
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంచే యోచన లేదని న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. సుప్రీం, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయోపరిమితిని రెండేళ్ల చొప్పున పెంచేందుకు ప్రభుత్వం బిల్లు రూపొందిస్తోందంటూ వచ్చిన వార్తలపై ఆయన ఈ వివరణ ఇచ్చారు. జస్టిస్ రంజన్ గొగోయ్‌కు ప్రమోషన్ రాకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును మరో రెండేళ్లకు పెంచుతోందంటూ మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ట్విట్టర్‌లో అంతకు కొద్దిసేపటి ముందే ఆరోపించారు.
ప్రస్తుతం సుప్రీం, హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సులు వరుసగా 65, 62 ఏళ్లు. హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు 62 నుంచి 65కు పెంచుతూ 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం బిల్లు రూపొందించి, లోక్‌సభలో కూడా ప్రవేశపెట్టింది. అయితే, చర్చ జరగలేదు. అనంతరం 2014లో లోక్‌సభ రద్దు కావటంతో ఈ బిల్లు కాలపరిమితి ముగిసిపోయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 31 జడ్జీలకు గాను 22 మంది.. దేశవ్యాప్తంగా ఉన్న 24 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తులకు గాను 673 మందే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment