పంచాయతీ కార్యదర్శుల భర్తీలో కొత్త మలుపు | government orders on panchayati secretary to permanent of contract post | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శుల భర్తీలో కొత్త మలుపు

Published Thu, Jan 30 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

government  orders on panchayati secretary to permanent of contract post

సాక్షి, సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల భర్తీ ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. నిరుద్యోగ దరఖాస్తుదారులను పక్కనపెట్టి కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులనే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ తాజా మార్గదర్శకాల అనుసారం డిగ్రీ విద్యార్హత కలిగిన కాంట్రాక్టు అభ్యర్థులను రెగ్యులరైజ్ చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం చర్యలు చేపట్టింది.

 ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పరిశీలన కోసం బుధవారం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌కు పంపించింది. ప్రస్తుతం జిల్లాలో 206 మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తుండగా, వారిలో 192 మంది డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నారు. డిగ్రీ విద్యార్హత లేని కాంట్రాక్టు కార్యదర్శుల విషయమై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా యథాస్థితిని కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది.

 కొలవుదీరిన ఆశానిరాశలు
 జిల్లాలోని 1066 గ్రామ పంచాయతీలను 514 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో పంచాయతీ కార్యదర్శి పోస్టు మంజూరు చేశారు. ప్రస్తుతం 316 పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండగా అందులో 206 మంది కాంట్రాక్టు ఉద్యోగులుండగా మిగిలిన 110 మంది రెగ్యులర్ ఉద్యోగులు. మొత్తం 504 ఖాళీలు ఉండగా ప్రభుత్వం ఈ పోస్టులను విభజించి రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు చేపట్టింది. 206 మంది కాంట్రాక్టు కార్యదర్శులను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

 గతేడాది అక్టోబర్ 31న కలెక్టర్ 210 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఏపీపీఎస్సీ ద్వారా మరో 182 ఖాళీల భర్తీకి గత డిసెంబర్ 30న మరో ప్రకటన జారీ అయింది.  అయితే నిరుద్యోగ అభ్యర్థుల నుంచీ దరఖాస్తులు ఆహ్వానించి ప్రభుత్వం సరికొత్త వివాదానికి శ్రీకారం చుట్టింది. 210 పోస్టులకు గాను 15,434 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి మార్కులపై వెయిటేజీ ఆధారంగా ఎంపికలు జరుపుతున్నట్లు ఆనాడు ప్రకటనలో తెలిపారు.

అయితే, కాంట్రాక్టు కార్యదర్శులకు 75 మార్కులను అదనపు వెయిటేజీగా ఇచ్చారు. ఈ ప్రక్రియపై అభ్యంతరాలు తెలుపుతూ 90 మంది కాంట్రాక్టు కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో అప్పట్లో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. డిగ్రీ విద్యార్హత గల కాంట్రాక్టు కార్యదర్శులందరినీ క్రమబద్ధీకరించాలని తాజాగా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. డిగ్రీ విద్యార్హత లేని కాంట్రాక్టు అభ్యర్థుల భవితవ్యంపై ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టి యథాస్థితిని కొనసాగించాలని సూచించింది. దీంతో కాంట్రాక్టు కార్యదర్శుల్లో ఆనందం వెల్లివెరిసింది.

 నిరాశలో నిరుద్యోగులు
 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీలో సర్కార్ అవలంబించిన ద్వంద్వ ప్రమాణాలు నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశను కలిగించాయి. ప్రకటన ద్వారా ఆశపెట్టడంతో దరఖాస్తు చేసుకున్న 15 వేల మంది అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement