
సాక్షి, మల్యాల(చొప్పదండి): పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మండలంలోని గొర్రెగుండం జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కోమలత(29) ఆదివారం అర్ధరాత్రి రామన్నపేట గ్రామంలోని అత్తగారింట్లో లాట్రిన్ గదిలో కాలిపోయి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. వెల్గటూర్ మండలం గొడిశెలపేటకు చెందిన కోమలతకు నాలుగేళ్లక్రితం మల్యాల మండలం రామన్నపేటకు చెందిన కొండ గణేశ్‌తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కొడుకు హిమాన్షు ఉన్నాడు. వివాహ సమయంలో గణేశ్‌కు రూ.6 లక్షల కట్నం ఇచ్చారు. అయితే మరో రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంతో వచ్చే వేతనం తన సొంతానికి వినియోగించుకుంటున్నాడు. ఇటీవలే కోమలత సోషియాలజీలో పీహెచ్‌డీ ఫెలోషిప్‌కు ఎంపిక కాగా, మార్చి నుంచి ఫెలోషిప్ కోసం వచ్చే రూ. 40వేలు కూడా తనకే ఇవ్వాలంటూ, అదనపు కట్నం కావాలంటూ వేధించేవాడు.
ఆదివారం అర్ధరాత్రి సైతం తనను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులతో కోమలత మొరపెట్టుకుంది. సోమవారం ఉదయం వస్తామని, గొడవపడొద్దంటూ కుటుంబ సభ్యులు సర్ధిచెప్పారు. అంతలోనే ఇంత ఘోరం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అర్ధరాత్రి సమయంలో తమ కూతురును హత్య చేసి, కాల్చివేశాడంటూ ఆరోపించారు. మృతికి కారణమైనవారు వచ్చే వరకు శవాన్ని తరలించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో ఎస్సై నాగరాజు మాట్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ శ్రీనివాస్, డీఎస్పీ వెంకటరమణ, సీఐ కిశోర్, ఎంపీడీఓ శైలాజరాణి సందర్శించారు. తమ కూతురు మృతికి భర్త గణేశ్, అత్త శారద, ఆడబిడ్డలు రజని, లావణ్యలే కారణమంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment