
హైదరాబాద్: ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తాజా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తీసుకొచ్చిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ–2021 .. మార్చి 30తో అమల్లోకి వచ్చి నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు.
దీంతో మార్చి 31తో పదవీ విరమణ చేయాల్సి ఉన్న వందల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించింది. ఈ నిర్ణయంతో రానున్న మూడేళ్లలో 40 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.