government orders
-
అక్కడ పిల్లలకు ‘బాంబ్’, ‘గన్’ అనే పేర్లే పెట్టాలంటా.. లేదంటే?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా.. ఆ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది కిమ్ జోంగ్ ఉన్ పాలన. ఆ దేశం ఇతర దేశాలతో పోలిస్తే చాలా భిన్నం. నిరంకుశ పాలనలో ప్రపంచంతో సంబంధం లేకుండా భిన్నమైన నిబంధనలు పాటిస్తారు. వారికి సొంత క్యాలెండర్ ఉంటుంది. దేశం విడిచి వెళ్లేందుకు అనుమతులు కావాలి. విదేశీ సంగీతం అక్కడ నిషేధం. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కనీసం తల వెంట్రుకలు ఎలా కట్ చేసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వమే చెబుతుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో కొత్త, విచిత్రమైన నిబంధనను తీసుకొచ్చింది కిమ్ సర్కార్. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘బాంబ్’, ‘గన్’, ‘శాటిలైట్’ వంటి పేర్లను పెట్టాలని కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దేశభక్తి భావాన్ని పిల్లల్లో పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఉత్తర కొరియా ప్రభుత్వం పౌరుల పేర్లను నిర్ణయించటంపై వ్యతిరేకత వస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ కొరియా మాదిరిగానే.. ఇక్కడా పేర్ల చివర్లలో అచ్చులు ఉండేలా చూడాలని గతంలో సూచించగా.. తాజా నిర్ణయంతో మారిపోయాయి. భారీగా జరిమానా.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే కుటుంబాలకు భారీగా జరిమానా విధించాలని కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పలు నివేదికలు తెలిపాయి. చెప్పిన విధంగా పేర్లు లేకపోవటం సోషలిస్ట్ విధానానికి వ్యతిరేకమని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు.. కొత్త పేర్లు దక్షిణా కొరియాలో ఉండే పేర్లకు భిన్నంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఆగ్రహం.. తమ పిల్లల పేర్లను బాంబ్, గన్, శాటిలైట్ వంటి వాటితో పెట్టాలని సూచించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆదేశాలను పాటించేందుకు చాలా మంది వ్యతిరేకత చూపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తమ పేర్లను మార్చుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఉత్తర కొరియాకు చెందిన ఓ వ్యక్తి రేడియో ఫ్రీ ఆసియా(ఆర్ఎఫ్ఏ)తో తెలిపాడు. గత ఏడాది నవంబర్ నుంచే పేర్ల మార్పునకు సంబంధించిన నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
సెకండ్‌వేవ్ అలర్ట్: తెలంగాణలో మళ్లీ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మత సంబంధిత సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఆంక్షలు విధించింది. బహిరంగ స్థలాలు, పని ప్రదేశాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సామూహిక కార్యక్రమాలతో కరోనా వ్యాప్తికి ఎక్కువ ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. షబ్–ఏ–బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్‌ఫ్రైడే, రంజాన్ తదితర వివిధ మతాల పండుగలు, ఉత్సవాలకు అనుమతించడం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని బహిరంగ స్థలాలు, మైదానాలు, పార్కులు, ప్రార్థన స్థలాల్లో మత సంబంధిత ర్యాలీలు, ఊరేగింపులు, ఉత్సవాలు, సామూహిక కార్యక్రమాలు, సమావేశాలను అనుమతించబోమని పేర్కొన్నారు. చదవండి: (తెలంగాణ: ‘సెకండ్ వేవ్’.. ఆందోళనొద్దు!) ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం–2005, సంబంధిత ఇతర చట్టాల కింద కేసులు పెడతామని హెచ్చరించారు. మాస్కులు ధరించనివారిపై విపత్తుల నిర్వహణ చట్టంతో పాటు ఐపీసీలోని సెక్షన్ 188 కింద కేసులు పెడతామని తెలిపారు. ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు. దేశంలో మళ్లీ కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకోవడానికి అనుమతిస్తూ ఈ నెల 23న కేంద్ర హోమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించింది. చదవండి: (అయ్యో పాపం ఎంబీబీఎస్.. పెళ్లిళ్లు కావడం లేదు?) -
నిబంధనల మేరకే సీజేఐ ఎంపిక
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రస్తుత సీజేఐ తన తర్వాత ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేస్తారని.. అనంతరం కార్యనిర్వాహక వ్యవస్థ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సీజేఐ దీపక్ మిశ్రా పదవీ కాలం అక్టోబర్ 2న ముగియనున్న నేపథ్యంలో.. సీనియర్ అయిన రంజన్ గొగోయ్‌కు సీజేఐ పదవి దక్కుతుందా అన్న ప్రశ్నకు రవిశంకర్ ఈ సమాధానమిచ్చారు. ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసెస్ (ఏఐజేఎస్) విషయంలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య భేదాభిప్రాయాలున్న విషయాన్ని అంగీకరిస్తూనే.. కిందిస్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపికలోనూ ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే విధంగా.. పలు సంస్థలు భారతీయుల డేటాను దుర్వినియోగం చేయడాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. వీరిపై కఠిన చర్యలు తప్పవన్నారు. దీనిపై ఇప్పటికే ఫేస్బుక్ క్షమాపణలు చెప్పిందని.. కేంబ్రిడ్జ్ అనలిటికా నుంచి ఇంకా వివరాలు సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌ను రవిశంకర్ సమర్థించుకున్నారు. 121 కోట్ల మంది భారతీయులకు కేంద్ర పథకాల లబ్ధిని అందించడంలో ఆధార్ కీలకమన్నారు. ఆధార్ వ్యవస్థను మరింత పకడ్బందీగా మారుస్తున్నట్లు ఆయన చెప్పారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వాలని సీనియర్ మహిళా నేతలైన సోని యా గాంధీ, మాయావతి, మమత బెనర్జీలను మంత్రి కోరారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా స్పందిం చాల్సిన అవసరం ఉందన్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరస్తులపై కఠినంగా వ్యవహరించేలా చట్టాల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. -
పంచాయతీ కార్యదర్శుల భర్తీలో కొత్త మలుపు
సాక్షి, సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల భర్తీ ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. నిరుద్యోగ దరఖాస్తుదారులను పక్కనపెట్టి కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులనే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ తాజా మార్గదర్శకాల అనుసారం డిగ్రీ విద్యార్హత కలిగిన కాంట్రాక్టు అభ్యర్థులను రెగ్యులరైజ్ చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పరిశీలన కోసం బుధవారం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌కు పంపించింది. ప్రస్తుతం జిల్లాలో 206 మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తుండగా, వారిలో 192 మంది డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నారు. డిగ్రీ విద్యార్హత లేని కాంట్రాక్టు కార్యదర్శుల విషయమై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా యథాస్థితిని కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది. కొలవుదీరిన ఆశానిరాశలు జిల్లాలోని 1066 గ్రామ పంచాయతీలను 514 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో పంచాయతీ కార్యదర్శి పోస్టు మంజూరు చేశారు. ప్రస్తుతం 316 పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండగా అందులో 206 మంది కాంట్రాక్టు ఉద్యోగులుండగా మిగిలిన 110 మంది రెగ్యులర్ ఉద్యోగులు. మొత్తం 504 ఖాళీలు ఉండగా ప్రభుత్వం ఈ పోస్టులను విభజించి రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు చేపట్టింది. 206 మంది కాంట్రాక్టు కార్యదర్శులను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. గతేడాది అక్టోబర్ 31న కలెక్టర్ 210 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఏపీపీఎస్సీ ద్వారా మరో 182 ఖాళీల భర్తీకి గత డిసెంబర్ 30న మరో ప్రకటన జారీ అయింది. అయితే నిరుద్యోగ అభ్యర్థుల నుంచీ దరఖాస్తులు ఆహ్వానించి ప్రభుత్వం సరికొత్త వివాదానికి శ్రీకారం చుట్టింది. 210 పోస్టులకు గాను 15,434 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి మార్కులపై వెయిటేజీ ఆధారంగా ఎంపికలు జరుపుతున్నట్లు ఆనాడు ప్రకటనలో తెలిపారు. అయితే, కాంట్రాక్టు కార్యదర్శులకు 75 మార్కులను అదనపు వెయిటేజీగా ఇచ్చారు. ఈ ప్రక్రియపై అభ్యంతరాలు తెలుపుతూ 90 మంది కాంట్రాక్టు కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో అప్పట్లో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. డిగ్రీ విద్యార్హత గల కాంట్రాక్టు కార్యదర్శులందరినీ క్రమబద్ధీకరించాలని తాజాగా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. డిగ్రీ విద్యార్హత లేని కాంట్రాక్టు అభ్యర్థుల భవితవ్యంపై ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టి యథాస్థితిని కొనసాగించాలని సూచించింది. దీంతో కాంట్రాక్టు కార్యదర్శుల్లో ఆనందం వెల్లివెరిసింది. నిరాశలో నిరుద్యోగులు పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీలో సర్కార్ అవలంబించిన ద్వంద్వ ప్రమాణాలు నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశను కలిగించాయి. ప్రకటన ద్వారా ఆశపెట్టడంతో దరఖాస్తు చేసుకున్న 15 వేల మంది అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.