సీజ్ చేసిన బియ్యాన్ని నిల్వ
నంగునూరు: అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని ఐదు సంవత్సరాల కిందట గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. ముక్కిపోయిన బియ్యాన్ని పంచాయతీ భవనంలో నిల్వ ఉంచడంతో దుర్వాసనకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించాలంటేనే పాలకవర్గం జంకే పరిస్థితి నెలకొంది.
మండలంలోని కొనాయిపల్లిలో ఉన్న గోపాలమిత్ర భవనంలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని 2011లో అధికారులు గుర్తించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అప్పటి తహసీల్దార్ కొండయ్య భవనానికి వేసిన తాళాన్ని పగులగొట్టి ప్రభుత్వ బియ్యంగా గుర్తించారు. గ్రామస్థుల సమక్షంలో పంచనామా నిర్వహించి 30 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
భవనం నిరుపయోగంగా మారడంతో ఎలుకలు, పందికొక్కులకు నియంగా మారింది. భవనం నుంచి దుర్వాసన రావడంతో బియ్యాన్ని తొలగించాలని కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే గోపాలమిత్ర భవనాన్ని తాము వాడుకుంటామని పశువైద్యులు చెప్పడంతో రెండు సంవత్సరాల కిందట బియ్యాన్ని గ్రామ శివారులో ఉన్న పంచాయతీ భవనంలోకి మార్చారు.
సంవత్సరాలు గడిచినా బియ్యాన్ని అక్కడి నుంచి తరలించకపోవడంతో భవనం నుంచి వచ్చే దుర్వాసనతో పాలకవర్గం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు పంచాయతీ కార్యాలయానికి రావడం మానేశారు. దీంతో అన్ని సమావేశాలను గ్రామంలోని వేంకటేశ్వరాలయం వద్ద నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి ముక్కిపోయిన బియ్యాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.