'సంక్షోభం' సమసేందుకు! | Supreme Court: Three legal eagles decode the Supreme Court crisis | Sakshi
Sakshi News home page

'సంక్షోభం' సమసేందుకు!

Published Sun, Jan 14 2018 2:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Supreme Court: Three legal eagles decode the Supreme Court crisis - Sakshi

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సంక్షోభానికి వీలైనంత త్వరగా ముగింపు పలికేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్, అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ల పర్యవేక్షణలో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), మిగిలిన నలుగురు న్యాయమూర్తుల మధ్య సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఈ సంప్రదింపుల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా కూడా ఆ నలుగురితో ఆదివారం సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. జస్టిస్‌ జోసెఫ్‌ కురియన్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌లు వేర్వేరు వేదికలపై చేసిన వ్యాఖ్యలు సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుందనే సంకేతాలనిచ్చాయి. 

జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మినహా మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు ఢిల్లీలో అందుబాటులో లేకపోవటంతో.. వీరంతా ఆదివారం రాజధానికి చేరుకున్న తర్వాత సీజేఐ వీరితో మాట్లాడనున్నట్లు సమాచారం. కాగా, ఇది న్యాయవ్యవస్థ అంతర్గత వివాదమని.. ఇందులో బయటివారి జోక్యం అవసరం లేదని జస్టిస్‌ కురియన్‌ పేర్కొన్నారు. అటు, అందరు సుప్రీం న్యాయమూర్తులతో సమావేశమై సమస్యను పరిష్కరించేందుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఏడుగురు సభ్యు ల బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసుల కేటాయింపులో సీజేఐ తీరును నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిరసించిన సంగతి తెలిసిందే. 

రంగంలోకి బార్‌ కౌన్సిల్‌ 
మరోవైపు సమస్య పరిష్కారంలో చొరవతీసుకోవాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) నిర్ణయించింది. న్యాయమూర్తులతో చర్చించేందుకు ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ బృందం ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ కలిసి వీలైనంత త్వరగా వివాదం సమసిపోయేందుకు వారితో చర్చిస్తుందని బీసీఐ అధ్యక్షుడు మనన్‌ మిశ్రా వెల్లడించారు. ‘మేం మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదాన్ని రాజకీయం చేయాల్సిన పనిలేదని, రాజకీయ పార్టీలేమీ ఈ వివాదంలో జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని (పరోక్షంగా రాహుల్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ) ఆయన హెచ్చరించారు.

 ‘ఈ వివాదంలో జోక్యం చేసుకోబోమని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అంతర్గత సమావేశాల ద్వారానే ఈ వివాదం పరిష్కారమవుతుంది’ అని మనన్‌ మిశ్రా తెలిపారు. అటు, ఈ వివాద పరిష్కారంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా చొరవతీసుకోవాలని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) తీర్మానం చేసింది. జనవరి 15న విచారణకు రానున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సీజేఐ నేతృత్వంలోని బెంచ్‌ లేదా కొలీజియం సభ్యులున్న ఇతర ధర్మాసనాలకు బదిలీ చేయాలని కోరింది. 

సీజేఐ ఇంటికి మోదీ దూత! 
అటు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా శనివారం ఉదయం సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే సీజేఐ ఇంటిగేటు తెరవకపోవటంతో తన కారులోనే కాసేపు వేచి ఉండి.. అనంతరం తిరిగి వెళ్లినట్లు టీవీ కెమెరాల్లో రికార్డయింది. దీనిపై కాంగ్రెస్‌ విమర్శలు చేసింది. ప్రధాని తన వ్యక్తిగత కార్యదర్శిని ప్రత్యేక దూతగా సీజేఐ వద్దకు పంపేందుకు ప్రయత్నించారని విమర్శించింది. దీనికి ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. వివాదానికి కారణమైన వ్యక్తులే చొరవతీసుకుని సమస్యను పరిష్కరించుకోలేని నేపథ్యంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ కోరారు.

 అయితే.. నలుగురు న్యాయమూర్తులు ధైర్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను చెవిటి, మూగ వ్యవస్థగా మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. కాగా, కేబినెట్‌ మంత్రులు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లా బయటకొచ్చి మాట్లాడాలని.. వారిలో నెలకొన్న భయాన్ని పక్కనపెట్టాలని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా సూచించారు. పార్లమెంటు రాజీపడి, సుప్రీంకోర్టు సరైన విధంగా నడవని పక్షంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన పేర్కొన్నారు.  

‘దురుద్దేశంతోనే పిటిషన్‌’ 
సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీహెచ్‌ లోయా మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ దురుద్దేశంతోనే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైందని బాంబే లాయర్ల అసోసియేషన్‌(బీఎల్‌ఏ) ఆరోపించింది. ఈ విషయంపై తాము బాంబే హైకోర్టులో వేసిన పిటిషన్‌ విచారణను అడ్డుకోవడానికే జర్నలిస్టు బీఆర్‌ లోనె సుప్రీంకోర్టులో ఆ పిటిషన్‌ దాఖలుచేసినట్లు పేర్కొంది. 

కేసుల కేటాయింపులో సీజేఐ మిశ్రా అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ నలుగురు జడ్జీలు గళమెత్తిన నేపథ్యంలో బీఎల్‌ఏ అధ్యక్షుడు అహ్మద్‌ అబ్ది శనివారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. జనవరి 4న తాము బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేసిన తరువాతే లోనె సుప్రీంకోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానం పరిధికి చేరిన విషయాన్ని బాంబే హైకోర్టు విచారణకు చేపట్టకుండా చూసేందుకు దురుద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు. 

సమస్య పరిష్కారమైనట్లే: జస్టిస్‌ కురియన్‌
సుప్రీంకోర్టులో రాజ్యాంగ సంక్షోభమేమీ లేదని.. తాము లేవనెత్తిన సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని జస్టిస్‌ కురియన్‌ కొచ్చిలో వెల్లడించారు. ‘రాజ్యాంగ సంక్షోభమేమీ లేదు. విధానంలోని లోపాలను సరిదిద్దాలనేదే మా అభిమతం. సీజేఐకి ఇచ్చిన లేఖలో ప్రతి అంశాన్నీ పేర్కొన్నాం. ఈ లేఖను రెండు నెలల క్రితమే ఆయనకు ఇచ్చాం’ అని తెలిపారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేందుకు మాత్రమే అధికారమున్నందున ఆయనకు ఈ విషయాన్ని వెల్లడించలేదన్నారు. ‘మేం ఓ కారణం కోసం దీన్ని లెవనెత్తాం.

 ఈ సమస్య త్వరగానే పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. ఇది ఎవరికీ వ్యతిరేకంగా చేస్తున్నది కాదు. మాకు వ్యక్తిగత విభేదాలేమీ లేవు. పారదర్శకత ఉండాలనేదే మా అభిప్రాయం’ అని జస్టిస్‌ కురియన్‌ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం బయటివారు చొరవతీసుకోవాల్సిన పనేం లేదని జస్టిస్‌ కురియన్‌ పేర్కొన్నారు. ‘విషయాన్ని లేవనెత్తాం. సంబంధించిన వాళ్లు దీన్ని విన్నారు. 

ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదు. సమస్య పరిష్కారమైందని నేను భావిస్తున్నాను. న్యాయవ్యవస్థ అంతర్గతంగా నెలకొన్న వివాదమిది. దీనిలో వేరే వ్యక్తుల జోక్యం అవసరం లేదు. వ్యవస్థే ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది’ అని ఆయన తెలిపారు. ‘సీజేఐ తరపునుంచి ఎలాంటి రాజ్యాంగపరమైన పొరపాటు జరగలేదు. కానీ ఆయన బాధ్యతల నిర్వహణలో సంప్రదాయ విధివిధానాలను అనుసరించాల్సింది. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. మార్పు చేసుకోవటం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మేం న్యాయం కోసం నిలబడ్డాం’ అని ఆయన పేర్కొన్నారు. 

కోల్‌కతాలో జరిగిన ఓ న్యాయసేవ కార్యక్రమంలో పాల్గొన్న మరో న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కూడా సంక్షోభమేమీ లేదని వెల్లడించారు. కాగా, ఈ వివాదం సోమవారం కల్లా పరిష్కారమవుతుందని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ధీమాగా చెప్పారు. ‘సోమవారానికల్లా న్యాయమూర్తుల మధ్య ఐక్యత నెలకొంటుంది. న్యాయవ్యవస్థ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యకు పరిష్కారం లభిస్తుంది. న్యాయమూర్తులు మేధావులు, అనుభవజ్ఞులు, రాజనీతిజ్ఞత గలవారు. వివాదాన్ని మరింత పెద్దది చేయాలని వారనుకోరు’ అని వేణుగోపాల్‌ పేర్కొన్నారు. 

17 నుంచి 8 కీలక కేసులపై విచారణ
ఒకవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియరు న్యాయమూర్తుల మధ్య వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు జనవరి 17 నుంచి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు 8 కీలక అంశాలపై విచారణ చేపట్టనున్నాయి. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజ్యాంగ పరంగా ఆధార్‌ చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న అంశాన్ని తేల్చడంతో పాటు 2013లో స్వలింగ సంపర్కం కేసులో తానిచ్చిన తీర్పును ఈ రాజ్యాంగ ధర్మాసనాలు పునః పరిశీలిస్తాయి.

 వివాదాస్పద అంశమైన కేరళలోని శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలకు ప్రవేశంపై నిషేధంతో పాటు, వేరే మతస్తుడిని పార్శీ మహిళ పెళ్లి చేసుకుంటే తన మత గుర్తింపును కోల్పోతుందా? అన్న విషయాన్ని కూడా ఈ రాజ్యాంగ ధర్మసనాలు విచారించనున్నాయి. వ్యభిచారం కేసుల్లో ఐపీసీ సెక్షన్‌ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన కేసును కూడా సుప్రీంకోర్టు చేపట్టనుంది. వివాహేతర సంబంధం కేసుల్లో కేవలం పురుషుడినే శిక్షించేందుకు అవకాశమిస్తోన్న ఈ ఐపీసీ సెక్షన్‌ చెల్లుబాటును రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. 

అలాగే చట్టసభ్యులు ఎప్పుడు క్రిమినల్‌ విచారణ ఎదుర్కొంటారు.. వారి అనర్హతకు సంబంధించిన పిటిషన్‌ కూడా విచారణకు రానుంది. ఈ అంశాల్ని ఇంతకముందే విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనాలు.. కీలక అంశాలు కావడంతో రాజ్యాంగ ధర్మాసనాలకు సిఫార్సు చేశాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement