retirement age extend
-
ఫ్రాన్స్‌లో ప్రత్యేక అధికారాలతో పెన్షన్ బిల్లుకు ఆమోదం
పారిస్: ఫ్రాన్స్ ప్రభుత్వం పెన్షన్ సంస్కరణల్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతోంది. దేశ పార్లమెంటులో ఓటింగ్ జరగకుండానే బిల్లు చట్టరూపం దాల్చేలా ప్రత్యేకమైన రాజ్యాంగ అధికారాన్ని పొందేలా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్యలు తీసుకున్నారు. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ల నుంచి 64 సంవత్సరాలకు పెంచుతూ తీసుకుని వచ్చిన ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీలోని దిగువ సభలో ఆమోదం పొందే అవకాశం లేదు. అందుకే ఓటింగ్‌కి కొన్ని నిమిషాల ముందు ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్ చట్టసభలు ఆమోదించకుండానే బిల్లు చట్టంగా మారేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 49:3ని వినియోగించుకున్నారు. ఈ కొత్త పెన్షన్ బిల్లుపై గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. -
France: ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్.. ఎందుకీ వ్యతిరేకత?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ పెన్షన్ సంస్కరణలు దేశ చరిత్రలో అతి పెద్ద నిరసన ప్రదర్శనకు దారి తీశాయి. పదవీ విరమణ వయసుని 62 నుంచి 64కి పెంచుతూ ప్రతిపాదనలు చేసినందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పెన్షన్ అందుకోవడానికి మరో రెండేళ్లు పని చేయాలా అంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాఠశాలలు తెరుచుకోలేదు. కార్యాలయాలు మూతబడ్డాయి. ఈఫిల్ టవర్‌ను మూసేశారు. పారిస్ సహా పలు నగరాల్లో 10 లక్షల మందికిపైగా నిరసనకారులు వీధుల్లోకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 12 ట్రేడ్ యూనియన్లు, లెఫ్ట్ పార్టీలు, ఫార్ రైట్ పార్టీలు కలసికట్టుగా ఈ ఆందోళనల్లో పాల్గొనడం విశేషం. దేశంలో 68% ప్రజలు ఈ పెన్షన్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. రైట్ పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే పెన్షన్ సంస్కరణల బిల్లుకు ఎంతవరకు మద్దతు లభిస్తుందన్న అనుమానాలున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంపు ఎందుకు? ప్రపంచమంతటా సగటు ఆయుఃప్రమాణం పెరుగుతోంది. జననాల రేటు తగ్గిపోతోంది. దీంతో వయసు మీద పడినా కష్టపడి పని చేయాల్సి వస్తోంది. అయితే రిటైర్మెంట్ వయసు యూరప్‌లోకెల్లా ఫ్రాన్స్‌లోనే తక్కువ. స్పెయిన్‌లో 65, యూకేలో 67, జర్మనీలో 67 ఏళ్లుగా ఉంది. జర్మనీ కూడా రిటైర్మెంట్ వయసును 70 ఏళ్లకు పెంచే యోచనలో ఉంది. ఫ్రాన్స్ కూడా పెన్షన్ నిధుల్ని పెంచుకోవడానికే ఈ సంస్కరణలను తీసుకొచ్చింది. రెండేళ్ల రిటైర్మెంట్ వయసు పెంపుతో ఏడాదికి 1,770 కోట్ల యూరోలు జమ అవుతాయి. 2027 నాటికి బ్రేక్ ఈవెన్ సాధ్యపడుతుంది. ఎందుకీ వ్యతిరేకత? హాయిగా ఇంటి పట్టున ఉండి పెన్షన్ అందుకుందామని అనుకున్న వారు మరో రెండేళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరు. ఇంకా పని చేస్తే రిటైరవక ముందే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని రైల్వే వర్కర్లు, మహిళలు, నైట్‌షిఫ్ట్‌ల్లో ఉండేవారు ఆందోళనగా ఉన్నారు. కనీసం 43 ఏళ్లు పని చేయాలన్న నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆలస్యంగా మొదలు పెట్టే మహిళలు, ఉన్నత విద్య చదివే వారు 67 ఏళ్ల దాకా పని చేయాల్సి వస్తుంది. మరోవైపు నిరుద్యోగులు కూడా తమకు ఉద్యోగాలు లేటవుతాయంటూ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌లో కనీస పెన్షన్ పెరుగుతున్న ధరలకి అనుగుణంగా లేదు. కరోనా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ధరాభారం పెరిగింది. ఫ్రాన్స్‌లో పెన్షన్ సంస్కరణలపై నిరసనలు ఇదేం మొదటి సారి కాదు. 2010లో రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచినప్పుడు కూడా ఇదే స్థాయి వ్యతిరేకత ఎదురైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడయ్యాక మాక్రాన్ ఈ సంస్కరణలు తేవాలని గట్టిగా అనుకున్నారు. 2019లో ఈ ప్రతిపాదిత సంస్కరణలకి వ్యతిరేకంగా సమ్మె జరిగినా కరోనా సంక్షోభంతో సమ్మెని ఆపేశారు. పెన్షన్ నిధి పెంచుకోవాలంటే సంపన్నులకి పన్నులు పెంచాలని, పెన్షన్ పథకంలో యాజమాన్యాల వాటాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ పథకంలో సంస్కరణలివే ► రిటైర్మెంట్ వయసును ఏడాదికి మూడు నెలల చొప్పున పెంచుతూ 2030 నాటికి 64 ఏళ్లకు పెంచడం. ► 2027 తర్వాత చేరే ఉద్యోగులెవరైనా పూర్తి పెన్షన్ కోసం కనీసం 43 ఏళ్లు పని చేయాలి. ► పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రిటైరయే నాటికి 43 ఏళ్ల సర్వీసు లేకపోతే 67 ఏళ్లు వచ్చేదాకా పని చేస్తేనే పెన్షన్ లభిస్తుంది. ► పూర్తి కాలం ఉద్యోగం చేసిన అల్పాదాయ వర్గాలకు 85% పెంపుతో పెన్షన్ 1200 యూరోలు అవుతుంది. 20 లక్షల మంది చిన్న ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ‘‘నేను ఒక కాస్మటిక్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా కార్యాలయంలో పని చేసే పరిస్థితుల్లేవు. మరో రెండేళ్లు పనిచేయాలంటే నా వల్ల కానేకాదు. ఈ పెన్షన్ బిల్లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు’’ – వర్జీనియా, మహిళా ఉద్యోగి ‘‘నేను రైల్వేల్లో పనిచేస్తాను. శారీరక శ్రమ చేయాలి. చేతులు, కాళ్లు విరగ్గొట్టుకుంటూ పని చేస్తున్నాను.ఈ పరిస్థితుల్లో ఎన్నేళ్లు వచ్చే వరకు పని చెయ్యగలను. కనీసం 43 ఏళ్ల సర్వీసు ఉంటేనే పెన్షన్ వస్తుందనడం చాలా అన్యాయం’’ – రైల్వే కార్మికుడు ఇక వృద్ధులు భారమేనా..? ► ప్రపంచ దేశాలు పెన్షన్లను ఖరీదైన వ్యవహారంగా పరిగణిస్తున్నాయి. అమెరికాలో 50 ఏళ్ల క్రితం ప్రతీ 10 మందిలో 8 మందికి డిఫైన్డ్ బెనిఫిట్ పథకాలు వర్తిస్తే ఇప్పుడు ప్రతీ 10 మందిలో ఒక్కరికే వర్తిస్తోంది. ► ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం వృద్ధులలో దాదాపు మూడో వంతు మందికి పెన్షన్‌పై భరోసా లేదు. కొందరికి పెన్షన్ వస్తున్నా అది వారి కనీస అవసరాలకి ఏ మూలకూ సరిపోవడం లేదు. ► వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు ఆర్థికంగా అండదండగా ఉంటారన్న నమ్మకం లేదు. ఎందుకంటే పిల్లల సంఖ్య కూడా ప్రపంచమంతటా క్రమక్రమంగా తగ్గిపోతోంది. కుటుంబంలో పిల్లల సంఖ్య సగటున 1.7కి పడిపోయింది. ► 1960వ దశకంలో ప్రపంచ జనాభాలో ఒక వృద్ధునికి సగటున 12 మంది పని చేసే శ్రామికుల చొప్పున ఉండేవారు. కానీ ప్రస్తుతం అలా పని చేసేవారి సంఖ్య ఏకంగా ఎనిమిదికి పడిపోయింది! 2050 నాటికల్లా ఈ సంఖ్య మరీ తక్కువగా 4కు పడిపోతుందని అంచనా. దీంతో పని చేయలేని వృద్ధులను ప్రభుత్వాలు భారంగా చూసే రోజులొస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిర్వాసితులపై ‘సింగరేణి’ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెరగనుంది. సోమవారం భేటీ అయిన సింగరేణి బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. 2021-22 ఏడాదికి సీఎస్ఆర్ ఫండ్ కోసం రూ.61 కోట్లు కేటాయించింది. ఇక సింగరేణి నిర్వాసిత కాలనీలకు సంబంధించి 201 ప్లాట్ల కేటాయించాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంది. -
తెలంగాణలో కొత్త చట్టం.. సంబరాల్లో ఉద్యోగులు!
హైదరాబాద్: ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తాజా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తీసుకొచ్చిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ–2021 .. మార్చి 30తో అమల్లోకి వచ్చి నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. దీంతో మార్చి 31తో పదవీ విరమణ చేయాల్సి ఉన్న వందల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించింది. ఈ నిర్ణయంతో రానున్న మూడేళ్లలో 40 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంచడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అలాగే.. కొత్త ఉద్యోగ నియామకాలకు ఆటంకం కలగదన్నారు. గురువారం శాసనసభలో పెన్షన్ సవరణ బిల్లును, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును మంత్రి ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మాజీ శాసనసభ్యుల పెన్షన్‌ను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే.. అప్పర్ సీలింగ్ రూ.70 వేలుగా ఖరారు చేసినట్లు చెప్పారు. వైద్య చికిత్సల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు పెంచుతున్నట్లు మంత్రి సభకు వివరించారు. ఈ పథకాన్ని మాజీ సభ్యులతో పాటు వారి సహ చరులు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే భాగన్న వైద్య చికిత్స సమయంలో సీలింగ్ రూ.లక్ష మాత్రమే ఉండటంతో మరింత నగదు చెల్లించాల్సి వచ్చిందని, అప్పట్లో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకూడదని సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ 61కి పెంపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇదివరకే నాల్గో తరగతి ఉద్యోగులకు అరవై ఏళ్లు, ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బందికి 65 సంవత్సరాలు, న్యాయ సిబ్బందికి 60 ఏళ్లు పదవీ విరమణ వయోపరిమితి ఉందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో 60 ఏళ్ల వరకు ఉందన్నారు. ఉద్యోగుల సీనియార్టీని, అనుభవాన్ని వినియోగించు కునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వేతన సవరణ సంఘం కూడా ఈ మేరకు ప్రతిపాదించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మానవుని సగటు జీవిత కాలం కూడా పెరిగిందని, దీంతో ఉద్యోగులకు మరో మూడేళ్ల పాటు పనిచేసే వెసులుబాటు ఇస్తున్నామని ఆయన వివరించారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు మరో తీపి కబురు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచుతూ బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. 52 రోజుల సుదీర్ఘ సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికులతో చర్చల సందర్భంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచుతూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి భవన్లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష: తెలంగాణ ఆర్టీసీపై ప్రగతి భవన్లో బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించడం, సరుకు రవాణా విభాగాన్ని పటిష్టం చేయడం, కార్మికులకు ఇచ్చిన హమీల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించి, పలు సూచనలు చేశారు. ఆర్టీసీలో కార్గో, పార్శిల్ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినట్లే, అన్ని చోట్లకూ సరుకు రవాణా చేయాలని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సీఎం బోర్డు కూర్పు, పని విధానాన్ని కూడా ఖరారు చేశారు. సమీక్ష సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ, ఈడీ పాల్గొన్నారు. -
జూడాల సమ్మెతో స్తంభించిన వైద్యసేవలు
సాక్షి,హైదరాబాద్: ‘నల్లగొండ జిల్లా రామన్నపేటకు చెందిన మురళీ గతకొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం బుధవారం ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నాడు. తీరా న్యూరో ఓపీలో వైద్యులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక మహబూబ్‌నగర్‌కు చెందిన రాజ్యలక్ష్మి గర్భంతో ఉంది. సాధారణ వైద్య పరీక్షల కోసం ఉదయం ఏడు గంటలకే పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చేరుకుంది. ఓపీలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఎదురు చూడాల్సి వచ్చింది. సుదూర ప్రాంతం నుంచి ఆస్పత్రికి చేరుకున్న ఆమె ఉదయం నుంచి ఏమీ తిన కుండా క్యూలో నిలబడటం వల్ల, నీరసంతో సొమ్మసిల్లిపడిపోయింది. ఇక పటాన్‌చెరుకు చెందిన కవిత సుస్తీ చేసిన తన కుమా రుడిని చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఓపీ వైద్యులు పట్టించు కోకపోవడంతో ఆమె పక్కనే ఉన్న ప్రైవేటు ఆస్పత్రి వైద్యు డిని ఆశ్రయించాల్సి వచ్చింది’. ఇలా ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న ఆస్పత్రుల్లో జూడాల సమ్మెతో అవుట్‌పేషెంట్ సర్వీ సులు స్తంభించి పోయాయి. ఓపీ బహిష్కరించి...ఆందోళన ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ డాక్టర్ల సంఘం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ పెంపువల్ల తమకు ఉద్యోగాలు దక్కకపోగా, ఇప్పటికే రెసిడెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్న వైద్యులు పదోన్నతులు పొందే అవకాశాన్ని కోల్పో యే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ఈ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 4 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రులతో పాటు పేట్లబురుజు, నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం, కోటి చెవిముక్కుగొంతు ఆస్పత్రి, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రుల్లోని జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఆందోళనలో భాగంగా ఓపీ సేవలను బహిష్కరించి, ఆయా ఆస్పత్రులు పరిపాలన భవనాల ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఓపీ, ఐపీ సేవలు స్తంభించిపోయాయి. సగానికిపైగా చికిత్సలు వాయిదా అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకున్నప్పటికీ...అత్యవసర చికిత్సల్లో సహాయపడే జూడాలు సమ్మెలో ఉండటంతో ఆయా చికిత్సలు వాయిదా వేయాల్సి వచ్చింది. గాంధీ జనరల్ ఆస్పత్రి సహా ఉస్మానియా ఆస్పత్రిలోనూ బుధవారం సగానికి పైగా చికిత్సలు వాయిదా పడ్డాయి. ఇన్పేషెంట్లుగా అడ్మిటై..బుధవారం ఆయా ఆపరేషన్ థియేటర్ల వద్దకు చేరుకున్న రోగులకు చికిత్సలు వాయిదా వేసినట్లు చెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక ఉస్మానియాలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. వివిధ రుగ్మతలతో బాధపడుతూ ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిటైన రోగులకూ ఇబ్బందులు తప్పలేదు. మంత్రి హామీతో సమ్మె విరమణ జూనియర్ వైద్యుల సమస్యను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లేందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ నెల 21 తర్వాత సీఎం కేసీఆర్‌తో చర్చలకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సమ్మెను విరమించి, విధుల్లో చేరాలని కోరడంతో మంత్రి హామీ మేరకు తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. -
జడ్జీల వయోపరిమితి పెంపు లేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంచే యోచన లేదని న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. సుప్రీం, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయోపరిమితిని రెండేళ్ల చొప్పున పెంచేందుకు ప్రభుత్వం బిల్లు రూపొందిస్తోందంటూ వచ్చిన వార్తలపై ఆయన ఈ వివరణ ఇచ్చారు. జస్టిస్ రంజన్ గొగోయ్‌కు ప్రమోషన్ రాకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును మరో రెండేళ్లకు పెంచుతోందంటూ మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ట్విట్టర్లో అంతకు కొద్దిసేపటి ముందే ఆరోపించారు. ప్రస్తుతం సుప్రీం, హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సులు వరుసగా 65, 62 ఏళ్లు. హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు 62 నుంచి 65కు పెంచుతూ 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం బిల్లు రూపొందించి, లోక్‌సభలో కూడా ప్రవేశపెట్టింది. అయితే, చర్చ జరగలేదు. అనంతరం 2014లో లోక్‌సభ రద్దు కావటంతో ఈ బిల్లు కాలపరిమితి ముగిసిపోయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 31 జడ్జీలకు గాను 22 మంది.. దేశవ్యాప్తంగా ఉన్న 24 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తులకు గాను 673 మందే ఉన్నారు. -
మా రాష్ట్రానికెళ్తాం... పంపేయండి!
* తెలంగాణలోని 812 మంది ఆంధ్రా ఉద్యోగులు వినతి * ఏపీలో విరమణ వయసు పెంపుతో అనూహ్య నిర్ణయం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచడంతో తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు పలువురు ఆంధ్రాకు పంపేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఏకంగా 812 మంది ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరుకు, వచ్చే నెలాఖరుకు పదవీ విరమణ కానున్న 812 మంది ఉద్యోగులు తమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ నెలాఖరులోగా పంపించేయాలని దరఖాస్తులో కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్వచ్చంధంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతామని ఆ దరఖాస్తులో ఉద్యోగులు వివరించారు. ఈ దరఖాస్తులన్నింటినీ ఆయా శాఖల అధికారులు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు సమర్పించారు. ఇందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు స్వచ్చంధంగా ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు ఆ రాష్ట్రానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండగా అభ్యంతరం పెట్టడంలో అర్ధం ఉండదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రాకు వెళ్లిపోతామని ధరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల్లో రాష్ట్ర కేడర్‌కు చెందిన వారుతో సహా మెరిట్లో 20 శాతం కోటాతో తెలంగాణలో నియామకమైన వారు కూడా ఉన్నారు. కమలనాధన్ కమిటీ పరిధిలోకి రాష్ట్ర కేరడ్ పరిధిలోని ఉద్యోగులు మాత్రమే వస్తారు. మెరిట్ కోటాలో తెలంగాణకు వచ్చిన ఉద్యోగుల విభజన అనేది కమలనాధన్ కమిటీ పరిధిలోకి రాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వచ్చిన దరఖాస్తులను సోమవారం కమలనాధన్ కమిటీ ముందు ఉంచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. స్వచ్చంధంగా వెళ్లిపోతానన్న రాష్ట్ర కేడర్ ఉద్యోగుల విషయంలో కమలనాధన్ కమిటీ ఎటువంటి వైఖరిని అవలంభిస్తుందో వేచి చూడాల్సి ఉంది.