Bhumaiah
-
కాంగ్రెస్‌లో చేరిన రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య..
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కి చెందిన రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య తన అనుచరులతో కలిసి శుక్రవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ 27 ఏళ్లు పోలీస్‌శాఖలో పనిచేశానని..ఆ శాఖలో చాలా అణచివేతను చూశానన్నారు. ప్రజా సేవ చేయడం కోసమే కాంగ్రెస్‌లోకి చేరానని తెలిపారు.కాంగ్రెస్ అభివృద్ధికి సైనికుడిగా పనిచేస్తానని చెప్పారు. టీఆర్ఎస్ పాలన రాజరికాన్ని తలపిస్తోందని..కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించారు. భవిష్యత్ కాంగ్రెస్‌దే.. భవిష్యత్ కాంగ్రెస్‌దేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తను విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పటి నుంచి భూమయ్యతో పరిచయం ఉందని తెలిపారు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని కొందరు చూస్తున్నారని..ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. -
జంగవమ్మ జ్ఞాపకాలు
బాలనాగమ్మ కథలో నాగమ్మకు అన్నీ కష్టాలే.. ఇక్కడ కూడా నాగమ్మ ఎన్నో కష్టాలను, కన్నీళ్లను చూసింది. ఆమెపేరు నాగమ్మ అయినందుకు కావచ్చు. దేశచరిత్రలో చీకటి రోజులుగా మిగిలిన ఎమర్జెన్సీ పిడుగు ముత్తునూరు నాగమ్మ కుటుంబం పైన పడింది. గిన్నెదరి హత్యకేసులో విచారణ పూర్తయిన సమయంలోనే ఎమర్జెన్సీ అమలు కావడంతో భూమయ్య, కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష తప్పలేదు. వారిద్దరికీ వేసిన ఉరిశిక్షను అమలు చేసేందుకు న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే వారికి క్షమాభిక్ష పెట్టాల్సిందిగా దేశంలోని వివిధ సంఘాలన్నీ రాష్ట్రపతిని కలిశాయి. చివరకు ఎమర్జెన్సీ సమయంలో ప్రశ్నించే గొంతులను అణచివేసే చట్టాలు అమ లు చేయడంతో 1975 డిసెంబర్ 1న ఆ ఇద్దరికీ ముషీరాబాద్ సెంట్రల్ జైలులో ఉరిశిక్ష అమలుచేశారు. ఎమర్జెన్సీ సమయంలో వేసిన ఈ శిక్ష దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉరిశిక్ష పడిన వారిలో ఒకరైన భూమయ్య భార్య ఇప్పుడు పూజారి జంగవమ్మగా జగిత్యాల ప్రాంతంలోని గొల్లపల్లి మండలం రాజోలుపల్లిలో అనాథగానే జీవితాన్ని గడుపుతోంది. 1975 జూన్ 25 విధించిన ఎమర్జెన్సీ సందర్భంగా నాగమ్మ జ్ఞాపకాలపై.. సాక్షి ఆమెను కలిసింది. కొసగంటి నాగమ్మ.. పూజారి జంగవమ్మగా చుట్టుపక్కల గ్రామాల్లో సంవత్సరీకాల (తద్దినాలు) పౌరోహిత్యంతో రోజులు వెళ్లదీస్తున్న ఆమె ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఇలా వివరించింది. ఉరిశిక్ష పై ఉత్తరం వచ్చింది... 1973 ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెదరి గ్రామానికిచెందిన పెద్ద భూస్వామిని తన భర్త భూమయ్యతో పాటు ఆయన స్నేహితుడు కిష్టాగౌడ్‌లు చంపారు. ఈ కేసు హైకోర్టు విచారించిందని ఆ ఇద్దరికీ ఉరిశిక్ష వేస్తున్నట్లు వైజాగ్ సెంట్రల్ జైలు నుంచి లేఖ అందింది. భూమయ్యను హత్యకేసులో జైలుకు తీసుకెళ్లిన తర్వాత ఓసారి వరంగల్ సెంట్రల్‌జైలుకు వెళ్లి కలిసాను. ఆ తర్వాత దాదాపు ఏడాదికి భూమయ్య, కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష వేస్తున్నట్లు ఉత్తరం అందింది. ఆతృతతో ఆయనను చూసేందుకు వెళ్లాలని ఎంత ప్రయత్నించినా బస్ చార్జీలు దొరకలేదు. దీంతో ఆయనను కలవలేకపోయాను. భూమయ్య జైలుకు వెళ్లిన తర్వాత పుట్టినిల్లు పుట్నూరుకు మూడేళ్లబాబు శంకరయ్యతో కలిసి చివరిసారిగా కలవాలని ఎంత ప్రయత్నించినా బస్సు చార్జీలు దొరకలేదు. భూమయ్య, కిష్టాగౌడ్‌లను ముషీరాబాద్ జైలులో ఉరితీసినట్లు ఎవరో రేడియో విని తెలిపారు. ఆ మరునాడు నాలుగురోజులకు అందిన ఉత్తరం తీసుకొని ముషీరాబాద్ జైలుకు వెళ్లాను. పోలీసులు తనను అనేక విధాలుగా ప్రశ్నించి చివరికి జైలునుంచి వచ్చిన ఉత్తరం చూపించడంతో భూమయ్యను పూడ్చిపెట్టిన స్థలాన్ని మాత్రం చూపించారు. కనీసం ఆయన జ్ఞాపకంగా ధరించిన బట్టలైనా ఇవ్వాలని జైలు అధికారులను వేడుకున్నా కనికరించలేదు. బట్టలతోపాటు అలాగే పూడ్చిపెట్టామని జైలుసిబ్బంది తెలిపారు. రెండుసార్లు వాయిదా... ఆందోళనలో పాల్గొన్న అటల్ బిహరీ వాజ్‌పేయ్... భూస్వామి లచ్చుపటేల్ హత్యకేసులో మరణశిక్ష ఖాయమైన తర్వాత ముందుగా వైజాగ్ సెంట్రల్‌జైలులో ఇద్దరికీ ఉరిశిక్ష వేసేందుకు తేది ఖరారు చేశారు. అప్పటికే విద్యార్థి ఉద్యమాలు బలంగా ఉండడంతో హక్కుల సంఘాల సహకారంతో వైజాగ్ న్యాయస్థానం ముందు వారిద్దరికీ మరణశిక్ష ఆపాలంటూ ఆందోళనలు చేపట్టారు. మరోసారి రాజమండ్రి జైలులో ప్రయత్నించగా తిరిగి బంద్ పిలుపు ఇవ్వడంతో శిక్షను వాయిదా వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేస్తున్న ఉరిశిక్షను రద్దు చేయాలని ఢిల్లీలో అటల్ బిహారీ వాజ్‌పేయ్, శ్రీశ్రీ, జయప్రకాశ్ నారాయణ, జార్జ్‌ఫెర్నండేజ్, కేజీకన్నాభిరామ్, ఎస్.జైపాల్‌రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, భూపేశ్‌గుప్త, పత్తిపాటి వెంకటేశ్వర్లు ఇలా పెద్ద సంఖ్యలో మేధావులంతా ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. అప్పటికే ఇలాంటి సంఘటనలు శ్రీకాకుళం జిల్లాలో జరిగాయి. శ్రీకాకుళం జిల్లా తాళ్లపాలెం హత్యకేసులో నెల్లూరు జిల్లాకు చెందిన ఇంత రమణారెడ్డి, శంకర్‌రెడ్డి, రామకృష్ణలకు సెషన్‌కోర్టు మరణశిక్ష విధించగా హైకోర్టు మరణశిక్షను రద్దు చేసి ఆ ముగ్గురిపై సాధారణ శిక్షను అమలుచేశారు. సరిగ్గా తాళ్లపాలెం లాంటి సంఘటనగానే గిన్నదరిలో జరిగిన లచ్చుపటేల్ హత్యకేసును చూడాలంటూ ప్రజాసంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. అయితే 1972లో జరిగిన స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా ఒడిశా ప్రభుత్వం మరణశిక్షలను రద్దు చేసిందని దీని ఆధారంగా భూమయ్య, కిష్టాగౌడ్‌ల మరణశిక్షను రద్దు చేయాలంటూ పలు సంఘాలు డిమాండ్లు చేశాయి. ఈ సమయంలోనే 1975, మే11న ఆ ఇద్దరికీ విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ జస్టిస్ చిన్నప్పరెడ్డి, జస్టిస్ గంగాదర్‌రావులు ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో ఇక ఆ ఇద్దరూ విడుదల అవుతారని భావించారు. ఆ తర్వాత జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించడం వల్ల పాత తీర్పును తిరిగి అమలు చేస్తూ డిసెంబర్ 1న ఉరిశిక్ష విధించారు. దేశంలో ప్రజాస్వామిక హక్కులు రదై్దనసమయంగా ఎమర్జెన్సీ సమయాన్ని వర్ణిస్తుంటారు. కొసగంటి భూమయ్య, గున్నాల కిష్టాగౌడ్‌లు ఎవరు..? ఎమర్జెన్సీ సమయంలో ఉరిశిక్షకు గురైన భూమయ్య జంగం పౌరోహితుడు. పెద్దపల్లి డివిజన్లోని వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన భూమయ్య పౌరోహితం కోసం ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో తిర్యాని మండలంలోని గడలపల్లికి చెందిన గున్నాల కిష్టాగౌడ్, అంబారావు సహకారంతో లచ్చుపటేల్ ఆకృత్యాలను తెలుసుకున్నారు. కిష్టాగౌడ్, భూమయ్యలు కలిసి లచ్చుపటేల్‌ను గ్రామ భూస్వామిగా పేర్కొంటూ హతమార్చారు. ఆ తర్వాత ధర్మారం పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా కోర్టులో విచారణ జరిపి వరంగల్, ముషీరాబాద్ జైళ్లకు తరలించారు. అక్కడి నుంచి విచారణ పూర్తికావడంతో వైజాగ్ జైలులో ఉన్న విప్లవకారులు భూమయ్య, కిష్టాగౌడ్‌లకు మద్దతుగా నిలిచి వారిని తమవారిగా, విప్లవపార్టీల కార్యకర్తలుగా ప్రకటించుకున్నారు. అప్పటివరకు ఆ ఇద్దరికీ ఎలాంటి విప్లవపార్టీతో సంబంధం లేకుండానే గిన్నదరి భూస్వామిని హతమార్చి జైలుకెళ్లారు. ఆ తర్వాత 1980లో ఏర్పడిన పీపుల్స్‌వార్ పార్టీ భూమయ్య, కిష్టాగౌడ్‌లను అమరవీరులుగా పేర్కొంటూ నివాళులర్పించింది. కట్టా నరేంద్రచారి, పెద్దపల్లి ఫోటోలు: సతీష్‌రెడ్డి, సాక్షి పెద్దపల్లి -
దీక్షల భూమయ్య ఇకలేరు
అనారోగ్యంతో మృతి తెలంగాణ కోసం 300 రోజులు దీక్ష చేసిన వృద్ధుడు జెండా పండగ నాడే కన్నుమూత నంగునూరు: ‘ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం చేస్తున్న దీక్షలు మాకోసం కాదు.. మాపిల్లల బాగు కోసం..’అంటూ నినదించిన వృద్ధుడు స్వాతంత్ర్య దినోత్సవం రోజునే తుది శ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుధీర్ఘ కాలం పాటు రిలే నిరాహారదీక్షలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్న నర్మేట గ్రామానికి చెందిన భూమయ్య సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నార్లపురం భూమయ్య (85) తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. టీఆర్ఎస్ పార్టీ చేసిన నిరసన కార్యక్రమాలు, సభల్లో పాల్గొంటూ యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పాలమాకులలో జేఏసీ ఆద్వర్యంలో 1,444 రోజుల పాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో 300 రోజులకు పైగా దీక్షల్లో కూర్చొని ఉద్యమ స్ఫూర్తిని చాటారు. అందులో సంవత్సరం పాటు మహిళలు దీక్షల్లో పాల్గొనగా పండగ రోజు వారికి బదులుగా నర్మేట గ్రామానికి చెందిన మిత్రులు రామలింగం, రాజయ్య, ఎల్లయ్య, రాఘవరెడ్డి, శింగరయ్య, వెంకటయ్య, మల్లయ్యలతో పాటు తాను దీక్షల్లో కూర్చోని అందరికి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ వచ్చేదాక దీక్షలు ఆపేదిలేదంటూ ప్రత్యేక రాష్ట్రం వచ్చేదాక పిడికిలి బిగించి ఉద్యమించారు. భూమయ్య చూపిన ఉద్యమ స్ఫూర్తికి ముగ్ధుడైన అప్పటి ఎమ్మెల్యే హరీశ్‌రావు అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. సంవత్సరం కిందట జారి పడడంతో చేయి విరగిన భూమయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మంత్రి హరీశ్‌రావు ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించి, నంగునూరు ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి ద్వారా రూ 5వేలు అందజేశారు. భూమయ్య అంత్యక్రియలు మంగళవారం నర్మేటలో నిర్వహించగా మండల నాయకులు, మిత్రులు, గ్రామస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
భూమయ్య మృతిపై న్యాయ విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య మృతిపై పలు సంఘాలు, నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. భూమయ్య మరణంపై వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నల్లమాస కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో రాత్రి 10 గంటల తర్వాతే బయలుదేరాల్సిన జీహెచ్ఎంసీ పారిశుధ్య వాహనాలు, 9.45 గంటలకే అతివేగంతో రోడ్డుపైకొచ్చి భూమయ్యను పొట్టనబెట్టుకున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. 1996 నుండి భూమయ్యను చంపుతామని బెదిరిస్తున్న శక్తులే ఈ ఘటన వెనక ఉండి ఉంటారని తాము భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. భూమయ్య మృతిపై సందేహాలు ఉన్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నారాయణరెడ్డి, ఎం.ఎన్.కిష్టప్ప అన్నారు. ఇది కుట్రపూరిత హత్యగా వారు ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చంద్రన్న కూడా ఇదే డిమాండ్ చేశారు. కాగా, భూమయ్య మరణం టిప్పర్ ప్రమాదం ముసుగులో ప్రభుత్వం పాల్పడిన పిరికిపంద చర్య అని సీపీఐ మావోయిస్టు కేంద్ర రీజినల్ బ్యూరో కార్యదర్శి ఆనంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని ఖండించాలన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నేతల నివాళి: ఆకుల భూమయ్య మృతదేహాన్ని వందలాది మంది తెలంగాణవాదులు బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువచ్చారు. తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్, గద్దర్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నేతలు కేశవరావు జాదవ్, విమలక్క, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేతలు వేదకుమార్, ప్రొ. హరగోపాల్, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, నాగం జనార్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, చుక్కా రామయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, వరవరరావు, దేశపతి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, బెల్లయ్యనాయక్, రాపోలు ఆనందభాస్కర్, దేవీప్రసాద్, పిట్టల రవీందర్, రత్నమాల నివాళులు అర్పించారు. కాగా, కరీంనగర్ జిల్లా జూలపల్లి మండల ం కాచాపూర్‌లో గురువారం ఉ.11 గంటలకు భూమయ్యకు అంత్యక్రియలు నిర్వహిస్తామని నల్లమాస కృష్ణ తెలిపారు.