Nangunuru
-
తలికొరివి పెట్టిన తల్లి
సిద్ధన్నపేటలో నిరుపేద మృతి చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించిన స్థానికులు నంగునూరు: నిరుపేద మృతి చెందడంతో గ్రామస్తులు చందాలు వేసుకుని మానవత్వం చాటారు. మరోవైపు మృతుడికి కుమారులు లేకపోవడంతో తల్లే తలకొరికి పెట్టిన ఘటన మెదక్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామానికి చెందిన అనరాజుల పరశురాములు (40) భార్య నర్సవ్వతో కలసి కూలి పనులు చేస్తూ కుంటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి వినోద, వందన, చందన ముగ్గురు కూతుళ్లు. తల్లి మల్లవ్వతో కలసి గ్రామంలో పూరి గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నారు. ఎనమిదో తరగతి చదువుతున్న రెండో కూతురు వందన గుండెకు రంధ్రం పడడంతో ఆపరేషన్ చేయించేస్తోమత లేక బడి మాన్పించారు. కుంటుంబ పోషణ భారం కావడంతో పాటు కూతురి పరిస్థితి చూసి కుంగిపోయిన పరశురాములు అనారోగ్యంతో మంచంపట్టాడు. గురువారం మృతి చెందాడు. మానవత్వం చాటిన గ్రామస్తులు పరశురాములు అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో స్థానికులు చందాలు వేసుకుని మానవత్వం చాటారు. సర్పంచ్ గిరిజ, పురుషుల పొదుపు సంఘం సభ్యులు ఆర్థిక సహాయం చేయడంతోపాటు స్థానికులు కూడా కొంత డబ్బు పోగు చేసి సహాయపడ్డారు. తల్లి మల్లవ్వ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించగా పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. నిరుపేదలైన వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని డబుల్ బెడ్రూ ఇళ్లు మంజూరు చేయాలని, గుండె జబ్బుతో బాధపడుతున్న వందన చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు ఈ సందర్భంగా కోరారు. -
రోడ్డు నిర్మాణంతో తగ్గిన దూరం
వాగు అవతలి గ్రామాలకు సౌకర్యం నంగునూరు: ఒకప్పుడు రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఆ గ్రామాలు నేడు ఒకే జిల్లా పరిధిలోకి రానున్నాయి. ప్రజల కోరిక మేరకు రెండు జిల్లాల మధ్య దూర భారం తగ్గించేందుకు మంత్రి హరీశ్‌రావు దూరదృష్టితో చేసిన కృషి ఫిలించింది. నాడు రాకపోకలను అనుకూలంగా లేని రోడ్డు నేడు తారు రోడ్డుగా మారడంతో రెండు మండలాల ప్రజలతో పాటు వాగు అవతలి గ్రామాలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరింది. నంగునూరు మండల పరిధిలోని కొండంరాజ్పల్లి, గట్లమల్యాల, ఘణపూర్, ఖాత, అక్కేనపల్లి గ్రామాలు మెదక్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులో ఉన్నాయి. కొండంరాజుపల్లి గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న ధర్మారం గ్రామానికి నిత్యం రాకపోకలు సాగిస్తారు. అలాగే మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్న వాగు అవతలి ఐదు గ్రామాలకు సిద్దిపేట 40 కిలో మీటర్ల దూరం ఉండగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కేవలం 18 కిలో మీటర్ల దూరం ఉంటుంది. దీంతో వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం రైతుల తోపాటు ప్రజలు ధర్మారం మీదుగా హుస్నాబాద్‌కు వెళ్లేవారు. వీరే కాకుండా కరీంనగర్ జిల్లా సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలకు వరంగల్ జిల్లాలోని పలు మండలాలకు వెళ్లాలన్నా ఈ మార్గం గుండా రాకపోకలు సాగించాలి. రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల కొండంరాజ్పల్లి నుంచి కరీంనగర్ జిల్లాలోని ధర్మారం గ్రామం కేవలం రెండు కిలో మీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ గ్రామం మీదుగా లంబాడి తండా, పందిళ్ల మీదుగా రేగొండ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ రెండు గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ ఎన్నో సార్లు ప్రతిపాదనలు పంపారు. ఈ తరుణంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతో రాష్ట్ర ప్రభుత్వం కొండంరాజ్పల్లి నుంచి ధర్మారం మీదుగా రేగొండ వరకు 8.8 కిలోమీటర్లు దూరానికి గాను పీఎంజీఎస్‌వై పథకం కింద రూ. 6.22 లక్షలు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో కొండంరాజ్పల్లితో పాటు ఖాత, ఘనపూర్ గ్రామాల ప్రజలకు హుస్నాబాద్ వెళ్లేందుకు సౌకర్యంగా మారింది. కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా హుస్నాబాద్ నియోజక వర్గాన్ని సిద్దిపేటలో కలుపనున్న నేపథ్యలో నంగునూరు, మద్దూర్, హుస్నాబాద్ మండల ప్రజలకు ఈరోడ్డు ద్వారా దూరం తగ్గనుంది. -
రెండోరోజూ నంగునూరులో బంద్
హుస్నాబాద్ డివిజన్లో కలుపొద్దంటూ ఆందోళనలు పాలమాకులలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, రాస్తారోకో నంగునూరు: మండలాన్ని సిద్దిపేట డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం యువజన సంఘాల ఆధ్వర్యంలో పాలమాకులలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నంగునూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రెండవ రోజు బంద్ నిర్వహించి షాపులను మూసి వేయించారు. ఈ సందర్భంగా పాలమాకులలో యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ కొత్త జిల్లా పేరుతో సిద్దిపేట నుంచి తమ మండలాన్ని విడదీయాలని చూస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకొని నంగునూరు మండలాన్ని సిద్దిపేట డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. వర్షం పడుతున్న లెక్కచేయకుండా గంట పాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రాజగోపాల్‌పేట ఏఎస్ఐ కొమురయ్య అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. నంగునూరులో రెండవ రోజు బంద్ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీఐటీయూ నాయకులు ఇమ్రాన్, యాదగిరి, మల్లేశం మాట్లాడుతూ నంగునూరు మండల ప్రజలకు సిద్దిపేటతో ఉన్న అనుబంధాన్ని దూరం చేయాలని మంత్రి హరీశ్‌రావు చూస్తున్నారని ఆరోపించారు. మండలాన్ని సిద్దిపేట డివిజన్‌లోనే ఉంచుతామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన చేస్తామన్నారు. -
మూలుగుతున్న బియ్యం
నంగునూరు: అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని ఐదు సంవత్సరాల కిందట గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. ముక్కిపోయిన బియ్యాన్ని పంచాయతీ భవనంలో నిల్వ ఉంచడంతో దుర్వాసనకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించాలంటేనే పాలకవర్గం జంకే పరిస్థితి నెలకొంది. మండలంలోని కొనాయిపల్లిలో ఉన్న గోపాలమిత్ర భవనంలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని 2011లో అధికారులు గుర్తించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అప్పటి తహసీల్దార్ కొండయ్య భవనానికి వేసిన తాళాన్ని పగులగొట్టి ప్రభుత్వ బియ్యంగా గుర్తించారు. గ్రామస్థుల సమక్షంలో పంచనామా నిర్వహించి 30 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసి కేసు నమోదు చేశారు. భవనం నిరుపయోగంగా మారడంతో ఎలుకలు, పందికొక్కులకు నియంగా మారింది. భవనం నుంచి దుర్వాసన రావడంతో బియ్యాన్ని తొలగించాలని కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే గోపాలమిత్ర భవనాన్ని తాము వాడుకుంటామని పశువైద్యులు చెప్పడంతో రెండు సంవత్సరాల కిందట బియ్యాన్ని గ్రామ శివారులో ఉన్న పంచాయతీ భవనంలోకి మార్చారు. సంవత్సరాలు గడిచినా బియ్యాన్ని అక్కడి నుంచి తరలించకపోవడంతో భవనం నుంచి వచ్చే దుర్వాసనతో పాలకవర్గం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు పంచాయతీ కార్యాలయానికి రావడం మానేశారు. దీంతో అన్ని సమావేశాలను గ్రామంలోని వేంకటేశ్వరాలయం వద్ద నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి ముక్కిపోయిన బియ్యాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
బంజారాల బతుకమ్మ ‘తీజ్’
తీజ్ వేడుకలకు వేదిక కానున్న బద్దిపడగ తండాలో వెల్లివిరుస్తున్న ఆనందోత్సవాలు దేవుడు కరుణించాలని తొమ్మిది రోజుల పాటు పూజలు నంగునూరు: బంజారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే తీజ్ పండుగ ఉత్సవాలకు బద్దిపడగలోని జేపీ తండా వేదిక కానుంది. తొమ్మిది రోజుల పాటు పెళ్లికాని యవతులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ఈ పండుగ ఆనవాయితీ. తాము చేసిన పూజలకు దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడని, దీంతో మంచి పంటలు పండుతాయని గిరిజనుల నమ్మకం. అలాగే తమ ఆరాధ్యదైవమై సంత్ సేవాలాల్ మహరాజ్ పిల్లాపాపలను సల్లంగా చూస్తాడని వారి నమ్మకం. ఈ పండుగ సందర్భంగా మొలకెత్తిన ధాన్యాన్ని భక్తి శ్రద్ధలతో గురువారం చెరువులో నిమజ్జనం చేస్తామని తండా వాసులు తెలిపారు. తీజ్ ఉత్సవాల నిర్వహణ ఇలా.. ఫిబ్రవరి 15న సేవాలాల్ మహరాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆషాఢ, శ్రావణ మాసంలో లంబాడాలు తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా పెళ్లి కాని తొమ్మిది మంది యువతులు సేవాలాల్ మహరాజ్ ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అలంకరిస్తారు. పూరిపాక ఏర్పాటు చేసి మొదటి రోజు గోధుమలను బుట్టలోపోసి అందులో ఎరువు వేసి ప్రతి రోజూ పూజలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకొని రోజుకు నాలుగు పూటలా మొలకలకు నీళ్లు పోస్తూ ఉదయం, సాయంత్రం టెంకాయ కొట్టి నైవేద్యం సమర్పిస్తారు. అలాగే మూడు పూటల మంగళహారతులు ఇస్తూ వారం రోజుల పాటు నియమ, నిష్టలతో పూజలు నిర్వహిస్తారు. రాత్రి పూట యువతులతో పాటు మహిళలు, యువకులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. తొమ్మిదవ రోజున ఉదయం కుల పెద్ద ప్రత్యేకంగా చేసిన వంటకాన్ని సేవాలాల్ మహరాజ్‌కు నైవేద్యంగా సమర్పించి అందరికి ప్రసాదం అందజేస్తారు. బతుకమ్మను పోలిన ఉత్సవం తొమ్మిది రోజుల వేడుకల్లో భాగంగా చివరి రోజు గిరిజనమంతా కొత్త బట్టలు వేసుకొని మొలకెత్తిన ధాన్యాన్ని గ్రామ కూడలిలో ఏర్పాటు చేసి ముఖ్య అతిథులతో కొబ్బరి కాయలు కొట్టించి పూజలు చేస్తారు. అనంతరం పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగితేలుతారు. రాత్రి వరకు ఉత్సవాలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేయడంతో తీజ్ ఉత్సవాలు ముగుస్తాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి బంజారాలకు ‘ తీజ్ ’ పెద్ద పండగ. ప్రభుత్వం గత సంవత్సరం నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ సంవత్సరం నిధులు మంజూరు చేయలేదు. బతుకమ్మ పండగ మాదిరిగా నిర్వహించే తీజ్ ఉత్సవాలకు నిధులు విడుదల చేయాలి. -
దీక్షల భూమయ్య ఇకలేరు
అనారోగ్యంతో మృతి తెలంగాణ కోసం 300 రోజులు దీక్ష చేసిన వృద్ధుడు జెండా పండగ నాడే కన్నుమూత నంగునూరు: ‘ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం చేస్తున్న దీక్షలు మాకోసం కాదు.. మాపిల్లల బాగు కోసం..’అంటూ నినదించిన వృద్ధుడు స్వాతంత్ర్య దినోత్సవం రోజునే తుది శ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుధీర్ఘ కాలం పాటు రిలే నిరాహారదీక్షలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్న నర్మేట గ్రామానికి చెందిన భూమయ్య సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నార్లపురం భూమయ్య (85) తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. టీఆర్ఎస్ పార్టీ చేసిన నిరసన కార్యక్రమాలు, సభల్లో పాల్గొంటూ యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పాలమాకులలో జేఏసీ ఆద్వర్యంలో 1,444 రోజుల పాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో 300 రోజులకు పైగా దీక్షల్లో కూర్చొని ఉద్యమ స్ఫూర్తిని చాటారు. అందులో సంవత్సరం పాటు మహిళలు దీక్షల్లో పాల్గొనగా పండగ రోజు వారికి బదులుగా నర్మేట గ్రామానికి చెందిన మిత్రులు రామలింగం, రాజయ్య, ఎల్లయ్య, రాఘవరెడ్డి, శింగరయ్య, వెంకటయ్య, మల్లయ్యలతో పాటు తాను దీక్షల్లో కూర్చోని అందరికి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ వచ్చేదాక దీక్షలు ఆపేదిలేదంటూ ప్రత్యేక రాష్ట్రం వచ్చేదాక పిడికిలి బిగించి ఉద్యమించారు. భూమయ్య చూపిన ఉద్యమ స్ఫూర్తికి ముగ్ధుడైన అప్పటి ఎమ్మెల్యే హరీశ్‌రావు అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. సంవత్సరం కిందట జారి పడడంతో చేయి విరగిన భూమయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మంత్రి హరీశ్‌రావు ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించి, నంగునూరు ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి ద్వారా రూ 5వేలు అందజేశారు. భూమయ్య అంత్యక్రియలు మంగళవారం నర్మేటలో నిర్వహించగా మండల నాయకులు, మిత్రులు, గ్రామస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
ఆసుపత్రికి తాళం వేసిన సర్పంచ్
డాక్టర్ కుర్చీలో శునకం దర్జా అపరిశుభ్రంగా ఆసుపత్రి డీఎంహెచ్ఓకు ఫిర్యాదు నంగునూరు: చికిత్స కోసం వస్తే వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో గ్రామ సర్పంచ్ ఆసుపత్రికి తాళం వేసిన సంఘటన ఆదివారం నంగునూరులో చోటు చేసుకుంది. డాక్టర్ కూర్చోవాల్సిన కుర్చీలో దర్జాగా శునకం కూర్చోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు జిల్లా వైద్యాధికారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ప్రజలు వ్యాధుల బారిన పడుతుంటే వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంగునూరుకు చెందిన వార్డు సభ్యుడు దానం కిషన్ పనులు చేస్తున్న క్రమంలో చేతి వేలికి తీవ్ర గాయమైంది. గ్రామ సర్పంచ్ యాదగిరి, మరి కొందరు గ్రామస్తులు కిషన్‌ను నంగునూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో డాక్టర్ గదిలోకి వెళ్లారు. డాక్టర్ కూర్చోవాల్సిన కుర్చీలో శుకనం ఉండడంతో ఆశ్చర్యపోయిన గ్రామస్తులు పక్కనే ఉన్న మందుల గదిలోకి వెళ్లగా ఫార్మసిస్ట్ సైతం లేదు. దీంతో వారు ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి వైద్యాధికారి సదానందంతోపాటు జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి ఆసుపత్రి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాదగిరి, గ్రామస్తులు మాట్లాడుతూ నంగునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు. వారం రోజుల క్రితం కొండంరాజ్పల్లికి చెందిన నారదాసు కనకయ్యకు గాయమైతే ఆసుపత్రిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడన్నారు. అలాగే మూడు రోజుల క్రితం సిద్దన్నపేటకు చెందిన మహిళ కడుపునొప్పితో ఆసుపత్రికి వస్తే సిబ్బంది లేకపోవడంతో తాను వైద్యాధికారికి ఫోన్ చేశానని, తన డ్యూటీ కాదని అతడు సమాధానం ఇచ్చాడన్నారు. ఆసుపత్రిలో ఏడుగురు డాక్టర్లతో కలపి 72 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా ఒక్కరైనా డ్యూటీలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలు వాంతులు, వీరేచనాలు, జ్వరంతో ఆసుపత్రికి వస్తే డాక్టర్లు లేక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రికి తాళం వేశారు. ఈ విషయమై ఆసుపత్రి వైద్యాధికారి సదానందం మాట్లాడుతూ విధుల్లో ఉండాల్సిన ఏఎన్ఎం సామ్రాజ్యంకు వీరేచనాలు కావడంతో ఇంటికి వెళ్లిందని సమాధానం ఇచ్చారు. -
పంచాయతీ కార్యరద్శి నిర్భందం
నంగునూరు: ఇంకుడు గుంతల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన ఘటన గురువారం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు లబ్ధిదారులకు ఇంకుడు గుంతల డబ్బులు విడుదల కావడంతో పంచాయతీ కార్యదర్శి రాములు గ్రామానికి చేరుకున్నారు. సంబంధించిన చెక్కుపై సంతకం చేసేందుకు సర్పంచ్ ముక్కేర లచ్చవ్వ గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు ఇంకుడు గుంతలు నిర్మించి ఆరు నెలలు గడిచినా బిల్లులు రావడంలేదని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌పై వాగ్వాదానికి దిగారు. గ్రామంలోని ఏడుగురు లబ్ధిదారులకు బిల్లులు వచ్చాయని, మిగతా వారికి త్వరలోనే చెల్లిస్తామని చెప్పడంతో తమకు డబ్బులు ఎందుకు రాలేదని నిలదీశారు. వెంటనే బిల్లులు చెళ్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ను గదిలో నిర్బంధించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకొని లబ్ధిదారులకు నచ్చ చెప్పడంతో విడిచిపెట్టారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని 70 మందికి బిల్లులు రావాల్సి ఉండగా కొందరికే వచ్చాయన్నారు. లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని చెప్పినా తనను గ్రామ పంచాయతీలో నిర్బంధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
బీఈడీ కౌన్సెలింగ్ ప్రారంభం
నంగునూరు: మండల పరిధిలోని రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం బీఈడీ కౌన్సెలింగ్ ప్రారంభించారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా ఒకే సెంటర్లో కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. మొదటి రోజు 148 మంది హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. తమ కళాశాలలో మొదటిసారిగా ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. సబ్జెక్ట్‌ల వారీగా ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని చెప్పారు. ఈ నెల 23 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేటినుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్... మెదక్ టౌన్: బీఈడీ కౌన్సెలింగ్ కోసం పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో వెబ్ కౌన్సిలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రారంభం కావాల్సిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ను ఐసెట్ కౌన్సెలింగ్ కారణంగా సోమవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ర్యాంక్‌ల ఆధారంగా కళాశాలల ఎంపిక, వెబ్ ఆప్షన్ల కోసం ఏర్పాట్లు చేసినట్లు సెంటర్ పరిశీలకులు వెంకట్రాంరెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌లో భాగంగా 22న గణితం, 23న ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, 24న బయోసైన్స్, 26, 27, 28న సోషల్ స్టడీస్ అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తై విద్యార్థులు స్క్రాచ్‌కార్డు పొంది వెబ్ ఆప్షన్ ఎంచుకోవచ్చని తెలిపారు. వెబ్ ఆప్షన్లో ఏఏ కేంద్రాలు ఇచ్చుకోవచ్చునో హెల్ప్‌లైన్ కేంద్రంలో తెలుపుతామని చెప్పారు. -
మాయమాటలతో పీఠమెక్కిన కేసీఆర్
నంగునూరు: ‘ప్రజలకు కల్లబొల్లి కబుర్లు, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్నాడ’ని బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని ముండ్రాయిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌పేట, పాలమాకుల, రాంపూర్, నంగునూరు, సిద్దన్నపేట, బద్దిపడగలో రోడ్‌షో నిర్వహించి తనను గెలిపించాలని కోరారు. అనంతరం బద్దిపడగలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ప్రతీ ఇంటికి మంజీర నీటిని ఇప్పించడంతో పాటు సిద్దిపేటకు రైల్వే మార్గం వేయిస్తానన్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయానికి ఏడు గంటలు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ కనీసం మూడు గంటలైనా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకానైనా ప్రవేశపెట్టాడా..? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ది మాటల ప్రభుత్వం, బీజేపీది చేతల ప్రభుత్వం అన్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, నాయకులు వంగ రాంచంద్రారెడ్డి, భూపేశ్, యాదమల్లు, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, భూపాణి, చంద్రం, రాజుగౌడ్, చంద్రం, పరమేశ్వర్‌రెడ్డి, తిరుపతిరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. గెలిపిస్తే రైల్వే లైన్ తెస్తా.... సిద్దిపేట రూరల్: తనను గెలిపిస్తే సిద్దిపేటకు రైల్వే లైన్ తెస్తాననని బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి అన్నారు. సిద్దిపేట మండలం నారాయణరావుపేట, రాఘవాపూర్, చిన్నగుండవెల్లిలో బుధవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున రైల్వే లైన్ తేవడం తమతోనే సాధ్యమన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తానని, తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. -
'అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తా'
హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రిగా వైద్య, ఆరోగ్య శాఖమంత్రి తాటికొండ రాజయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగ సంఘాలు అభినందనలు తెలిపాయి. వైద్య ఆరోగ్య మంత్రి హోదాలో రాజయ్య ...తొలిగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డును 50 పడకల నుంచి 120 పడకలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. అలాగే మెదక్ జిల్లా నంగునూరులో 50 పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వైద్యరంగంలో అవినీతికి ఆస్కారం లేకుండా కృషి చేస్తామని రాజయ్య తెలిపారు. వైద్య విద్యను ప్రోత్సహించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో అన్ని ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు రాజయ్య తెలిపారు. -
'సీమాంధ్ర ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తించారు'
నంగునూరు: అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ బిల్లు ప్రతులను చింపి రాద్ధాంతం చేసిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. గురువారం మెదక్ జిల్లా నంగునూరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఆగబోదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయించిందని, కొత్త సంవత్సరంలో ఏర్పాటు కావటం ఖాయమని చెప్పారు.