న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రస్తుత సీజేఐ తన తర్వాత ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేస్తారని.. అనంతరం కార్యనిర్వాహక వ్యవస్థ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
సీజేఐ దీపక్ మిశ్రా పదవీ కాలం అక్టోబర్ 2న ముగియనున్న నేపథ్యంలో.. సీనియర్ అయిన రంజన్ గొగోయ్‌కు సీజేఐ పదవి దక్కుతుందా అన్న ప్రశ్నకు రవిశంకర్ ఈ సమాధానమిచ్చారు. ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసెస్ (ఏఐజేఎస్) విషయంలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య భేదాభిప్రాయాలున్న విషయాన్ని అంగీకరిస్తూనే.. కిందిస్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపికలోనూ ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.
దేశ ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే విధంగా.. పలు సంస్థలు భారతీయుల డేటాను దుర్వినియోగం చేయడాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. వీరిపై కఠిన చర్యలు తప్పవన్నారు. దీనిపై ఇప్పటికే ఫేస్‌బుక్ క్షమాపణలు చెప్పిందని.. కేంబ్రిడ్జ్ అనలిటికా నుంచి ఇంకా వివరాలు సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌ను రవిశంకర్ సమర్థించుకున్నారు.
121 కోట్ల మంది భారతీయులకు కేంద్ర పథకాల లబ్ధిని అందించడంలో ఆధార్ కీలకమన్నారు. ఆధార్ వ్యవస్థను మరింత పకడ్బందీగా మారుస్తున్నట్లు ఆయన చెప్పారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వాలని సీనియర్ మహిళా నేతలైన సోని యా గాంధీ, మాయావతి, మమత బెనర్జీలను మంత్రి కోరారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా స్పందిం చాల్సిన అవసరం ఉందన్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరస్తులపై కఠినంగా వ్యవహరించేలా చట్టాల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment