సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో చిన్నాభిన్నమైన అన్ని వ్యవస్థలను పటిష్టం చేసేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపిందించామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోల్కొండ హోటల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ నేత పళ్లా వెంకట్ రెడ్డిలతో కలిసి మహాకూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్(ఉమ్మడి ప్రణాళిక)ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. పది భాగాలుగా పలు అంశాలతో కామన్ మేనిఫెస్టో విడుదల చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ది విస్తరిస్తామని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయరంగం బలోపేతం, సంక్షేమ రంగాన్ని సైతం మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
మాది ‘ప్రజా ఫ్రంట్’: ఉత్తమ్
టీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన కూటమికి ‘ప్రజా ఫ్రంట్’గా నామకరణం చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నుంచి అందరూ అలాగే అభివర్ణించాలని ఆయన కోరారు. అన్ని పార్టీలు ఒప్పుకున్న వాటిని కామన్ మినిమమ్ ప్రోగ్రాంను విడుదల చేస్తున్నామన్నారు. అందరి ఆశీర్వాదంతో తమ కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోదండరాం కన్వీనర్‌గా కేబినెట్ హోదాలో మేనిఫేస్టో అమలుకు కృషి చేస్తారని ఉత్తమ్ తెలిపారు. విధానపరమైన డాక్యుమెంట్ అని ఎన్నికల నాటికి అవసరమైన మరిన్ని జోడించి ప్రజల్లోకి వెళతామని రమణ వివరించారు. కామన్ మేనిఫెస్టోతో ప్రజలకు జవాబుదారీ భరోసా కల్పిస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment