సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రంలో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేతగాక ఆంధ్ర నుంచి చంద్రబాబును తెచ్చుకుందని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఇది మన ఆత్మగౌరవానికి మళ్లీ పరీక్ష అని పేర్కొన్నారు. తెలంగాణకు పరమ శత్రువు చంద్రబాబు.. మీ ఇంటికి వచ్చి మిమ్మల్నే కొడతామంటే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. 15 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 9 సభల్లో పాల్గొన్నారు. కామారెడ్డి, డిచ్‌పల్లి (నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం), బోధన్, మోర్తాడ్ (బాల్కొండ), జగిత్యాల (ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల ఉమ్మడి సభ), కరీంనగర్ (మానకొండూరు, కరీంనగర్ ఉమ్మడి సభ), స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, వరంగల్ (వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల ఉమ్మడి సభ)లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ వలసాధిపత్యాన్ని మళ్లీ మన నెత్తిన రుద్ది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తోందని, ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ‘‘కాంగ్రెసోళ్లకు చేతకాక చంకల చంద్రబాబును ఎత్తుకుని వస్తుండ్రు. కొట్లాడి మనం తెలంగాణ తెచ్చుకుని అభివృద్ధి చేస్కుంటుంటే, కేసులతో మన ప్రాజెక్టులకు అడ్డంపడుతున్న బాబుతో ఈ కాంగ్రెసోళ్లు అంటకాగుతున్నరు. సిగ్గు, పౌరుషం లేకుండా చిల్లర అధికారం కోసం ఆంధ్ర నుంచి చంద్రబాబును అప్పు తెచ్చుకుంటారా? కాంగ్రెస్ నాయకులకు సిగ్గుందా? చీము, నెత్తురు, తెలంగాణ పౌరుషం ఉందా’’అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని, పొరపాటున ఏమైనా జరిగితే మన కళ్లను మన వేళ్లతోనే పొడుచుకున్నవారమవుతామని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణతి రాలేదన్నారు. పార్టీలు, నాయకులు గెలవడం ముఖ్యం కాదని, ప్రజలు గెలవాలని, ప్రజల అభీష్టం, వాంఛితం గెలవాలని వ్యాఖ్యానించారు.
ఇద్దరి మధ్యే పోటీ...
రాష్ట్రంలో ఇద్దరి మద్యే ప్రధాన పోటీ నెలకొందని.. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లు ఉద్యమం చేసి.. తెలంగాణ సాధించి నాలుగేళ్లు పాలించిన టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, కూటమి అభ్యర్థులే పోటీగా ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘58 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, టీడీపీ ఏం చేసినయో మీ ముందు ఉంది. టీఆర్‌ఎస్ ఏం చేసిందో మీ ముందు ఉంది.. మేం చెప్పేది వినండి, ఎదుటి వాళ్లు చెప్పేది వినండి.. ఈ అంశాలను గ్రామాలలో చర్చించండి.. తెలంగాణను దోచుకున్నది, అరిగోస పెట్టింది కాక.. ఇప్పుడు తెలంగాణను మళ్లీ ఆగం చేసే కుట్రతో కూటమిగా ప్రజల్లోకి వస్తున్నవారిని నమ్ముతామా? వాళ్లకు సరైన బుద్ది చెప్పడమే కరెక్ట్’’అని కేసీఆర్ స్పష్టంచేశారు.
‘‘చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను నేనే కట్టిన అంటడు, ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్‌ను నిలిపినా అంటడు. మరి ఆయన కాలంలో కరెంటు ఎందుకు లేకపాయె’’అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో గ్రామాల్లో, పట్టణాల్లో కరెంట్ ఏ విధంగా ఉంది.. ఈ రోజు ఎలా ఉంది ఆలోచన చేయాలని కోరారు. దేశంలో రైతాంగానికి 24 గంటల విద్యుత్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని పేర్కొన్నారు. కరెంటు తలసరి సగటు వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నాం...
అనేక అంశాల్లో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు ఉన్నట్టు కేంద్రమే చెబుతోందని కేసీఆర్ తెలిపారు. మన రాష్ట్ర వృద్ధి రేటు 14 నుంచి 17.17కు పెరిగి ప్రస్తుతం 19.83 శాతంగా ఉందని, ఇది దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాలేదని పేర్కొన్నారు. మనం దూసుకుపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోతోందని, ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించిన తాజా నివేదిక అని వెల్లడించారు. ప్రతి ఏటా మన రాష్ట్ర అదనపు ఆదాయం రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు పెరుగుతోందని తెలిపారు.
కరీంనగర్ తెలంగాణకే తలమానికం...
కరీంనగర్ తెలంగాణకు తలమానికం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా కరీంనగర్ మారిందని పేర్కొన్నారు. 2001 మే 17న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలోనే ‘సింహగర్జన’ద్వారా తెలంగాణ ఉద్యమానికి నాంది పడిందని, అందుకే ఈ గ్రౌండ్‌కు వస్తే తనకు కొత్త ఉత్సాహం వస్తుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి, వరంగల్‌కు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. కేసీఆర్ పిలుపునిస్తే జెండా కింద పడకుండా కాపాడిన ఘనత వరంగల్‌కు ఉందని కేసీఆర్ కొనియాడారు.
నా భూమి కూడా పడావుగా ఉంది..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు కిందికి కాకుండా మీదికి రావాల్సిన అవసరం ఉందని, ఈ ప్రాజెక్టు పూర్తయి మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ పునరుజ్జీవం, వరదకాల్వల తదితర ప్రాజెక్టుల కింద 365 రోజులు అలుగులు పారుతాయన్నారు. ‘‘పేరుకు సీఎంనైనా నేను కూడా రైతునే.. నాకు కూడా వ్యవసాయం ఉంది.. నా 60 ఎకరాల భూమి కూడా పడావుగా ఉంది. నీళ్లుంటేనే సాగు చేయవచ్చు.. తుపాకీ ఉంది గానీ మందుగుండు లేదు.. వచ్చే ఏడాది నాటికి నా భూమితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న బీడు భూములకు సాగునీటిని అందిస్తాం’’అని కేసీఆర్ పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ గాలి వీస్తోంది..
‘‘తెలంగాణలో భయంకరమైన సుడిగాలి వీస్తోంది. టీఆర్‌ఎస్ వేవ్ కనిపిస్తోంది. రాష్ట్రం నలుదిక్కులు ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ఎక్కడైనా టీఆర్‌ఎస్‌కు పాజిటివ్ వేవ్ కనిపిస్తోంది.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు’’అని కేసీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో వందకు పైగా సీట్లు గెలుస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
పరకాలలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌కు సంఘీభావం తెలుపుతూ చేతులెత్తిన మహిళలు
రిజర్వేషన్లు ఎలా ఇవ్వరో చూస్తాం..
ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు తెచ్చి తీరుతామని కేసీఆర్ స్పష్టంచేశారు. యుద్ధం చేసి తెలంగాణ తెచ్చినట్లే ఈ రిజర్వేషన్లు సాధిస్తామని పునరుద్ఘాటించారు. ‘‘బిచ్చమెత్తుకుంటే రిజర్వేషన్లు ఇవ్వరు.. కొట్లాడి తెచ్చుకుంటాం.. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా, 16 ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకుంటుంది.. ఇండియాలో రాబోయేది ఫెడరల్ ఫ్రంట్.. ముస్లింలు, గిరిజనులకు ఒక్కటే హామీ ఇస్తున్న.. తెలంగాణ తెచ్చినట్లే రిజర్వేషన్లు సాధిస్తాం’’అని కేసీఆర్ హామీనిచ్చారు. ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపైనా కేసీఆర్ స్పందించారు. రిజర్వేషన్లు ఎలా ఇవ్వరో చూస్తాం అని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మతం బీమారి ఉందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment