న్యూఢిల్లీ: పెండింగ్ కేసుల భారానికి తోడు న్యాయమూర్తుల కొరత రూపంలో కొత్త సంవత్సరంలో సుప్రీంకోర్టు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేలా కన్పిస్తోంది. ఈ ఏడాది 9 మంది న్యాయమూర్తులు రిటైర్ కానున్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీకాలం జనవరి 4న, జస్టిస్ ఎంఆర్ షా మేలో, జస్టిస్ కేఎం జోసెఫ్, అజయ్ రస్తోగీ, వి.రామసుబ్రమణియం జూన్‌లో, జస్టిస్ కృష్ణ మురారి జూలైలో, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ అక్టోబర్లో, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పదవీకాలం డిసెంబర్లో ముగియనుంది.
ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆరు ఖాళీలున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ మూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థపై న్యాయ వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో ఈ ఖాళీలన్నింటినీ సకాలంలో భర్తీ చేయడం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు సవాలు కానుంది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులుండాలి. ప్రస్తుతం 28 మంది ఉన్నారు. కొలీజియం గత భేటీలో ఐదుగురి పేర్లను సిఫార్సు చేసింది. వీటిలో కొన్నింటిని కేంద్ర న్యాయ శాఖ త్వరలో ఆమోదించవచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment