భూమయ్య మృతిపై న్యాయ విచారణ | Magisterial enquiry on Bhumaiah Death | Sakshi
Sakshi News home page

భూమయ్య మృతిపై న్యాయ విచారణ

Published Thu, Dec 26 2013 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

Magisterial enquiry on Bhumaiah Death

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య మృతిపై పలు సంఘాలు, నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. భూమయ్య మరణంపై వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నల్లమాస కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో రాత్రి 10 గంటల తర్వాతే బయలుదేరాల్సిన జీహెచ్‌ఎంసీ పారిశుధ్య వాహనాలు, 9.45 గంటలకే అతివేగంతో రోడ్డుపైకొచ్చి భూమయ్యను పొట్టనబెట్టుకున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. 1996 నుండి భూమయ్యను చంపుతామని బెదిరిస్తున్న శక్తులే ఈ ఘటన వెనక ఉండి ఉంటారని తాము భావిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు.. భూమయ్య మృతిపై సందేహాలు ఉన్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నారాయణరెడ్డి, ఎం.ఎన్.కిష్టప్ప అన్నారు. ఇది కుట్రపూరిత హత్యగా వారు ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చంద్రన్న కూడా ఇదే డిమాండ్ చేశారు. కాగా, భూమయ్య మరణం టిప్పర్ ప్రమాదం ముసుగులో ప్రభుత్వం పాల్పడిన పిరికిపంద చర్య అని సీపీఐ మావోయిస్టు కేంద్ర రీజినల్ బ్యూరో కార్యదర్శి ఆనంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని ఖండించాలన్నారు.

 అమరవీరుల స్తూపం వద్ద నేతల నివాళి: ఆకుల భూమయ్య మృతదేహాన్ని వందలాది మంది తెలంగాణవాదులు బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువచ్చారు. తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్, గద్దర్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నేతలు కేశవరావు జాదవ్, విమలక్క, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేతలు వేదకుమార్, ప్రొ. హరగోపాల్, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, నాగం జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, చుక్కా రామయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, వరవరరావు, దేశపతి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, బెల్లయ్యనాయక్, రాపోలు ఆనందభాస్కర్, దేవీప్రసాద్, పిట్టల రవీందర్, రత్నమాల నివాళులు అర్పించారు. కాగా, కరీంనగర్ జిల్లా జూలపల్లి మండల ం కాచాపూర్‌లో గురువారం ఉ.11 గంటలకు భూమయ్యకు అంత్యక్రియలు నిర్వహిస్తామని నల్లమాస కృష్ణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement