కార్యదర్శి, సర్పంచ్‌ను నిర్భందించిన దృశ్యం
నంగునూరు: ఇంకుడు గుంతల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన ఘటన గురువారం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు లబ్ధిదారులకు ఇంకుడు గుంతల డబ్బులు విడుదల కావడంతో పంచాయతీ కార్యదర్శి రాములు గ్రామానికి చేరుకున్నారు.
సంబంధించిన చెక్కుపై సంతకం చేసేందుకు సర్పంచ్ ముక్కేర లచ్చవ్వ గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు ఇంకుడు గుంతలు నిర్మించి ఆరు నెలలు గడిచినా బిల్లులు రావడంలేదని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌పై వాగ్వాదానికి దిగారు.
గ్రామంలోని ఏడుగురు లబ్ధిదారులకు బిల్లులు వచ్చాయని, మిగతా వారికి త్వరలోనే చెల్లిస్తామని చెప్పడంతో తమకు డబ్బులు ఎందుకు రాలేదని నిలదీశారు. వెంటనే బిల్లులు చెళ్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ను గదిలో నిర్బంధించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకొని లబ్ధిదారులకు నచ్చ చెప్పడంతో విడిచిపెట్టారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని 70 మందికి బిల్లులు రావాల్సి ఉండగా కొందరికే వచ్చాయన్నారు. లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని చెప్పినా తనను గ్రామ పంచాయతీలో నిర్బంధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.