Panchayati Secretary
-
TS: జేపీఎస్‌లకు ప్రభుత్వం నోటీసులు.. జాబ్స్ నుంచి తొలగిస్తాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రం 5గంటలలోపు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ విధుల్లో చేరకుంటే శాశ్వతంగా తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగారు. ఈ క్రమంలో రెగ్యులర్ చేసే దాకా సమ్మె ఆపేది లేదని సెక్రటరీలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. మరోవైపు.. జూనియర్ సెక్రటరీలకు రాజకీయ పార్టీలు, నేతల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ వారికి మద్దతు ప్రకటించారు. జేపీఎస్‌లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల నుంచి గ్రామాలకు అవార్డులు రావటంలో కీలక పాత్ర పోషించారని, వారిది న్యాయమైన డిమాండ్ అని అన్నారు. ఇది కూడా చదవండి: TSRTC: చరిత్రలో తొలిసారి.. లాభాల్లోకి 45 డిపోలు.. గట్టెక్కించిన శుభ ముహూర్తాలు -
పని ఒత్తిడితోనే పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
సాక్షి, షాద్‌నగర్‌రూరల్: విధుల్లో ఒత్తిడి, పనిభారంతోనే పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ ఆత్మహత్య చేసుకున్నాడని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ యాదయ్య అన్నాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామ కార్యదర్శి ఆత్మహత్యకు నిరసనగా గురువారం ఫరూఖ్‌నగర్ మండల పంచాయతీ కార్యదర్శులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి జగన్నాథ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో భాగంగా జగన్నాథ్ ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డును అందకున్నారని అన్నారు. గ్రామంలో చేపట్టిన పనులకోసం ఖర్చు చేసిన బిల్లుల విషయంలో గ్రామ ఇంచార్జి సర్పంచ్, అధికారులు సహకరించకపోవడంతో ఆ త్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులసంఘం మండల అధ్యక్షుడు శ్రీరాం, çపంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, అనిల్, పండరీనా«థ్, మహేష్. ఫయాజ్, రాజేందర్, ముజఫర్, రామకృష్ణ, స్వాతి, అరుణ, నందిని, ప్రవళిక పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి శంషాబాద్ రూరల్: పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్.శ్రీకాంత్‌గౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద జగన్నాథ్ చిత్ర పటానికి ఆయన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది ప్రతిభ, శ్రీనివాస్‌రెడ్డి, అనిత, కృష్ణకాంత్, పంచాయతీ కార్యదర్శులు సురేష్, శశిధర్‌రెడ్డి, అశ్విని, భాస్కర్, ఇర్ఫాన్, శ్రీకాంత్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దు.. మొయినాబాద్ రూరల్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని ఎదుర్కోవాలని మొయినాబాద్ ఎంపీడీఓ విజయలక్ష్మి అన్నారు. సంగారెడ్డి జిల్లా పూల్‌కల్ మండలం మిన్కూర్ గ్రామ కార్యదర్శి జగన్నాథ్ గ్రామ అభివద్ధిలో ఖర్చు చేసిన డబ్బుల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీఓ సురేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రాఘవేందర్, మల్లేష్, దీపలత, తారాభాయ్, ప్రియాంక, లావణ్య, వనజ, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట... కొత్తూరు: సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ చిత్రపటానికి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గురువారం పలువురు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి, ఎంపీఓ శ్రీనివాస్, ఏఓ గోపాల్, ఏఈఓలు సనా, దీపిక, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా పంచాయతీ కార్యదర్శి మృతి
సాక్షి, మల్యాల(చొప్పదండి): పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మండలంలోని గొర్రెగుండం జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కోమలత(29) ఆదివారం అర్ధరాత్రి రామన్నపేట గ్రామంలోని అత్తగారింట్లో లాట్రిన్ గదిలో కాలిపోయి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. వెల్గటూర్ మండలం గొడిశెలపేటకు చెందిన కోమలతకు నాలుగేళ్లక్రితం మల్యాల మండలం రామన్నపేటకు చెందిన కొండ గణేశ్‌తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కొడుకు హిమాన్షు ఉన్నాడు. వివాహ సమయంలో గణేశ్‌కు రూ.6 లక్షల కట్నం ఇచ్చారు. అయితే మరో రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంతో వచ్చే వేతనం తన సొంతానికి వినియోగించుకుంటున్నాడు. ఇటీవలే కోమలత సోషియాలజీలో పీహెచ్డీ ఫెలోషిప్‌కు ఎంపిక కాగా, మార్చి నుంచి ఫెలోషిప్ కోసం వచ్చే రూ. 40వేలు కూడా తనకే ఇవ్వాలంటూ, అదనపు కట్నం కావాలంటూ వేధించేవాడు. ఆదివారం అర్ధరాత్రి సైతం తనను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులతో కోమలత మొరపెట్టుకుంది. సోమవారం ఉదయం వస్తామని, గొడవపడొద్దంటూ కుటుంబ సభ్యులు సర్ధిచెప్పారు. అంతలోనే ఇంత ఘోరం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అర్ధరాత్రి సమయంలో తమ కూతురును హత్య చేసి, కాల్చివేశాడంటూ ఆరోపించారు. మృతికి కారణమైనవారు వచ్చే వరకు శవాన్ని తరలించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో ఎస్సై నాగరాజు మాట్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ శ్రీనివాస్, డీఎస్పీ వెంకటరమణ, సీఐ కిశోర్, ఎంపీడీఓ శైలాజరాణి సందర్శించారు. తమ కూతురు మృతికి భర్త గణేశ్, అత్త శారద, ఆడబిడ్డలు రజని, లావణ్యలే కారణమంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
తెలియక మేశా.. విడిపించండి మహాప్రభో!
సాక్షి, గోపాల్పేట (వనపర్తి) : రోడ్డు పక్కన నాటిన మొక్కలను మేసిన ఓ మేకను పంచాయతీ కార్యదర్శి చెట్టుకు కట్టేశాడు. మండలంలోని ఏదుట్లలో ఎన్ఆర్ఈజీఎస్ కింద రోడ్డు వెంబడి నాటిన మొక్కలను మంగళవారం ఓ మేక తినేసింది. దీంతో ఇంత కష్టపడి మొక్కలు నాటుతుంటే మేకలు తింటున్నాయని మేకల యజమానిని హెచ్చరించేందుకు మేకను కట్టివేశానని కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. మేక మెడలో తెలియక మేశాను.. దయచేసి నన్ను విడిపించండి అని అట్టపై రాసి మేక మెడకు తగిలించాడు. -
పంచాయతీ కార్యదర్శికి దేహశుద్ధి
-
పంచాయతీ కార్యరద్శి నిర్భందం
నంగునూరు: ఇంకుడు గుంతల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన ఘటన గురువారం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు లబ్ధిదారులకు ఇంకుడు గుంతల డబ్బులు విడుదల కావడంతో పంచాయతీ కార్యదర్శి రాములు గ్రామానికి చేరుకున్నారు. సంబంధించిన చెక్కుపై సంతకం చేసేందుకు సర్పంచ్ ముక్కేర లచ్చవ్వ గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు ఇంకుడు గుంతలు నిర్మించి ఆరు నెలలు గడిచినా బిల్లులు రావడంలేదని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌పై వాగ్వాదానికి దిగారు. గ్రామంలోని ఏడుగురు లబ్ధిదారులకు బిల్లులు వచ్చాయని, మిగతా వారికి త్వరలోనే చెల్లిస్తామని చెప్పడంతో తమకు డబ్బులు ఎందుకు రాలేదని నిలదీశారు. వెంటనే బిల్లులు చెళ్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ను గదిలో నిర్బంధించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకొని లబ్ధిదారులకు నచ్చ చెప్పడంతో విడిచిపెట్టారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని 70 మందికి బిల్లులు రావాల్సి ఉండగా కొందరికే వచ్చాయన్నారు. లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని చెప్పినా తనను గ్రామ పంచాయతీలో నిర్బంధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
కోటగిరి, న్యూస్‌లైన్: కోటగిరి గ్రామపంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గ్రామ పంచాయతీలో బాధితుడు వద్ద నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావ్ ఆధ్వర్యంలో అధికారులు కార్యదర్శిని అరెస్టు చేశారు. వివరాలు.. కోటగిరికి చెందిన ఒడ్డె లింగయ్యకు నర్సింలు, గణేశ్ ఇద్దరు కుమారులు. 2004లో లింగయ్య తన ఆస్తిని ఇద్దరు కుమారులకు పంచాడు. ఇంటినం-4-72 ఇల్లును నర్సింలుకు ఇవ్వగా, 15-50 అనే ఇంటిని గణేశ్ పేర రాశారు. కాగా లింగయ్య 2006లో మృతిచెందాడు. నర్సిం లు తమ్ముడు గణేశ్ ఉద్యోగరీత్యా కువైట్‌కు వెళ్లాడు. ఈనేపథ్యంలో ఇటీవల గణేశ్ కోటగిరికి రాగా ఆస్తి మార్పులు చేసుకుందామని ఇద్దరు అన్నదమ్ములు అంగీకరించి 10 రోజుల క్రితం తండ్రి డెత్ సర్టిఫికెట్‌తోపాటు ఇంటిమార్పిడికి సంబంధించిన పత్రాలను కార్యదర్శికి అందజేశారు. అయితే ఇంటిమార్పిడి చేయాలంటే రూ. 10వేలు ఖర్చు అవుతుందని కార్యదర్శి సుదర్శన్ అన్నదమ్ములకు చెప్పా డు. డబ్బు ఇస్తే వెంటనే మీపనులు పూర్తిచేస్తానన్నాడు. అంతడబ్బు తేలేమని వారు చెప్పడంతో డబ్బు తేకపోతే మీరిచ్చిన పత్రాలు లేవని చెబుతాను.. అప్పుడు ఏం చేసా ్తరో చేసుకోండని సుదర్శన్ డిమాండ్ చేశాడు. మళ్లీ రెండోసారి నర్సింలు సుదర్శన్‌ను వేడుకోగా రూ.8వేలు తీసుకురమ్మని చెప్పాడు. అదికూడా 21వ తేదీలోగా డబ్బు తీసుకుని పంచాయతీ ఆఫీసుకు రావాలని చెప్పడంతో ఫిబ్రవరి 18న నర్సింలు ఏసీబీ జిల్లా కార్యాలయానికి వెళ్లి పరి స్థితి వివరించారు. దీంతో ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావ్ ఓపథకం ప్రకారం నర్సింలును పురమాయించారు. దీంతో 21న నర్సింలు కోటగిరి పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శికి రూ.8 వేలు నగదును లంచం ఇస్తుండగా ఏసీ బీ అధికారులు దాడిచేసి కార్యదర్శి సుదర్శన్‌ను రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. ఫైల్స్ అన్నింటిని సీజ్ చేశారు. సుదర్శన్‌ను శనివారం హెదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టుకు తరలించనున్నట్లు జిల్లా రేంజ్ అధికారి సంజీవ్‌రావ్ తెలిపారు. ఎవరైన అధికారులు అంచం ఇవ్వాలని అడిగితే తమకు ఈ సెల్ నం. 94404 46155కు ఫోన్ చేయాలని సూచించారు. -
పంచాయతీ కార్యదర్శుల భర్తీలో కొత్త మలుపు
సాక్షి, సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల భర్తీ ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. నిరుద్యోగ దరఖాస్తుదారులను పక్కనపెట్టి కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులనే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ తాజా మార్గదర్శకాల అనుసారం డిగ్రీ విద్యార్హత కలిగిన కాంట్రాక్టు అభ్యర్థులను రెగ్యులరైజ్ చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పరిశీలన కోసం బుధవారం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌కు పంపించింది. ప్రస్తుతం జిల్లాలో 206 మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తుండగా, వారిలో 192 మంది డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నారు. డిగ్రీ విద్యార్హత లేని కాంట్రాక్టు కార్యదర్శుల విషయమై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా యథాస్థితిని కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది. కొలవుదీరిన ఆశానిరాశలు జిల్లాలోని 1066 గ్రామ పంచాయతీలను 514 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో పంచాయతీ కార్యదర్శి పోస్టు మంజూరు చేశారు. ప్రస్తుతం 316 పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండగా అందులో 206 మంది కాంట్రాక్టు ఉద్యోగులుండగా మిగిలిన 110 మంది రెగ్యులర్ ఉద్యోగులు. మొత్తం 504 ఖాళీలు ఉండగా ప్రభుత్వం ఈ పోస్టులను విభజించి రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు చేపట్టింది. 206 మంది కాంట్రాక్టు కార్యదర్శులను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. గతేడాది అక్టోబర్ 31న కలెక్టర్ 210 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఏపీపీఎస్సీ ద్వారా మరో 182 ఖాళీల భర్తీకి గత డిసెంబర్ 30న మరో ప్రకటన జారీ అయింది. అయితే నిరుద్యోగ అభ్యర్థుల నుంచీ దరఖాస్తులు ఆహ్వానించి ప్రభుత్వం సరికొత్త వివాదానికి శ్రీకారం చుట్టింది. 210 పోస్టులకు గాను 15,434 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి మార్కులపై వెయిటేజీ ఆధారంగా ఎంపికలు జరుపుతున్నట్లు ఆనాడు ప్రకటనలో తెలిపారు. అయితే, కాంట్రాక్టు కార్యదర్శులకు 75 మార్కులను అదనపు వెయిటేజీగా ఇచ్చారు. ఈ ప్రక్రియపై అభ్యంతరాలు తెలుపుతూ 90 మంది కాంట్రాక్టు కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో అప్పట్లో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. డిగ్రీ విద్యార్హత గల కాంట్రాక్టు కార్యదర్శులందరినీ క్రమబద్ధీకరించాలని తాజాగా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. డిగ్రీ విద్యార్హత లేని కాంట్రాక్టు అభ్యర్థుల భవితవ్యంపై ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టి యథాస్థితిని కొనసాగించాలని సూచించింది. దీంతో కాంట్రాక్టు కార్యదర్శుల్లో ఆనందం వెల్లివెరిసింది. నిరాశలో నిరుద్యోగులు పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీలో సర్కార్ అవలంబించిన ద్వంద్వ ప్రమాణాలు నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశను కలిగించాయి. ప్రకటన ద్వారా ఆశపెట్టడంతో దరఖాస్తు చేసుకున్న 15 వేల మంది అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. -
1న మార్కెట్లోకి ‘పంచాయతీ కార్యదర్శి’ స్పెషల్ బుక్లెట్
అందుబాటులో పేపర్-2 గ్రామీణాభివృద్ధి-అంశాలు వెల రూ. 50 మాత్రమే సాక్షి, హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం పోటీపడుతున్న లక్షలాది మంది అభ్యర్థుల కోసం పంచాయతీ కార్యదర్శి పేపర్-2 స్పెషల్ బుక్‌లెట్‌ను ‘సాక్షి’ అందుబాటులోకి తెచ్చింది. నిపుణులైన అధ్యాపకులు రూపొందించిన ఈ పుస్తకం ఫిబ్రవరి 1న మార్కెట్లోకి రానుంది. ఈ బుక్లెట్ వెల రూ. 50 మాత్రమే. ఈ స్పెషల్ బుక్‌లెట్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ప్రముఖ పుస్తక కేంద్రాల్లోగానీ, మీ సమీప సాక్షి ఏజెంట్‌ను గానీ సంప్రదించవచ్చు. బల్క్ ఆర్డర్ కోసం బుక్‌షాపుల యజమానులు 90100-66999 నంబర్‌కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఫోన్ చేసి పుస్తకాలను బుక్ చేసుకోవచ్చు.