కట్టానని చెబుతానని చంద్రబాబు అన్నారు. ఏపీని అభివృద్ధి చేస్తూ దేశం కోసం కాంగ్రెస్‌తో కలిశానన్నారు. సీబీఐ భ్రష్టు పట్టిందని, ఈడీ దెబ్బతిందని, ప్రశించిన రాజకీయ నాయకులు, మీడియా, కంపెనీలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్, ఆర్బీఐ వ్యవçస్థలను నిర్వీర్యం చేశారన్నారు. యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతితో ఎక్కడికి వెళుతున్నామో ఆలోచించాలన్నారు. ‘అభివృద్ధి చేసినందుకే కేసీఆర్ తిడుతున్నాడా? తెలంగాణలో నీకేం పని అంటారు. నేను రాకూడదా? మీకు బాధగా లేదా? నగరంలో రోడ్లు బాగు పడలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదు. ఇంటింటికి నీళ్లు రావడం లేదు. ఎస్సీలకు మూడెకరాల భూమి పంచలేదు. ఎస్సీని సీఎం చేయలేదు’ అని బాబు ధ్వజమెత్తారు. కొట్టినట్లు బీజేపీ, ఏడ్చినట్లు టీఆర్ఎస్ నటిస్తూ దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులకు తాను వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవి మంజూరు చేసింది తానేనని మండిపడ్డారు. దేశంలో బీజేపీ ఒక కూటమిగా, దాని వ్యతిరేక పార్టీలన్నీ మరో కూటమి అని.. ఇందులో నీవు ఏ కూటమో స్పష్టం చేయాలని కేసీఆర్‌ను నిలదీశారు. తెలంగాణకు న్యాయం చేయాలనుకున్న పార్టీ తమదని తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ గెలుపు కోసం ప్రజా కూటమి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ప్రజా కూటమిలోని పార్టీల నేతలు పాల్గొన్నారు. -
అన్నా.. ఎవరు గెలుస్తరే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముందెన్నడూ లేని ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా.. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య కూడళ్లు, రెస్టారెంట్లు, టీ సెంటర్లు, గ్రామాల్లో రచ్చబండలు ఇలా ఎక్కడ ఏ నలుగురు కలిసినా తెలంగాణ ఎన్నికల్లో గెలుపోటములపైనే చర్చ. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసి ఎన్నికలకు వెళ్తున్న చంద్రశేఖర్‌రావు.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీల కూటమి నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్2న టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభ తర్వాత ఆ పార్టీ ప్రతిష్ట కొంత మసకబారినట్లు అనిపించినా కొద్ది రోజులకే మార్పు కనిపించింది. ఈ ఏడాది మే, జూన్‌ల్లో కాంగ్రెస్ పుంజుకుంటున్న వాతావరణం కనిపించినా.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించడంతోనే టీఆర్ఎస్ బలపడుతున్న సంకేతాలు కనిపించాయి. దానికి తోడు కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం నామినేషన్ల గడువు ముగిసేదాకా తేలకపోవడం కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనిపించింది. టీడీపీతో పొత్తు.. కాంగ్రెస్‌కు మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న రెడ్డి సామాజికవర్గానికి టీడీపీతో పొత్తు రుచించలేదు. దీంతో ఈ సామాజికవర్గంలో కొంత మేర చీలిక వచ్చి టీఆర్ఎస్కు ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘అసెంబ్లీ రద్దు అయ్యే నాటికి ఎన్నికల కోసం టీఆర్ఎస్కు ఎన్నికలకు ముందున్న ఎజెండా సంక్షేమ పథకాలు.. కానీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం టీఆర్ఎస్ ఎజెండానే మార్చేసింది. టీడీపీతో కాంగ్రెస్ ఎప్పుడు జత కలిసిందో అప్పుడే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చంద్రబాబు రూపంలో ఎన్నికల ప్రచారానికి సెంటిమెంట్ అస్త్రం మరోసారి కలిసొచ్చింది. దీన్ని అంత తేలిగ్గా తీసిపారేయలేం’అని ఓ రాజకీయ విశ్లేషకుడు పేర్కొన్నారు. సెటిలర్లంతా బాబును బలపరుస్తారా? ఏపీ సెటిలర్లందరూ టీడీపీని బలపరుస్తారన్న తప్పుడు అంచనాతో కాంగ్రెస్ తన గొయ్యి తనే తవ్వుకుందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. గత టీఆర్ఎస్ పాలనలో సెటిలర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, ఏపీ ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత టీఆర్ఎస్కు కలసివస్తాయని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ద్వారా కాంగ్రెస్ ఒకే ఒక సామాజికవర్గం ఓట్లలో మాత్రమే 60 నుంచి 70 శాతం మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉందని, ఇది టీఆర్ఎస్ విజయావకాశాలను ఎంత మాత్రం దెబ్బతీయదని పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అదీ టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా నివసించే అమీర్‌పేటలో నిర్వహించిన కూటమి సభకు హాజరైన జనం 2,500 నుంచి 3 వేల వరకు ఉండటాన్ని వారు ఉదహరిస్తున్నారు. తెలంగాణలో స్థిరత్వం కోరుకుంటున్న ఏపీ సెటిలర్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని, ఇది కాంగ్రెస్‌కు మింగుడుపడని వ్యవహారమని రాజధానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఎక్కడ చర్చ జరిగినా సీఎంగా కేసీఆర్‌కే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. అయితే టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందిపై వ్యతిరేకత ఉందని, అది పార్టీ విజయావకాశాలపై ప్రబావం చూపొచ్చని పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ మాత్రం వంద శాతం విజయం సాధిస్తామని, సంక్షేమ ఫలితాలు పొందిన వారిలో 80 శాతం మంది తమకే ఓటేస్తారని విశ్వసిస్తోంది. కూటమి ఎన్ని హామీలు ఇచ్చినా, గడచిన నాలుగేళ్ల పాలనలో తాము అందించిన సంక్షేమ పథకాల ఫలాల కంటే అవేమీ గొప్ప కాదని, పైగా బహు నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో నమ్మకం లేదని టీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్ మాత్రం ఏడాదిలో లక్ష ఉద్యోగాలతో యువత, పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడం ద్వారా ఉద్యోగులు, ఏడాదిలో ఆరు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడమన్న హామీతో మహిళల ఆదరణ ఉంటుందని, గట్టెక్కుతామని నమ్మకంతో ఉంది. జోరుగా బెట్టింగులు తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బెట్టింగ్‌లు జోరందుకుంటున్నాయి. ఏపీలో భీమవరం, రైల్వేకోడూరు, మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా బెట్టింగులు సాగుతున్నాయి. భీమవరం కేంద్రంగా ఇప్పటికే వందల కోట్లలో బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ‘15 రోజుల కింద దాకా టీఆర్ఎస్ 50 దాటదు అన్న బెట్టింగ్ ఎక్కువగా నడిచింది. ఇప్పుడు టీఆర్ఎస్కు 60 దాటొచ్చు అన్న దానిపైనే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కూటమికి ఒక దశలో 50 సీట్లు దాటుతాయన్న బెట్టింగ్‌లు ఎక్కువగా నడిచినా, ఇప్పుడు 40 దాటుతుందన్న దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు’అని భీమవరం కేంద్రంగా నడుస్తున్న ఓ బెట్టింగ్ నిర్వాహకుడు చెప్పారు. వచ్చే నెల 2–5 తేదీల మధ్య బెట్టింగ్‌ల్లో మార్పులు ఉంటాయని, అప్పుడు స్పష్టత వస్తుందని చెప్పారు. -
మోదీతో మిలాఖత్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/హైదరాబాద్: ‘రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. అయినప్పటికీ ఆయనతో ఎందుకు అంటకాగుతున్నారో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పాలి’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. మోదీ బీ టీమ్ టీఆర్ఎస్ కాగా, సీ టీమ్ మజ్లిస్ అని అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును టీఆర్ఎస్ సమర్థించిందని విమర్శించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసమే బీజేపీ, టీఆర్ఎస్లు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్‌గాంధీ బుధవారం తొలుత కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో జరిగిన సభలో మాట్లాడారు. అనంతరం ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని అమీర్‌పేట, ఆసిఫ్‌నగర్‌లలో జరిగిన సభల్లో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని, కేసీఆర్ పాలనలో ఏ ఒక్క పనీ పూర్తికాని దుస్థితి ఉందని ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సాధించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రధాని మోదీ అస్తవ్యస్త విధానాలను సమర్థించడంలో తెలంగాణ ముఖ్యమంత్రే అందరికన్నా ముందున్నారని, దేశమంతా నోట్ల రద్దును వ్యతిరేకిస్తే.. కేసీఆర్ సమర్థించారని గుర్తుచేశారు. అలాగే లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన సమయంలో సైతం బీజేపీకి మద్దతుగా నిలిచారని, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థికి అండగా నిలిచారని.. ఇంత చేసినా స్వరాష్ట్రానికి మాత్రం బీజేపీ నుంచి ఆవగింజంతైనా అభివృద్ధిని సాధించలేకపోవడాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారు... ఎన్నికల సంఘం, ఆర్బీఐ, సీబీఐతోపాటు దేశంలోని అన్ని వ్యవస్థలనూ నాశనం చేయడానికి ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని రాహుల్ ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి, బీజేపీ కారణంగా పనిచేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారని పేర్కొన్నారు. న్యాయమూర్తి హత్య కేసులో బీజేపీ అధ్యక్షుడి పేరు వచ్చిందని గుర్తు చేశారు. మోదీ పాలనలో ప్రజలకు వస్తాయనుకున్న అచ్చేదిన్.. ప్రైవేటు కంపెనీలకు మాత్రమే వచ్చాయని విమర్శించారు. మోదీ కనుసన్నల్లో మెలుగుతున్న కేసీఆర్ బీ టీమ్‌ను చిత్తుగా ఓడించి.. ఢిల్లీలో ఏ టీమ్‌గా ఉన్న నరేంద్రమోదీని ఓడించేందుకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం హంగామా చేస్తోందని, కాంగ్రెస్ హయాంలో రూపొందించిన ప్రాజెక్టులకు పేర్లు మార్చి వేల కోట్ల రూపాయల అదనపు నిధులను ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో చేవెళ్ల–ప్రాణహిత కోసం రూ.50వేల కోట్లతో ప్రాజెక్టును రూపొందిస్తే.. కేసీఆర్ ఆ ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.93వేల కోట్లతో నిర్మిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి రూ.15వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో అప్పగిస్తే.. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించిన ఘనత ఆయనదేనన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మినహా ఏ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోని పరిస్థితి ఉందని, ఆయన కుటుంబం మాత్రం అనేక పదవులతో ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి..? మోదీ రాష్ట్రానికి ఇస్తామన్న రూ.2లక్షల కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాగా తయారైందని, భూ ఆక్రమణలు, దగాకోరు పనులకు చిరునామాగా మారిందని విమర్శించారు. నేనెందుకు పెత్తనం చేస్తా: చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ అభివృద్ధికి.. ఆవిర్భావానికి చిత్తశుద్ధితో కృషి చేసిన తాను తెలంగాణపై పెత్తనం చేస్తానని.. ప్రజాకూటమి వస్తే తానే రాజ్యమేలుతాననే రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం దుర్మార్గమని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు తాను చేసిన ద్రోహం ఏమిటో.. తనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పదేపదే దూషిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో తాను భాగస్వామి కావడం ముమ్మాటికీ నిజమని.. తన హయాంలోనే సైబరాబాద్ నగరం రూపకల్పన జరిగిందని, హైటెక్ సిటీ, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్‌రోడ్ వంటి అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. ‘హైదరాబాద్ నేను కట్టానని ఎక్కడా చెప్పలేదు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడ్డట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ హైటెక్ సిటీ అయిందని అన్న నోటితోనే కేటీఆర్ తిట్టడం ఏ మేరకు సమంజసం? కేసీఆర్ దళితుడ్ని సీఎం చేస్తానంటే అడ్డుపడ్డానా? డబుల్ బెడ్రూం ఇళ్లకు అడ్డుపడ్డానా? మహిళలకు మంత్రి పదవి ఇవ్వొద్దని చెప్పానా? 12 శాతం రిజర్వేషన్ ఇస్తానంటే అడ్డుపడ్డానా’ అని చంద్రబాబు నిలదీశారు. అసలు తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ ఉంటాడా..? ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం కాదా..? అని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన చారిత్రక అవసరం ఆసన్నమైందని, అందుకే కాంగ్రెస్‌తోపాటు ప్రధాన జాతీయ రాజకీయ పక్షాలతో కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు బాబు తెలిపారు. వచ్చేనెల 10న కలిసొచ్చే జాతీయ రాజకీయ పక్షాలతో సమావేశం అవుతున్నామని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం ప్రారంభమై.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా నూతన అధ్యాయం ఆవిష్కరించబోతున్నామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. మేధావుల హత్యతో దేశం అల్లాడుతోంది: సురవరం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని.. మైనార్టీలు, దళితులు, మేధావులు, రచయితలపై దాడులు పెరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. దేశం మేధావుల హత్యలతో అల్లాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేని స్థాయికి దిగజారిందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాసిన పాపానికి గౌరీ లంకేష్, కమ్యూనిస్టు మేధావిగా పేరొందిన గోవింద్ భన్సార్ను పొట్టన పెట్టుకుందని ఆరోపణలు చేశారు. ఇక సీఎం కేసీఆర్‌కు కనీస నైతిక విలువలు కరువయ్యాయని, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఏ సీఎం అయినా తమ ముందు తలవంచాల్సిందేనని చెప్పడానికి మించి దుర్మార్గం ఏముంటుందని ప్రశ్నించారు. మైనార్టీలపై ఇన్నిసార్లు దాడులు జరిగినా సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ఖండించలేదని, ఇందుకు ఎంఐఎంతో ఉన్న మిత్రుత్వమే కారణమని సురవరం ఆరోపించారు. కేసీఆర్ ఫాసిస్ట్ పాలనలో మోసపోని వర్గం లేదని, తెలంగాణ ప్రజల అదృష్టంకొద్దీ ముందస్తు ఎన్నికలు వచ్చాయని, ఈ ఫాసిస్ట్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు సిద్ధం కావాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే నియంత కేసీఆర్ ఓడిపోవాల్సిందేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఖమ్మం సభలో ప్రజాగాయకుడు గద్దర్ తన ఆటపాటలతో ఆకట్టుకున్నారు. సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, కార్యదర్శి సలీం అహ్మద్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జట్టి కుసుమకుమార్, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, శాసన మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ నేతలు పోట్ల నాగేశ్వరరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు, ప్రజాకూటమి అభ్యర్థులు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, బానోతు విజయ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఓడితే మోదీ బి టీమ్ ఓడినట్టే!
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో ఏర్పడిన ప్రజా కూటమి దేశానికే దిక్సూచి వంటిదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఎన్నిలకు తెలంగాణ భవిష్యత్ కోసమే కాదని యావత్ దేశ భవిష్యత్ కోసమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో ప్రజాకూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీలపై నిప్పులు చెరుగుతూనే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరించారు. ఈ సభకు రాహుల్‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట ఇంఛార్జ్ కుంతియా, కాంగ్రెస్ ముఖ్య నేతలు, ప్రజాసంఘాల నేతలు, తదితరులు హాజరయ్యారు. రాహుల్ ప్రసంగాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క తనదైన రీతిలో అనువాదం చేసి ఆకట్టుకున్నారు. రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. వ్యవస్థలను నాశనం చేశారు ‘ప్రధాని నరేంద్ర మోదీ.. సీబీఐ, సుప్రీం కోర్టు, ఎలక్షన్ కమిషన్ వంటి అనేక వ్యవస్థలను నాశనం చేశారు. నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్, రాష్ట్రపతి ఎన్నికలు, అవిశ్వాస తీర్మాన సమయాల్లో టీఆర్ఎస్ బీజేపీకి బహిరంగంగా మద్దతిచ్చింది. కానీ వీటన్నింటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడింది. ప్రజా కూటమిలోని పార్టీలన్ని కలిసి బీజేపీ కూటమి అయిన టీఆర్ఎస్ను ఓడిద్దాం. తెలంగాణలోని టీఆర్ఎస్ ఓడిపోతే మోదీ బి టీమ్ ఓడినట్టే.. ఆ తర్వాత ఢిల్లీలోని ఏ టీమ్‌ను ఓడిద్దాం. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తున్నా.. మోదీ మాత్రం తెలంగాణ అభివృద్దిని పట్టించుకోలేదు. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్, ఎంఐఎంలు బలంగా కోరుకుంటున్నాయి. తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి గెలవబోతోంది. రీడిజైనింగ్‌లో పేరిట వేల కోట్ల ఖర్చు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం 50వేల కోట్లతో ప్రణాళిక రూపిందించింది. కానీ టీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినందుకే అదనంగా 43 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ కాలం వెల్లదీస్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటూ పాత వాటికే రంగులు అద్దుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు 17 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. కానీ నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పులు చేసింది. దీంతో ఒక్కొక్కరిపై 60వేల భారం పడుతుంది. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి తప్పా ఎవ్వరికీ ఉద్యోగాలు రాలేదు. తెలంగాణ ఖజానాను కేసీఆర్ కుటంబం, బినామీలు, సన్నిహితులు దోచుకుంటున్నారు. విభజన హామీలు నెరవేర్చలేదు రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఖాజీపేట్‌లో రైల్వే కోచ్, బయ్యారంలో స్టీల్ ప్లాంట్, గిరిజన యునివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండు రాష్ట్రాలకిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. విభజన హామీలు నెరవేర్చేది కేవలం కాంగ్రెస్ మాత్రమే. బీజేపీకి కేసీఆర్ మద్దతిస్తున్నా.. మోదీ మాత్రం తెలంగాణ ప్రజల అభివృద్ధి పట్ల వివక్ష చూపిస్తున్నారు. బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారని తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను అడగండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ది అని ప్రజలు గుర్తించండి’ అంటూ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు. -
కేసీఆర్ ముసుగు తొలగింది
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలు అధికార దురహంకారంతో మీడియాను భ్రష్టుపట్టించారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మీడియాపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముసుగు తొలగిందని, ఓటమి భయంతోనే పిచ్చి ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంగళవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం మీదున్న ప్రేమతో తాను చిన్నవయసులోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరానని, అక్కడే సైనిక శిక్షణ పొంది మెరిట్ ర్యాంకులో పాసయ్యానని ఉత్తమ్ చెప్పారు. పాక్, చైనా సరిహద్దుల్లో మిగ్–21, మిగ్– 23 లాంటి అత్యాధునిక యుద్ధవిమానాలు నడిపిన అతికొద్దిమందిలో తానూ ఒకడినని గుర్తు చేసుకున్నారు. సియాచిన్‌లో మైనస్ 45 డిగ్రీల చలి లో, రాజస్తాన్ ఎడారిలో 55 డిగ్రీల ఎండలో తాను దేశం కోసం విధులు నిర్వహించానని అన్నారు. మీడియాపై బెదిరింపులా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో పాత్రికేయవృత్తి దయనీయంగా ఉందని, కేవలం అమెరికా, యూరోప్, భారత్‌లోనే మీడియా స్వతంత్రంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. కానీ, మోదీ, కేసీఆర్‌లు పత్రికలను, టీవీలను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి తమకు వ్యతిరేకంగా వార్తలు రాకుండా జాగ్రత్త పడుతున్నారని ఆరోపించారు. ఇది వ్యవస్థకు చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏనాడూ ఇలా వ్యవహరించలేదన్నారు. మీడియా విషయంలో కేసీఆర్ స్టిక్ అండ్ క్యారెట్ పద్ధతిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. పౌరుల ప్రాథమిక హక్కులను సైతం హరించి వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేయడం, ఇసుక మాఫియాను ప్రశ్నించిన నేరెళ్ల దళితులకు కరెంటు షాక్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం పట్ల కేసీఆర్ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసన్నారు. టీవీచానళ్లను 10 కిలోమీటర్ల లోతుకు తొక్కుతాన్న కేసీఆర్ కుటుంబాన్ని 10 కిలోమీటర్ల లోతుకు తొక్కాలని ఉత్తమ్ అన్నారు. మహాకూటమి గెలుస్తుందనే... మహాకూటమి గెలుస్తుందన్న భయంతోనే కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. తాము 99 స్థానాల్లోనే పోటీ చేస్తున్నా.. ఇంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. చేతనైతే మోదీపై తెలంగాణ హక్కుల కోసం పోరాడగలరా.. అని కేసీఆర్‌కు సవాలు విసిరారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు పరిశ్రమల సాధన కోసం ఎందుకు పోరాడటం లేదని నిలదీశారు. మోదీ పేరు వింటేనే కేసీఆర్ లాగులు తడుస్తాయని ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయలతో భవంతులు నిర్మించుకున్నారని, ఖరీ దైన కార్లు, ప్రైవేటు విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రణాళిక కేసీఆర్ ప్రభుత్వం విలేకరుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఉత్తమ్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో విలేకరుల సంక్షేమానికి కావాల్సిన విధానాన్ని రూపొందిస్తామని హామీ ఇచ్చారు. విలేకరులకు ఇళ్లు, వారి పిల్లలకు విద్య, బీమా తదితర సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రెస్‌క్లబ్‌ను దేశంలోని అత్యున్నత ప్రెస్‌క్లబ్‌లో ఒకదానిలా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. తాను సీఎం అయినా, కాకపోయినా.. ఈ హామీ బాధ్యత తనదేనని స్పష్టంచేశారు. సోనియాది త్యాగధనుల కుటుంబం... ఓడిపోతానన్న నిస్పృహలోనే కేసీఆర్ సోనియా గాంధీని, కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. 30 ఏళ్లుగా సోనియా, 15 ఏళ్లుగా రాహుల్ రాజకీయాల్లో ఉన్నారని, వారు కోరుకుంటే.. క్షణాల్లో ప్రధానమంత్రి పదవి చేపట్టేవారని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలే ఊపిరిగా బతికే త్యాగధనుల కుటుంబానికి పదవులు ఓ లెక్క కాదని తెలిపారు. త్యాగధనుల కుటుంబం అనడానికి ఇందిరా, రాజీవ్ మరణాలే నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వస్తే.. తిరిగి ఓయూకు పునర్వైభవం కల్పిస్తామని, ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటిగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలకు తిరిగి గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు. రాహుల్ సభలో టీఆర్ఎస్ ముఖ్యనేతలు తమ పార్టీలో చేరతారని సంకేతాలు ఇచ్చారు. ఆరునూరైనా మేనిఫెస్టో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రచారానికి ఏపీ నేతలు కూడా వస్తారని చెప్పారు. -
సయోధ్య లేని కూటమి
సంగారెడ్డి జోన్/పటాన్చెరు: మహాకూటమి, ప్రజా కూటమి అంటూ చివరికి ప్రజలే లేని కమిటీగా మిగిలిపోయిందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంగళవారం సంగారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం లో, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హరీశ్ మాట్లాడారు. మహాకూటమికి కామన్ మినిమం ప్రోగ్రాం లేదని, ఉత్తమ్, కోదండరాం మధ్య సయోధ్య లేదన్నారు. దుబ్బాక, మెదక్‌ల లో టీజేఎస్ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌కు బీఫాంలు ఇచ్చారన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అడ్డుకుంటామంటున్నారని, తెలంగాణను తిరిగి చీకటి మయం చేస్తారా అని ప్రశ్నించారు. వరంగల్‌లో పోటీ చేస్తున్న రేపూరి ప్రకాశ్‌రెడ్డి మూడు మంత్రి పదవులు టీడీపీకే అని అంటున్నారని, వీటిలో నీళ్ల శాఖ, హోం శాఖ, పరిశ్రమల శాఖను తీసుకుని నీటి శాఖతో ఆంధ్రాకు నీటిని తరలించడం, హోంశాఖ ద్వారా ఓటుకు కోట్లు కేసులో బాబుకు జైలును తప్పించడం, పరిశ్రమ శాఖ ద్వారా సంగారెడ్డి, పటాన్చెరు పరిశ్రమలను ఆంధ్రాకు తరలించడమే ఉద్దేశమా అని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్‌లో చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అని హరీశ్‌రావు అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. మోదీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్తో కుమ్మక్కయిందనడం తగదన్నారు. నిజామాబాద్‌లో నీళ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లేదనడం తప్పన్నారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలే తమకు హైకమాండ్ అని, తమకు బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఒక్కటేనని పేర్కొన్నారు. టీడీపీతో బీజేపీ దోస్తీ ఉన్న కాలంలోనే సుజనాచౌదరి రూ.వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలం గాణపై ప్రేముంటే నాలుగున్నరేళ్ల క్రితమే విభజన హామీలు నెరవేరేవన్నారు. విభజన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు. మోదీ అధికారంలోకి రాగానే టీడీపీ చెప్పినట్లు విని 7 మండలాల ను ఆంధ్రాలో కలిపారని గుర్తు చేశారు. హైకోర్టు విభజన చేయలేదని, ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారం గనుల విషయంలో అన్యాయం చేశారన్నారు. -
కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి జోష్..
సాక్షి, హైదరాబాద్: కాస్త ఆలస్యంగా ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారం కేడర్‌లో జోష్ నింపుతోందని కాంగ్రెస్ వర్గాలు సంబరపడుతున్నాయి. పదునైన మాటలు, ప్రభుత్వ పెద్దలపై విమర్శలతో మొదటి నుంచీ వార్తల్లో ఉన్న వ్యక్తిగా, అధికార టీఆర్ఎస్కు మింగుపడని నేతగా గుర్తింపు పొందిన రేవంత్ ప్రచారానికి ఆశించిన స్పందన లభిస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొదటిసారి అసెంబ్లీకి పోటీచేస్తున్న అభ్యర్థులతో పాటు మాజీ మంత్రులు, సీనియర్ నేతల నియోజకవర్గాల్లో నూ రేవంత్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి నిత్యం ఒక బహిరంగ సభ, రోడ్ షోలో పాల్గొంటూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో: కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెండ్రోజుల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇతర సీనియర్ నేతలైన మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, షబ్బీర్‌అలీ నియోజకవర్గాల్లో ఇప్పటికే బహిరంగ సభలతోపాటు రోడ్‌షో కూడా పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ రోడ్‌షో నిర్వహించి కార్యకర్తల్లో ఊపు తెచ్చారు. నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో ఏఐసీసీ అనుమతి తీసుకున్న రేవంత్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిత్యం 2, 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నా రు. ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆసిఫాబా ద్, ఖానాపూర్, బోథ్, కరీంనగర్‌లోని చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, వరంగల్ జిల్లా ములుగులో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్త అభ్యర్థులకు కీలకం.. మొదటిసారి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో రేవంత్ ప్రచారం ధైర్యాన్ని నింపుతోందని తెలుస్తోంది. సీనియర్ నేతలు, మాజీ మంత్రులు వారి నియోజకవర్గాలకే పరిమితం కావడంతో కొత్త అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో రేవంత్ ప్రచారం ఆయా నియోజకవర్గాల్లోని కేడర్‌కు ఉత్సాహం నింపుతోంది. మేనిఫెస్టోలో ఉత్తమ్ బిజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పార్టీ మేనిఫెస్టో, అసంతృప్తుల బుజ్జగింపు కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో అంతర్గత సమస్యలతో పార్టీ దెబ్బతినకుండా సమన్వయం చేస్తూనే ప్రచారంలోనూ వేగాన్ని పెంచాలని ఉత్తమ్ రేవంత్‌కు సూచించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా నల్లగొండ జిల్లాల్లోనూ 4 బహిరంగ సభలు నిర్వహించేందుకు రేవంత్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్లోనూ మరో 2 బహిరంగ సభలు, మహబూబ్‌నగర్‌లో 3, ఖమ్మంలో 3, నిజామాబాద్ 2 బహిరంగ సభ లు ఈ వారంలో నిర్వహించనున్నట్టు తెలిసింది. తన సొంత నియోజకవర్గంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సభ నిర్వహిస్తు న్నారు. బుధవారం కోస్గి మండల కేంద్రంలో జరిగే బహిరంగ సభకు రాహుల్ హాజరుకానున్నారు. ఈ సభలో రేవంత్ గురించి రాహుల్ ఏం చెబుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకీ లేదు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి లేకే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, కోదండరాం పార్టీలు కూటమిగా వస్తున్నాయని ఎద్దేవా చేశారు. సింహం లాంటి కేసీఆర్ సింగిల్‌గా వస్తున్నారని, ప్రజలంతా కూటమి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలన చూసి ఓట్లు వేయాలని కోరారు. తెలంగాణభవన్‌లో సోమవారం జరిగిన సిక్కుల ఆత్మీయ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికలను దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజల మనసులు గెలిచిందన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. సిక్కు సోదరులది కీలకపాత్ర.. ‘సిక్కు సోదరులు దేశంలో ఎక్కడ ఉన్నా భారత సైన్యంలో ముందుంటూ దేశ రక్షణలో, వ్యవసాయంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నో వర్గాలకు చెందిన వారు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. సిక్కులు సహా అన్ని వర్గా ల్లోని పేదలకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం. సిక్కులకు తెలంగాణలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. కరీంనగర్ మేయర్ పదవి సిక్కు వర్గానికి చెందిన రవీందర్‌సింగ్‌కు ఇచ్చాం. నాందేడ్ తరహాలో నగరంలో గురుద్వార్ నిర్మిస్తాం’అని కేటీఆర్ అన్నా రు. సమావేశంలో ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, సలీం, సిక్కు ప్రతినిధి బగ్గా తదితరులు పాల్గొన్నారు. మతసామరస్యంలో దేశానికే ఆదర్శం.. ‘శాంతిభద్రతలు, మత సామరస్యంలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేయలేదు. మనిషిని మనిషిగా చూసిన ప్రభుత్వం మాది. పేదవారు ఏ వర్గంలో ఉన్నా వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో పథకాలు తెస్తున్నాం. తెలంగాణ రాకముందు ఉన్న విద్యుత్ సమస్యలను కొద్ది రోజులకే అధిగమించాం. వ్యవసాయానికి, ఇళ్లకు పరిశ్రమలకు నిరంతర కరెంటు ఇస్తున్నాం. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. మహిళల రక్షణ కోసం షీ–టీమ్స్ ఏర్పాటు చేశాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో మేలు చేస్తున్నాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు 30 నుంచి 50% వరకు పెరిగాయి. మిషన్‌భగీర«థతో ఇంటింటికీ నల్లాతో తాగునీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 17% వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరిస్తాం. రైతులకు ఎకరానికి ఇప్పుడు ఇస్తున్న రూ.8 వేలను రూ.10 వేలకు పెంచుతాం. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3,01 6 భృతి ఇవ్వాలని నిర్ణయించాం. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాం. వచ్చే ఏప్రిల్‌లోగా అవి పూర్తవుతాయి’అని వివరించారు. -
ఆత్మగౌరవానికి మళ్లీ పరీక్ష
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేతగాక ఆంధ్ర నుంచి చంద్రబాబును తెచ్చుకుందని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఇది మన ఆత్మగౌరవానికి మళ్లీ పరీక్ష అని పేర్కొన్నారు. తెలంగాణకు పరమ శత్రువు చంద్రబాబు.. మీ ఇంటికి వచ్చి మిమ్మల్నే కొడతామంటే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. 15 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 9 సభల్లో పాల్గొన్నారు. కామారెడ్డి, డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం), బోధన్, మోర్తాడ్ (బాల్కొండ), జగిత్యాల (ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల ఉమ్మడి సభ), కరీంనగర్ (మానకొండూరు, కరీంనగర్ ఉమ్మడి సభ), స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, వరంగల్ (వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల ఉమ్మడి సభ)లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ వలసాధిపత్యాన్ని మళ్లీ మన నెత్తిన రుద్ది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తోందని, ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ‘‘కాంగ్రెసోళ్లకు చేతకాక చంకల చంద్రబాబును ఎత్తుకుని వస్తుండ్రు. కొట్లాడి మనం తెలంగాణ తెచ్చుకుని అభివృద్ధి చేస్కుంటుంటే, కేసులతో మన ప్రాజెక్టులకు అడ్డంపడుతున్న బాబుతో ఈ కాంగ్రెసోళ్లు అంటకాగుతున్నరు. సిగ్గు, పౌరుషం లేకుండా చిల్లర అధికారం కోసం ఆంధ్ర నుంచి చంద్రబాబును అప్పు తెచ్చుకుంటారా? కాంగ్రెస్ నాయకులకు సిగ్గుందా? చీము, నెత్తురు, తెలంగాణ పౌరుషం ఉందా’’అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని, పొరపాటున ఏమైనా జరిగితే మన కళ్లను మన వేళ్లతోనే పొడుచుకున్నవారమవుతామని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణతి రాలేదన్నారు. పార్టీలు, నాయకులు గెలవడం ముఖ్యం కాదని, ప్రజలు గెలవాలని, ప్రజల అభీష్టం, వాంఛితం గెలవాలని వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్యే పోటీ... రాష్ట్రంలో ఇద్దరి మద్యే ప్రధాన పోటీ నెలకొందని.. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లు ఉద్యమం చేసి.. తెలంగాణ సాధించి నాలుగేళ్లు పాలించిన టీఆర్ఎస్కు కాంగ్రెస్, కూటమి అభ్యర్థులే పోటీగా ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘58 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, టీడీపీ ఏం చేసినయో మీ ముందు ఉంది. టీఆర్ఎస్ ఏం చేసిందో మీ ముందు ఉంది.. మేం చెప్పేది వినండి, ఎదుటి వాళ్లు చెప్పేది వినండి.. ఈ అంశాలను గ్రామాలలో చర్చించండి.. తెలంగాణను దోచుకున్నది, అరిగోస పెట్టింది కాక.. ఇప్పుడు తెలంగాణను మళ్లీ ఆగం చేసే కుట్రతో కూటమిగా ప్రజల్లోకి వస్తున్నవారిని నమ్ముతామా? వాళ్లకు సరైన బుద్ది చెప్పడమే కరెక్ట్’’అని కేసీఆర్ స్పష్టంచేశారు. ‘‘చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను నేనే కట్టిన అంటడు, ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్‌ను నిలిపినా అంటడు. మరి ఆయన కాలంలో కరెంటు ఎందుకు లేకపాయె’’అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో గ్రామాల్లో, పట్టణాల్లో కరెంట్ ఏ విధంగా ఉంది.. ఈ రోజు ఎలా ఉంది ఆలోచన చేయాలని కోరారు. దేశంలో రైతాంగానికి 24 గంటల విద్యుత్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని పేర్కొన్నారు. కరెంటు తలసరి సగటు వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నాం... అనేక అంశాల్లో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు ఉన్నట్టు కేంద్రమే చెబుతోందని కేసీఆర్ తెలిపారు. మన రాష్ట్ర వృద్ధి రేటు 14 నుంచి 17.17కు పెరిగి ప్రస్తుతం 19.83 శాతంగా ఉందని, ఇది దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాలేదని పేర్కొన్నారు. మనం దూసుకుపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోతోందని, ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించిన తాజా నివేదిక అని వెల్లడించారు. ప్రతి ఏటా మన రాష్ట్ర అదనపు ఆదాయం రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు పెరుగుతోందని తెలిపారు. కరీంనగర్ తెలంగాణకే తలమానికం... కరీంనగర్ తెలంగాణకు తలమానికం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా కరీంనగర్ మారిందని పేర్కొన్నారు. 2001 మే 17న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలోనే ‘సింహగర్జన’ద్వారా తెలంగాణ ఉద్యమానికి నాంది పడిందని, అందుకే ఈ గ్రౌండ్‌కు వస్తే తనకు కొత్త ఉత్సాహం వస్తుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి, వరంగల్‌కు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. కేసీఆర్ పిలుపునిస్తే జెండా కింద పడకుండా కాపాడిన ఘనత వరంగల్‌కు ఉందని కేసీఆర్ కొనియాడారు. నా భూమి కూడా పడావుగా ఉంది.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు కిందికి కాకుండా మీదికి రావాల్సిన అవసరం ఉందని, ఈ ప్రాజెక్టు పూర్తయి మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ పునరుజ్జీవం, వరదకాల్వల తదితర ప్రాజెక్టుల కింద 365 రోజులు అలుగులు పారుతాయన్నారు. ‘‘పేరుకు సీఎంనైనా నేను కూడా రైతునే.. నాకు కూడా వ్యవసాయం ఉంది.. నా 60 ఎకరాల భూమి కూడా పడావుగా ఉంది. నీళ్లుంటేనే సాగు చేయవచ్చు.. తుపాకీ ఉంది గానీ మందుగుండు లేదు.. వచ్చే ఏడాది నాటికి నా భూమితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న బీడు భూములకు సాగునీటిని అందిస్తాం’’అని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ గాలి వీస్తోంది.. ‘‘తెలంగాణలో భయంకరమైన సుడిగాలి వీస్తోంది. టీఆర్ఎస్ వేవ్ కనిపిస్తోంది. రాష్ట్రం నలుదిక్కులు ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ఎక్కడైనా టీఆర్ఎస్కు పాజిటివ్ వేవ్ కనిపిస్తోంది.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు’’అని కేసీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో వందకు పైగా సీట్లు గెలుస్తామని ఆయన పునరుద్ఘాటించారు. పరకాలలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌కు సంఘీభావం తెలుపుతూ చేతులెత్తిన మహిళలు రిజర్వేషన్లు ఎలా ఇవ్వరో చూస్తాం.. ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు తెచ్చి తీరుతామని కేసీఆర్ స్పష్టంచేశారు. యుద్ధం చేసి తెలంగాణ తెచ్చినట్లే ఈ రిజర్వేషన్లు సాధిస్తామని పునరుద్ఘాటించారు. ‘‘బిచ్చమెత్తుకుంటే రిజర్వేషన్లు ఇవ్వరు.. కొట్లాడి తెచ్చుకుంటాం.. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా, 16 ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంటుంది.. ఇండియాలో రాబోయేది ఫెడరల్ ఫ్రంట్.. ముస్లింలు, గిరిజనులకు ఒక్కటే హామీ ఇస్తున్న.. తెలంగాణ తెచ్చినట్లే రిజర్వేషన్లు సాధిస్తాం’’అని కేసీఆర్ హామీనిచ్చారు. ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపైనా కేసీఆర్ స్పందించారు. రిజర్వేషన్లు ఎలా ఇవ్వరో చూస్తాం అని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మతం బీమారి ఉందని విమర్శించారు. -
‘ప్రజలకు జవాబుదారీ కోసమే కామన్ మేనిఫెస్టో’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో చిన్నాభిన్నమైన అన్ని వ్యవస్థలను పటిష్టం చేసేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపిందించామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోల్కొండ హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ నేత పళ్లా వెంకట్ రెడ్డిలతో కలిసి మహాకూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్(ఉమ్మడి ప్రణాళిక)ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. పది భాగాలుగా పలు అంశాలతో కామన్ మేనిఫెస్టో విడుదల చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ది విస్తరిస్తామని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయరంగం బలోపేతం, సంక్షేమ రంగాన్ని సైతం మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. మాది ‘ప్రజా ఫ్రంట్’: ఉత్తమ్ టీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన కూటమికి ‘ప్రజా ఫ్రంట్’గా నామకరణం చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నుంచి అందరూ అలాగే అభివర్ణించాలని ఆయన కోరారు. అన్ని పార్టీలు ఒప్పుకున్న వాటిని కామన్ మినిమమ్ ప్రోగ్రాంను విడుదల చేస్తున్నామన్నారు. అందరి ఆశీర్వాదంతో తమ కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోదండరాం కన్వీనర్‌గా కేబినెట్ హోదాలో మేనిఫేస్టో అమలుకు కృషి చేస్తారని ఉత్తమ్ తెలిపారు. విధానపరమైన డాక్యుమెంట్ అని ఎన్నికల నాటికి అవసరమైన మరిన్ని జోడించి ప్రజల్లోకి వెళతామని రమణ వివరించారు. కామన్ మేనిఫెస్టోతో ప్రజలకు జవాబుదారీ భరోసా కల్పిస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. -
ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలని స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కాంగ్రెస్ తోకపార్టీగా మార్చడంతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రె స్ ముందు టీడీపీ మోకరిల్లడంతో చంద్ర బాబు ఎన్టీఆర్‌ను మరోసారి వెన్నుపోటు పొడిచినట్లైందని ఆయన విమర్శించారు. కూకట్పల్లి నియోజకవర్గం లో శనివారం ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంఘీభావంగా సీమాంధ్రులు ఏర్పాటు చేసిన ‘హమారా హైదరాబాద్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరిపైనా వివక్ష చూపలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు శాంతి భద్రతల విషయంలో దుష్ప్రచారం చేశారని, టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఎక్కడైనా పొరపాట్లు జరిగాయా అని ప్రశ్నిం చారు. టీఆర్ఎస్ను ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీకి విజయాన్ని అందించారని గుర్తు చేశారు. కేసీఆర్ సింహంలాంటి వాడు... టీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేకే నాలుగు పార్టీల నేతలు కలిసి కూటమి కట్టారని, సింహం లాంటి సీఎం కేసీఆర్ ఎన్నికల్లో సింగిల్‌గానే వస్తున్నారని మంత్రి కేటీఆర్ చమత్కరించారు. డిసెంబర్ 11 తర్వాత రాహుల్ గాంధీ వీణ, చంద్రబాబు ఫిడేల్ వాయించుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ సీమాంధ్రుల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. జగన్ దాడిపై స్పందిస్తే ఇంత రాద్ధాంతమా? ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాడి జరిగిన సమయంలో తాను సిరిసిల్లలో ఓ కార్యక్రమంలో ఉండగా పీఏ వచ్చి దాడి గురించి చెప్పారని కేటీఆర్ వివరించారు. జగన్‌పై దాడిని ఖండిస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని మధ్యాహ్నం 3.35 నిమిషాలకు తాను ట్వీట్ చేశానని, ఆ వెంటనే కేసీఆర్, కేటీఆర్, పవన్, ప్రధాని మోదీ కలిసి పోయారని ఏపీ సీఎం చంద్రబాబు ఒకటే రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. సాటి మనిషిపై దాడి జరిగితే మానవీయంగా స్పందించడం తప్పా అని ప్రశ్నించారు. తన కంటే గంట ముందే చంద్రబాబు కుమారుడు లోకేశ్ జగన్‌పై దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశాడని.. అంటే లోకేశ్ కూడా మాతో కలిసిపోయినట్లేనా అని ప్రశ్నించారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంఘటన జరిగినప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారని..దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేశారని విమర్శించారు. అమరావతిని ఎందుకు కట్టలేకపోయాడు? తొమ్మిదేళ్లలో హైదరాబాద్‌ను తానే కట్టానని చెబుతున్న చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లలో అమరావ తిని ఎందుకు నిర్మించలేకపోయాడని కేటీఆర్ ప్రశ్నిం చారు. తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధి మీద దృష్టి పెడితే ఆంధ్రాలో చంద్రబాబు గ్రాఫిక్స్ మీద దృష్టి పెట్టారన్నారు. ఆంధ్రాలో అభివృద్ధి గ్రాఫిక్స్ మీదే తప్ప వాస్తవ రూపంలో కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు... అధికారం కోసం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలోనే నెగ్గలేడని, ఇక్కడక్కొచ్చి ఏం చేయగలడని ఎద్దేవా చేశారు. ఇటువంటి వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం కూకట్పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ప్రతినిధులు సినీనటుడు, వైఎస్సార్ సీపీ నేత విజయచందర్ తదితరులు పాల్గొన్నారు. శాంతిభద్రతల్లో నం.1గా హైదరాబాద్ శాంతిభద్రతల విషయంలో దేశంలోనే హైదరాబాద్ నంబర్ వన్‌గా నిలించిందని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకునే సీమాంధ్రులంతా ఈ నాలుగున్నరేళ్లు సంతోషంగా జీవించారని చెప్పారు. అందరం అభివృద్ధి చెందాలంటే నగరంలోని సీమాంధ్రులం తా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కేటీఆర్ కోరారు. -
స్వానుభవమే గీటురాయి
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోలింగ్‌కు రెండు వారాల వ్యవధి కూడా లేదు. నామినేషన్లూ, బుజ్జగింపులూ, ఉపసంహరణల పర్వం పూర్తయింది. ప్రచారం తారస్థాయికి చేరుకున్నది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకే వేదికపై కనిపించి వేలాదిమంది సభికులకు కనువిందు చేసి వెళ్ళి పోయారు. తెలంగాణ రాష్ట్రంలో సోనియా అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ఆప ద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) వరుస సభలతో దుమ్మురేపుతున్నారు. హరీష్‌రావు, కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) క్షణం తీరికలేకుండా తిరుగుతున్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల సభలో ప్రసంగించబోతున్నారు. 2014 నాటి ఎన్నికలకీ, ఈ ఎన్నికలకీ పోలిక లేదు. అప్పటి సమీకరణాలు ఇప్పుడు లేవు. నాటి పరిస్థితులు నేడు లేవు. నాలుగున్నర సంవత్సరాల కిందట ఎన్నికలు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తో పాటు తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్ఆర్సీపీ కూడా పూర్తి స్థాయిలో పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్‌తో సీపీఐ కూటమి కట్టింది. సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది. నాడు టీడీపీ, బీజేపీ, పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ఒక కూటమిలో భాగ స్వామ్య పక్షాలు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు. ఆయన పరిపాలనాదక్షత ఏపా టిదో ప్రజలకు తెలియదు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్ళు ప్రతిపక్ష నేతగా అనుభవం గడించారు. ఇవి తెలం గాణ రాష్ట్రంలో తొలి ఎన్నికలు. బీజేపీతో టీడీపీ మైత్రీబంధం తెగిపోయింది. టీడీపీ ఆజన్మవిరోధి కాంగ్రెస్‌తో కలిసి కూటమి కట్టింది. అందులో ప్రొఫెసర్ కోదండరామ్ పెట్టిన తెలంగాణ జన సమితి (టీజేఎస్), సీపీఐలకు భాగ స్వామ్యం ఉన్నది. సీపీఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్నది. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తూ మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య అనుబంధం ఉన్నది. వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికలకు దూరం. జనసేన పోటీలో లేదు. 52 మాసాల కేసీఆర్ పాలనలోని మంచిచెడులు ప్రజల ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాఫల్య వైఫల్యాలు అందరికీ తెలుసు. సోనియా సహకారం శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో జరిగిన పెద్ద బహిరంగ సభలో సోనియాగాంధీ ప్రసంగంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఆమె ప్రసంగం కూటమికి కొత్త ఊపు ఇచ్చిందనీ, ఉత్సాహం నింపిందనీ కొంతమంది వ్యాఖ్యానిస్తే. సోనియా భాషణం చప్పగా ఉన్నదని మరి కొందరు చప్పరి స్తున్నారు. రాహుల్ క్లుప్తంగా మాట్లాడటాన్ని తప్పుపడుతున్నారు. వాస్తవానికి సోనియా సభ నాలుగున్నర సంవత్సరాలు ఆలస్యంగా జరిగింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును రాజ్యసభ ఆమోదించిన తర్వాత వారంరోజుల్లో హైదరాబాద్‌లో పెద్ద సభ నిర్వహించి సోనియాగాంధీని ఆహ్వానించి ఉన్నట్ల యితే తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి మంజూరు చేసినందుకు ప్రతిఫలం కాంగ్రెస్‌కి దక్కేది. అప్పటికి పదేళ్ళు మంత్రి పదవులు అనుభవించిన కాంగ్రెస్ నాయకు లలో ఒక్కరు కూడా నడుం బిగించలేదు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అట్టహాసంగా వచ్చిన కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇంటికి పెద్ద ఊరేగింపులో చేరడానికి ఆరేడు గంటలు పట్టింది. ఆ రోజే తెలంగాణ ఇచ్చిన పార్టీ కంటే తెచ్చిన పార్టీకే ప్రజలు పట్టం కడతారని తేలిపోయింది. శుక్రవారం సభ సైతం అంత భారీగా జరగడానికి టీడీపీ నుంచి కొన్ని మాసాల కిందట కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి చొరవ కారణం. ఎన్నికలు ప్రస్తుతం అయిదు రాష్ట్రాలలో జరుగుతున్నప్పటికీ సోనియాగాంధీ మరే రాష్ట్రానికీ వెళ్ళడం లేదు. కాంగ్రెస్ నాయకత్వం విన్నపాన్ని మన్నించి ఆరోగ్యం సహకరించకపోయినా హైదరాబాద్‌కు ప్రత్యేకంగా వచ్చారు. ఆ సభ లక్ష్యం నెరవేరింది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక భేష్ రాహుల్‌గాంధీ సాధించిన చిరువిజయాలు ముందుగా చెప్పుకోవాలి. ఎంత ఒత్తిడి వచ్చినా టీపీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కొనసాగించడం చెప్పుకోదగిన అంశం. పార్టీ అభ్యర్థులను నిర్ణయించిన తీరు గతం కంటే చాలా నయం. పెక్కు వడబోతల అనంతరం యోగ్యులైన అభ్యర్థులకే టికెట్లు లభించాయని చెప్పవచ్చు. టీజేఎస్‌కు కేటాయించిన కొన్ని స్థానాలలో పోటీ పెట్టడం, టీడీపీని 13 స్థానాలకు పరిమితం చేయడం విశేషం. ఈసారి కాంగ్రెస్ నాయ కత్వం వ్యవహరించిన తీరులో క్షేత్రవాస్తవికతకు సంబంధించిన స్పృహ కని పిస్తున్నది. మొత్తంమీద 99 స్థానాలలో అభ్యర్థులను నిలిపింది. అధికారంలో ఉన్న పార్టీలో, అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీలో టికెట్టు ఆశించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. టికెట్టు దక్కని అసమ్మతి నేతలు తిరుగుబాటు చేయడం, పార్టీ ఫిరాయించడం లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం సర్వసాధారణం. టీడీపీ చంద్రబాబు సొంత సంస్థ కనుక ఆయన శక్తియుక్తులన్నీ ప్రయోగించి అసమ్మతివాదులకు ఉపశమనం కలిగిస్తారు. టీఆర్ఎస్లో ఆ పని కేటీఆర్ చేశారు. కాంగ్రెస్‌లో అసమ్మతివాదులను శాంతింజేయడానికి అంత తీవ్రమైన ప్రయత్నం జరగదు. ఈ సారి మాత్రం పకడ్బందీగా జరిగింది. అహమ్మద్ పటేల్, జైరాంరమేశ్ వంటి జాతీయ స్థాయి నాయకులూ, తమిళనాడు, కర్ణాట కకు చెందిన సీనియర్ నాయకులూ హైదరాబాద్‌లో మకాం పెట్టి అసమ్మతి నాయకుల ఇళ్ళకు వెళ్ళి బతిమిలాడి, బామిలాడి పోటీ నుంచి ఉపసంహరింప జేశారు. గతంలో పోల్చితే కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్య తక్కువే. అసమ్మతివాదులకు నచ్చజెప్పడానికి ఇంత పెద్ద స్థాయిలో కృషి జరగడం ఇటీవలి కాంగ్రెస్ చరిత్రలో ఇదే మొదటిసారి. టీఆర్ఎస్ సర్కార్ పట్ల వ్యతిరేకత లేకపోలేదు. కాంగ్రెస్ మరింత శ్రద్ధతో ఎన్నికలకు సిద్ధమై, టీజేఎస్, సీపీఐ కూటమితో సరిపెట్టుకుంటే టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వగలిగేది. ఏ కారణం చేతనో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించుకు న్నది. ఫలితంగా కేసీఆర్ చేతికి బలమైన ఆయుధం లభించింది. ‘తెలంగాణకు చంద్రబాబునాయుడు అవసరమా?;’ అంటూ ప్రతి ఎన్నికల సభలో ప్రజలను అడిగి కెమెరాలూ, మైకులూ సభికులవైపు తిప్పమంటూ టీవీ జర్నలిస్టులను కేసీఆర్ అడుగుతున్నారు. తెలంగాణ ప్రజల మనోగతం ప్రపంచానికి తెలియా లని అంటున్నారు. కూటమి ‘పొరబాటున’ గెలిచినా ఢిల్లీకీ, అమరావతికీ గులా ములే పాలకులు అవుతారంటూ హెచ్చించే అవకాశం కేసీఆర్‌కి కాంగ్రెస్ ఇచ్చింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సూర్జేవాలా కేసీఆర్ ప్రభు త్వంపైన చార్జిషీట్‌తో ధ్వజమెత్తుతూ, నోట్లరద్దునూ, గబ్బర్‌సింగ్ టాక్స్ (జీఎస్ టీ)ని సమర్థించినవారిలో ప్ర«థముడు తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. నిజమే కానీ, నోట్లు రద్దు చేయమంటూ ప్రధాని నరేంద్రమోదీకి తానే సలహా చెప్పానంటూ ప్రస్తుతం కాంగ్రెస్ మిత్రుడు, బీజేపీ మాజీ స్నేహితుడు చంద్ర బాబునాయుడు గొప్పలు చెప్పుకున్నారు. జీఎస్టీని సైతం ఆయన సంపూ ర్ణంగా సమర్థించారు. ఆ విషయం మాట్లాడకుండా కేసీఆర్‌ని మాత్రమే నిందిస్తే విశ్వసనీయత ఉండదు. అవినీతి ఆరోపణలూ అంతే. కేసీఆర్ కుటుంబ పాలన గురించి బీజేపీ నాయకులు విమర్శిస్తే అర్థం ఉంటుంది. సోనియాగాంధీ తప్పు బడితే పొసగదు. వంశ పాలనే లేకపోతే ఇటలీలో పుట్టి ఇండియాలో మెట్టిన సోనియాగాంధీ 1983లో భారత పౌరసత్వం స్వీకరించి 1998లో ఏఐసీసీ అధ్యక్ష పదవిని పొందగలిగేవారా? కాంగ్రెస్ పార్టీకి అత్యంత దీర్ఘకాలం (ఇరవై ఏళ్ళు) అధ్యక్షురాలిగా ఉండగలిగేవారా? తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ సోనియా ప్రకటించడాన్ని టీఆర్ఎస్ ప్రచారానికి వినియోగించుకుంటుంది. సాఫల్య వైఫల్యాలు తన తెలంగాణ బిడ్డలు తల్లడిల్లి పోతున్నారంటూ సోనియాగాంధీ ఆవేదన వెలి బుచ్చడం కాస్త కృతకంగా కనిపించింది. నిజమే. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు సమ్మతిస్తే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని తెలిసి కూడా సోనియా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మాట ఎవ్వరూ కాదనలేరు. టీఆర్ఎస్ 2014 ఎన్నికలలో చేసిన వాగ్దానాలలో కొన్నింటిని కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చని మాట వాస్తవం. ఉద్యోగ కల్పనలో వైఫల్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. యువతను ఆందోళనకు గురిచేస్తున్నది. రెండు పడకగదుల ఇళ్ళూ, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల వంతున భూములు మంజూరు చేయడం వంటి కార్యక్రమాలు పాక్షికంగానే అమలైనాయి. చేసిన ప్రతి వాగ్దానం నూటికి నూరు పాళ్ళూ అమలు కావాలనుకోవడంలో తప్పు లేదు కానీ అది అయిదేళ్ళ వ్యవధిలో జరగడం అసాధ్యం. కేసీఆర్ ప్రచారంలో పేర్కొంటున్న విజయాలలో రోజుకు ఇరవైనాలుగు గంటలసేపు నాణ్యమైన విద్యుత్తు అందించడం ప్రధానమైనది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అక్కడ చీకటి రాజ్యం చేస్తుందని హెచ్చరించడాన్ని కేసీఆర్ అదేపనిగా ఉటంకిస్తున్నారు. మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, కాళే శ్వరం ప్రాజెక్టు వంటి బృహత్తరమైన పథకాలు జయప్రదంగా అమలు జరుగు తున్న వాస్తవాన్ని కాదనలేము. ఐటీ రంగంలో జరుగుతున్న అభివృద్ధి కని పిస్తున్నది. హక్కులకు భంగం కలుగుతున్నదనే భావన బలంగా ఉన్నప్పటికీ శాంతిభద్రతల పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం రైతులకు అందించడం ప్రశంసార్హం. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు అనేకం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకరువు పెడుతున్నారు. వాటన్నిటినీ ప్రజలు ఆలకిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దంటూ కూటమి నాయకులు కరాఖండిగా చెబుతున్నారు. అహంకారి అనీ, ప్రజలకు అందుబాటులో ఉండరనీ, సచివాలయంలో అడుగుపెట్టకుండానే పదవీకాలం పూర్తి చేసుకుంటున్న ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారనీ, జాతకాలూ, వాస్తు వంటి నమ్మకాలు మితిమీరి పోతున్నాయనీ, నిరంకుశ పాల కుడనీ, మంత్రివర్గంలో ఒక్క మహిళకు సైతం చోటు కల్పించలేదనీ కేసీఆర్‌పైన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ప్రజలు వింటున్నారు. చర్చనీయాంశమైన వ్యాఖ్య అభ్యర్థుల యోగ్యత ఏ విధంగా ఉన్నప్పటికీ తన పట్ల ఉన్న ప్రజాదరణ వారిని గెలిపిస్తుందనే విశ్వాసంతో కేసీఆర్ ముందస్తుకు వెళ్ళారు. ‘గెలిపిస్తే గట్టిగా పనిచేస్తాం. ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటాం,’ అంటూ ఖానాపూర్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యను ప్రజలు అపార్థం చేసుకునే అవకాశాలే అధికం. ఓటమి భయం కేసీఆర్‌ను వెన్నాడుతూ ఆ విధంగా మాట్లాడించిందని కొందరూ, అది మనో వైజ్ఞానిక దబాయింపు (ఎమోషనల్ బ్లాక్మెయిల్) అని కొందరూ విశ్లేషించారు. ‘నన్ను ఎన్నుకుంటే కృతజ్ఞుడినై ఉంటాను. లేకపోయినా అంతే (If elected I shall be thankful; if not, it will be the same),’ అంటూ అమెరికా అధ్య క్షుడు అబ్రహాం లింకన్ చేసిన వ్యాఖ్య ఈ సందర్భానికి సరిపోతుంది. తనను ఓడిస్తే ప్రజలే నష్టపోతారని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ సందేశం సవ్యంగా అందలేదు. నరేంద్రమోదీకి హిందూ–ముస్లి బీమారీ (వ్యాధి) ఉన్నదంటూ నిర్మల్ సభలో కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని జాతీయ స్థాయిలో టీవీలు విస్తృ తంగా ప్రచారం చేశాయి. బీజేపీకీ, టీఆర్ఎస్కీ రహస్య మైత్రి ఉన్నదంటూ ప్రత్యర్థులు ఊదరకొడుతున్నదానికి విరుగుడుగా కేసీఆర్ ఆ వ్యాఖ్యానం ఉద్దేశ పూర్వకంగానే చేసి ఉంటారు. పోటాపోటీగా జరుగుతున్న ఎన్నికలలో ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, ఎత్తుకు పైఎత్తు వేయడం సహజం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తమ జీవితా లలో ఎటువంటి మార్పు వచ్చిందో సమీక్షించుకొని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవలసింది ప్రజలే. పార్టీలు ఎంత ధాటిగా ప్రచారం చేసినా, నాయ కులు ఎంత ఘాటుగా ప్రసంగాలు చేసినా, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేసి అరచేతిలో వైకుంఠం చూపించినా, మీడియా ప్రాధమ్యాలు ఎట్లా ఉన్నా ప్రజలు స్వానుభవం ప్రాతిపదికగానే ఏ పార్టీకి ఓటు వేయాలో, ఏ అభ్యర్థిని గెలిపించాలో లేదా ఓడించాలో నిర్ణయించుకుంటారు. కె. రామచంద్రమూర్తి -
ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించారు: రేవంత్
సాక్షి, హైదరాబాద్ : ‘గెలిపిస్తే సేవ.. లేకుంటే వ్రిశ్రాంతి’ అని పేర్కొన్న తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మవద్దని ప్రజాకూటమి నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం మేడ్చల్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌పై, టీఆర్ఎస్ పాలనపై ప్రజా కూటమి నేతలు నిప్పులు చెరిగారు. ఇంకా ప్రజా కూటమి నేతల ఏమన్నారంటే.. కేసీఆర్ మాటలపై అప్రమత్తంగా ఉండాలి- రేవంత్ ‘నన్ను ఓడిస్తే ఫాంహౌస్‌లో పడుకుంటానని కేసీఆర్ అంటున్నడు. మరోపక్క నేను అమెరికాకు పోతానని కేటీఆర్ అంటున్నడు. కేసీఆర్ మాటలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా, ప్రజలతో ఉండేది కాంగ్రెస్ మాత్రమే. 2004లో రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంట్, ఉద్యోగాలు, ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదు, దళితులకు మూడెకరాలు, రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటాన్ని, ఆత్మబలిదానాలను గుర్తించి సోనియా రాష్ట్రం ఇస్తే, ఆ రాష్ట్రంలో సీఎం అయిన కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించారు. అటువంటి కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలి అమ్మా.. నీ రుణం తీర్చుకుంటాం- భట్టి విక్రమార్క తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కలను సోనియా నిజం చేశారు. తెలంగాణలోని వనరులన్నీ నాలుగు కోట్ల ప్రజలకు సమానంగా పంచాలనే ఆలోచనతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. సోనియమ్మ రుణాన్ని ఏ రకంగా తీర్చుకున్నా తక్కువేనని, అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించి కొంతలోకొంత రుణాన్ని తీర్చుకుంటాం. ఎందరో ఆగ్రహాల్ని చల్లార్చి తెలంగాణకు విముక్తి కలిగించారు. మీ రుణం తీర్చుకుంటామని కార్తీక పౌర్ణమిన శపథం చేస్తున్నాం. నిర్బంధాలు, ఆంక్షలు, ఎన్కౌంటర్లు, అవినీతి లేని తెలంగాణ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం కేసీఆర్‌కు ఓటేస్తే బురదగుంటలో వేసినట్లే- కోదండరాం తనకు ఓటేయకుంటే ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకుంటా అని కేసీఆర్ అంటున్నడు. ఆయనకు ఓటేసినా, వేయకున్నా ఫాంహౌస్‌లోనే పడుకుంటడు. ఎటుదిరిగి ఫాంహౌస్‌కి వెళ్లే కేసీఆర్‌కి ఓటేసి వృథా. టీఆర్ఎస్కి ఓటేస్తే బురదగుంటలో వేసినట్లే. అలాంటి ఓటు వృథా పోకూడదంటే ప్రజలందరూ కూటమికి ఓటెయ్యాలి. ఈ నియంతృత్వ, నిరంకుశ పాలనకు సమాధి కట్టాలి. టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క పక్షానికి మంచి జరుగలేదు. నిరుద్యోగులను వంచించారు. నోటిఫికేషన్ ఇవ్వలేదు. రైతులకు బేడీలు వేశారు. ఇసుక మాఫీయాపై తిరగబడ్డ దళితులను అరెస్ట్ చేశారు. ఈ నియంతృత్వ పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైంది. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. వాటికి లొంగకుండా మీ కోసం పనిచేసే కూటమి పక్షాన నిలవాలని కోరుతున్నా. ఓటమి ఖాయమని కేసీఆర్‌కు తెలిసిపోయింది- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 100 సీట్లు గెలుస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోతే ఫాంహౌస్‌కు పోతా అంటున్నరు. 15 రోజుల ముందే తెలంగాణ తీర్పు కేసీఆర్‌కు అర్థమైంది. ఓటమి ఖాయమని తెలిసిపోయింది. అందుకే ఫింఛన్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొడుతున్నరు. కేసీఆర్ పాలనలో వేల కోట్లు దోచుకున్నడు. ఆ డబ్బుతో గెలవాలని చూస్తున్నడు. ఎంత డబ్బు పంచినా కాంగ్రెస్ గెలుపు ఖాయం. ప్రజాకంటక పాలనను తరిమికొట్టాలి- ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం కాదు కదా.. ఊరికో ఉద్యోగం రాలేదు. మేము చదువుకుంటమని బడుగు, బలహీన వర్గాలు అంటుంటే, మీరు గొర్లు, బర్ల కాడికి పోవాలని, చేపలు పట్టాలని కేసీఆర్ అంటుండు. ఇటువంటి ప్రజా కంటక పాలనను తరిమికొట్టాలి. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు రాహుల్ సమ్మతించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేందుకు, చట్టసభల్లో రాజ్యాధికారం ఇచ్చేందుకు అంగీకరించారు. బీసీలు, ఇతర వర్గాలన్నీ కూటమి పక్షాన ఉండాలి. కేసీఆర్ పారిపోతున్నడు- చాడ వెంకట్‌రెడ్డి సోనియా పుణ్యంతోనే తెలంగాణ ఏర్పడింది. వచ్చిన తెలంగాణ గడీల పాలైంది. నియంతృత్వ, నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్య పాలనకు పాతరేశారు. ఈ ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసమేనని కేసీఆర్ అంటున్నరంటే ఆయన పారిపోతున్నడు అని తెలుస్తోంది. డిసెంబర్ 11తో కూటమి ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఈ కూటమే డిసెంబర్ 11న అధికారంలోకి వచ్చేలా.. కేసీఆర్‌ను పారదోలేలా ప్రజలంతా కంకణబద్ధులు కావాలి. -
కలలన్నీ కల్లలే!
రాష్ట్ర సాధన సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తులు నా ముందున్నాయి. కానీ, తెలంగాణ ప్రజల ఉద్యమస్ఫూర్తిని చూసి ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న నిర్ణయానికి వచ్చాం. దీంతో కాంగ్రెస్‌కు ఏపీలో ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసు. అయినా, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చాం. – సోనియా గాంధీ సాక్షి, హైదరాబాద్ :‘‘నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదు. కేవలం కుటుంబం కోసం పనిచేస్తూ, తెలంగాణలో పరిపాలనను విస్మరించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి’’అని యుపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ పిలుపునిచ్చారు. శుక్రవారం మేడ్చల్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొంతకాలం తర్వాత తన సంతానాన్ని చూస్తే ఒక తల్లి ఎంతగా సంబరపడుతుందో, తాను కూడా తెలంగాణ ప్రజలను కలుసుకుంటున్నందుకు అంతే ఆనందపడుతున్నానని పేర్కొన్నారు. ప్రతి తల్లి తన సంతానం సుఖసంతోషాలతో దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటుందని, అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా జరగడంతో ఓ తల్లిగా తానెంతో దుఃఖించినట్టు చెప్పారు. ఈ ప్రస్తావన సందర్భంగా ఆమె గొంతు కొద్దిగా జీరపోయి, పూడుకుపోయిన స్వరంతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో నాకు ఇంకా గుర్తుంది. ఆ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తులు నా ముందున్నాయి. కానీ, తెలంగాణ ప్రజల ఉద్యమస్ఫూర్తి, పోరాట పటిమను చూసి అప్పటి ప్రధాని మన్మోహన్, రాహుల్‌గాంధీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎంత నష్టం వాటిల్లుతుందో మాకు తెలుసు. అయినా, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకే మొగ్గుచూపాం’’అని వివరించారు. అదే సమయంలో ఆంధ్రపదేశ్ ప్రజల ప్రయోజనాలను విస్మరించలేదన్నారు. వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక హోదాను ప్రతిపాదించామని, పార్లమెంటులో ప్రకటన కూడా చేశామని గుర్తుచేశారు. ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని సభ సాక్షిగా వాగ్దానం చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో ప్రతీ బిడ్డా అన్ని విధాలుగా దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. తెలంగాణ బిడ్డలకు ఏం దక్కింది? ఏ కలల కోసమైతే, ఏ ఆకాంక్షల సాధన కోసమైతే తెలంగాణ బిడ్డలు పోరాడారో అవేమీ దక్కలేదని సోనియాగాంధీ పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదని.. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. సాగునీటి కోసం రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ హయాంలో రూపొందిన భూసేకరణ చట్టాన్ని నీరుగార్చిన టీఆర్ఎస్ సర్కారు రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సైతం ఈ ప్రభుత్వం నీరుగార్చిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలంతా తీవ్ర నిరాశలో ఉన్నారని.. ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. ‘‘ఇక్కడి స్వయం సహాయక మహిళా బృందాలను చూసి గర్వపడేదాన్ని. ఇతర రాష్ట్రాలకు వెళ్లినపుడు వీరి గురించి గొప్పగా చెప్పేదాన్ని. కానీ, ఇప్పుడు వీరి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. రాష్ట్రంలో ప్రజల ఈ దుస్థితికి ముమ్మాటికీ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యమే కారణం’’అని మండిపడ్డారు. దళిత, ఆదివాసీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. యువత, నిరుద్యోగులు, మహిళలు, సంక్షేమాన్ని విస్మరించి కేవలం తన కుటుంబం కోసమే పనిచేశారని ఆరోపించారు. గెలిపించిన ప్రజల పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం విశ్వసనీయత లేదని విమర్శించారు. పిల్లల పెంపకంలో లోపం ఉంటే చిన్నారుల భవిష్యత్తు పాడవుతుందని.. ఇపుడు టీఆర్ఎస్ నాలుగన్నరేళ్ల పాలన కారణంగా తెలంగాణ పౌరుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రతిష్టాత్మమైనవి, నిర్ణయాత్మకమైనవని.. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు న్యాయం చేసేలా అన్ని వర్గాల సంక్షేమానికి స్పష్టమైన హామీలు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమస్ఫూర్తితో ఇపుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. లోతుగా ఆలోచించి, విశ్లేషించి కూటమికి ఓటేయాలని సూచిస్తూ.. జైహింద్, జై తెలంగాణ అన్న నినాదాలతో సోనియా తన ప్రసంగాన్ని ముగించారు. టీఆర్ఎస్ పాలన ముగియబోతోంది: రాహుల్ ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో సోనియాగాంధీ తెలంగాణ ప్రజల వెంట నిలిచారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. తెలంగాణను ప్రజలు ఉద్యమం, చెమట, రక్తమోడి సాధించుకున్న రాష్ట్రంగా అభివర్ణించారు. ఉద్యమ సమయంలో సోనియాగాంధీ చూపించిన సహకారం మరువలేనిదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ముగియబోతోందని.. ఈ లక్ష్యం కోసమే కాంగ్రెస్‌తో టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఒక్కటయ్యాయని రాహుల్ వివరించారు. తెలంగాణ ప్రజల కలల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చలేని ప్రభుత్వాన్ని అంతమొందించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఏనాడూ ప్రజల కోసం పనిచేయలేదని, కేవలం కుటుంబం కోసమే పరిపాలన సాగించారని ఆరోపించారు. కానీ, రాబోయే ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. రైతుల కష్టాలు తీరుస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రజల ఆకాంక్షలను చేరుకునేలా పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ను బొందపెట్టాలి: ఉత్తమ్ నాలుగన్నరేళ్లపాటు పాలించిన టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలని, గోరీ కట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చేది ముమ్మాటికీ ప్రజాకూటమి ప్రభుత్వమేనని «ధీమా వ్యక్తంచేశారు. అందుకే ప్రజలంతా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ, లక్షలాది ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామని స్పష్టంచేశారు. రూ.1,000 పింఛన్‌ను రూ.2,000కు, రూ.1,500 పింఛన్‌ను రూ.3,000కు పెంచుతామని హామీ ఇచ్చా రు. కూటమిపై కేసీఆర్ చేస్తున్న పిచ్చి ఆరోపణల్ని నమ్మొద్దని ప్రజల్ని కోరారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టుల కోసం ప్రధానిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. దాసోజు అనువాదం..: చాలాకాలం తర్వాత సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఒకే వేదికపై ప్రసంగించారు. వీరిద్దరికీ టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి, ఖైరతాబాద్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ అనువాదకులుగా వ్యవహరించారు. సోనియా, రాహుల్ ప్రసంగాలను తనదైన శైలిలో చక్కగా వ్యక్తీకరించారు. బహుభాషా పండితుడైన శ్రవణ్.. తన సహజ వాక్పటిమతో అనువాదం చేశారు. దామోదర గైర్హాజర్... సోనియా, రాహుల్ ప్రారంభించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. తనకు తగిన ప్రాధాన్యత లభించలేదన్న అసంతృప్తితో ఆయన రాలేదా లేక మరేదైనా కారణముందా అని పలువురు నేతలు చర్చించుకున్నారు. అందోల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందునే ఆయన రాలేకపోయారని కొందరు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పార్టీలో చేరిన కొండా, యాదవరెడ్డి సోనియా, రాహుల్ సమక్షంలో మేడ్చల్ సభా వేదికపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్, సోనియా సమక్షంలో పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సభ హైలెట్స్ కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి శుభాకాంక్షలతో సోనియాగాంధీ తన ప్రసంగం ప్రారంభించారు. పొదుపు సంఘాల గురించి ఆమె చేసిన ప్రస్తావన ఆకట్టుకుంది. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సోనియా భారీ కటౌట్ వద్ద అభిమానులు సెల్ఫీలు దిగారు. సోనియా, రాహుల్, రేవంత్ ప్రసంగాల సమయంలో కార్యకర్తలు కేరింతలు చేస్తూ బాణసంచా కాల్చారు. సోనియా, రాహుల్ వేర్వేరుగా వేదిక పైకి వచ్చిన సమయంలో సభికులు కుర్చీలపై నుంచి లేచి అభివాదం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ కార్యకర్తలు తమ పార్టీ జెండాలు పట్టుకుని తిరుగుతూ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిమానులు ప్లకార్డులు చేతపట్టుకుని అందరినీ ఆకర్షించారు. జనగామ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యకు చెందిన ఒగ్గు కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. భట్టి విక్రమార్క అభిమానులు ప్రత్యేకంగా డప్పు వాయిద్యాలతో అందరినీ అలరించారు. ఏపూరి సోమన్న కళాబృందం తమ ఆటపాటలతో ఆకర్షణగా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు సభా ప్రాంగణంలో భారీ జెండాలను ప్రదర్శించారు. సోనియాగాంధీ సభ సందర్భంగా మేడ్చల్ పట్టణం ప్రజాకూటమి జెండాలతో కళకళలాడింది. కేసీఆర్ డోకాబాజి పేరుతో నాలుగు చక్రాల బండిపై కేసీఆర్ కుటుంబం చిత్రాలను ఏర్పాటు చేసి, వారి డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం విఫలమైందని పేర్కొనడం ఆకర్షణగా నిలిచింది. వీఐపీ, మీడియా ద్వారాల వద్ద పోలీసులు అడ్డు చెబుతున్నా కాంగ్రెస్ అభ్యర్థుల అనుచరులు లోపలకు చొచ్చుకెళ్లారు. సభలో గద్దర్ పాడిన పాట అందరిలో జోష్ నింపింది. సభా ప్రాంగణం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిష్టాపూర్ దారిలో వాహనాలు పార్కింగ్ చేసి ఉండడంతో అక్కడి నుంచి కార్యకర్తలు నడుచుకుంటూ వచ్చారు. -
పట్టు కలవాలి!
పూర్వం సిండికేట్ అనే వారు. ఇప్పుడు తెలుగులో మహాకూటమి, ప్రజాకూ టమి అనే పేర్లతో వ్యవహ రిస్తున్నారు. ‘ఇదొక కాక్ టైల్ కూటమి, ఇదో క్లబ్ పార్టీ’ అన్నాడొక నాగరి కుడు. నాయకుల్ని ఏకం చేయగలిగింది పదవీ వ్యామోహం ఒక్కటేనని ఓ పెద్దాయన తీర్మానించాడు. ‘ఈ మాత్రం ఐకమత్యం దేశ సమస్యలప్పుడుం టేనా... రాష్ట్రాలన్నీ చిన్న చిన్న రామరాజ్యాలైపో తాయ్’ ఒక పెద్దావిడ నిట్టూర్చింది. ‘ఈ మహా కూటమిలో కట్టు కట్టిన వారంతా మహానుభావులు. గొప్ప గొప్ప ఆలోచనలున్నవారు. సొంత ఫిలాసఫీ, ఎజెండాలున్నవాళ్లు. వీళ్లు చివరికి ఎట్లా కలుస్తారండీ. నూకలు, మైదాపిండి, గులక రాళ్లు, నీళ్లు కలిపినట్టు అవుతుందండీ. మీకేమనిపిస్తోంది’ అని సూటిగా నిలదీశాడు. ‘ఇదివరకు ఇలా చాలా కూటములు వెలి శాయండీ. బలం కూడదీసుకోడానికి ఇదొక మార్గం’ అని నీళ్లు నమిలాను. చంద్రబాబు అన్నిస్థాయిల్లో కూటములు తయారు చేసేట్టున్నాడు. మోదీని చిత్తుచేసి దేశ రాజ్యాంగాన్ని నిలిపే ఉద్యమంలో తిరుగుతున్నాడు. ప్రయోగాత్మకంగా తెలంగాణలో కూటమిలో చేరిపో యారు. ఏ మాత్రం సంకోచించకుండా కాంగ్రెస్‌తో సైతం కరచాలనం చేసేశారు. చాలామంది ‘ఔరా’ అనుకుంటూ ముక్కున వేలేసుకుంటే, ఆ చర్య మూసీ ప్రభావంవల్లగానీ మా చర్యవల్ల కాదని చంద్రబాబు సమర్థించుకుంటున్నారు. ప్రతి కూటమి వెనక స్వార్థం ఉంటుంది. గొప్ప సేవాభావం అయితే ఉండదు. సరైన కొలతలు లేని ఒక చిత్రమైన ఆకృతిలో జంతువు తయారవుతుంది. అయిదుకాళ్లు, రెండు తోకలు, చిన్న తొండంతో ఉంటుంది. భావసారూప్యత లేక నాలుగుకాళ్లు నాలుగు పొడుగుల్లో ఉంటాయి. గిట్టలు, పాదాలు ఇలా రకరకాలు. పాపం, అది అడుగు ముందుకు వెయ్యాలంటేనే పెద్ద ప్రయత్నం చెయ్యాలి. అదింకా జాతిని పరుగులెలా పెట్టిస్తుందో తెలియదు. పాత జానపద కథ ఒకటుంది. రాజరికాలు నడిచే రోజుల్లో కూడా సింహాసనం కోసం ఎప్పుడూ ఓ యుద్ధం నిశ్శబ్దంగా సాగుతూ ఉండేది. యుద్ధ మంటే అవతలివారి ఆశ. బలమైన కోరిక. తమ శక్తియుక్తులన్నీ ప్రయోగించి నిరంతరం ప్రయత్నాలు సాగిస్తూ ఉండేవారు. కథ ఏంటంటే– ఒక అడవిలో ఒక బండినిండా ధాన్యం ఉంది. కానీ బండి లాగడానికి ఎడ్లు లేవు. అది గమనించిన ఒక గద్దకి ఆలోచన వచ్చింది. మరో నలుగురితో జతకట్టి, ఆ బండిని వేరే చోటికి చేర్చి, హాయిగా పంచుకు తినాలని ఆలోచన చేసింది. గద్ద దగ్గర్లో ఉన్న సొర చేపని, ఎండ్రకాయని సంప్రదించ బోయింది. అవి గద్ద రెక్కల చప్పుడు వినగానే బొరి యలోకి, నదిలోకి పోయి దాక్కున్నాయి. ఎట్లాగో నచ్చచెప్పి, సంగతి వివరించి ఒప్పించింది. గబ్బి లంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. బండి కాడికి అటూఇటూ సొర చేపను, ఎండ్రకాయను కట్టింది. కాడిని మధ్యలో తనే ఎత్తిపట్టింది. గబ్బిలం వెనకాల తలక్రిందులుగా వేలాడుతూ ఆలోచన చేస్తోంది. కాడిని గద్ద బలంగా పైకి లేపింది. ఎంత సేప టికీ సొరచేప నీళ్లవైపు లాగుతోంది. రెండోవైపు ఎండ్రకాయ దాని సహజమైన అడ్డధోరణిలో పక్కకి పెడలాగుతోంది. గబ్బిలం తలక్రిందు ఆలోచనలతో తపస్సు చేస్తోంది. బండి ఎటూ కదలడం లేదు. ముందుకీ కదలడం లేదు. పక్కకి అసలే లేదు. బండి సక్రమంగా ముందుకు వెళ్లాలంటే పట్టు కలవాలి. అది ఏకోన్ముఖంగా సక్రమంగా ఉండాలి. అదీ కథ. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
పోరు ఇక హోరాహోరీ!
తెలంగాణ అసెంబ్లీకి వచ్చే నెల 7న జరగబోయే ఎన్నికలకు గురువారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో బరిలో ఉండబోయే అభ్యర్థులెవరన్న అంశంలో స్పష్టత వచ్చింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండూ అసంతృప్తుల్ని బుజ్జగించి పోటీనుంచి వారు వైదొలగేలా చేయడంలో విజయం సాధించాయి. దాదాపు అరడజను స్థానాల్లో మినహా మిగిలినచోట్ల రెండు పార్టీలకూ రెబెల్స్ బెడద తప్పిపోయింది. టీఆర్ఎస్ గత ఎన్నికల మాదిరే ఈసారి కూడా ఎవరి తోనూ పొత్తు లేకుండా పోరుకు సిద్ధమైంది. కాంగ్రెస్ మాత్రం తెలుగుదేశం, తెలంగాణ జన సమితి (టీజేఎస్), సీపీఐలను కూడగట్టి ప్రజా కూటమిని ఏర్పరిచినట్టు ప్రకటించింది. మరోపక్క బీజేపీ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇవిగాక దళిత, బీసీ పార్టీలను కలుపుకుని సీపీఎం బహు జన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్)ను రూపొందించింది. ప్రధాన ప్రత్యర్థిగా ఉండే ప్రజాకూటమి నామినే షన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్న సమయానికి కూడా పంపకాలు పూర్తి చేసుకోలేక చర్చోప చర్చల్లో మునిగి ఉండగా...టీఆర్ఎస్ నెలన్నరక్రితమే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో సైతం అందరికన్నా ముందుంది. కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన టీజేఎస్‌ను పొత్తు పేరుతో రారమ్మని పిలిచిన కాంగ్రెస్...ఆ పార్టీకి చుక్కలు చూపింది. చేదు అనుభవాన్ని మిగిల్చింది. 8 సీట్లు ఇస్తామని చెప్పి, ఆ పార్టీకి కేటాయించిన స్థానాల్లో సొంత అభ్యర్థులకు బీ ఫారాలిచ్చి, చివరికి నాలుగే మిగిల్చి దాన్ని అయోమయంలో పడేసింది. టీజేఎస్ అధినేత కోదండరాం దీన్ని మోసమనో, నమ్మక ద్రోహమనో అభివర్ణించి ఉంటే ఆ పొత్తు కాస్తా అక్కడితో ముగిసిపోయేది. కానీ ఆయన సంయ మనం పాటించారు. కాంగ్రెస్‌కు కనికరం లేదని, అది తమను అవమానించిందని, ఉద్యమ దిగ్గ జాల భవిష్యత్తును కూడా తాము వదులుకోవాల్సివచ్చిందని వాపోయారు. అయినా జనం కోసం అన్నీ భరిస్తామంటున్నారు. మంచిదే. కానీ కూటమికి సంబంధించిన ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఎజెండా బాధ్యతను తీసుకున్నానని చెబుతున్న ఆయన ఆ విషయంలో ప్రజలకు దృఢమైన భరోసా ఇవ్వగలుగుతారా? ఇచ్చినా వారు నమ్మగలరా? సీట్ల పంపకాల్లో మీకు జరిగిందేమిటని, దానిపై ఏం చేయగలిగారని ఎదురు ప్రశ్నిస్తే ఏం జవాబిస్తారు? ఏడెనిమిదేళ్లుగా రహస్య చెలిమితో కాలక్షేపం చేస్తూ వచ్చిన కాంగ్రెస్, తెలుగుదేశంల మధ్య సీట్ల సర్దుబాటులో సమస్యలు తలెత్తలేదు. తెలంగాణ ప్రజల్లో తమ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో... అధినేత చంద్రబాబు నాయుడు ఇరుక్కున్న ‘ఓటుకు కోట్లు’ కేసుతో అది ఇంకెంతగా దిగ జారిందో తెలుగుదేశం స్థానిక నాయకులకు బాగా తెలుసు. అందుకే వారు ‘దక్కినకాడికి దక్కుడు’ సూత్రాన్ని పాటించి కిక్కురుమనకుండా ఉండిపోయారు. అయితే గియితే ఈ ‘బహిరంగ చెలిమి’ వల్ల నష్టపోయేది కాంగ్రెసే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాదాపు తొమ్మిదేళ్ల ఏలుబడిలో బాబు ఏం చేశారో తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఈ ప్రాంతాన్ని ఒక నిర్బంధ శిబిరంగా మార్చి, ‘తెలంగాణ’ పదం ఉచ్చరించినవారిపై నక్సలైట్ ముద్ర వేసి ఆయన సర్కారు చెలరేగిన తీరు జనం మస్తిష్కాలనుంచి ఇంకా చెరిగిపోలేదు. గాయని బెల్లి లలిత మొదలుకొని పౌర హక్కుల నేతల వరకూ ఎందరినో పొట్టనబెట్టుకున్న, వేధింపులకు గురిచేసిన అనేకానేక ముఠాల వెనక ఏ శక్తులు పనిచేశాయో వారికి తెలుసు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పోరాడిన రైతులపై బషీర్ బాగ్‌లో తుపాకులు గర్జించడం, అక్కడ నేలకొరిగినవారి స్మృతికి కనీసం స్థూపం కట్టుకునే అవ కాశం కూడా లేకుండా చేయడం తెలంగాణ ప్రజలకు గుర్తుంది. మారుమూల పల్లెసీమల్లో తల్లీ బిడ్డల క్షేమం కోసం అహర్నిశలూ పాటుబడే అంగన్వాడీ మహిళలు తమకు కనీస వేతనాలివ్వా లని, తమ బతుక్కి భరోసా కల్పించాలని అడగడానికొస్తే గుర్రాలతో తొక్కించడం ఇప్పటికీ పల్లెప ల్లెనా ఒక పచ్చి జ్ఞాపకం. కరువుకాటకాల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నలపై కరెంటు చార్జీల కత్తిని ఝుళిపించి... కట్టలేనివారి కరెంటు మోటార్లు జప్తు చేయించడం గుర్తులేనిదె వరికి? ఆ రైతన్నలు దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు రూపాయి కూడా రాల్చకుండా వీధిన పడేయడం మరిచిపోయేంత చిన్న విషయమా? అంతెందుకు కూటమికి మద్ద తుగా ప్రచారం చేస్తానంటున్న గద్దర్ ఒంట్లో ఇప్పటికీ మిగిలిపోయిన తూటా దోషిగా చూపేదెవ రిని? ఈ తరంలో చంద్రబాబు గురించి తెలియనివారెవరైనా ఉంటే... అటువంటివారికి ఆంధ్రప్రదే శ్లో ఆయన సాగిస్తున్న పాలనే ప్రత్యక్ష సాక్ష్యం. తనను జనం పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉంచినా ఆయనలో రవ్వంతయినా మార్పు రాలేదని అక్కడ నిత్యం కనబడుతూనే ఉంది. రాష్ట్ర విభజన జరిగాక కూడా ఇలాంటి నాయకుడిని పొత్తు పేరుతో మళ్లీ ఇక్కడికి రానిస్తున్నారన్న అప కీర్తిని కాంగ్రెస్ మూటగట్టుకోక తప్పని దుస్థితి ఏర్పడింది. ఈ విషయంలో తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ రాగల రోజుల్లో ఎలా ఒప్పించగలదో, దీన్నెలా అధిగమించగలదో చూడాలి. రాజస్తాన్, మధ్యప్రదేశ్లతోసహా అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార పర్వంలో ఎక్కడా కన బడని యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ మేడ్చల్‌లో శుక్రవారం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. తెలంగాణ కల సాకారం కావడానికి ఆమె ప్రధాన కారకురాలని అందరికీ తెలుసు. కానీ ఆమె ప్రసంగంలో టీఆర్ఎస్ పాలనపై చేసిన విమర్శల్ని పరధ్యానంగా విన్నవారికి సోనియా ఏపీలో తెలుగుదేశం ఏలుబడి గురించి మాట్లాడుతున్నారేమిటన్న అనుమానం వస్తే అది వారి తప్పు కాదు. భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారని, ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించారని, డ్వాక్రా సంఘాల మహిళల్ని, యువతను నిరాశానిస్పృహల్లోకి నెట్టారని, దళితులకు, ఆదివాసీలకు ఒరగబెట్టిందేమీ లేదని టీఆర్ఎస్ పాలనపై ఆమె చేసిన విమర్శలు సహేతుకమైనవే కావొచ్చు. కానీ ఈ అంశాలన్నిటా అత్యంత అధ్వాన్నంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాచిచంపాన పెడుతున్న బాబుతో ఇక్కడెలా చెలిమి చేశారని ప్రశ్నిస్తే ఆమె ఏం సంజాయిషీ ఇస్తారు? ప్రజల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల విషయంలో రాష్ట్రానికొక ప్రమాణాన్ని పాటించే పార్టీలను జనం విశ్వసిస్తారా? ఏదేమైనా తెలంగాణ ప్రజలు ఎంతో పరిణతి, వివేచన ఉన్నవారు. వారి తీర్పు ఎలా ఉంటుందో వచ్చే నెల 11 వరకూ వేచిచూడాలి. -
