Gazette released
-
Telangana: ఇకపై ‘టీఎస్’ బదులు ‘టీజీ’.. కేంద్రం గెజిట్ విడుదల
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను టీఎస్ నుంచి టీజీగా వాడనున్నారు. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణాశాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి.. 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ మార్పు చేసినట్లు తెలిపింది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద.. తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్ కేటాయించినట్లు వెల్లడించింది. అయితే, గత నెల ఫిబ్రవరిలో తెలంగాణ కేబినెట్ వాహనాల రిజిస్ట్రేషన్లు మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీఎస్ నుంచి టీజీగా మార్పు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అనుబంధంగా మంగళవారం రవాణా, రహదారుల శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకనుంచి రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ టీజీగా మారనుంది. -
‘రీజినల్’ రెండో గెజిట్ విడుదల.. అభ్యంతరాలకు 21 రోజుల గడువు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి రెండో గెజిట్ విడుదలైంది. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంపీటెంట్ అథారిటీలోని 8 మంది అధికారులకుగాను ముగ్గురు అధికారుల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లను పేర్కొంటూ 3 (క్యాపిటల్ ఏ)గా పిలిచే ఈ గెజిట్‌ను గురువారం కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. యాదాద్రి–భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్, అదే జిల్లా పరిధిలోని చౌటుప్పల్ ఆర్డీవో, సంగారెడ్డి జిల్లా అందోల్–జోగిపేట ఆర్డీఓల పరిధిలోని 31 గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లు, దాని పరిధిలో సేకరించాల్సిన భూముల విస్తీర్ణాన్ని ఇందులో పేర్కొన్నారు. సేకరించే భూమిలో 617 హెక్టార్లకు సంబంధించిన సర్వే నంబర్ల వివరాలను ఈ గెజిట్‌లో పొందుపరిచారు. కంపీటెంట్ అథారిటీలో భాగంగా ఉన్న యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలోని గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వెలుపుపల్లె, మల్లాపూర్, దత్తార్‌పల్లె గ్రామాలకు సంబంధించి 208.6090 హెక్టార్ల భూమిని సమీకరించనున్నట్లు గెజిట్‌లో వివరించారు. చదవండి👉🏼 మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు.. అలాగే సంగారెడ్డి జిల్లా అందోల్–జోగిపేట ఆర్డీఓ పరిధిలోని శివ్వంపేట, వెండికోల్, వెంకటకిష్టాపూర్ (అంగడి), లింగంపల్లి, కోర్పోల్ గ్రామాలకు సంబంధించి 108.9491 హెక్టార్ల భూమిని సమీకరించనున్నారు. ఇక చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలోని చిన్నకొండూరు, వెర్కట్‌పల్లె, గోకారం, పొద్దటూరు, వలిగొండ, సంగం, చౌటుప్పల్, లింగోజీగూడెం, పంతంగి, పహిల్వాన్పూర్, కంచెన్‌పల్లె, టేకులసోమారం, రెడ్లరాపాక, నేలపట్ల, తల్లసింగారం, స్వాములవారి లింగోటం, తంగేడుపల్లె గ్రామాలకు సంబంధించి 300.3820 హెక్టార్ల భూమిని సమీకరించనున్నారు. అభ్యంతరాలకు 21 రోజుల గడువు.. విడుదలైన ముగ్గురు కంపీటెంట్ అధికారుల అధీనంలోని ప్రాంతాల ప్రజలు పత్రికాముఖంగా గెజిట్ ప్రచురితమైన రోజు నుంచి 21 రోజుల్లోపు అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలపై సమాధానాలు వెలువడ్డ తర్వాత రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల నిడివి ఎక్కడ ఉండనుందో రెవెన్యూ అధికారులు హద్దులు గుర్తించి రాళ్లు పాతనున్నారు. దీన్ని డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం పరికరాల శాటిలైట్ శాస్త్రీయ సర్వేతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. నెల తర్వాత 3డీ గెజిట్.. గ్రామాలవారీగా భూసమీకరణ జరిగే సర్వే నంబర్లను రెండో గెజిట్‌లో పొందుపరచగా ఈ సర్వే నంబర్లో ఎంత భూమి సేకరించనున్నారో, దాని యజమాని ఎవరో స్పష్టం చేసే 3డీ గెజిట్ మరో నెల రోజుల తర్వాత విడుదల కానుంది. చదవండి👉🏼 సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు -
తెలంగాణలో కొత్త చట్టం.. సంబరాల్లో ఉద్యోగులు!
హైదరాబాద్: ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తాజా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తీసుకొచ్చిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ–2021 .. మార్చి 30తో అమల్లోకి వచ్చి నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. దీంతో మార్చి 31తో పదవీ విరమణ చేయాల్సి ఉన్న వందల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించింది. ఈ నిర్ణయంతో రానున్న మూడేళ్లలో 40 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. -
17వ లోక్‌సభ గెజిట్ విడుదల
-
ఇక ప్రకటనే తరువాయి!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు పూర్తయింది. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. మండల, వార్డు స్థాయిల్లో సర్పంచ్, వార్డుసభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన జిల్లాల వారీ గెజిట్లను సోమవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. ఈ ఎన్నికల్లో 1,49,73,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రోజూ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం నిర్వహించుకునేందుకు అభ్యర్థులను అనుమతించనున్నారు. సర్పంచ్ అభ్యర్థుల కోసం 30, వార్డు సభ్యుల కోసం 20 ఎన్నికల గుర్తులను ఎన్నికల సంఘం సిద్ధం చేసి ఉంచింది. ఒక గుర్తును పోలి మరో గుర్తు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల వ్యయ లెక్కలను సమర్పించని కారణంగా 12,716 మందిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో రేషన్ డీలర్లు సైతం పోటీ చేయొచ్చని స్పష్టతనిచ్చింది. బలవంతపు ఏకగ్రీవాలపై చర్యలు ప్రజాస్వామ్యబద్ధంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇబ్బంది లేదని, ఈ పదవులను వేలం వేయడం లేదా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తే సంబంధిత జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయనుంది. ఎన్నికల ఖర్చులపై స్పష్టత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వ్యయ పరిమితులపై ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. 5 వేలకు పైగా జనాభా గల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, వార్డు సభ్యుడు రూ.50 వేల వరకు ఖర్చు చేయొచ్చని తెలిపింది. 5 వేల లోపు జనాభా ఉంటే రూ.1.5 లక్షల లోపు, వార్డు సభ్యుడు రూ.30 వేల వరకు మాత్రమే వ్యయం చేయాలని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు 95 వేల బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసింది. -
కావేరీ యాజమాన్య సంస్థ ఏర్పాటు
న్యూఢిల్లీ: కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన కావేరీ నదీ జలాల విషయాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ముందడుగేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కావేరీ నదీజలాల యాజమాన్య సంస్థ (సీఎంఏ)ను శుక్రవారం ఏర్పాటుచేసింది. ఈ సంస్థ చైర్మన్, సభ్యులను నియమించనప్పటికీ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర జలవనరుల శాఖ వెలువరించింది. సీఎంఏలో చైర్మన్, సెక్రటరీతో పాటుగా ఎనిమిది మంది సభ్యులుంటారు. ఇందులో కేంద్రం తరపున ఇద్దరు శాశ్వత, ఇద్దరు తాత్కాలిక సభ్యులు, భాగస్వామ్య రాష్ట్రాల నుంచి నలుగురు తాత్కాలిక సభ్యులు ఉంటారు. చైర్మన్‌గా జలవనరుల నిర్వహణలో అనుభవమున్న సీనియర్ ఇంజనీర్ లేదా ఈ రంగంలో అనుభవమున్న ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. కమిటీ కావేరీ నదీ జలాల నిల్వ, పంపకం, వివాదాల పరిష్కారం తదితర వివాదాలను సమీక్షించి ఆదేశాలిస్తుంది. కావేరీ జలాల్లో కర్ణాటక వాటాను పెంచి.. తమిళనాడు వాటాను సుప్రీంకోర్టు స్వల్పంగా తగ్గించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయంపై తమిళనాడు సీఎం పళనిస్వామి హర్షం వ్యక్తం చేశారు. -
క్షయని నోటిఫై చేయకుంటే జైలు శిక్ష
న్యూఢిల్లీ: క్షయ కేసుల వివరాలను వైద్యులు ఇకపై తప్పనిసరిగా సంబంధిత జిల్లా అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఔషధ విక్రేతలకు కూడా ఇది వర్తిస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ విషయాలతో గెజిట్ ప్రకటన జారీచేసింది. వైద్యులు, ఫార్మసీలు తప్పకుండా క్షయ వ్యాధి కేసులను నోటిఫై చేయాలని ఆ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. -
‘నుడా’ గెజిట్ విడుదల
30 రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలి నెల్లూరు(పొగతోట): నెల్లూరు అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (నుడా)ను నెల్లూరు గెజిట్‌లో విడుదల చేశారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు బుధవారం నుడా గెజిట్ నంబర్ 91ని విడుదల చేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి నెల్లూరు కార్పొరేషన్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలు, 21 మండలాలు 156 గ్రామాలు నుడా పరిధిలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 19 మండలాలు 145 గ్రామాలు, చిత్తూరు జిల్లాకు సంబంధించి 2 మండలాలు 11 గ్రామాలు నుడా పరిధిలో ఉన్నాయి. నుడాకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి 30 రోజులలోపు ప్రజలు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. జిల్లా యంత్రాంగం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తారు.