telangana praja front
-
ఖమ్మంలో ఎన్ఐఏ కలకలం
ఖమ్మంక్రైం: తెలంగాణ ప్రజా ఫ్రంట్ అగ్రనేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమాసు కృష్ణను ఖమ్మంలో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతున్న కృష్ణను.. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎన్ఐఏ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడైన ఆయనను రహస్యంగా విచారించినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. తీవ్ర చర్చనీయాంశం.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసులు ఖమ్మానికి రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండా తెలంగాణ ప్రజా ఫ్రంట్ అగ్రనేతను అదుపులోకి తీసుకొని విచారించడంతో పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేకెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని కోమరారం గ్రామానికి చెందిన నల్లమా సు కృష్ణ 2004లో మావోయిస్టులకు ప్రభుత్వానికి జరిగిన చర్చల్లో సైతం కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న కృష్ణ కోసం హైదరాబాద్ నుంచి ఎన్ఐఏ బృందం కోమరారం వచ్చి కృష్ణ సోదరుడి ఇంట్లో తనిఖీలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కాలంలో తెలంగాణ విద్యావంతుల వేదికకు చెందిన ఒక అగ్రనేతను అదుపులోకి తీసుకోగా అతను కృష్ణ గురించి కీలక సమాచారం తెలిపినట్లు తెలియవచ్చింది. ఆస్పత్రికి చేరుకున్న ఎన్ఐఏ టీంలోని ఒక డీఎస్పీ స్థాయి అధికారి కృష్ణ కూతురును, ఆయన బంధువులను విచారించారు. అనంతరం కృష్ణను తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు ఎఫ్ఐఆర్ కాపీ అందించారని విలేకరులతో కృష్ణ కూతురు తెలిపింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న అతడిని హైదరాబాద్ తరలించేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో స్థానిక పోలీసులకు ఎన్ఐఏ టీం ఈ వ్యవహరాన్ని అప్పగించి వెళ్లినట్లు తెలిసింది. -
టీపీఎఫ్ నాయకుల అరెస్ట్
భీమదేవరపల్లి: వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన టీపీఎఫ్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు గొల్లూరి ప్రవీణ్‌కుమార్, టీపీఎఫ్ సభ్యుడు ఉగ్గె శేఖర్ అలియాస్ శంకర్‌తో పాటు కమలాపూర్ మండలం కానిపర్తికి చెందిన రైతు సంఘం నాయకుడు కొత్తూరి ఇంద్రసేన అలి యాస్ చిన్నన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి విప్లవ సాహిత్యం, పేలుడుకు ఉప యోగించే ఐదు డైనమోలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన వంగర పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ బలోపేతంలో భాగంగా మాణిక్యాపూర్ చెరువు శివారు కట్ట వద్ద సమావేశం జరుగుతోందని సమాచారం రావడంతో ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్‌జీ, ముల్కనూర్, వంగర ఎస్సైలు టీవీఆర్ సూరి, గంజి స్వప్న సిబ్బందితో వెళ్లి ఉగ్గె శేఖర్, గొల్లూరి ప్రవీణ్ కుమార్, ఇంద్రసేనను అదుపులోకి తీసుకు న్నారని చెప్పారు. ప్రవీణ్, శేఖర్, ఇంద్రసేనను హుస్నాబాద్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలిపారు. -
ఆదివాసీల ఆత్మబంధువు జనార్ధన్
అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేల ఎందరో తెలంగాణ వీర యోధుల, అమర వీరుల ఆకాంక్షలకు దర్పణం బియ్యాల జనార్ధన్ రావు. ఆదివాసీల ఆత్మబంధువుగా మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్ధనరావు వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల వీడు గ్రామంలో కిషన్‌రావు, అంజమ్మలకు 1955 అక్టోబర్ 12న జన్మించారు. చిన్నతనం నుంచి ఏజెన్సీలోని ఆదివాసీలతో అనుబంధ కారణంగా వారి సంప్రదాయం, జీవన విధానంపై అవగాహన కలిగింది. ఆదివాసీల సమస్యలు, స్వయం పాలన, రాజ్యాంగ రక్షణ, హక్కుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారు. 1983లో కాకతీయ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పార్ట్ టైం అధ్యాపకుడిగా చేరారు. ఆదివాసుల భూముల పరాయీకరణపై 1985లో పీహెచ్డీ పట్టా పొందారు. ఆదివాసీలపై పరిశోధన చేసి పట్టా పొందిన తొలి గిరిజనేతరుడు జనార్ధన్‌రావు. 1993–2000 మధ్య కాలంలో ఆది వాసీ ఉద్యమాలు, 1/70 చట్టం, పీసా చట్టం, గ్రామీణ సమస్యలపై దృష్టి సారించారు. అమెరికా, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రేలియాలలో జరిగిన సెమినార్లలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ వారి పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఎంపికయ్యారు. తెలంగాణపై వివక్ష, అణచివేతపై అనేక రచనలు చేశారు. ప్రముఖ కవి కాళోజీ, ప్రొఫె సర్ జయశంకర్‌లతో కలిసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పర్యవసానాలు, ఆదివాసీల జీవన విధ్వంసంపై ఎన్నో వేదికలపై చర్చించారు. ఉసిళ్ల పుట్టలై మన పని, పాటల్ని కమ్మేస్తున్న దొంగ టీవీ చానళ్లను తీసేసి, మన జనపదాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎన్నోరకాలుగా ఎండగట్టారు. ఆదివాసీలు రాజ్యాధికారంలో భాగమై, స్వయం పాలన సిద్ధించిన నాడే జనార్ధన్ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆదివాసీ సంఘాలు, మేథావులు జనార్ధ న్ను స్ఫూర్తిగా తీసుకుని ఆదివాసీల సమస్యలపై పోరాటాలను ముందుకు తీసుకువెళ్లాలి. వ్యాసకర్త: ఊకె రామకృష్ణ దొర, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత -
ఆత్మగౌరవానికి మళ్లీ పరీక్ష
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేతగాక ఆంధ్ర నుంచి చంద్రబాబును తెచ్చుకుందని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఇది మన ఆత్మగౌరవానికి మళ్లీ పరీక్ష అని పేర్కొన్నారు. తెలంగాణకు పరమ శత్రువు చంద్రబాబు.. మీ ఇంటికి వచ్చి మిమ్మల్నే కొడతామంటే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. 15 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 9 సభల్లో పాల్గొన్నారు. కామారెడ్డి, డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం), బోధన్, మోర్తాడ్ (బాల్కొండ), జగిత్యాల (ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల ఉమ్మడి సభ), కరీంనగర్ (మానకొండూరు, కరీంనగర్ ఉమ్మడి సభ), స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, వరంగల్ (వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల ఉమ్మడి సభ)లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ వలసాధిపత్యాన్ని మళ్లీ మన నెత్తిన రుద్ది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తోందని, ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ‘‘కాంగ్రెసోళ్లకు చేతకాక చంకల చంద్రబాబును ఎత్తుకుని వస్తుండ్రు. కొట్లాడి మనం తెలంగాణ తెచ్చుకుని అభివృద్ధి చేస్కుంటుంటే, కేసులతో మన ప్రాజెక్టులకు అడ్డంపడుతున్న బాబుతో ఈ కాంగ్రెసోళ్లు అంటకాగుతున్నరు. సిగ్గు, పౌరుషం లేకుండా చిల్లర అధికారం కోసం ఆంధ్ర నుంచి చంద్రబాబును అప్పు తెచ్చుకుంటారా? కాంగ్రెస్ నాయకులకు సిగ్గుందా? చీము, నెత్తురు, తెలంగాణ పౌరుషం ఉందా’’అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని, పొరపాటున ఏమైనా జరిగితే మన కళ్లను మన వేళ్లతోనే పొడుచుకున్నవారమవుతామని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణతి రాలేదన్నారు. పార్టీలు, నాయకులు గెలవడం ముఖ్యం కాదని, ప్రజలు గెలవాలని, ప్రజల అభీష్టం, వాంఛితం గెలవాలని వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్యే పోటీ... రాష్ట్రంలో ఇద్దరి మద్యే ప్రధాన పోటీ నెలకొందని.. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లు ఉద్యమం చేసి.. తెలంగాణ సాధించి నాలుగేళ్లు పాలించిన టీఆర్ఎస్కు కాంగ్రెస్, కూటమి అభ్యర్థులే పోటీగా ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘58 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, టీడీపీ ఏం చేసినయో మీ ముందు ఉంది. టీఆర్ఎస్ ఏం చేసిందో మీ ముందు ఉంది.. మేం చెప్పేది వినండి, ఎదుటి వాళ్లు చెప్పేది వినండి.. ఈ అంశాలను గ్రామాలలో చర్చించండి.. తెలంగాణను దోచుకున్నది, అరిగోస పెట్టింది కాక.. ఇప్పుడు తెలంగాణను మళ్లీ ఆగం చేసే కుట్రతో కూటమిగా ప్రజల్లోకి వస్తున్నవారిని నమ్ముతామా? వాళ్లకు సరైన బుద్ది చెప్పడమే కరెక్ట్’’అని కేసీఆర్ స్పష్టంచేశారు. ‘‘చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను నేనే కట్టిన అంటడు, ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్‌ను నిలిపినా అంటడు. మరి ఆయన కాలంలో కరెంటు ఎందుకు లేకపాయె’’అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో గ్రామాల్లో, పట్టణాల్లో కరెంట్ ఏ విధంగా ఉంది.. ఈ రోజు ఎలా ఉంది ఆలోచన చేయాలని కోరారు. దేశంలో రైతాంగానికి 24 గంటల విద్యుత్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని పేర్కొన్నారు. కరెంటు తలసరి సగటు వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నాం... అనేక అంశాల్లో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు ఉన్నట్టు కేంద్రమే చెబుతోందని కేసీఆర్ తెలిపారు. మన రాష్ట్ర వృద్ధి రేటు 14 నుంచి 17.17కు పెరిగి ప్రస్తుతం 19.83 శాతంగా ఉందని, ఇది దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాలేదని పేర్కొన్నారు. మనం దూసుకుపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోతోందని, ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించిన తాజా నివేదిక అని వెల్లడించారు. ప్రతి ఏటా మన రాష్ట్ర అదనపు ఆదాయం రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు పెరుగుతోందని తెలిపారు. కరీంనగర్ తెలంగాణకే తలమానికం... కరీంనగర్ తెలంగాణకు తలమానికం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా కరీంనగర్ మారిందని పేర్కొన్నారు. 2001 మే 17న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలోనే ‘సింహగర్జన’ద్వారా తెలంగాణ ఉద్యమానికి నాంది పడిందని, అందుకే ఈ గ్రౌండ్‌కు వస్తే తనకు కొత్త ఉత్సాహం వస్తుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి, వరంగల్‌కు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. కేసీఆర్ పిలుపునిస్తే జెండా కింద పడకుండా కాపాడిన ఘనత వరంగల్‌కు ఉందని కేసీఆర్ కొనియాడారు. నా భూమి కూడా పడావుగా ఉంది.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు కిందికి కాకుండా మీదికి రావాల్సిన అవసరం ఉందని, ఈ ప్రాజెక్టు పూర్తయి మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ పునరుజ్జీవం, వరదకాల్వల తదితర ప్రాజెక్టుల కింద 365 రోజులు అలుగులు పారుతాయన్నారు. ‘‘పేరుకు సీఎంనైనా నేను కూడా రైతునే.. నాకు కూడా వ్యవసాయం ఉంది.. నా 60 ఎకరాల భూమి కూడా పడావుగా ఉంది. నీళ్లుంటేనే సాగు చేయవచ్చు.. తుపాకీ ఉంది గానీ మందుగుండు లేదు.. వచ్చే ఏడాది నాటికి నా భూమితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న బీడు భూములకు సాగునీటిని అందిస్తాం’’అని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ గాలి వీస్తోంది.. ‘‘తెలంగాణలో భయంకరమైన సుడిగాలి వీస్తోంది. టీఆర్ఎస్ వేవ్ కనిపిస్తోంది. రాష్ట్రం నలుదిక్కులు ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ఎక్కడైనా టీఆర్ఎస్కు పాజిటివ్ వేవ్ కనిపిస్తోంది.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు’’అని కేసీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో వందకు పైగా సీట్లు గెలుస్తామని ఆయన పునరుద్ఘాటించారు. పరకాలలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌కు సంఘీభావం తెలుపుతూ చేతులెత్తిన మహిళలు రిజర్వేషన్లు ఎలా ఇవ్వరో చూస్తాం.. ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు తెచ్చి తీరుతామని కేసీఆర్ స్పష్టంచేశారు. యుద్ధం చేసి తెలంగాణ తెచ్చినట్లే ఈ రిజర్వేషన్లు సాధిస్తామని పునరుద్ఘాటించారు. ‘‘బిచ్చమెత్తుకుంటే రిజర్వేషన్లు ఇవ్వరు.. కొట్లాడి తెచ్చుకుంటాం.. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా, 16 ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంటుంది.. ఇండియాలో రాబోయేది ఫెడరల్ ఫ్రంట్.. ముస్లింలు, గిరిజనులకు ఒక్కటే హామీ ఇస్తున్న.. తెలంగాణ తెచ్చినట్లే రిజర్వేషన్లు సాధిస్తాం’’అని కేసీఆర్ హామీనిచ్చారు. ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపైనా కేసీఆర్ స్పందించారు. రిజర్వేషన్లు ఎలా ఇవ్వరో చూస్తాం అని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మతం బీమారి ఉందని విమర్శించారు. -
విరసం నేత వరవరరావు అరెస్ట్
విరసం నేత వరవరరావును మెదక్ జిల్లా కొండపాక మండలం కోనాయిపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు లాఠీచార్జీలో గాయపడ్డ మల్లన్న సాగర్ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్నా ఆయనను మార్గమధ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగరు ముంపు బాధితులను పరమార్శించడానికి వెళుతున్న విరసం, ప్రజాఫ్రంట్ నాయకులు డా.కాశీం, రవించంద్ర, దేవేంద్ర, గీతాంజలి,నలమాస కృష్ణ, రమణాచారీ, మెంచు రమేష్, కోటి, రమ, స్నేహ,బద్రీ తదితరులను వేములగట్టు పోలీస్ స్టేషన్ కి తరలించారు. -
టీఆర్ఎస్ మాటలు నీటి మూటలయ్యాయి : టీపీఎఫ్
ఇందూరు (నిజామాబాద్) : అమరుల శవాల మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అంగట్లో అమ్మకానికి పెట్టిందని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ ఆరోపించారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు తెలంగాణనే దోచుకుంటోందన్నారు. 60 ఏండ్ల కోస్తాంధ్ర, రాయలసీమ పాలనను ప్రక్షాళన చేసి దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చు దిద్దుతామని చెప్పిన టీఆర్ఎస్ మాటలు నీటి మూటలయ్యాయని విమర్శించారు. టీఆర్ఎస్ ఏడాది పాలనలో ఏం చేసింది, ఎవరిని వంచించింది, ప్రజలను ఎంతగా మోసం చేసిందో వివరించడానికి టీపీఎఫ్ సిద్ధమైందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రస్థాయిలో ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అక్రమార్కులకు, కబ్జాదారులకు, మాఫియాకు అండగా నిలిచి టీఆర్ఎస్ తెలంగాణను ఎలా దోచుకుంటుందో ప్రజలకు తెలిసే విధంగా సభను నిర్వహిస్తామని చెప్పారు. బహిరంగసభకు టీపీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. -
బంద్ ప్రశాంతం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఆంక్షలు, షరతులు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్, ఓయూ జేఏసీతోపాటు వివిధ తెలంగాణ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో మంగళవారం బంద్ ప్రశాంతంగా ముగిసింది. విద్యా సంస్థలు బంద్ పాటించాయి. పలుచోట్ల దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు మూసి ఉంచారు. ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. ఉట్నూర్‌లో తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రామారావు ఆధ్వర్యంలో బంద్‌కు మద్దతుగా దుకాణాలు మూసివేయించారు. పాత బస్టాండ్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఎలాంటి ఆంక్షలు, షరతులు విధించొద్దని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును కట్టరాదని, దీనివల్ల 3 లక్షల మంది ఆదిమ గిరిజనులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని కేవలం మూడేళ్లు మాత్రమే సరిపోతుందని వివరించారు. ఉమ్మడి హైకోర్టు విద్యా వ్యవస్థలో ఉమ్మడి విధానం ఉండరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సర్పంచ్ బొంత ఆశరెడ్డి, తెలంగాణ విద్యార్థి వేదిక ప్రధాన కార్యదర్శి రాహుల్ పాల్గొన్నారు. సిర్పూర్, జైనూర్, కడెం, ఖానాపూర్‌లలో పాక్షికంగా జరిగింది. నిర్మల్‌లో పెట్రోల్‌బంక్‌లను మూసిఉంచారు. తాంసిలో ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కాగజ్‌నగర్, చెన్నూర్‌లలో పాఠశాలలను మూసిఉంచి బంద్‌కు మద్దతు పలికారు. ఆసిఫాబాద్‌లో ఏఐఎస్ఎఫ్ నాయకులు చిరంజీవి, ఎస్ఎఫ్ఐ నాయకులు దినకర్‌ల ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్లను మూయించారు. -
ఆడా, మగా కాని సీఎం కిరణ్: చుక్కా రామయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాలన ఉందా? లేదా? అనేది అర్థం కావడంలేదని.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆడా కాదు.. మగా కాదని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య విమర్శించారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్) అధ్యక్షుడు ఆకుల భూమయ్య మృతి ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుక్కా రామయ్య ప్రసంగించారు. కిరణ్‌తో పాటు సీమాంధ్ర నేతలంతా అవకాశవాద ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, ప్రొ.లక్ష్మణ్, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, రత్నమాల మాట్లాడారు. -
పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి
పరిగి, న్యూస్‌లైన్: బహుజనుల తెలంగాణ కోసం ఉద్యమించాలని, రాష్ట్ర పునర్నిర్మాణంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ కో చైర్పర్సన్ విమలక్క పిలుపునిచ్చారు. శుక్రవారం విద్యార్థి జేఏసీ పరిగి నియోజకవర్గ చైర్మన్ రవికుమార్ అధ్యక్షతన కేఎన్ఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన విద్యార్థి రణభేరి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలంగాణ ఆపేందుకు సీఎం కిరణ్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని, అవసరమైతే మరో ఉద్యమానికి విద్యార్థి లోకం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పరిగిలో వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, పాలమూరు ఎత్తిపోతల వెంటనే చేపట్టాలని, వికారాబాద్ నుంచి పరిగి మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు. మన భూములు, నీళ్లు, ఉద్యోగాలు కొల్లగొట్టిన వారిని తరిమికొట్టేందుకు విద్యార్థులు సిద్ధం కావాలన్నారు. సీమాంధ్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాంత నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓట్లడగటానికి వచ్చేవారిని గల్లా పట్టి నిలదీయాలని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కుళ్లుపట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు విద్యార్థులు సిద్ధం కావాలని ఓయూ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చించకపోవటాన్ని నిరసిస్తూ ఈ నెల 7వ తేదీన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించి తీరుతామన్నారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ నాడు పరిగిలో చంద్రబాబును అడ్డుకున్న విద్యార్థులపై దాడులు చేసిన టీడీపీ నాయకులే నేడు తెలంగాణ సాధించామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. టీజీఓల సంఘం జిల్లా కార్యదర్శి హరిశ్చందర్ మాట్లాడుతూ అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం లేని రాజకీయాలతోనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో మనం కోరుకోవాల్సింది ఇదేనని అన్నారు. తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చెర్క సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య కోసం పోరాడుతామన్నారు. జిల్లా అభివృద్ధికి అవరోధంగా మారిన 111 జీఓను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బహుజనుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు విద్యార్థుల తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. జేఏసీ జిల్లా నాయకుడు ముజీబ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీర్‌మహ్మద్, విద్యార్థి జేఏసీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మునీర్, కో కన్వీనర్ సాయిరాంజీ, ఆయా నియోజకవర్గాల విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రణభేరి సభలో ఆరుణోదయ కళాకారులు ఉద్యమ గీతాల ఆటపాటలతో సభికులను ఉత్తేజపరిచారు. -
బహుజనుల తెలంగాణ కోసం మరో ఉద్యమం
పరిగి, న్యూస్‌లైన్: దొరల నీడపడని బహుజనుల తెలంగాణ సాధనకోసం మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టఫ్) కో చైర్పర్సన్ విమలక్క పేర్కొన్నారు. శుక్రవారం పరిగిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ను దోచుకున్న వారే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని, వారికి సీఎం కిరణ్ నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. ఆంక్షలు లేని తెలంగాణ ను సాధించుకోవటమే తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు, కొందరు నాయకులు తమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులు, కళాకారులు, బహుజనుల త్యాగఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందన్నారు. కొన్ని పార్టీలు ఇక్కడోమాట ఆంధ్రాలో ఓ మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును డిజైన్ మార్చి నిర్మిస్తే అభ్యంతరంలేదని అన్నారు. ఇదే సమయంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి వెంటనే పూర్తి చేయాలన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలో సీమాంధ్రులు దోచుకున్న భూములు వదులుకునేది లేదని, అవసరమైతే నాగళ్లుకట్టి దున్ని తీరుతామని అన్నారు. ఈ నెల 8న మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించే బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరుణోదయ, పీడీఎస్‌యూ, విద్యార్థి జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు నారాయణ్‌రావు, సంతోష్, లక్ష్మి, రవీందర్, విజయల క్ష్మి, సర్దార్, రవికుమార్, వెంకటరాములు, విజయ్‌రావు, ముజీ బ్, మునీర్, పీర్‌మహ్మద్, సాయిరాంజీ, పాండు, రవి, బందయ్య, గోవింద్, వెంకట్ పాల్గొన్నారు. -
లాల్‌సలామ్.. భూమన్నా
కరీంనగర్ జిల్లాలో టీపీఎఫ్ నేత ఆకుల భూమయ్య అంత్యక్రియలు పెద్దపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా కాచాపూర్ గ్రామంలో జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉద్యమకారులు, విప్లవాభిమానులు, బంధుమిత్రులు ఆయనకు అశ్రునివాళులర్పించారు. మంగళవారం హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భూమయ్య భౌతిక కాయాన్ని బుధవారం రాత్రి కాచాపూర్‌కు తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్థం తన ఇంటి ఆవరణలో భూమన్న పార్థివదేహాన్ని ఉంచారు. జిల్లా నలుమూలలకు చెం దిన ఉపాధ్యాయులు, తెలంగాణవాదులు, హక్కుల సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు, మాజీ మావోయిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు. హక్కుల సంఘాలు, ప్రజాసంఘాల నేతలు.. రగల్‌జెండా కళాకారులు ఎర్రై దండాలంటూ భూమన్నకు కన్నీటి వీడ్కోలు పలికారు. విప్లవోద్యమాలకు జీవి తాన్ని అంకితం చేసిన మహానేతగా పలువురు కీర్తిస్తూ అంతిమ యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా సీపీఐ మావోయిస్టు పార్టీ రీజినల్ బ్యూరో కార్యదర్శి ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్, భూమన్న మరణాన్ని ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) చేసిన దారుణ హత్యగా వర్ణిస్తూ పంపిన లేఖను విరసం నేత వరవరరావు చదివి వినిపించారు. దేశంలో అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ కంటే బయట ఉన్న మేథావులే ప్రమాదకారులని చిదంబరం చేసిన వ్యాఖ్యలను రుజువు చేస్తూ భూమయ్య హత్య జరిగిందని వరవరరావు అన్నారు. భూమయ్య అంత్యక్రియల్లో ప్రజాఫ్రంట్, టీజేఎస్, టీఎన్జీవో, పౌరహక్కుల నాయకులు, బంధుమిత్రుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భూమయ్య చితికి ఆయన కుమార్తెలు చారుమతి, కవిత నిప్పంటించారు. -
భూమయ్య మృతిపై న్యాయ విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య మృతిపై పలు సంఘాలు, నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. భూమయ్య మరణంపై వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నల్లమాస కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో రాత్రి 10 గంటల తర్వాతే బయలుదేరాల్సిన జీహెచ్ఎంసీ పారిశుధ్య వాహనాలు, 9.45 గంటలకే అతివేగంతో రోడ్డుపైకొచ్చి భూమయ్యను పొట్టనబెట్టుకున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. 1996 నుండి భూమయ్యను చంపుతామని బెదిరిస్తున్న శక్తులే ఈ ఘటన వెనక ఉండి ఉంటారని తాము భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. భూమయ్య మృతిపై సందేహాలు ఉన్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నారాయణరెడ్డి, ఎం.ఎన్.కిష్టప్ప అన్నారు. ఇది కుట్రపూరిత హత్యగా వారు ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చంద్రన్న కూడా ఇదే డిమాండ్ చేశారు. కాగా, భూమయ్య మరణం టిప్పర్ ప్రమాదం ముసుగులో ప్రభుత్వం పాల్పడిన పిరికిపంద చర్య అని సీపీఐ మావోయిస్టు కేంద్ర రీజినల్ బ్యూరో కార్యదర్శి ఆనంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని ఖండించాలన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నేతల నివాళి: ఆకుల భూమయ్య మృతదేహాన్ని వందలాది మంది తెలంగాణవాదులు బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువచ్చారు. తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్, గద్దర్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నేతలు కేశవరావు జాదవ్, విమలక్క, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేతలు వేదకుమార్, ప్రొ. హరగోపాల్, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, నాగం జనార్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, చుక్కా రామయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, వరవరరావు, దేశపతి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, బెల్లయ్యనాయక్, రాపోలు ఆనందభాస్కర్, దేవీప్రసాద్, పిట్టల రవీందర్, రత్నమాల నివాళులు అర్పించారు. కాగా, కరీంనగర్ జిల్లా జూలపల్లి మండల ం కాచాపూర్‌లో గురువారం ఉ.11 గంటలకు భూమయ్యకు అంత్యక్రియలు నిర్వహిస్తామని నల్లమాస కృష్ణ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో భూమయ్య మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల భూమయ్య మంగళవారం రాత్రి హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన మంగళవారంరాత్రి 9.30 గంటల సమయంలో స్కూటర్ (ఏపీ15హెచ్5270)పై అడిక్‌మెట్‌లోని తన నివాసానికి వెళ్తుండగా.. విద్యానగర్ చౌరస్తాలో వెనుక నుంచి వేగంగా దూసుకు వచ్చిన జీహెచ్ఎంసీ డింపింగ్ వాహనం (ఏపీ11వీ8385) ఢీకొట్టింది. దీంతో స్కూటర్ మీంచి పడిపోయిన భూమయ్యపై నుంచి లారీ చక్రాలు వెళ్లటంతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసిన భూమయ్య మూడేళ్ల కిందట ఉద్యోగ విరమణ పొందారు. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఏపీటీఎఫ్, డీటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పొషించారు. తెలంగాణ జనసభను మొదట్లో ఆయనే స్థాపించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ.. గద్దర్ తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతలు వేదకుమార్, జేఏసీ నాయకులు ఎం.నరసయ్య, మందకృష్ణమాదిగ ఓయూ ప్రొఫెసర్ లక్ష్మణ్ తదితరులు ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు. రోడ్డుబైఠాయింపు సంఘటనా స్థలికి చేరుకున్న ఆయన భార్య కుమార్తెలు మృతదేహాన్ని తరలిం చకుండా అడ్డగించారు. డీసీపీ రావాలంటూ డిమాండ్ చేశారు. పాలేర్ల ఉద్యమమే ప్రాణప్రదం గోదావరిఖని: కరీంనగర్జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, రత్నమ్మలకు ఏడుగురు కుమారుల్లో ఆకుల భూమయ్య పెద్దవాడు. 1948లో జన్మించిన భూమయ్య 6వ తరగతి వరకు కాచాపూర్‌లో, హెచ్ఎస్సీ పెద్దపల్లిలో చదివారు. పీయూసీ కరీంనగర్లో, డిగ్రీ జమ్మికుంటలో చదివాడు. అక్కడే బీఈడీ చేసే సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా వ్యవహరించారు. మొదటిసారిగా దొరలకు వ్యతిరేకంగా పాలేర్లు తమకు వేతనాలు పెంచాలని చేసిన ఉద్యమానికి మల్లోజుల కోటేశ్వరరావు, లచ్చిరెడ్డితో కలిసి నాయకత్వం వహించారు. 1973లో రామగుండం మండలం గుడిపెల్లి జయ్యారంలో టీచర్‌గా తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆయనను ఇబ్బందులకు గురిచేయడానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ అనే సంస్థకు సూపర్వైజర్గా నియమించింది. ఆనాటి నుంచి ఆయన హైదరాబాద్‌లోనే నివాసముంటున్నారు. -
ఏపీఎన్జీవో సభలను తరిమికొట్టండి: ప్రభాకర్
సమైక్యాంధ్రకు మద్దతుగా 'సేవ్ ఆంధ్రప్రదేశ్'అంటూ పెట్టుడిదారులైన ఏపీఎన్జీవోల నిర్వహిస్తున్న మహాసభలను తరిమికొట్టాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్ శుక్రవారం తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి నుంచి రేపు అర్థరాత్రి వరకు టీ జేఏసీ బంద్‌కు పిలుపు నివ్వడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు.తెలంగాణ బంద్‌కు ఆయన మద్దతు పలికారు. రాజకీయ ఖైదీల నాయకుడు శ్రీరాముల శ్రీనివాస్ కూడా తెలంగాణ బంద్‌కు మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు ఏపీఎన్జీవోలు ఈ నెల 7న నగరంలోని ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది.ఆ సభకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. అయితే ఆదే రోజు నగరంలో తెలంగాణావాదులు శాంతిర్యాలీ నిర్వహించేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.ఆ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అందుకు నిరసనగా ఈ నెల 7న 24 గంటల బంద్ నిర్వహించాలని టీజేఏసీ తెలంగాణవాదులకు పిలుపు నిచ్చింది.