కుమారుడి అంత్యక్రియలు చేస్తున్న తల్లి
సిద్ధన్నపేటలో నిరుపేద మృతి
చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించిన స్థానికులు
నంగునూరు: నిరుపేద మృతి చెందడంతో గ్రామస్తులు చందాలు వేసుకుని మానవత్వం చాటారు. మరోవైపు మృతుడికి కుమారులు లేకపోవడంతో తల్లే తలకొరికి పెట్టిన ఘటన మెదక్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామానికి చెందిన అనరాజుల పరశురాములు (40) భార్య నర్సవ్వతో కలసి కూలి పనులు చేస్తూ కుంటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇతనికి వినోద, వందన, చందన ముగ్గురు కూతుళ్లు. తల్లి మల్లవ్వతో కలసి గ్రామంలో పూరి గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నారు. ఎనమిదో తరగతి చదువుతున్న రెండో కూతురు వందన గుండెకు రంధ్రం పడడంతో ఆపరేషన్ చేయించేస్తోమత లేక బడి మాన్పించారు. కుంటుంబ పోషణ భారం కావడంతో పాటు కూతురి పరిస్థితి చూసి కుంగిపోయిన పరశురాములు అనారోగ్యంతో మంచంపట్టాడు. గురువారం మృతి చెందాడు.
మానవత్వం చాటిన గ్రామస్తులు
పరశురాములు అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో స్థానికులు చందాలు వేసుకుని మానవత్వం చాటారు. సర్పంచ్ గిరిజ, పురుషుల పొదుపు సంఘం సభ్యులు ఆర్థిక సహాయం చేయడంతోపాటు స్థానికులు కూడా కొంత డబ్బు పోగు చేసి సహాయపడ్డారు.
తల్లి మల్లవ్వ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించగా పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. నిరుపేదలైన వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని డబుల్ బెడ్‌రూ ఇళ్లు మంజూరు చేయాలని, గుండె జబ్బుతో బాధపడుతున్న వందన చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు ఈ సందర్భంగా కోరారు.