భూమయ్య
- అనారోగ్యంతో మృతి
- తెలంగాణ కోసం 300 రోజులు దీక్ష చేసిన వృద్ధుడు
- జెండా పండగ నాడే కన్నుమూత
నంగునూరు: ‘ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం చేస్తున్న దీక్షలు మాకోసం కాదు.. మాపిల్లల బాగు కోసం..’అంటూ నినదించిన వృద్ధుడు స్వాతంత్ర్య దినోత్సవం రోజునే తుది శ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుధీర్ఘ కాలం పాటు రిలే నిరాహారదీక్షలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్న నర్మేట గ్రామానికి చెందిన భూమయ్య సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు.
గ్రామానికి చెందిన నార్లపురం భూమయ్య (85) తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. టీఆర్‌ఎస్ పార్టీ చేసిన నిరసన కార్యక్రమాలు, సభల్లో పాల్గొంటూ యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పాలమాకులలో జేఏసీ ఆద్వర్యంలో 1,444 రోజుల పాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో 300 రోజులకు పైగా దీక్షల్లో కూర్చొని ఉద్యమ స్ఫూర్తిని చాటారు.
అందులో సంవత్సరం పాటు మహిళలు దీక్షల్లో పాల్గొనగా పండగ రోజు వారికి బదులుగా నర్మేట గ్రామానికి చెందిన మిత్రులు రామలింగం, రాజయ్య, ఎల్లయ్య, రాఘవరెడ్డి, శింగరయ్య, వెంకటయ్య, మల్లయ్యలతో పాటు తాను దీక్షల్లో కూర్చోని అందరికి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ వచ్చేదాక దీక్షలు ఆపేదిలేదంటూ ప్రత్యేక రాష్ట్రం వచ్చేదాక పిడికిలి బిగించి ఉద్యమించారు. భూమయ్య చూపిన ఉద్యమ స్ఫూర్తికి ముగ్ధుడైన అప్పటి ఎమ్మెల్యే హరీశ్‌రావు అతన్ని ప్రత్యేకంగా అభినందించారు.
సంవత్సరం కిందట జారి పడడంతో చేయి విరగిన భూమయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మంత్రి హరీశ్‌రావు ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించి, నంగునూరు ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి ద్వారా రూ 5వేలు అందజేశారు. భూమయ్య అంత్యక్రియలు మంగళవారం నర్మేటలో నిర్వహించగా మండల నాయకులు, మిత్రులు, గ్రామస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.