‘చంద్రబాబు ముక్త్ తెలంగాణ కావాలి’
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది విస్తరణకు, 2019 లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే బీజేపీకి నాంది అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, మహాకూటమిపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకులకు కోవర్టుగా మారిందన్నారు. టీడీపీ తెలంగాణ ధోఖా పార్టీ అంటూ అభివర్ణించారు. తెలంగాణ అభివృద్దికి, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలపై చర్చలు జరగాలని, వాటిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా మురళీధర్ రావు ఏమన్నారంటే ఆయన మాటల్లోనే ఒంటరిగా ఎదుర్కోలేకనే కూటమి ‘తెలంగాణలో చంద్ర గ్రహణం రాకూడదు. ఫలితాలను చంద్రబాబు నిర్దేశించాలనుకుంటారు. కానీ తెలంగాణలో ఆయన నిర్దేశించే రాజకీయాలు రావు, రాకూడదు. చంద్రబాబు ముక్త్ తెలంగాణ కావాలి, చంద్రబాబు లేని రాజకీయాలు మాత్రమే ఉండాలి. తెలంగాణ ప్రజలను ఒంటిరిగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ మహా కూటమి తయారు చేసింది. కాంగ్రెస్ నేతలను బెంగళూరు, ఢిల్లీలో కలిసిన చంద్రబాబు.. తెలంగాణలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో వారితో ఎందుకు పాల్గొనడం లేదు. నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణకు ఇచ్చిన నిధులను ప్రజలకు వివరిస్తాము. తెలంగాణలో మోదీ, అమిత్ షా విస్తృతంగా పర్యటన చేస్తారు. జాతీయ ముఖ్య నేతలతో వందకు పైగా సభలు నిర్వహిస్తున్నాము. గిరిజన రిజర్వేషన్లు ఇవ్వలేకనే.. మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పటికీ వ్యతిరేకమే. నిజాం గులాంగిరిని, ఖాసీం రజ్వీ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తోంది. టీఆర్ఎస్ గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేకే ముస్లింలతో ముడిపెడుతున్నారు. దేశంలో జరిగే ఎన్నికలు కుటంబ రాజకీయాలకు, జాతీయవాద రాజకీయాలకు మధ్య జరిగే పోరాటం. రాజస్తాన్‌లో కాంగ్రెస్ నాయకులు భారత్ మాతాకు జై అనొద్దు, సోనియా గాంధీకి జై అనాలన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అర్థమవుతోంది దేశమంటే కాంగ్రెస్‌కు ఎంత అభిమానమో’ అంటూ మురళీధర్ రావు కాంగ్రెస్, టీడీపీలప ధ్వజమెత్తారు. -
అవమానాలు భరించాం!
సాక్షి, హైదరాబాద్: ‘‘ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల మేలు కోసం కూటమిని ఏర్పాటు చేసుకున్నాం. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలనుకున్నాం. అందుకే అవమానాలు భరించాం. వివక్ష చూపినా వదిలేశాం. మా పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి తెచ్చారు. మాకు ఇస్తామన్న స్థానాలు ఇమ్మని అడిగినా కాంగ్రెస్ కనికరించలేదు. ఉద్యమంలో పని చేసి, మా పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారి భవిష్యత్‌ను వదులుకున్నాం’’అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. గురువారం అభ్యర్థుల ఉపసంహరణ అనంతరం టీజేఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి అభ్యర్థులుగా టీజేఎస్ 4 స్థానాల్లో పోటీ చేస్తోందని, మరో 4 చోట్ల టీజేఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు స్నేహపూర్వక పోటీ చేస్తున్నారన్నారు. ప్రజలు ఈ పరిస్థితిని గమనించి ఆ 8 స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులకు, అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో సర్వేల పేరుతో మీవాడు పనికి రాడంటూ కాంగ్రెస్ తమ అభ్యర్థులను చులకన చేసిందన్నారు. అయినా భరించి, పొత్తు ధర్మాన్ని అనుసరించి జనగామ, మిర్యాలగూడ స్థానాలను వదులుకున్నామన్నారు. పొత్తుల్లో జాప్యం వద్దని పోరాటం చేసినా సమాధానం రాలేదన్నారు. తాను పోటీలో లేకపోవడం మంచిదేనని, కేసీఆర్ నిరంకుశ పాలనను ప్రజలకు వివరిస్తానన్నారు. మల్కాజ్గిరి, అంబర్‌పేట, వర్దన్నపేట, సిద్దిపేట, వరంగల్ ఈస్ట్, దుబ్బాక, ఆసిఫాబాద్, ఖానా పూర్లో తమ అభ్యర్థులను గెలిపించాలని, మిగతా స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హామీల అమలు కోసమే పట్టుబట్టి ‘కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‘ బాధ్యతను తీసుకున్నామన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆ ఎజెండాను అందుబాటులోకి తెస్తామన్నారు. నాలుగున్నరేళ్లల్లో కేసీఆర్ ఆస్తులు పెంచుకోవడానికే పనిచేశారన్నారు. తాను ఓడితే తనకు నష్టం ఏం లేదని కేసీఆర్ చెప్పిన మాట వాస్తవమేన్నారు. గెలిచినా, ఓడినా ఫాంహౌజ్‌కే పరిమితం అన్నారు. సోనియా సభలో పాల్గొనాలని తనకు ఆహ్వానం వచ్చిందని పాల్గొంటానన్నారు. -
టీజేఎస్‌కు మిగిలింది నాలుగే!
సాక్షి, హైదరాబాద్: ప్రజా కూటమి పొత్తులో తెలంగాణ జన సమితి (టీజేఎస్) సొంతంగా 4 స్థానాల్లో పోటీకే పరిమితమైంది. మరో 4 స్థానాల్లో టీజేఎస్ పోటీ చేస్తున్నా, అక్కడ స్నేహపూర్వక పోటీ పేరుతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. కోదండరాం చర్చలు జరిపినా కాంగ్రెస్ ససేమిరా అనడంతో టీజేఎస్ 4 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. టీజేఎస్‌కు 8 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ మొదట్లో చెప్పినప్పటికీ 6 స్థానాలపైనే స్పష్టత ఇచ్చింది. మరో 2 స్థానాలను నామినేషన్ల చివరిరోజు వరకూ దాటవేస్తూ వచ్చింది. కాంగ్రెస్ వైఖరిని గ్రహించిన టీజేఎస్ 14 స్థానాల్లో అభ్యర్థులకు బీ– ఫారాలు ఇచ్చి నామినేషన్లు వేయించింది. గురు వారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పలుమార్లు భేటీ అయ్యారు. తమకు ఇస్తామన్న 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ లేకుండా చూడాలని కోరారు. తొలుత కేటాయించిన మల్కాజిగిరి, వర్ధన్నపేట, సిద్దిపేట స్థానాలు గాక అంబర్‌పేట్‌లో కాంగ్రెస్ తమ అభ్యర్థిని పోటీ నుంచి విరమింపజేయించి టీజేఎస్‌కు ఇచ్చింది. వరంగల్ ఈస్ట్, దుబ్బాక, ఆసిఫాబాద్, ఖానాపూర్ స్థానాలను కూడా ఇవ్వాలని కోదండరాం కోరినా కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయలేదు. దీంతో ఈ 4 చోట్ల స్నేహపూర్వక పోటీ తప్పలేదు. టీజేఎస్ నామినేషన్లు వేసిన 14 స్థానాల్లో 8 స్థానాలపై స్పష్టత వచ్చింది. ఇక స్టేషన్ ఘన్పూర్ నుంచి నామినేషన్ వేసిన టీజేఎస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయింది. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థే పోటీలో ఉన్నారు. చర్చల అనం తరం కాంగ్రెస్ అంబర్‌పేట్‌లో తమ అభ్యర్థిని విరమింపజేసి టీజేఎస్‌కు కేటాయించగా, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, చెన్నూ రు, అశ్వరావుపేట్, మెదక్ స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి టీజేఎస్ ప్రతిపాదించినా కాం గ్రెస్ ససేమిరా అనడంతో టీజేఎస్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అసంతృప్తిలో టీజేఎస్.. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కాంగ్రెస్ వైఖరి పట్ల టీజేఎస్ తీవ్ర అసహనంతో ఉంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి నెలకొందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి కోసం తమ పార్టీని ఫణంగా పెట్టినట్లు అయిందన్న అసంతృప్తిలో ఉన్నారు. టీజేఎస్ అడ్వొకేట్ విభాగం నేతలు గురువారం పార్టీ కార్యాలయంలోనే ఈ విషయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇస్తామన్న 8 స్థానాలను పూర్తిస్థాయిలో ఇవ్వకుండా, స్నేహపూర్వక పోటీ పేరుతో తమ అభ్యర్థులకు నష్టం కలిగించే పరిస్థితిని కాంగ్రెస్ తెచ్చిందన్నారు. ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ పార్టీ కనికరించలేదని కోదండరామే స్వయంగా పేర్కొనడంతో పార్టీ శ్రేణులు కాంగ్రెస్ తీరుపై భగ్గుమన్నాయి. పొత్తు పేరుతో కాంగ్రెస్.. తమ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేసిందన్నారు. సీట్ల వ్యవహారంలోనే ఇలా ఉంటే రేపు ప్రజా ఆకాంక్షల అమలుకు కాంగ్రెస్ ఎంత మేరకు సహకరిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.