సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ప్రధానితో పాటు ప్రజలందరినీ రాహుల్ తీవ్రంగా అవమానించాడని అన్నారు. అలాగే ప్రాన్స్ అధ్యక్షుడి వ్యాఖ్యలను కూడా రాహుల్ వక్రీకరించారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని ఉద్దేశించిన రాహుల్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలను చేయవద్దని సూచించింది. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన పలువురు కేంద్ర మంత్రులు విపక్షాలు ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవుపలికారు. దేశ ప్రజలందరికీ రాహుల్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు, ఇటీవల సుప్రీంతీర్పుని సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. అలాగే కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్ డీల్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్ధారించింది. తద్వారా వివాదాస్పదమైన రాఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చినట్టైంది.
Comments
Please login to add a commentAdd a comment