
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు పూర్తయింది. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. మండల, వార్డు స్థాయిల్లో సర్పంచ్, వార్డుసభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన జిల్లాల వారీ గెజిట్లను సోమవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. ఈ ఎన్నికల్లో 1,49,73,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రోజూ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం నిర్వహించుకునేందుకు అభ్యర్థులను అనుమతించనున్నారు. సర్పంచ్ అభ్యర్థుల కోసం 30, వార్డు సభ్యుల కోసం 20 ఎన్నికల గుర్తులను ఎన్నికల సంఘం సిద్ధం చేసి ఉంచింది. ఒక గుర్తును పోలి మరో గుర్తు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల వ్యయ లెక్కలను సమర్పించని కారణంగా 12,716 మందిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో రేషన్ డీలర్లు సైతం పోటీ చేయొచ్చని స్పష్టతనిచ్చింది.
బలవంతపు ఏకగ్రీవాలపై చర్యలు
ప్రజాస్వామ్యబద్ధంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇబ్బంది లేదని, ఈ పదవులను వేలం వేయడం లేదా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తే సంబంధిత జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయనుంది.
ఎన్నికల ఖర్చులపై స్పష్టత
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వ్యయ పరిమితులపై ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. 5 వేలకు పైగా జనాభా గల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, వార్డు సభ్యుడు రూ.50 వేల వరకు ఖర్చు చేయొచ్చని తెలిపింది. 5 వేల లోపు జనాభా ఉంటే రూ.1.5 లక్షల లోపు, వార్డు సభ్యుడు రూ.30 వేల వరకు మాత్రమే వ్యయం చేయాలని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు 95 వేల బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment